June 25, 2024

గిలకమ్మ కతలు – గిలకమ్మా.. మజాకా…

రచన: కన్నెగంటి అనసూయ

 

“ ఇత్తెలిసిందేటే సరోజ్నే….”

నిలువునా పరిసిన గోనుసంచి మీద దోసిలితో దోసెడు  తొక్కి , కడిగి ఆరబెట్టిన నూగింజలు పోసి మడిగాళ్లేసుకుని మరీ బత్తాకేసి పావుతా పిన్నత్త కూతురు సూరయ్యమ్మన్న మాటలకి ..

అలా బత్తాగుడ్దకేసి  పావిన నూగింజల్నల్లా  సేట్లో పోసుకుని పొట్టు సెరిగేత్తన్న సరోజ్ని సెరిగే సెరిగే సేట్ని ఆమట్నే ఆపేసి దాన్ని మడిసిన  కాళ్ల మీదెట్టి  కళ్ళు సికిలిచ్చి మరీ  సూరయ్యమ్మకేసే అదోలా సూత్తా..”ఏటది..? “ అంది  ఇంత పొడుగున సాగదీత్తా….

” అబ్బాయన్నానీతో ఓమాటన్లేదా? అనుమ్టాడనుకున్నానే! టీకొచ్చెల్లేడుగా ? తెల్దేవో లే. అయినా.. ఊరంతా కోడై కూసేత్తుంటే..నీకింకా తెల్దా?” సరోజ్నంకే ఇడ్డూరంగా సూత్తా పావీ పావీ సేత్తోనే బుగ్గల్నొక్కుకుందేవో..సూరయ్యమ్మ ..ఆవె చెంపలకంతా నల్ల నూ పొట్టే…

“ వచ్చెల్లేరు. ఒక్క మటా అన్లేదు సూరయ్యమ్మొదినే! నువ్వన్నట్టు తెల్దేవో. తెలిత్తే అంతాకేవైంది?  ఏటది ఇంతకీని. ఇందాక తడిసిన నూపొట్టు బాల్చీతో  కుడితి కుండీలో పోద్దావని  సేటట్టుకుని ఈధిలోకెల్లినప్పుడు ఎక్కడ్నించో మాటలినిపిత్తన్నాయని రాజేశ్రమ్మ ఇంటికేసి సూసేతలికి పోగులోరి పారువాతమ్మా, రాజేశ్రమ్మా సెవులు కొరుక్కుంటా కొరుక్కుంటా నన్నుజూసి ఆపేసేరు నేనెక్కడ ఇనేత్తానోనని అనుకుంటాను.   ఇదేనేమో..! ఆల్లు సెప్పపోతే తెల్దా ఏటి?

నాకెవరు సెప్తారు అయినాను? నేనెవర్ని కలుత్తున్నాను.? ఎవర్నన్నా కలిత్తే తెలుత్తా ఉంటాయ్ ఎయ్యన్నాను.  ఇంతకీ ఏటో..అది..” ఎడంకాలు పాదాన్ని  కుడిగజ్జలోకంటా మడిసి కుడికాలు పొడుగ్గా సాపి మరీ సెరుగుతుందేవో..నువ్వుల సేట్ని ఆమట్నే కుడికాలు మీదెట్టి..ఆసత్తిగా అటే సూత్తా అంది ఏంజెప్పుద్దో సూరయ్యమ్మని.

“ నేను మాత్రం కలుత్తున్నానా ఏటి? నేనూ ఇంట్లోనే పడి కొట్టుకుంటున్నాను. ఏదో ఇయ్యాల నూ రమ్మన్నావని పోన్లే సెరిగి పెడితే  పోయేదేవుందని వచ్చేను. రేపెప్పుడన్నా నేను నువ్వులు తొక్కుకుంటే  నువ్వొత్తావనేగానీ లేపోతే నాకు పనేటి?  తల వాసేటన్ని పన్లున్నాయ్ నాకు.  మసిరి మీంచి ఇత్తడి సామానం కిందెట్టిచ్చి సింతపండు నానబెట్టేను. రోజుకో రెండన్నా తోవుకుంటే..పండగనాటికి కానన్నా లొంగుతాయని..” ఎట్నించెటో ఎల్లిపోయింది “ పోనీలే.. అని ఏదో సెవిలో ఓ మాట ఏద్దావనుకున్నాననుకో..దీనికీ ఎత్తిపొడుపు మాటేవన్నా పనుందా ?” అని మనసులో సరోజిన్ని ఈసడిచ్చుకుంటా.

“అయ్యా..దాన్దేవుందిలే వదినీ..! ఒకరికొకళ్లం సాయం. ఎంతుకురానూ. వత్తాను. ఇంతకీ ఏటో సెప్పేవ్ గాదు ..” ఇంకా ఏదేదో సెప్పుకు పోతున్న సూరయ్యమ్మ మాటలకి అడ్డడంది సరోజ్ని సూరయ్యమ్మ పావిన నువ్వులన్నిట్నీ సేటలో పోసి సెరుగుతాకి సేటెత్తి  పట్టుకుని..

“ ఏవుంది..ఆ బడికాడ ముసలోడు లేడా..?”

“ ఏ బడికాడ..?”

“ అదే పెడ్ద బడికాడ..”

“ ఎవరా ముసలోడు?” కల్లు సికిలిచ్చి మరీ సూరయ్యమ్మొంసూత్తా ఆరాగా అడిగింది సరోజ్ని.

“ అదే..! ఆ మూలమీదిల్లు. పొద్దుగూకులా ఈధిలోబడి ఏడుత్తాడు గందా! మంచి నీళ్లకనో ,ఒకటకనో దేనికో దానికీ బళ్ళొ  పిల్లలు లోపలికీ, బయటికీ ఎల్తా వత్తా ఉంటారు..”

“ ఉమ్మిడోళ్ళ నాగయ్యమ్మ మొగుడా? “

“ ఆ..! ఆ ముసలోడే. నీకు బాగానే గుత్తొచ్చేసింది. నాకే ఏటో ఏదీ గుత్తుంటాలేదు. ఇట్టే మరిసిపోతున్నాను. మొన్న మూడ్రోజుల్నాడేంజేసేనో ఇన్నావంటే నవ్వుతావ్ గూడాను..” అని సెప్పటం ఆపి కాసేపు తన్లో తనే నవ్వేసి..

“ ములక్కాయలూ,సిక్కుడు కాయలూ ఉంటే అడ్దవేసి ఆనపకాయ్ పులుసెట్టేను సింతకాయలు ఉడకబెట్టి రసవోసి. అప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో సూసి మరీ పులుసెక్కువైపోయిందని ఓ మాటు పొయ్యి మీదెట్టేను కాతంత పులుసు ఇగురుద్దని.  ఈలోపు మియ్యన్నయ్యొచ్చి టీబెట్టనేసర్కి  గిన్నెలో నీలూ, పాలూ కలిపి పొయ్యి మీదెట్టి  పంచదారేసి..టీపొడి ఎయ్యాబోయి పక్కనే ఉన్న పులుసు గిన్నెలో ఏసేసేను ఏదో ఆలోసిత్తాను.  ఏసేసేకా సూసుకున్నానేవో..అసలే సింతపండుగాకుండా సింతకాయ ఉడకబెట్టిన రసవోసేనేవో..పచ్చగా గుమగుమలాడిపోయిన పులుసల్లా..సింతగింజల పులుసల్లే నల్లగా రూపు మరిపోయిందనుకో. పేనం ఒస్సూరుమనిపోయిందనుకో..“

“ ఏంజేసేవ్ మరి దాన్ని. “

“ ఏంజేత్తాను?  అప్పటికే మియ్యన్నయ్య పొలవెల్తాకి ముంతెట్తమని కూకునున్నారు. ఎలాగూ పులుసు తాలింపేత్తాకి  అయిదారు నిమిసాలన్నా పట్టుద్దని టీ పెట్టమన్నారనుకో. పాపం ఆయన తప్పేవుంది..”

“ అదే ఏసి పెట్టేవా?”

“ ఇంకేవన్నా ఉందా? గుడ్ల నీళ్ళు గుడ్లని కుక్కుకుని అవతల పాడబోసి పచ్చడి ముక్కేసి పెట్టేను..అవతల కూలోళ్ళొత్నారని గొడవజేత్తేని.  ‘

“ బాగానే ఉంది..ఒకోసారి నేనూ అలాగేజేత్తాఉంటాను..పెద్దోళ్లమైపోతల్లేదా..మతిమరుపొత్తాది. మానాననీవోడు…ఎప్పుడైనా మాయమ్మ ఇలాటియ్ సేత్తేని..మనుసులక్కాక  మతిమరుపు మానులకొత్తాదాని..”  అంటన్నంతలో..

“ ఏంజేత్నారు? టీలైపోయినియ్యా..? ఎన్ని కుంచాలు తొక్కేవేటి నువ్వులు? “ అన్న మాటలకి ఈధికేసి సూసిన సరోజ్ని..గుమ్మాన్నట్టుకుని నిలబడున్న సెంద్రమ్మని చూసి..ముఖవంతా నవ్వు పులువుకుని..కాలుసాపుతుం వల్న పైకెళ్ళిపోయిన సీరని ముందుకి లాక్కుంటా..

” హ్హా హ్హా. ఏవుంది? వండుకుంతం, తింటం. ఇప్పుడే టీ పెట్టిత్తే  తాగి అటెల్లేరు మీయల్లుడుగారు. లోపలికి రాపోయావా పిన్నే! అక్కడే నిలబడ్డావ్. ఎక్కడికెల్లొత్నావేటి?” అంది సరోజ్నీ మరియాదగా..లేసి నుంచుంటాకి పెయత్నిత్తా..

“లెక్కు. కూకో. నేనుండను. ఎల్లిపోతాను. అదే ఉమ్మిడి సుబ్బన్న ఏదో బల్లెక్కి పడ్డాడంట. సూసొత్తాకెల్లేను. బల్లెక్కే ఈడేనా? మాయదార్రోజులు కాపోతేనీ! సుబ్బన్న పెళ్ళం నాగయ్యమ్మ  మరి మా  ఆడపడుసుకి పిన్నత్తగారే గదా..”

“ అవ్ను. సుట్తరికం ఉందిగదా..! ఎల్లాలి మరి. ఎల్లాపోతే ఎలాగ. ఊళ్ళో రేపొద్దున మొకామొకాలు సూసుకోవద్దా? ఉప్పుడదే అంటంది సూరయ్యమొదిని. పడ్దాడంటని. నేనూ అదే అంటన్నాను..బల్లెంతుకెక్కేడో..అని! సిన్న పిల్లోడా ఏవన్నానా? సిన్నోళ్లే ధైర్నం సెయ్యలేకపోతన్నారు..”

అంది సరోజ్ని..అలా కూకునే సెంద్రమ్మకేసి సూత్తా కింద సేటలో నువ్వుల్ని కుడి సేత్తో సేటకేసి పావుతా..

“ అదే ఎవళ్లకీ తెలుత్తాలేదు. ఎంతుకెక్కావ్? నీకేంపనంటే సెప్తాకేమో..నోరొత్తాలేదంట. పక్కకి పోయిందంట..ఒక కాలూ , సెయ్యీ కూడా లేత్తల్లేదని అంటన్నారు. ఎంత వరకూ నిజవో, ఏమోమరి. ఆస్పట్టల్నించొత్తేనేగానీ తెల్వదు.”

“ఇంటికాడే ఉన్నాడా..?”

“ లేదు. పడ్దోడ్ని సూసేతలికే సేనా ఆలీసం అయిపోయిందంట. ఎప్పుడు పడ్దాడో ఏవో మరి..కొడుకు ఏదో పనుందని రాజమండ్రెల్లేడంట. పెళ్లవేవో..వణ్నందిని ..కూతురింటికెల్లొత్తానని ఎల్లిందంట. మజ్జానం బండి దిగి కొడుకొచ్చేతలికి పడిపోయున్నాడంట. నోట్లోంచి ఊరికే సొంగంట..! అప్పటికప్పుడు బామ్మర్ధికి ఫోన్జేసి కారేసుకు రమ్మని  తీసుకెల్లిపోయేరంట.. రాజారావు ఆస్పటల్ కి. మరెలా ఉంటదో ఏమోగానీ..” అని ఓసారి అటూ ఇటూ సూసి మెల్లగా లోనకో అడుగేసి..

“ ఒకాలూ, సెయ్యీ పన్జేత్తాలేదంట..నాగయ్యమ్మకొచ్చింది సావు. కూతురూళ్ళో ఉందని ముడ్డి మీద గుడ్డుండద్దానికి. అడుగడుక్కీ కూతురింటికే..!అయ్యిందా? మంచం మీదడ్దోల్లని సూతం అంత వీజీనా? సెయ్యొద్దా సెప్పు..” గుసగుసలుగా అంది..

“అవునంట..నేనూ ఇన్నానీ మాట. ముసలోడు ఇక లేత్తం కట్తవే అంటన్నారు. “ అంది అప్పటిదాకా ఇదంతా సెవిలో ఏసుకున్న సూరయ్యమ్మ..

ఇంటన్న కొద్దీ  సరోజ్నీలో ఏదో   అనుమానం తలెత్తేసింది సిన్నగాను.

పొద్దున్నగిలకమ్మ సంచట్టుకుని బళ్ళోకి ఎల్తంటే..

“ మజ్జానం అణ్ణానికొచ్చేటప్పుడు…వత్తా,వత్తా నాగయ్యమ్మ మామ్మనడిగి నూపప్పు డబ్బా ఓసారివ్వమని పట్రా..! రేపు బళ్ళోకొచ్చేటప్పుడు తెచ్చేత్తానని సెప్పు..” అంది సరోజ్ని..

అంతకు ముందురోజు పొద్దుపోయేకా నానబోసిన నువ్వుల్ని పిల్లలు బళ్లోకెల్లాకా, పనోళ్లని రమ్మంటే బోల్డు బోల్డు అడుగుతున్నారని మెల్లగా రోట్లో పోసి తొక్కటం మొదలెట్టి, అక్కడికదయ్యాకా..నూతిలోంచి బాల్చాల్నిండా నీళ్ళు తోడుకుని అట్టే పెట్టుకుంది, గిలకమ్మ వచ్చేటప్పుడు నూపప్పు డబ్బా తెత్తాది.. పిల్లా, పిల్లోడూ అన్నాల్దిని బళ్ళొకెల్లేకా పప్పుని కడుక్కుని ఎండలో పోసుకోవచ్చని.

అయితే గిలక్కంటా ముందే వచ్చేసేడు పిల్లోడు.

“ అక్కేదిరా?” అనడిగితే ..”   బడికాడ తాత ఆళ్ళింట్లో దూరింది. ఏదో తెమ్మన్నావంటగదా “ అన్నాడాడు.

మెల్లగా ఈడ్సుకుంటా  తర్వాత కాసేపటిక్కానీ  రాలేదు గిలక. వత్తవే సిరాగ్గా వచ్చింది..గిలకమ్మ.

వత్తా,వత్తా..” ఇంకోసారాళ్ళింటికి పంపేవంటేనా? ఏంజేత్తానో సూడు..” అంతానే వచ్చింది.

నూపప్పు డబ్బా పెద్దగా ఉంటాది కదా..జతకత్తుల ముందు సిగ్గుపడిందేవో అనుకుని పెద్దగా పట్టిచ్చుకోలేదు సరోజ్నీ.

ఏటే అనడిగితే నోరిప్పితే ఒట్టు. వణ్నం తిని బళ్ళొకెల్లిందేగానీ..రిటన్ లో తిరిగొచ్చేసింది జొరవచ్చేసిందని.

నువ్వులూ, బెల్లవేసి తొక్కిన సిమ్మిలంటే ఉన్న ఇట్టంకొద్దీ  కళాసులు ఎగ్గొట్టేసిందేవోననుకుని  మెడకింద సెయ్యేసి సూసిన సరోజ్నికి ఎచ్చగా తగిలింది గిలకమ్మొల్లు.

ఆమట్ని కాసిన్ని పాలుకాసిచ్చి  తాగమని సలేత్తందంటే దుప్పటి కప్పింది పడుకోమని.

ఆలోసిత్తుంటే ముసలోడు పడిపోతం ఎనక గిలకమ్మేవైనా సేసిందాన్న అనుమానం వచ్చి ఒల్లు జలదరిచ్చింది

సరోజ్నీకి. ఇదసలే తేడా వచ్చిందంటే పీకి పాకం పట్తే రకం.

ఆలోసనొచ్చిందే..తడవు..” సందేలవుతుంది సూరయ్యమ్మొదినే. నువ్వూ పొయ్యి ముట్టిచ్చాలిగదా..! రేపు సేద్దాంలే..ఈలుంటే ఒకడుగు ఇటెయ్యి…” అంటా మరో మాటకి తావివ్వకుండా..సేట్లో నువ్వుల్నికుంచంలోబోసి..

సెరగాల్సిన నువ్వుల మీద బత్తా కప్పి. ..ఆ మటా ఈమాటా సెప్తా సూరయ్యమ్మని సాగనంపి తలుపేసి

మెల్లగా గిలకమ్మకాడికెల్లి “గిలకా..! అమ్మా..గిలకా..” అని మెల్లగా తట్టిందేవో ఉలిక్కిపడి లేసి కూకుంది గిలక.

జొరంతో వల్లు సల సలా కాలిపోతంది..

అడుగుదావా వద్దా అని కాసేపు ఆలోసిచ్చి “ ఎంతుకిలాగయ్యిందో  నిజ్జంగా గిలక్కే గనక తెల్సుంటే.. ఎవుళ్లైనా వచ్చి పిల్లని ఏదైనా అడిగితే  ఏదోటి సెప్పి పంపాలిగదా..! ఓ మాట అడిగితేనే..నయవని..”  మనసులో ఆలోసిచ్చి..

మెల్లగా నాయమారతా..” ఒల్లు కాలిపోతందమ్మా..! డాట్తర్ గారి దగ్గరకెల్దాం నాన్నొచ్చాకాగానీ..నేనెవ్వరికీ సెప్పను ..బడికాడ తాతనడిగి నూపప్పు దబ్బా తెచ్చేవ్ గదా..? అదెవరిచ్చేరు నీకు?” అంటా గుసగుసలుగా అడిగింది.

“తాతే ఇచ్చేడు…” అడగ్గా అడగ్గా..ఇసురుకుని,కసురుకుని  సేలా సేపటిక్కానీ నోరిప్పలేదు గిలక.

“ అప్పటికి బాగానే ఉన్నాడా?”

“నన్నడక్కు అయ్యన్నీనీ..” ఇసుక్కుని ముసుగెట్తేసింది గిలక.

తల్లి పుట్టిల్లు మేనమామకి తెల్వదా అన్నట్టు గిలక ఎప్పుడెలా ఉంటదో సరోజ్నీకి బాగా ఎరికే. అంతుకే ఏదో జరిగిందని..అదేటో తెల్సుకోపోతే సేనా గొడవైపోద్దని మనసులో భయపడతానే గుమ్మంకాడికెల్లి తలుపు గెడ పెట్టి  ఉందో లేదోనని మరోసారి చూసి..గిలకమ్మ దగ్గరకంటా వచ్చి ..

“కాదమ్మా.! ఆ తాత పడిపోయేడంట. నోరొంకరపోయిందంట. బతుకుతాడో బతకడో అంటన్నారు..ఏం జరిగిందో సెప్పు..నాన్నక్కూడా సెప్పను..” అనే తలికి భయపడిందో ఏవో..గబుక్కున లేసి కూచ్చుంది మంచం మీద..

అలా కూచ్చునే..

”  నూపప్పు డబ్బా తెమ్మన్నావ్ గదా..! ఉండమంటే  ఉండకుండా తమ్ముడేవో ఇంటికొచ్చేసేడు. డబ్బా ఎక్కడో పైనుంది..పీటేత్తాను. నువ్వెక్కి తీస్కో అన్నాడమ్మా ఆ తాత.  లోపలెక్కడో ఉన్న పీట పట్రమ్మాడు లోనకెల్లి.  తెత్తాకి లోపలికెల్తే నా ఎనకే వచ్చి ముద్దెట్టి..” ఏవే ..నన్ను పెల్లి సేసుకుంటావా? మీ నాన్ననడుగుతాను “ అని నవ్వేడు.. “ స్సీ “ అని తోసిపడేసేను. “సర్దాగా ఆన్నాన్లేవే. “ అన్నాడు మల్లీని.

“ అప్పుడే వచ్చేద్దామనుకున్నాను.. తేపోతేనేమో నువ్వు తిడతావు.”

“ అంతవరకైతే పర్లేద్లే.. ముసలోళ్లు ఏదో సరదాకంటారు. నిజ్జంగా సేస్కొమ్మనా ఏటి నీబ్బొంద. . తర్వాతేంజేసేడో సెప్పు..”

“ఏవుంది..పీటీడుసుకొచ్చి పైనున్న డబ్బాకోసం  ఎక్కా బోతంటే..నువ్వెక్కలేవుండు , నేనెక్కిత్తానని  ..ఇదిగో ..ఇక్కడ రెండుపక్కల్నించీ సంకల్లోంచి సేతులేసి పైకి ఎక్కిత్తన్నట్టు…గట్టిగా నొక్కేసేడమ్మా..” అంది సిగ్గేసిన మొకంతో గుండెలకేసి సూపిత్తా..

“నాకెంత నొప్పేసిందో..! మా బళ్ళోను..రాణి మంచినీళ్ళు తాగుతాకని లోపలికెల్తే..ఇలాగే సేసేడంట. నాకది గేపకం వచ్చింది..అంతుకే ..ఆడికి  బుద్ధి సెప్పాలని..

“తాతా పీట నువ్వెక్కు..ఈసారి నేను నిన్ను ఎక్కిత్తాను.” అన్నాను.

“ ఏటో అనుకున్నాను. తెలివైందానవేనే మనవరాలా” అంటా పీటెక్కుతా పట్టుకోమన్నాడు

“ ముందు పైకెక్కి  నూపప్పుడబ్బా దించెయ్ . తర్వాత నిన్ను దించుతా..” అని సెప్పి పై నించి తీసి తాత నూపప్పుడబ్బా అందిత్తే దాన్నందుకుని పక్కనెట్టి..దిగుతాకని పీట మీద కూచ్చుంటాకి వంగుతుంటే ..పీటెత్తి పక్కకి పడేసేను. సచ్చూరుకున్నాడు ముసలోడు..లేపోతే గట్టిగా నొక్కేత్తాడా..నన్ను..”

అంటా వణికిపోతున్న గిలకమ్మ గౌనెత్తి పొట్తకి కాతంత పైనా, మెడకిందా కమిలిపోవటాన్ని సూసి పల్లు నూరతానే బాధని బిగబట్టి ..పిల్ల సూడకుండా.. గుడ్డు నీళ్ళు గుడ్డున కుక్కుకుంటా..

“ మాబాగా సేసేవ్. అలాటెదవలకి అలాగే సెయ్యాలి. ముసలి సచ్చినోడు…ముసలి సచ్చినోడని. కాటిక్కాల్లు సాపుకుని కూకున్న ఎదవకి పసిగుడ్దని కూడా అనిపిచ్చలేదా ఎదవన్నెరెదవకి..”

కసిదీరా తిట్టి..” ఈమాట..నాన్తో అనకు. నువ్వు సేసిందే సాలు  ఆ ముసిలోడికి..”  అంటా..వణుకు తగ్గిన కూతురు నుదురు మీదో ముద్దెట్టి  నిండా దుప్పటి కప్పి, ఏణ్ణీల్లు కాపడం పెడదావని

పొయ్యంటిత్తాకి అగ్గిపుల్ల గీసిందేవో.. నిజాన్నా పొయ్యిలో పడేసింది సరోజ్ని.

——

 

 

 

 

1 thought on “గిలకమ్మ కతలు – గిలకమ్మా.. మజాకా…

  1. ఎదవ ముసలి సచ్చినోడికి దైర్నoగా బానే బుద్ధిసెప్పింది గిలకమ్మ( సెప్పడానికైనా, సెయ్యడానికైనా గిలకమ్మ అమ్మలాటోళ్ళ పెంపకం కూడా అలానే ఉండాలి మరి..
    ఇలాంటి నిజాన్ని నిప్పుల్లోపడేయడానికి నిమిషం కూడా ఆలోచించలేదు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *