April 20, 2024

మానవత్వం

రచన: గిరిజారాణి కలవల

”శిరీషా! ఏం చేస్తున్నావు?” అన్న అత్తగారి మాటకి సమాధానంగా శిరీష.
“గోపమ్మకి కాఫీ కలుపుతున్నా అత్తయ్యా” అంది.
ఆవిడ గబుక్కున గిన్నెలోకి చూసి
”ఇంత చిక్కగానే… ఇంకా నయమే… ఇలా అలవాటు చేస్తే ఇంకేవన్నా వుందా..”అంటూ శిరీష చేతిలో పాలగిన్నె తీసుకుని ఏదో వంపీ వంపనట్లు పాలు వంపి, ఆ కాఫీలో ఇన్ని నీళ్లు కలిపేసి పంచదార కాస్త ఎక్కువ వేసింది. పైగా “వాళ్ళు మనలాగా స్ట్రాంగ్ గా తాగరు… పల్చగా తియ్యగా తాగుతారు అంటూ ఆ తియ్యని నీళ్ల కాఫీని వేడి చేసి”గోపమ్మా…. కాఫీ తాగుదువుకాని… నీ గ్లాసు తీసుకుని రా.. “అంటూ పిలిచింది ఆ ఇంటి యజమానురాలు, శిరీషకి అత్తగారైన కాంతమ్మ.
ఆ పిలుపుతో తన గాజుగ్లాసు తెచ్చుకుని పెరటిగుమ్మంలో కూర్చుంది గోపమ్మ. ఆ నీళ్ల కాఫీని ఆఖరుచుక్క పడేవరకూ వంపింది కాంతమ్మ ఆ గ్లాసులోకి. వూదుకుంటూ తాగుతున్న గోపమ్మని చూసి పాపం అనుకుంది శిరీష.
ఉప్మాలో జీడిపప్పులన్నీ ఏరేసి మూకుడులో చివరగా గుప్పెడంత ఉప్మా వుంచడం, దోశలు, చపాతీలు చిన్న సైజులో వేసి ఇవ్వడం… అత్త కాంతమ్మ, పనిమనిషిని ఏదో అంటరానిదాన్ని చూసినట్లుండడం, ఇలా అధ్వానంగా తిండి పెట్టడం సహించలేకపోతోంది శిరీష. పైగా ఇంటెడు చాకిరీ.. ఎక్కడా రాజీ పడదు. తుడిచిందే పదిసార్లు తుడిపిస్తుంది… చేసిన ప్రతీపనికీ వంకలు పెడుతూ ఆ గోపమ్మని ఏదో ఒకటి అంటూనే వుంటుంది. అది కూడా సత్తెకాలంలో మనిషి కాబట్టి.. ఏదీ పట్టించుకోకుండానే వుంటుంది. ఎప్పుడైనా శిరీష చెప్పబోయినా కాంతమ్మ నీకు తెలీదు పనివాళ్ళతో ఎలా వుండాలో… మెత్తగా వుంటే నెత్తికి ఎక్కుతారు అని తన మాట కొట్టిపారేసేది.
జీతం మాట్లాడుకున్నది అంట్లు తోమడం, గదులు తుడవడం, బట్టలు ఉతకడం..ఈ పనులకే.. ఒప్పుకున్నా.. అనుకున్న పని కంటే ఎక్కువగానే చేసేది గోపమ్మ. కాంతమ్మ మాత్రం.. ఒక్క రూపాయి కూడా ఎక్కువ విదిలించేదికాదు. ఒక్క రోజు మానేసినా డబ్బులు జీతంలో నుండి కోసేసేది. ఏడాదికో పాత చీర.. అదీ ఇంకోరెండు సార్లు కడితే చిరిగిపోయే స్ధితిలో వుండేది ఇచ్చేది. అదే పరమానందంగా తీసుకునేది గోపమ్మ. పండగలకి శిరీష హైదరాబాద్ నుండి వస్తూ.. గోపమ్మకి వున్న ఇద్దరు మగ పిల్లలకి.. బట్టలు తెచ్చి అత్తగారు చూడకుండా గోపమ్మ చేతిలో పెట్టేది. వెళ్ళేటపుడు అత్తగారికి తెలీకుండా కాస్త డబ్బులు కూడా ఇచ్చేది.
ఇప్పుడు దసరా శెలవులు అని పిల్లలని తీసుకుని అత్తగారి దగ్గరకి వచ్చిన శిరీష.. అత్తగారి ధోరణి తెలిసి.. గోపమ్మ విషయంలో ఏం మాట్లాడకుండా మిన్నకుంది.
రెండు రోజుల్లో దసరా పండగ వచ్చింది. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకల్లా వచ్చేసే గోపమ్మ ఆ రోజు ఇంకా రాలేదు. కాంతమ్మ కోపంతో శాపనార్థాలు పెట్టేస్తోంది. శిరీష బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి.. అంట్లు ముందు వేసుకుంది తోమడానికి. కాంతమ్మ సణుక్కుంటూ.. గోపమ్మని తిట్టుకుంటూ.. దేవుని గది తుడుచుకొంటోంది. ఆ టైమ్ లో గోపమ్మ… నెమ్మదిగా గేటు తీసుకుని లోపలకి వచ్చింది.
”అమ్మగారూ!”అని పిలిచింది. చేతిలో చీపురుతో కాంతమ్మ… తోముతున్న గిన్నె సింక్ లో పడేసి గబగబా చేతులు కడుక్కుని శిరీషా.. హాల్లోకి వచ్చారు ఆ పిలుపు విని.
”ఏమొచ్చింది మాయ రోగం… పండగ పూటా.. ఇంత ఆలస్యంగా వచ్చావు..”అంటున్న కాంతమ్మ మాట మధ్యలోనే ఆగిపోయింది. కారణం… గోపమ్మ తలకి పెద్ద బేండేజీ కట్టు… అంతే కాదు.. గోపమ్మ వేలు పట్టుకుని అమాయకచూపులు చూస్తున్న ఓ పదేళ్ల పాప…
గోపమ్మతో ఎప్పుడూ చూడలేదు ఈ పిల్లని… మాసిన గౌను వేసుకుని.. బెరుకు బెరుకుగా గోపమ్మ వెనకాల కొంగు పట్టుకు దాక్కుని వుంది.
కాంతమ్మ.. ఒక్కసారిగా విరుచుకు పడింది.
“పండగ పూటా… ఏంటే ఇంత ఆలస్యం గా వచ్చావూ… ఆ తల కట్టేంటీ? ఈ పిల్లేంటీ? “అంది.
శిరీష కూడా.. “ఏమయింది గోపమ్మా…”అంది.
”అదే అమ్మగారూ…. నిన్న మీ ఇంటి కాడ పనయినాక మా ఇంటికి పోతన్నాను.. బస్ స్టాండులోనుంచి పోతే దగ్గర దారికదా… అటే పోతోంటే.. అక్కడ ఈ పిల్ల ఏడుస్తూ అగపడింది.. ఆడ ఓరూ జనాలు కూడా లేరు. ఎవరో ఏంటో.. తప్పిపోయిందా అని.. అడిగాను . హైదరాబాద్ లో ఎవరింట్లోనో వాళ్ళ చంటిపిల్లని ఆడించడానికని .. వీళ్ళమ్మ ఈ పిల్లని కుదిర్చి.. వెళ్లి పోయిందట. ఇదేమో.. ఆడిస్తూ.. ఆడిస్తూ.. వుండగా ఓసారి ఆ చంటిపిల్ల దీని చేతిలోనుంచి కిందకు దూకేసి కింద పడిందట. ఆ ఇంటి యజమానురాలు కోపంతో దీని చేతి మీద వాత పెట్టిందట.. ఇది భయపడి ఆ ఇంట్లోంచి పారిపోయి కనపడ్డ బస్సు ఎక్కేసి.. ఈ వూళ్లో దిగిందట.. ఏ ఊరో చెప్పు.. మీ అమ్మా వాళ్ళ దగ్గరకి తీసుకుపోతానంటే.. నోరు ఇప్పడం లేదు. బాగా భయపడిపోయింది.. సరే రెండు రోజులాగితే అదే చెపుతుంది.. అని మా ఇంటికి తోలుకెళ్ళాను. చచ్చినోడు… మా ఆయన ఎందుకు తీసుకొచ్చావూ.. గెంటెయ్యమని నాతో తగాదా పెట్టుకుని.. జుట్టు పట్టుకొని గోడకేసి కొడితే… బడబడా రగతమే.. వంటి నిండా… ఆసుపత్రికి పోయి కట్టు కట్టించుకొన్నాను. నెత్తి అంతా దిమ్ముగా వుండి పొద్దుగాల్నే లెగవలేకపోయా… అందుకే ఆలీసం అయిందమ్మగారూ “అంటూ చెప్పుకొచ్చింది గోపమ్మ.
”బానే వుంది సంబడం.. తాను దూర సందులేదు గానీ.. మెడకో డోలు.. అంటారు ఇదే కాబోలు.. దారిన పోయే తద్దినం నీకెందుకే. మళ్లీ అక్కడే వదిలెయ్యి. పైగా మీ ఆయన ఒప్పుకోలేదు కూడానూ..“అంది కాంతమ్మ.
”అదేంటమ్మగారూ.. అలా అంటారూ.. సూస్తూ సూస్తూ.. పాపం పసిపిల్లని ఎట్టా ఒగ్గేయమంటారూ… నా మొగుడు తాగుబోతు నాయాలు.. వాడట్టాగనే అంటాడు… మీరూ అలాగే అంటే ఎలా… ఈ పిల్ల తాలూకు వాళ్ళెవరైనా వచ్చేదాకా నా కాడనే వుంటుంది.. “అంది గోపమ్మ.
”అది సరే కానీ.. గోపమ్మా…. ముందు పోలీసులకు చెప్పు… లేకపోతే నువ్వే ఈ పిల్లని ఎత్తుకొచ్చావని ఎవరయినా కంప్లయింట్ ఇస్తే..నీకు ఇబ్బంది అవుతుంది..వాళ్ళు ఏదైనా చిల్డ్రన్స్ హోమ్ లో వుంచుతారు.. వాళ్ళ వాళ్ళు వచ్చేదాకా.“అని శిరీష సలహా ఇచ్చింది.
పోలీసులు మాట అనగానే గోపమ్మ భయపడిపోయింది.”ఔనా.. అమ్మగారూ… అయన్నీ నాకు తెల్వదు… మీరు చదూకొన్నోరు… మీరే సెయ్యాల… నాకు పోలీసులంటేనే భయ్యం.. “అంది గోపమ్మ.
”బానే చెప్పావులే… నీ నెత్తిన ఏదో వుందని చెపితే… నువ్వే తీసెయ్యి అందట వెనకటకి ఎవత్తో… అలాగా… నీకేదో ఈ పిల్ల దొరికితే… మేం వచ్చి పోలీసులకు చెప్పడమేమిటి? నీ ఏడుపు నువ్వేడు.. మమ్మల్ని ఇరికించకు “అంది కాంతమ్మ తన ధోరణిలో.
“అయ్యో… అత్తయ్యా… ఇందులో మనకి పోయేదేంముంది… గోపమ్మ కి తెలీదంటోంది కదా… వెళ్లి ఒకసారి.. చెప్పి వస్తా.. మరేం ఫర్వాలేదు.. పైగా ఆ ఇనస్పెక్టర్ మీ అబ్బాయికి పరిచయమే.. “అంటూ.. అత్తగారి పర్మీషన్ కోసం చూడకుండా…
“పద.. గోపమ్మా.! చెప్పి వద్దాం..”అంటూ బయలుదేరింది శిరీష.
“ఇదేం చోద్యమే… మన ఇంటా వంటా లేదు.. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడమేమిటీ.. పదిమందికీ తెలిస్తే.. పరువు పోతుంది… పనిదానికోసం నువ్వు వెళ్ళడమేమిటీ…”అంటూ బుగ్గలు నొక్కుకుంది కాంతమ్మ.
ఇదేం వినిపించుకోకుండా వెళ్లి పోయింది శిరీష.
పోలీసు స్టేషన్ లో… ఇనస్పెక్టర్ కి జరిగిన సంగతి చెప్పింది.. శిరీష… అంతావిని… ఆ పిల్ల ఫోటోలు తీసుకుని వివరాలు తీసుకుని… మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా చిల్డ్రన్స్ హోమ్ లో వుంచుతాము.. మీకేం అభ్యంతరం లేదుగా… “అన్నాడు అతను.
ముందు సరే అంది కానీ గోపమ్మ.. తర్వాత ఒప్పుకోలేదు. శిరీష ని పక్కకి పిలిచి…”వద్దమ్మగారూ… ఆడపిల్లని అలా వదిలేయడం నాకు ఇట్టం లేదు.. మన దగ్గరే వుంచుకుంటామని ఆ అయ్యగారికి సెప్పండి.. “అంది.
దానికి వచ్చిన ఆలోచన తనకి రాలేదని నిందించుకుని… అదే మాట ఇనస్పెక్టర్ తో చెప్పింది. వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళేదాకా… ఈ పిల్ళ తనతోనే వుంటుందని.. తనదే హామీ అని చెప్పి.. ఆ పిల్లని తీసుకుని ఇంటికి వచ్చింది.
ఆ పిల్లని ఇంట్లో వుంచుకుందుకి కాంతమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. శిరీష ఎంతగానో బతిమిలాడినా… కూడా మెత్తపడలేదు.. చివరికి తన భర్తతో చెప్పించినా కూడా లొంగలేదు. తనతో పాటు హైదరాబాద్ తీసుకుని వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు.
ఇదంతా చూసి గోపమ్మ.. “పోనీలెండమ్మగారూ… మీరేదో మంచి మనసుతో మంచి సేద్దామనుకున్నారు పెద్దమ్మగారికి ఇట్టం లేదు.. నా గురించి మీరు తగువులాడుకోడం నాకిట్టం లేదు… మా ఆయన సంగతి నేనేదో చూసుకుంటా… నాకు దొరికిన పిల్లని నేనే మా ఇంటికి తీసుకుపోతా..”అంది గోపమ్మ.
“ఈ పిల్ల గురించి ఎవరూ రాకపోతే.. ఈ తద్దినం మా నెత్తికి చుట్టుకుంటుంది.. ఆ గోల పడలేను కానీ.. నువ్వే తీసుకుపో.. “అంది కాంతమ్మ.
ఆ తర్వాత.. శిరీష అక్కడ వున్న నాలుగు రోజులూ… అయ్యో.. దిక్కులేని ఆడపిల్లకి తన ఇంట ఆశ్రయమివ్వగల స్వేచ్ఛ కూడా తనకి లేదు.. అనుకుంటూనే బాధ పడింది. ఆ తర్వాత సెలవలు అయిపోవడంతో హైదరాబాద్ తిరిగి వెళ్ళి పోయింది.
తర్వాత ఎప్పుడో.. ఫోను చేసినప్పుడు కాంతమ్మ చెప్పింది…గోపమ్మ పని మానేసిందనీ.. గోపమ్మకి దొరికిన పిల్ల గురించి… . ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఎవరూ రాలేదనీ… తనే పెంచుకుందికి నిర్ణయించుకుందనీ ఈ విషయమై గొడవ పడి .. గోపమ్మ మొగుడు.. ఇంట్లోంచి గెంటేసాడనీ… గోపమ్మ ఆ పిల్లని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయిందనీ చెప్పింది.
అనాధ ఆడపిల్లకి ఆశ్రయమిచ్చినందుకు.. గోపమ్మని మెచ్చుకోవాలో.. భర్త వదిలేసినందుకు బాధ పడాలో తెలీలేదు శిరీషకి.
కాలగమనంలో రోజులు గడిచిపోయాయి.. ఈ క్రమంలో గోపమ్మ విషయం మరుగున పడిపోయింది.. శిరీష ఇంచుమించుగా ఆ విషయం మర్చిపోయింది.
కాంతమ్మ గారు.. ముసలితనం పైగా అనారోగ్యంతో బాధ పడుతూ వుండేసరికి.. కొడుకు తన దగ్గరికి తీసుకువచ్చాడు.. వయసు పైబడినా.. ఆవిడ నైజంలో మాత్రం మార్పు రాలేదు. యధాప్రకారం శిరీష అవేమీ పెద్దగా పట్టించుకోకుండా.. అత్తగారి బాగోగులు చూసుకొంటోంది.
ఒకరోజు… ఉదయం పేపర్ చదువుతూ… ఒకచోట శిరీష చూపు నిలబడిపోయింది.. నిజమా.. కాదా అని ఒకటికి రెండుసార్లు ఆ వార్త చదివి.. నిర్ధారణకి వచ్చి… “అత్తయ్యా ! ఈ పేపర్ లో ఈ వార్త చూడండి.. కొత్తగా కలెక్టర్ గా బాధ్యత తీసుకుంటున్న.. ఈవిడని చూడండి. పేరు లక్ష్మి అట. తన ఈ విజయానికి కారణం తన తల్లి అనీ, ఆవిడ తన స్వంత తల్లి కాదనీ.. తాను అనాధగా బస్ స్టాండ్ లో వుండగా తనని తీసుకువెళ్ళి ఎన్నో కష్టనష్టాలకోర్చి తనని పెంచి, చదివించి.. తనని ఈ స్ధాయికి తీసుకువచ్చిందనీ.. ఆవిడ ఋణం జన్మజన్మలకీ తీర్చుకోలేను.. అంటూ వ్రాసిన ఈ వార్త చూడండి. ఈ ఫోటోలో.. ఆ కలెక్టర్ లక్ష్మి పక్కన ఆవిడ తల్లి.. మన గోపమ్మే… గుర్తు పట్టారా? “అంటూ పేపర్ చూపించింది శిరీష .
ఆ వార్త చదివి అవాక్కయిపోయింది కాంతమ్మ. కళ్ళజోడు సవరించుకుని మరీ చూసింది ఆ ఫోటోని.. ఏంటీ.. పనిమనిషి గోపమ్మ.. దారిన దొరికిన అనాధని.. ఇంత చదువు చదివించి.. కలెక్టర్ ని చేసిందా.. నోట మాట రాలేదు ఆవిడకి.. కోడలి వైపు సూటిగా చూడలేకపోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు ఆవిడకి.
శిరిషే అందుకుంది..”ఒకవేళ ఆరోజు ఈ లక్ష్మిని మన ఇంట వుంచుకుందుకు కనుక మీరు ఒప్పుకుని వుంటే… మనింట్లో పనిపిల్లగానే వుండి వుండేది.. ఈ అదృష్టం పట్టుండేది కాదు. గోపమ్మ చేతిలో పడి ఆణిముత్యం అయింది.. మీరు ఒప్పుకోకపోవడం మంచిదే అయింది.”అంది.
కోడలి మాటలలో వ్యంగ్యాన్ని గుర్తించి తిరిగి సమాధానం ఇవ్వలేకపోయింది కాంతమ్మ.
పూరిపాకల్లో నివశించినా.. నీళ్ల కాఫీలు తాగినా.. గోపమ్మ లాంటివారి మనసు మాత్రం అమృతమయమని ఈ వార్త తెలిపింది.
గొప్పతనం అనేది మనసుని బట్టి వుంటుంది కానీ.. డబ్బుని పట్టి కాదు.. ఈ విషయం గోపమ్మ నిరూపించింది.. తన మొగుడు తనని వదిలేసినా.. తన చేయందుకున్న ఓ అనాధకి ఓ అందమైన జీవితాన్ని కల్పించగలిగిన.. గోపమ్మకి మనసులోనే వందనాలు చెప్పుకుంది శిరీష.

2 thoughts on “మానవత్వం

  1. డబ్బు గౌరవాన్ని ఇస్తుంది కానీ ప్రేమను ఇవ్వదు..గొప్పింటోళ్లు చిన్న బుద్ధి చూపితే లేమిలోని తల్లి పెద్ద మనస్సును చూపింది..చక్కటి కథ..ముగింపు బావుంది..రచయిత్రికి అభినందనలు

Leave a Reply to పద్మజ యలమంచిలి Cancel reply

Your email address will not be published. Required fields are marked *