March 28, 2024

భగవంతుల రహస్య సమావేశం

రచన: రాజన్ పి.టి.ఎస్.కె

సర్వాంతర్యామి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆయన వదనంలో నిత్యం నాట్యం చేసే చిరునవ్వు ఎందుకో ఈ రోజు అలిగినట్టుంది. ఆయన గంభీర వదనాన్ని చూసి భయపడ్డ పాలసముద్రపు కెరటాలు కూడా మెల్లిగా ఆడుకుంటున్నాయి. ఆదిశేషుడు తను కొట్టే చిన్నిపాటి బుసలను కూడా మాని నిర్లిప్తంగా చూస్తున్నాడు. విష్ణు పాదాలు ఒత్తుతున్న జగన్మాతకు మాత్రం ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నడూ లేనిది స్వామి ఇలా వ్యాకులం గా కనిపించడంతో అమ్మవారు ఉండబట్టలేక…
“స్వామీ ఎందుకు మీరింత ఆలోచనామగ్నులై ఉన్నారు. ఎవరైనా భక్తునికి ఆపద వాటిల్లిందా?” అని అడిగింది.
శ్రీహరి ఒకసారి లక్ష్మిదేవి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. “లేదు దేవి. ఈ సారి ఆపద మొత్తం ప్రపంచానికి రాబోతున్నది, అది ఒక్కసారిగా కాక మెల్లిమెల్లిగా మొదలై మహోపద్రవంగా మారబోతున్నది. దానిని ఎలా నివారించాలా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.
“సృష్టిస్థితిలయ కారకులైన మీరు కూడా నివారించలేని ఆపదా ప్రభూ?” అని ఆందోళనగా అడిగింది అమ్మవారు. ఈసారి స్వామివారి సమాధానం మరో చిరునవ్వు మాత్రమే. ఆయన ఆలోచనలన్నీ రేపు జరగబోయే సమావేశం చుట్టూనే తిరుగుతున్నాయి.
నిర్జన ప్రదేశంలో సమావేశం ఏర్పాటుచేయబడింది. సమావేశానికి ఆతిథ్యమిస్తున్న విష్ణువు అందరికన్నా ముందుగా అక్కడకు చేరుకున్నాడు. ఆ తరువాత సమస్తలోకప్రభువు, పాపవినాశకుడు అయిన యెహోవా వచ్చాడు. ఆ వెంటనే సర్వలోకైకనాథుడు, పరమ పవిత్రుడు అయిన అల్లా కూడా సమావేశస్థలిని చేరుకున్నాడు. అందరి ముఖాల్లోను ఒకటే భావం, అదే వ్యాకులత. సమావేశం మొదలయ్యింది.
“మనుషులలో మూర్ఖత్వం పెరిగిపోయింది” యెహోవా ప్రారంభించాడు.
“ప్రేమ, సేవ అనే భావాలు మెలి మెల్లిగా కనుమరుగైపోతున్నాయి, మతమౌఢ్యం, వేర్పాటువాదం మితిమీరిపోతున్నాయి.” ఆయన మాటలలో బాధ ధ్వనిస్తోంది.
“అవును” అల్లా గద్గదమైన స్వరంతో అన్నాడు.
“అసలు ఎందుకిలా జరుగుతుంది?” ఆయనే మళ్ళీ ప్రశ్నించాడు.
“తప్పు మనలోనే ఉన్నట్టుంది” విష్ణువు తల పంకిస్తూ అన్నాడు.
“మనలోనా?” మిగతా ఇద్దరూ ఆశ్చర్యంగా అడిగారు.
“అవును మనలోనే…” కచ్చితంగా చెబుతున్నట్టుగా నొక్కి చెప్పాడు శ్రీహరి.
“జీవులు ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు మరణించాలో మనమే నిర్ణయిస్తున్నప్పుడు, ఈ పరిణామానికి తప్పు మనదవుతుంది గాని వారిదెందుకవుతుంది?”
మిగతా ఇద్దరికీ ఇది సరైన తర్కంగానే అనిపించింది, కానీ ఏదో తెలియని సందేహం.
“కావచ్చు…కానీ మనం వారినలా మూర్ఖులుగా ప్రేమరహితులుగా మారమనలేదే?” అల్లా ప్రశ్నించాడు.
“ఆ మాటకొస్తే మన పవిత్ర గ్రంధాలన్నీ ప్రేమనే ప్రవచిస్తాయి, తోటివారికి సాయపడమనే చెబుతాయి, మరి అలాంటప్పుడు తప్పు మనదెందుకవుతుంది?” మళ్ళీ ప్రశ్నించాడు.
“మనం కేవలం వారికి అలా ఉండమని చెప్పామంతే. కానీ వారిని ఆచరించేలా చేయలేదేమో? బహుశా అందుకే ఈ పరిస్థితేమో?” యెహోవా సందేహంగా అన్నాడు.
ఆల్లా నవ్వుతూ మెల్లిగా చెప్పాడు “మనం వారి పుట్టుకను మరణాన్ని మాత్రమే శాసించగలం, ఆ రెంటి మధ్యలో ఉన్న జీవితాన్ని కాదు, ఆ జీవితానికి పూర్తి బాధ్యుడు మానవుడే. ఈ విషయం మీ ఇద్దరికీ కూడా తెలియనిదేమీ కాదు.”
“అవునవును మీరన్నది నిజమే… ఈ దేవ రహస్యం దేవుళ్ళమైన మన ముగ్గురికీ తప్ప మిగతా వారికి తెలిసే అవకాశమే లేదు” యెహోవా అంగీకారంగా తలూపుతూ చెప్పాడు.
విష్ణువు కూడా “మీరు చెప్పింది నిజమే…మరి తప్పు ఎక్కడ జరిగి ఉంటుందని మీ ఉద్దేశ్యం?” అన్నాడు. ముగ్గురూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
“మానవుడిని పుట్టించక ముందు కొన్ని కోట్ల సంత్సరాలు పాటు మనకీ సమస్య రాలేదు. అంతకు ముందు అన్నిరకాల జీవరాశులు తమ పని తాము చేసుకుంటూ ఆనందంగా జీవించేవి. ఇప్పుడీ మానవుడు మాత్రం తన ఆనందాన్ని తానే నాశనం చేసుకుంటూ మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు.” కొద్దిపాటి ఆవేశపూరిత స్వరంతో అన్నాడు విష్ణువు.
“మానవుడు కొద్దిగా పెడదారి పడుతున్నప్పుడల్లా అవతారాలు ఎత్తుతూ వచ్చాను. ఇప్పటి వరకూ తొమ్మిది అవతారాలు ఎత్తాను, దుర్మార్గులందరినీ సంహరించాను, కాని ఇప్పుడు కల్కి అవతారం ఎత్తి దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షిద్దామంటే…. ఒక్క సన్మార్గుడూ కనపడడు. ప్రతీ ఒక్కరిలోనూ ఏదో ఒక వికారం ఉంటూనే ఉంది. ఇప్పుడు వారిని శిక్షించడమంటే విశ్వం మొత్తాన్ని నాశనం చెయ్యడమే. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు.” ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనపడుతుంది.
“అవును….నేను కూడా మహ్మద్ ప్రవక్త లాంటి వారిని భూమ్మీదకు పంపి జనాలలో దేవుని గురించి, అతని గొప్పతనం గురించి, అతని ప్రేమ పొందాలంటే వాళ్ళెలా జీవించాలో…మొదలైన విషయాలన్నీ చెప్పించాను. కాని ఇప్పుడు వాటి ప్రభావం జనం మీద ఏమీ ఉన్నట్టు లేదు. అలాగే యెహోవా కూడా ఏసుక్రీస్తు ద్వారా కరుణతత్వాన్ని, నమ్మకం గొప్పతనాన్ని చెప్పించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రభావం కూడా శూన్యమే.” పెదవి విరుస్తూ అన్నాడు అల్లా.
“నాకొకటి అనిపిస్తుంది” యెహోవా సాలోచనగా అన్నాడు.
“మనం ఇన్ని అవతారాలు ఎత్తినా ఎంతమంది ప్రవక్తలను, దైవకుమారులను భూమ్మీదకు పంపినా పరిస్థితిలో మార్పురాకపోవడానికి కారణం ఒకటై ఉంటుంది” అన్నాడు.
“ఏమిటది?” మిగతా ఇద్దరూ ఆతృతగా అడిగారు.
“మనిషి ప్రవృత్తి” సమాధానంగా చెప్పాడు.
“కృష్ణుడు, జీసస్, ప్రవక్త…వీళ్ళు పుట్టక ముందూ అరాచకం ఉంది, వీళ్ళు ఉన్నప్పుడూ ఉంది, వీళ్ళు అవతారం చాలించాక కూడా ఉంది. మరి వీళ్ళు వెళ్ళి ఏం చేసారు అంటే….ఎలా బ్రతికితే ఆనందంగా ఉండచ్చో చెప్పారు. దానిని ఆచరించిన వారు ఆనందాన్ని పొందారు. ఇలా ఆనందాన్ని పొందినవారు తరువాత ప్రవక్తలు, అవతారమూర్తులు చెప్పిన ధర్మాలను ఒక చోట చేర్చి వాటికి మతాలని పేరు పెట్టారు. వారి బోధనలను పవిత్ర గ్రంథాలుగా సూత్రీకరించారు.”
“అవునవును ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. మనం పంపిన మనవాళ్ళెవరూ మతాలు ఏర్పరచమని చెప్పలేదు. ధర్మాన్ని భోదించి అలా బ్రతకమన్నారు. కానీ మానవులు తమ తెలివి తేటలతో ఆ బోధలను మతంగా మార్చేసి ఆ ధర్మాలకు రకరకాల భాష్యాలు చెప్పారు. నేను బుద్ధావతారం ఎత్తి విగ్రహారాదన, పూజలు పునస్కారాలు వద్దన్నాను, దేవుడు నీలోనే ఉన్నాడని ప్రబోధించాను. కానీ ఏం లాభం? నేను అలా అవతారం చాలించానో లేదో వాళ్ళు బుద్ధుడికో గుడి కట్టి పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసారు” అన్నాడు విష్ణువు.
“మావాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా! కొంతమంది మూర్ఖులు పవిత్ర యుద్దానికి రకరకాల ఉపమానాలు తీసి మతాల మీద యుద్దం చేస్తున్నారు. వాళ్లనేం చెయ్యాలంటారు” అన్నాడు అల్లా.
“అందరి పరిస్థితి అలానే ఉందండి, మా వాళ్లలో కూడా కొంతమంది మతాలపై యుద్ధాలు, మతమార్పిడిలంటూ నా సువార్తల రూపు మార్చేస్తున్నారు.” అన్నాడు యెహోవా.
“అసలు ఆకాశంలో ఉన్నామో లేమో తెలియని మనకోసం భూమ్మీద వీళ్ళెందుకండి కొట్టుకు చచ్చిపోతున్నారు” నిర్వేదంగా అన్నాడు విష్ణువు.
“సరే….ఇంతకి మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఈ ఆపదనుండి మానవాళిని ఎలా కాపాడాలి?” యెహోవా ప్రశ్నించాడు.
“వీటన్నిటికీ ఒకటే మార్గం… దేవుళ్ళనే మనకి ప్రత్యేకమైన రూపం గాని, ఉండే ప్రదేశం గాని లేవని, నమ్మకమే మనరూపమని… ప్రేమ ఆనందాలే మనం ఉండే ప్రదేశాలన్న నిజం మనుషులకు చెప్పేద్దాం. మనకోసం కొట్టుకునే కంటే, వాళ్ళ మనుగడకు కొన్ని దశాబ్దాల లోపే మంగళం పాడగల పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నించమందాం. వాళ్ల తెలివి తేటలను దేవుడు ఉన్నాడా? లేడా? అనే వాదనల మీద కాక, ప్రాంతాలను, కులాలను, మతాలను వాడుకుని మనుషుల మద్య చిచ్చుపెడుతున్న రాజకీయనాయకుల కుయుక్తులను ఎదుర్కోవడానికి ఉపయోగించమందాం. ప్రతీసారి ప్రవక్తలుగాను, పురుషోత్తములుగాను భూమ్మీదకు వెళ్ళిన మనం ఈసారి అక్షరాల రూపంలోను, మాటల రూపంలోను వెళదాం. సమాజ శ్రేయస్సు కోసం తమవంతు సాయం అందించే ప్రతీ ఒక్కరి చేతివ్రాతలోను, నోటిమాటలోను నివాసముందాం. ఆయుధాలకు బదులు చిరునవ్వులు విసురుకోమందాం, భయకోపాలని ధైర్యవంతమైన ప్రేమతో ఎదుర్కోమందాం. మన ముగ్గురం వేరు వేరు కామని ముగ్గురం కలిస్తేనే వాళ్ళు పీల్చే ప్రాణవాయువని తెలియజేద్దాం….” ఆవేశభరితము, అనురాగపూరితము అయిన అల్లా సూచనా ప్రసంగం పూర్తయ్యింది.
విష్ణువుకి, యెహోవాకీ కూడా ఈ ఆలోచనే సరైనదనిపించింది. ముగ్గురూ కలిసి మెల్లిగా అడుగులు వెయ్యడం ప్రారంభించారు. అలా నడుస్తూ నడుస్తూ ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోయారు. దివ్యకాంతి ఒకటే అక్కడ కనపడుతోంది. ఆ దివ్యమైన వెలుగు భూలోకం వైపు వేగంగా రాసాగింది.

శుభం భూయాత్

4 thoughts on “భగవంతుల రహస్య సమావేశం

  1. అల్లా.. విష్ణు.. ఏసు.. ల ఏకాభిప్రాయం వైనం బాగుంది. అభినందనలు రచయితకు!!!

  2. అల్లా.. విష్ణు.. ఏసు .. లు ఏక కంఠంతో ఉద్ఘాటించిన వైనం చాలా బాగుందండీ…. అభినందనలు మీకు!!!

  3. జనాలు అంధవిశ్వాసంతో..మతాల మారణ హోమాన్ని ఎలా సృష్టిస్తున్నారో…విరుగుడు ఏమిటో భలే క్లుప్తంగా చెప్పారు.. చాలా బావుంది.. రచయితకు అభినందనలు

Leave a Reply to శ్రీకాంత్ గుమ్ములూరి. Cancel reply

Your email address will not be published. Required fields are marked *