గుండె గొంతుకు…

రచన: కృష్ణ అశోక్

 

గొంతు మింగుడు పడటంలేదు..
నోటిదాకా చేరని ఓ అన్నం ముద్ద
పిడికిలిలోనే ఉండిపోయి
మెల్లగా ఎండిపోతుంది..

ఎండిపోతున్న ఒక్కో మెతుకు
తనలోని తడి ఉనికిని కోల్పోయి
పిడికిలిని వీడి ఆకాశంలోకి
ఆవిరై రాలిపోతుంది..

కొన్ని ఇమడలేని మెతుకులు కూడా
ఒకటొకటి గాలి చాలకో ఊపిరాడకో
వాంతి అయిపోయినట్టు
పిడికిలి దాటి జారిపోతున్నాయి…

గొంతు ఇంకా గింజుకుంటూనే ఉంది
మింగుడుపడే మార్గంకోసము..
గరగరా శబ్దం చేస్తూ
కిందమీద పడుతూనేవుంది…

పిడికిలి ముద్దనుండి రాలిపోగా మిగిలిన మరికొన్ని సున్నిత మెతుకులు
అమాయకంగా ఎదురుచూస్తున్నాయి
గొంతు గుహలో సేద తీరేందుకు…

గట్టిగా సకిలించినట్టు
గొంతు సవరించాను
మింగడానికి మార్గం
సుగమం అయినట్టుంది…

ముద్ద నోటివద్దకు చేరింది
కానీ మిగిలిన మెతుకులు ఒకటో రెండో..
చాలు ఈ జీవితం నిలవడానికి
సార్ధకత చేకూరడానికి.. ఇవి చాలు..!!

1 thought on “గుండె గొంతుకు…

Leave a Comment