March 29, 2024

‘నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!

రచన : సోమ సుధేష్ణ

 

 

“కొత్త ఇంట్లో చాల బావుంది శ్రీను.” అంటూ హిమ ఫేమిలీ రూమ్ లో నలుమూలలా తాను చేసిన అలంకారాలు సరి చేసుకుంటూ అంది.

శ్రీనివాస్ కు కూడ అలంకరణ నచ్చింది. రాబోయే తల్లిదండ్రులకోసం అన్ని సిద్దంగా ఉన్నాయి. తృప్తిగా తలాడించాడు. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళారు. కింగ్ సైజు బెడ్ దానికి రెండు వైపులా టేబుల్స్ పై లాంప్స్ ఉన్నాయి. బెడ్ కు ఎదురుగా ఒక పక్క డ్రెస్సింగ్ టేబుల్, మరో పక్క  డ్రాయర్స్ తో చెస్ట్ ఉన్నాయి. మరో వైపు గోడకు అనుకుని రెండు కుర్చీలు ఉన్నాయి. శ్రీను ఒక దాంట్లో కూర్చుని చూసాడు. మెత్తగా ఒరగడానికి వీలుగా ఉంది. గది నిండుగా అందంగా ఉంది.  గోడల పైన భారత నారీలు, చక్కటి పొలాల పెయింటింగ్స్ అందాన్ని ఇనుమడిస్తున్నాయి. తల్లిదండ్రుల కోసం ఈ రూమ్ కేటాయించాడు.

‘అమ్మానాన్న పడ్డ కష్టమంతా మరిచిపోయేట్టు చేస్తాను. వాళ్ళని నా దగ్గరే ఉంచుకుని జీవితంలోని ఆనందాలు వాళ్ళకి చూపిస్తాను. రామవరం ఒక ప్రపంచం కాదు, ప్రపంచంలో రామవరం ఒక చిన్న ఊరు. దాన్ని మించిన అందమైన ప్రపంచం ఉందని ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలి. వేలు కదపనివ్వకుండా సదుపాయాలు అన్నీ చేసి పెట్టాలి.’ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు శ్రీనివాస్.

‘నేను చాల అదృష్టవంతుణ్ణి, తల్లి దండ్రులను దగ్గర ఉంచుకుని వారి మంచి చెడ్డలు చూసే అవకాశం నాకు కలుగుతోంది. నా తల్లి దండ్రులు దేవుండ్లు. వాళ్ళ జీవితం ధారపోసి నన్ను ఈ స్థితికి తెచ్చారు. వాళ్ళకు ఎంత చేసినా తక్కువే.’ శ్రీను గుండె నవ్వుకుంది.

*****

ఆ రోజు శనివారం ఉదయం-

హిమ ఇంకా పడుకునే ఉంది. శ్రీనుకు మాత్రం కంటిమీద కునుకు పడలేదు. మనసు నిండా ఆలోచనలే. నిద్ర రావడం లేదు కానీ లేవాలని కూడా లేదు. అలాగే వెల్లకిలా పడుకుని కళ్ళు తెరిచినా, మూసినా ఒకేలా ఉన్న చీకటిలోకి చూడలేక కళ్ళు మూసుకున్నాడు. నిశీదంలో నిశ్శబ్దం. నిశ్శబ్దంలో శూన్యం. మనమంతా శూన్యంలోనే కదా ఉన్నాము మరి శూన్యం ఇంత నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉందేమిటి! ఆలోచనలతో మొదలయిన అలజడి దాంతో రాత్రంతా నిద్ర రాక శివరాత్రే అయ్యింది.

నిశ్శబ్డాన్ని చేధిస్తూ అలారం మ్రోగింది. అలారం నిద్రలో ఉన్న వాళ్ళకు కాని మెలకువ ఉన్నవాళ్ళకెందుకు! హిమ వీకెండుకు అలారం ఆఫ్ చేస్తుంది, ఎక్కువసేపు పడుకోవచ్చని. ఈ రోజు ఆఫ్ చేయడం మరిచి పోయినట్లుంది. హిమ కదిలి పక్కకి తిరిగి  అలారం టక్కున ఆఫ్ చేస్తూ దిండులను ఎత్తుగా పేర్చి వాటికీ ఒరిగి ఉన్న భర్తను చూసి,

“ఎప్పుడు లేచావు శ్రీను?” అడిగింది.

“పడుకుంటే గదా లేవడానికి. నిద్ర రాలేదు.” నీరసంగా పలికాడు.

“ఇప్పుడైనా కాసేపు నిద్ర పో?”

“ఆల్రెడి ఆరున్నార్ అయింది.ఇప్పుడిక నిద్దర రాదుగాని నే వెళ్లి కాఫీ పెడతా .”

తనూ లేచి బాత్రుంలోకి వెళ్తూ హిమ “ఓ కే” అంది .

“ఎందుకు నిద్దర రాలేదు? వర్క్ గురించి ఏదైనా వర్రీనా?” రీక్లైనర్ లో వెనక్కి వాలి కూర్చున్న శ్రీను పక్కనే కూర్చుంటూ అంది. నిద్ర రానంత డిస్టర్బ్ ఎప్పుడు కాలేదు.

“కొత్త సంగతేమి కాదు హిమా, నిన్నటి నుండి మన ఊరు, అమ్మ, నాయన గుర్తొస్తున్నరు. రాత్రి చాలా డిస్టర్బ్ గా ఉండి నిద్ర పట్టలేదు.”

“ఫోన్ చేసి మాట్లాడితే మనసు కుదుటపడేది కదా. కాఫీ చల్లారిపోతుంది” టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పు అందిచ్చింది.

“ట్రై చేసాను, ఎవరు ఫోన్ ఎత్తలేదు.” నిట్టూర్చాడు. మనసు బాగా లేకపోతే ఈ కాఫీ, టీలతో వచ్చే హుషారు ఏమి పని చెయ్యవు. ఆలోచనల్లోంచి మనసులోకి వచ్చి భావాలై నిలిచిన ఆ హుషారు ముందు అన్నీ ‘హుష్! కాకియే.’

“ఏదైనా ప్రోబ్లం ఉంటే అన్న ఫోన్ చేసేవాడే గద శ్రీను. వర్రీ గాకు. మొన్నే కదా మాట్లాడావు.” అంటూ లేచి ఫోన్ ట్రై చేసింది. లైను కలవలేదు.

“ఓ గంట ఆగి మల్లి ట్రై చేస్తాను.”

“వాళ్ళు అందరూ బాగానే ఉండి ఉంటరు. అదేమో మరి మనసు నెమ్మది అనిపించడం లేదు.”

“పది రోజుల్లో వాళ్ళు మన దగ్గర ఉంటరు. వాళ్ళు వస్తారనే ఎక్గ్జయిట్ మెంటులో నీ కలా అనిపిస్తుందేమో.”

శ్రీను మనసులో ఏదో తెలియని ఆరాటం, అలజడి. జ్ఞానం వచ్చిన నాటినుండి జీవితాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మేఘాలు కదిలినట్టుగా ఆలోచనలు తరుచుగా అలా మనసులో కదులుతూనే ఉంటాయి. మానవ జన్మ అన్నింటి కంటే ఉత్తమమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ ఉన్నతమైన మానవ జన్మలో కూడా ఈ తారతమ్యాలేమిటి! ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద జన్మించారు కదా-వారిలో ఏ ఒక్కరూ ఈ తారతమ్యాన్ని సరిదిద్దలేకపోయారా! ఉత్తమమైన ఈ మానవుడు తోటి మానవుడిని గుర్తించడానికి ఎందుకింత కష్టపడుతున్నాడు. పెద్ద దొర మనసెంత పెద్దది, అందరి మీద ప్రేమే. తల్లితండ్రి పెద్దదొరను దేవుడు అనుకుంటారు. పెద్దదొర వాళ్ళని ఎప్పుడూ అవసరానికి ఆదుకుంటూనే ఉంటాడు.

ఆలోచనల్లోకి ఒదిగి పోయిన శ్రీను మనసులో మమతాను బంధంతో ముడిపడిన జీవన తరంగాలు అలలు అలలుగా లేస్తున్నాయి. ఒడుదుడుకుల బాటలతో గడిచిన ఊరి జీవితం ఆ గతుకులను చూపిస్తూ కళ్ళ ముందు తరుచుగా కదులుతూనే ఉంటుంది.

‘ఆ జీవితపు పరిధుల్లోంచి నన్ను దాటించి, తల్లి, దండ్రులు నా కందిచ్చిన ఈ ప్రశాంతతను వాళ్ళ జీవితంలోకి తీసుకు రావాలి.’ శ్రీనులోని ఆరని దూప, తీరని ఆకలి.

‘అమ్మ ఊరిలో పెద్ద దొర ఇంట్లో వంట, అన్ని పన్లు చేసి, ఆ వీధిలనే ఉన్న చిన్నరెడ్డి దొర ఇంట్ల గూడ పని జేస్టది. అమ్మ తెల్లారక ముందే పనికి వొయ్యి సందే దిగినంక గాని ఇంటికి రాదు. నాయన పొలం పన్లకు పోతడు. కావలిసింది తిండి, బట్ట. భూమి పగిలినా, ఆకాశం ఇరిగినా, పెయ్యి సల సల కాలుతున్న ఆగకుండ ఇద్దరు పనికి పోతర్. అన్న,ఎంకటేసు లగ్గం జేస్కొని అత్తగారింటి కాడ అక్కన్నే బతుకుతుండు. ఆయన బామ్మరిదికి వాతం వొచ్చి కాళ్ళు చేతులు పడిపోయ్యినయ్. అత్తగారికి ఎవ్వరు దిక్కులేరు. అన్ననే దిక్కు.  అక్క, లలితకు పన్నెండెండ్లకే లగ్గం జేసిండ్రు. బావ తాలుకాల కిరానా దుక్ నం సూసుకుంటడు. మంచిగనే ఉన్నరు తిండికి, బట్టకు కరువు లేదని అమ్మ జెప్తది. మనకు అన్నం పెట్టె పెద్దోల్లకు దండం బెట్టాలే, ఆల్లను మరువొద్దు కొడుకా, అని నాకు ఊకే సేప్తది అమ్మ.

పెద్ద దొర మనుమలు, మనుమరాండ్లు ఊరికి వొస్తే మస్తు మజా అనిపించేది నాకు. ఇల్లంత సందడే. అందరూ లచ్చిమి..లచ్చిమి అని అమ్మను ఇష్టంగా పిలుస్తరు. అంత పెద్ద ఇంట్ల పెద్ద దొర ఒక్కడే ఉంటడు. ముగ్గురు కొడుకులు, వాళ్ళ పిల్లలు పట్నంలనే ఉంటరు. నేను రోజు బడి నుంచి రాంగనే పెద్ద దొరతోనే ఉంట. అందరూ పెద్ద దొర అని పిలిస్తే నేను కూడా పెద్ద దొర అనే పిలుస్త. ఆయన పేరు వేంకట నరసింహ్మా రేడ్డి. దొర ఏం పని జెప్తే అది చేస్త, ఆయన ఎనకాలనే తిరుగుత, దొరతో మాట్లాడుతుంటే పుస్తకాలు సదివినట్టే ఉంటది సీనుకు. నాకు ఇంగ్లీషు, మాత్స్ ఇంక తెలుగు మంచిగ మాట్లాడుడు దొర సేప్పిండు. పెద్ద దొర్సానమ్మ చాల చాల మంచిదున్దేనంట. నేను సూడలేదు. మా యమ్మకు పిల్లలు పుట్టంగనే పెద్ద దోర్సానే మాకు  పేర్లు పెట్టిందట. మా అదృష్టం అని అమ్మ ఊకే అంటుంటది.

“నా దగ్గరకు వస్తున్నావు ఇప్పుడు, నేను పోయాక ఏం చేస్తావురా సీను?” నన్ను పెద్ద దొర సీను అని పిలుస్తడు. నా కట్లనే శాన ఇష్టం.

“నువ్వేక్కడ్కు వోతె అక్కడికి నన్నుగూడ తీస్కపో. నువ్వెం జేయ్యమంటే అదే జేస్త దొర.” అని జవాబు చెప్పిన సీనుకు దొర చెప్పిందే వేద వాక్కు. పెద్ద దొర ఎప్పుడు సీను తల నిమిరేవాడు. అవే దీవెనలై శ్రీనును తీర్చి  దిద్దాయి. పెద్ద దొర రాత్రి పండ్లు తింటడు అంతనే. అందుకే సందె కాంగనే ఇంటికి ఉరికి పొయ్యి అన్నం దిని ఒస్త. రాత్రి పెద్ద దొర భగవద్ గీత సదివి పండుకుంటడు. రోజ్ ఇని ఇని నాగ్గూడ కొన్ని కంటపాఠం అయినవి. పెద్దదొర మంచం పక్కనే పండుకుంట.’

“ఈసారితో ఊళ్ళో ఉన్న చదువు అయిపోతుంది. పక్క ఊరిలో హైస్కూల్ ఉన్నా పోయి రావడం కుదరదురా. నీకు తెలివి ఉంది, బాగా చదువుకుని పైకి రావాలి. హైదరాబాదులో మురళి దగ్గర కెళ్ళి చదువుకుంటావా?పై  చదివులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ నీ తల్లి, దండ్రులను సుఖ పెట్టాలిరా. అప్పుడే బ్రతుకుకు అర్థం  ఉంటుంది.”

“ నువ్వు ఏం చదువుమంటే అదే చదువుత. నువ్వు గూడ వస్తవా దొర?”

“నాకిక్కడే ప్రశాంతంగా ఉంటుంది. సెలవులకు ఊరికి వచ్చి మీ అమ్మ, నాన్నను, నన్ను చూద్దువుగాని.”

పెద్ద దొర అనుకున్నట్టుగానే శ్రీనును పెద్ద కొడుకు మురళి దగ్గరకు పంపాడు. తల్లి, తండ్రుల పేరిట రెండెకరాల భూమి రాసినాడు. చదువు అంతా అయేదాకా మురళి సారుకు నన్ను సూసుకోమని సెప్పిండు. పెద్ద దొర దేవుడు. ఒకనాడు నాయనను పిలిచి,

“యాదగిరి! సీనును చదివించమని అన్నావు. హైదరాబాదులో మురళి దగ్గర ఉండి చదువుకుంటడు. ఏమంటవు?”

“అట్టనే దొర. మీరేం జేయ్యమంటే అది చేస్తం. లచ్చిమి గూడ అట్టనే అంటది. మీరే జెయ్యలే దొర.”

పెద్ద దొర అన్నట్టుగానే,

“వాని తల్లి, తండ్రి కోరిక ప్రకారం వాడికి చదువు చెప్పిస్తే వాల్ల మంచి తనానికి, సంవత్సరాల తరబడి మన  కుటుంబానికి సేవ చేసినందుకు ఋణం తీరుతుంది.” అని పెద్ద కొడుకు మురళికి చెప్పాడు.

శ్రీనుకు హెస్కూల్ లో మొదట కష్టంగానే ఉన్నా త్వరగానే అలవాటు పడ్డాడు. సెలవలకు ఊరికి పోగానే సంచి అక్కడ్ పడేసి పెద్ద దొర దగ్గరకు పరుగెత్తి వస పిట్టలాగ కబుర్లు చెప్పేవాడు. శ్రీనులోని మార్పును చూసి తల్లి,దండ్రి

“వీడు దొరల ఇంట్ల పుట్టాల్సినోడు. మన అదృష్టం కొద్ది మన కడుపున బుట్టిండు.” యాదగిరి అంటే

“పోయిన జన్మల మస్త్ పున్నెం జేసుకున్నం. ఆని మాటలట్లనే, ఆ తెలివి అట్లనే ఉంది.” అనుకుంట మురిసి పోయింది లచ్చిమి.

“కొడుకా! ఇట్ల వోస్తవ్, అట్ల పోతవ్. నిన్ను సూసినట్టే ఉండదు. కోడి తిన్నట్టు నాలుగు గింజలు తింటవు.

జల్ది రా, నాయ్ న్తోని కూసోని తిందువుగాని.” కొడుకు వచ్చాడు ఏదో చెయ్యాలనే ఆరాటం, కడుపులో దాచుకోవాలని ఆరాటం, ప్రపంచంలోకి పంపాలని ఉబలాటం ఆ తల్లికి.

“పట్నంల నేను మంచిగానే ఉన్న అమ్మా. మీరు ఇద్దరు ఫిఖర్ చెయ్యొద్దు. మీరు మంచిగ ఉండండ్రి.” శ్రీనుకు  వాళ్ళలోని ఆరాటం తెలుసు.

ఆదాయం లేని పేద కుటుంబం కాబట్టి శ్రీను కాలేజి చదువంతా ఉచితంగానే ఉండేది. మురళి సార్ ఇంట్లో  ఏ పని చెప్పినా  డ్రైవింగ్ తో పాటు అన్ని పనులు చేసేవాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేస్తున్నపుడే పెద్ద దొర ఆరోగ్యం బాగా లేదని హైదరాబాదుకు తీసుకొచ్చారు. శ్రీను రాత్రనక, పగలనక చేసిన సేవ అ కుటుంబంలో అందరి మనసులను కదిలించింది. ఆయన ఆయుష్షు తీరి కన్ను మూసాడు. శ్రీనుకు తేరుకోవడానికి చాల రోజులు పట్టింది.  పెద్ద దొర మాటలు, చేతలు తనలో పదిలంగా దాచుకున్నాడు.

*****

ఒక రోజు కాల్ సెంటర్ చూడడానికి వెళ్ళిన శ్రీను అక్కడ  హిమను కలిసాడు. స్నేహితులయ్యారు. తరుచుగా   కలుసు కున్నారు. ఇద్దరిలోనూ ప్రేమ చిగురించింది.  బీద కుటుంబంలో పుట్టడం మనుషులు చేసిన తప్పుకాదు. జరిగి పోయిన రోజుల గురించి తనకే బాధ లేదు కాని ముందు జీవితం మీద చాల ఆశ ఉంది అని తన అన్న దగ్గర ఉన్న తల్లి ఖర్చులకు కొంత సాయం చేయాలని ఉన్నట్టు హిమ తన మనసులోని మాటను తెలిపింది. ఇద్దరికి తమ కోరిక సమంజసంగానే అనిపించింది.

హిమ ఒక రోజు తన అన్న రఘుకు శ్రీనును పరిచయం చేసింది. రఘుకు, వాళ్ళ అమ్మకు  శ్రీను చాల నచ్చాడు. రఘు బి.ఏ. చదివాక మంచి జాబ్ దొరకక ఊబర్ నడుపుతున్నడు. మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తామని రఘు అనగానే శ్రీను తన కుటుంబంలో అందరికి వార్త చెప్పడం, డేట్ కుదర్చడం, పెళ్ళిలో అందరు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మురళి సార్ ఫేమిలీ దగ్గర ఉండి పెళ్ళి జరిపించారు.

పెళ్ళి అవగానే అనుకున్న ప్రకారం అమెరికాలో దొరికిన జాబ్ లో జాయిన్ అయ్యాడు శ్రీను. నెల రోజుల్లోనే హిమ కూడా అతన్ని చేరింది. శ్రీను తల్లిదండ్రులకి తరుచుగా డబ్బు పంపుతూనే ఉంటాడు. హిమ దృష్టిలో అది చాల మాములు విషయం. అదృష్టం అంటే ఇదే గాబోలు అనుకున్నాడు శ్రీను.

నేను చాల అదృష్టవంతుణ్ణి కాబట్టే దేవుడు నాకు ఆ తల్లిదండ్రులు, పెద్ద దొర, మురళి సార్ లాంటి మంచి మనుషులను, హిమలాంటి భార్యను నా చుట్టూ ఉంచి నాకు మంచి దారి చూపించాడు. ఇవి చాలు నాకు. దేవుడు ఇచ్చిన ఈ ఆనందాన్ని అందరికి పంచాలి తనలో తానే ఎన్నోసార్లు అనుకోవడమే కాకుండా హిమతో అన్నప్పుడు,

“ నాకు తెలుసు. అందుకే నిన్ను పెళ్ళి చేసుకున్నాను” నవ్వింది హిమ.

శ్రీను ఆలోచనలకు  బ్రేకు వేసాడు.

కాఫీ పూర్తి చేసి “హిమా! ఈ రోజు ప్రోగ్రాం ఏముంది?”

“ఈ రోజు సుశీల వాళ్ళింట్లో డిన్నరు ఉంది. మీకు మూడు బాగా లేకపోతే ఫోన్ చేసి ఎక్స్ క్యూజ్ చేయమని చెప్తాను.”

“సాయంత్రం కదా, వెళ్దాంలే.”

‘తల్లిదండ్రి ఒక పది రోజుల్లో ఇక్కడ ఉంటారు. వారి ప్రేమ ముందు నేను చూపే ప్రేమ పండితుని ముందు ఓనమాలు చదివినట్టే. డబ్బుకు పేదరికమేమో గాని ప్రేమ వారిలో పుష్కలంగా ఉంది.’

సాయంత్రం పార్టికి రెడి అయి బయల్దేరే ముందు “అనిల్ వాళ్ళ  కొత్త ఇంటి అడ్రస్ ఇవ్వు. ఐఫోన్ లో ఎక్కిస్తే గూగుల్ చెయ్యొచ్చు” అంటూ శ్రీను కార్ కీస్ తీసుకున్నాడు.

“నా ఫోన్ లో ఉంది షేర్ చేస్తాను.” హేండ్ బేగ్ లోంచి ఫోన్ తీసింది.

అప్పుడే ఇంటి ఫోన్ రింగయింది. హిమ వెళ్లి ఫోన్ తీసుకుంది.

“శ్రీను ఫోన్ ఇండియానుండి. లోపలికి రా” డోర్ తెరిచి గరాజ్ లోకి వెళ్ళబోతున్న శ్రీనుతో గట్టిగా అనేసి ఫోన్ లో

“హలో” అంది.

“శ్రీనివాస్ ఉన్నడా?”

“ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్ర్రేనివాస్ భార్య హిమను. మీరెవరు?”

“నేను భోనగిరి నుండి మాట్లాడుతున్న, ఇక్కడ కారు ఏక్సిడెంట్ అయ్యింది.”

“ఏక్సిడెంటా! ఎవరికి ఏక్సిడెంట్?” హిమ గాబరాగా అడిగింది.

వెనక్కి తిరిగి ఒక్క అంగలో వచ్చిన శ్రీను హిమ చేతిలోంచి ఫోన్ తీసుకుని

“నేను శ్రీనివాస్ ను, ఎవరు మాట్లాడుతున్నారు? ఏక్సిడెంట్ ఎవరికి అయ్యింది?” శ్రీను చేతులు వణుకుతున్నాయి.

“నేను వెంకటేశ్ దోస్తు రాఘవను. నీ అమ్మ నాయిన ఎలుగుపల్లికి పొయ్యి మీ అక్కను చూసి వొస్తున్నారు. బోనగిరి అడ్డ దగ్గర లారి ఎదురుంగ వొచ్చి కొట్టింది. అక్కడికక్కడే కార్ల అందరి పానాలు పొయినాయ్. బస్సోడు ఆగకుండ కొట్టుకపొయ్యిండు. పోలీ ..”

శ్రీను చేతిలోంచి ఫోన్ కింద పడింది. శ్రీను అక్కడే నేల మీదకు కుప్పలా కూలిపోయాడు.

“శ్రీను..శ్రీను..” ఏడుస్తూ హిమ ఒరిగిపోతున్న శ్రీను తలను తన గుండెలపై అనించుకుంది.

ఏ భావమూ లేని శ్రీను కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి తప్ప చలనం లేదు. హిమ నీళ్ళు తెచ్చి మొహం మీద చిలకరించింది. గ్లాసుతో నీళ్ళు తగించడానికి ప్రయత్నించింది కాని శ్రీను తాగలేక పోయాడు. ఇద్దరూ శిలలై అలాగే ఉన్నారు.

“’నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!”  శూన్యంలోకి చూస్తూ అన్న శ్రీను మాటలు చిన్నగా వినిపించాయి.

 

_______________

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *