April 18, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

 

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

కీర్తనలో అన్నమయ్య వాదన బహు చిత్రవిచిత్రంగా ఉంటుంది. మనిషి యొక్క పాపపుణ్యాలకు కారణమైనది మనసు. మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా!  అలాంటప్పుడు పాప పుణ్యాలను చేయించే బుద్ధిని  తప్పు మానవులది ఎలా అవుతుంది?  అందువల్ల ఆయన్నే అడగాలి. మనం చనిపోయాక మన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తునిచే            చదివించి యమధర్మరాజు శిక్షించే పద్ధతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. చిత్తగించండి.

కీర్తన:

పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును

అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ

 

.1. కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే

గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా

సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే

పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా          అత॥

 

.2. రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే

అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా

ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే

మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా          అత॥

 

.3. యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే

తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా

చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే

అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త         అత॥

(రాగం: లలిత, సం.2. సంకీ.294, రాగిరేకు 161-2)

 

విశ్లేషణ:

 

పల్లవి: మనిషిచేసే మంచిచెడులన్నిటికీ మనస్సే కారణం. మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా! మనిషి మరణించాక యమధర్మరాజు చిత్రగుప్తునిచే మన మంచి చెడ్డల చిట్టా విప్పి చదివించి శిక్షలు వేయడం ఏమి న్యాయం? శ్రీవెంకటేశ్వరుడు మన బుద్ధులను నియంత్రిస్తున్నాడు కనుక ఆయననే అడగాలి విషయాలు మమ్ము విచారించవద్దు అనే క్రొత్త వాదన వినిపిస్తున్నాడు అన్నమయ్య.

 

.1. కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే

గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా

సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే

పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా

నాకు కాళ్ళు చేతులు సర్వ అంగములను ఇచ్చినది భగవంతుడే కదా! నా కర్మలకు సైతము ఆయనే కర్త కదా! నా సంచిత, ఆగామి కర్మలన్నీ ఆయన అధీనమే కదా! నా ప్రాణములను నిత్య చైతన్యవంతం కలిగించేది సర్వేశ్వరుడే కదా! మరి నా అపరాధములు పరిహరించే కర్తవ్యం కూడా ఆయనదే కదా! నా పాపములను పరిహరణ చేయకుండా నన్నే పాపిగా దోషిగా నిలబెట్టడం ఏమిటి దేవా? ఇందులో నా దోషం ఇసుమంతైననూ లేదు.

 

.2. రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే

అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా

ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే

మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా

          నను చక్కగా పుట్టించేది, రక్షించేది శ్రీహరే కదా! నాకు సంబంధించిన మంచి చెడ్డలను చూసుకునే బాధ్యత వహించినట్టే కదా! నాకు సంబంధించిన అన్ని వ్యవహారములకు ఆయనే కర్తయై ఉన్నాడు. నా అంతరాత్మలో నెలకొన్న పరంధాముడే మీతో మాట్లాడు కుంటాడు. సరైన ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆయంకు తెలియనివి కాదు కదా! అన్నిటికినీ ఆయనే కర్త అంటున్నాడు అన్నమయ్య.

 

.3. యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే

తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా

చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే

అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త

 

 

            పరంధాముడు మమ్ము ఎన్నడూ విడచిపెట్టడు. మా మంచిచెడ్డలన్నీ ఆయనే కాచుకుని ఇహపర సుఖాలను ప్రసాదిస్తాడు.ఇతరులు బాధలనందకుండా తనను నమ్ముకున్న భక్తులు దు:ఖించకుండా చూసుకునే కర్త ఆయనే కదా! నా పాలి దైవమైన శ్రీవేంకటేశ్వరుడు మిమ్ములను సద్భుద్దిగల వారుగా చేస్తాడు. తానే అన్నిటికీ కర్తృత్వం వహించి మీరు తనకు దాసులుగా ఆత్మార్పణము చేసే విధంగా చూసుకొంటాడు. కనుక శ్రీహరిని త్రికరణసుద్ధిగా నమ్మితే పై విధంగా అన్నివిధాలా మనలను రక్షిస్తాడు మోక్షగాములను చేస్తాడు అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.

 

ముఖ్యమైన అర్ధాలు    ఔగాములు  = మంచిచెడ్డలు; తడవకుమీ! = వెదకవద్దు సుమా! అనగా మాకు సంబంధం లేని విషయంలో మా జోళికి రావద్దు అని చెప్పడంకరచరణాదులు = కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు; ఉభయ కర్మములు = సంచిత,ఆగామి అనే కర్మలు; సరుగ = వర్ధిల్లు, వృద్ధిపొందు; పరగు = ప్రసరించు; పరిహరణ = ఛేదనము, విచ్ఛేదనము, సంభేదము; రమణ = మనోజ్ఞత, అందము; వళుకు = తగవు, కయ్యము, పోట్లాట; ప్రమదముఆనందము, సంతోషము; పాదుకొన్న = నెలకొన్న; పాయక = విడువక; సమ్మతిజేయు = అంగీకరించు, ఆమోదించు; అప్పణ = ఉత్తరువు, సెలవు.

-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *