క్షణికానందం….

రచన:శ్రీకాంత  గుమ్ములూరి.

 

మిట్ట మధ్యాహ్నం దారి తప్పిన రోడ్డులో
నడినెత్తిన మండుతున్న ఎండలో
నడుస్తున్నా  తీరు తెన్ను లెరుగని దిశలో
చుట్టూ కాంక్రీట్ జంగిల్
పచ్చదనం కరువైన బాట
సిమెంట్ మయమైన చోట
రెండు గోడల ఇరుకులో
నన్నే చూడమని పిలిచింది
కన్నులని ఆకట్టుకుంది
వేలెడైనా లేదు కానీ
నిటారుగా నిలిచింది!
ఒంటరి దాన్నే కానీ
నాకూ ఒక గుర్తింపు కావాలంది!
నేనందుకు తగనా అని నిలదీసింది!
తలెత్తి చూస్తే మేడమీద అందంగా,
దూరంగా, బాల్కనీలో వరుసగా పేర్చబడిన
కుండీల్లో విరబూసిన పూలు నిండుగా, ఎర్రగా!
పోల్చకు నన్ను వాటితో
అందరికీ అవకాశం దొరికే దెలా?
పెట్టి పుట్టిన వాళ్ళకే దొరుకును అలా
అందుకే నే చేసిన ప్రయత్నం ఇలా
జీవితం పై తీరని ఆశ నాది
సాధించగలనన్న ఆకాంక్ష నాది
ఒడుదుడుకుల కోర్వగల నైజం నాది
ప్రయత్నం ఫలించి తీరగలదను నమ్మకం నాది
క్షణిక జీవనంలో అల్పానందం
పంచి ఇవ్వగల ప్రయత్నం నాది!!!

*******

Leave a Comment