March 29, 2024

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల

 

 

కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు.

వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో అని భయంతో కూడా తన ఆలోచనలు తనలోనే పెట్టుకునేది. యెవరింటికన్నా వెళ్ళి రెండు రోజులు వుండడం జరిగితే మాత్రం  వాళ్ళ ఇంట్లొ పనివాళ్లకి రూపాయో అర్థ రూపాయో ఇచ్చి వచ్చేది. కొద్దిగా మొహం దీనంగా పెట్టి యేదన్నా వాళ్ళ అవస్ధలు చెప్పారంటే ఇక ఇంతే సంగతులు. తండ్రి యేమన్నా కొనుక్కోమని ఇచ్చిన పదో పరకో వాళ్ళ చేతుల్లో పెట్టి వచ్చేసేది. . . యేమయ్యాయే డబ్బులు అని నాన్న యెప్పుడూ అడిగేవాడు కాదు.

ఒకసారి యేమయిందంటే ….  కాంతం అప్పుడు ఆరో ,   యేడో చదువుతున్నది. బాబాయివాళ్ళ ఇంట్లో పెళ్ళికి కుటుంబ సమేతంగా వారం ముందుగా వెళ్ళారు. వాళ్ళది పల్లెటూరు ఇంటి నిండా నౌకర్లు చాకర్లు బోల్డుమంది.

కాంతానికేమో యెక్కడికన్నా వెళ్ళగానే పనివాళ్ళెవరా? యెక్కడున్నారా?యెంతమంది వున్నారా? అని వెతుకుతాయి కళ్ళు. అలా పనివాళ్ళకోసమై వెతకటానికో ఫ్లాష్ బ్యాక్ వుంది

మన కాంతానికి విపరీతమైన పుస్తకాల పిచ్చి. స్కూల్లో జాయిన్ చేయగానే ఆమె వయసు వాళ్ళు అ ఆ లు చదివే స్టేజ్ లోనే వుంటే మన కాంతం ఒకటో తరగతి చదివేసి స్కూల్లో చదవడానికి యేమీ లేక యే పుస్తకం దొరికితే అది చదవడం మొదలు పెట్టింది. అదిగో అప్పుడే యజమానులు పనివాళ్ళను బానిసలుగా చూడడం,  లేదా సరిగా చూడకపోవడం,   అలాంటి కథలు యెక్కువగా చదివింది. దానితో వాళ్ళకు యేమన్నా చేయాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఓ…. . ఫీల్ అయి పోతుండేది.

సరే మళ్ళీ పెళ్ళి కొద్దాము. వెళ్ళగానె కాంతం తండ్రి,   పిన్ని పిల్లలూ,  బాబాయి పిల్లలూ అలా పిల్లలందరికీ తలా ఒక అయిదు రూపాయలు,   నోట్లు కాకుండా చిల్లర ఒక చిన్న గుడ్డ సంచిలో వేసి ఇచ్చి ఆ పెళ్ళికి అక్కడ వున్న నాలుగు రోజులూ పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా అయిసు ఫ్రూట్లు,  జీళ్ళు కొనుక్కమని ఇచ్చాడు. ఆయనకదో సరదా. పిల్లలందరూ ఆయన్ని ఓ. . పొగిడేసి యెగిరి గంతులేసారు. ఆ రోజుల్లో అయిదు రూపాయలంటే మాటలు కావు కదా.  ఆ డబ్బుల్ని చూడగానే. చిన్ని కాంతానికి ఒకటర్థమయింది అవన్నీ అక్కడ వున్న పని వాళ్ళకే సరిపోతాయని. మరి తనెలా యేమి కొనుక్కోవాలి?కాంతం బుజ్జి బుర్ర ఆలోచనలతో వేడెక్కింది.

ఇంతలో అందరూ పొలోమంటూ  జీళ్ళు కొనుక్కోడానికి బయల్దేరుతూ కాంతాన్ని కూడా లాక్కు పోయారు. ఇందులో కాంతానికి ఇంకో అలవాటు కూడా వుంది. అందరి దగ్గరా డబ్బులున్నాయి కదా?యెవరిది వాళ్ళు కొనుక్కోవచ్చు కదా?కాని దుకాణం దాకా  వెళ్ళేసరికి కాంతం లోనిఅతి మంచితనం నిద్ర లెస్తుంది. లేచింది వూర్కోకుండా కాంతాన్ని వుక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఫైనల్ గా వాళ్ళు కొనుక్కున్న వాటికి కూడా తనే డబ్బులిచ్చేస్తుంది. అందరికీ తెలుసా సంగతి. అందుకే వాళ్ళు రావే అంటూ లాక్కెళ్తారు.

సరే మొత్తం యాభై పైసలు పోగా నాలుగు రూపాయల యాభై పైసలున్న గుడ్డ సంచిని జాగ్రత్తగా గౌను జేబులో పెట్టుకుని దాన్ని పిన్నీసుతో గౌనుకి జత చేసింది. ఈ తతంగమంతా పూర్తయ్యి తలెత్తి చూసేసరికి యెవ్వరూ కనపడలేదు. వుసూరుమంటూ ఒక్కత్తే పెళ్ళింటికొచ్చింది. మధ్యాహ్నసమయం . పెద్దలందరూ కునుకు తీస్తున్నారు. చేసేదేమీ లేక పెరటి దొడ్డి గడపమీద కూర్చుని తన వంతు జీడి ని నెమ్మదిగా తినసాగింది. ఇంతలో అటుగా వెళ్తున్న పాలేరు “యేంది! కాంతమ్మగోరూ! ఒక్కరే జీళ్ళు తింటున్నారు?మాకేదండో” అనడిగాడు.

“అయ్యో! వెంకాయ్! నేనెంగిలి చేసేసాను. పోనీలే నీకో అయిదు పైసలిస్తాను. కొనుక్కొ యేం?” అని తను తింటున్న జీడి పక్కన పెట్టి జాగ్రత్త గా పిన్నీసు తీసి,  సంచీని బయటికి తీసి అందులో నుండి అయిదు పైసలు తీసి వెంకాయ్ కిచ్చింది.

“అమ్మాయిగోరెంత మంచోరో?” మెచ్చుకుని వాడెళ్ళి పోగానే మళ్ళీ సంచీ ప్రాసెస్ అంతా పూర్తి చేసి తన జీడి తీసుకుని తలెత్తేసరికి అక్కడ పని చేస్తున్న పాలేర్లందరూ వలయాకారంగా నించుని వున్నారు.

“మాకేదండీ కాంతమ్మగోరూ?”అందరూ ఒక్కసారిగా అడిగారు. . ఇక ఆ తర్వాత చెప్పడానికి యేమీ లేదు.

మర్నాడు అందరూ ఐస్ఫ్రూట్స్ కొనుక్కోడానికి వెళ్తుంటే అడగడానికి అభిమానం అడ్డొచ్చి ఇంట్లోనే వుండిపోయింది పాపం.

జీళ్ళు కొనడానికి డబ్బుల్లేకపోయినా ఆ తర్వాత పాలెర్లు మంచి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు మన కాంతానికి. అది వేరు సంగతి.

ఇది ఒక వేపు. ఇంకోటేంటంటే వీధిలో,  సిగ్నల్స్ దగ్గరా,   రైల్వే స్టేషన్ల దగ్గరా అడుక్కునే వాళ్ళను చూస్తే వాళ్ళకు యేదో జ్ఞానబోధ చెయ్యాలన్న ఆరాటం పీ టీ ఉషలా వురుక్కుంటూ వస్తుంది హృదయంలో నుండి.

ఒకసారి హైదరాబాదు నుండి పూణే వెళ్తుంటే సీట్ల కింద ,  మధ్య ఒక పాత గుడ్డేసుకుని తుడుస్తూ ఒక కుర్రవాడు కనపడ్డాడు. పదేళ్ళుంటాయేమొ. పక్కన కూర్చున్న తన కొడుకు ఈడువాడే. వాడు హడావుడిగా తుడిచేసి ఆ గుడ్డని భుజం మీద వేసుకుని దీనమొహంతో అడుక్కోవడం మొదలు పెట్టాడు. ట్రైన్ పెద్ద రష్ గా లేదు. అక్కడక్కడా వున్నారంతే. వాడికి పెద్ద గిట్టుబాటు కావడం లేదు. మన కాంతం లోని మాతృహృదయం వువ్వెత్తున యెగసి పడింది. వాడిని తీసుకెళ్ళి తన కొడుకుతో పాటు చూసుకోవాలని ఆరాటపడింది. సరే వాడందరి దగ్గరా అడుక్కుంటూ కాంతం దగ్గరికి కూడా వచ్చి చేయి చాపాడు.

“బాబూ! నీ పేరేంటి?” అడిగింది ప్రేమగా.

“షారూఖ్ ఖాన్” జుట్టెగరేస్తూ చెప్పాడు. జాలిగా పెట్టిన మొహం యెక్కడికి పోయిందో.

“భలే వుంది నీ పేరు. సరే గాని ఇలా రోజూ అందరి దగ్గరా అడుక్కోవడం యెందుకూ?నాతో పాటు వస్తావా? నీకిలా అడుక్కునే పని తప్పుతుంది. చక్కగా నా కొడుకుతో పాటు స్కూల్ కి వెళ్ళొచ్చు. మంచిగా చదువుకుంటే బాగా సంపాయించుకోవచ్చు. అప్పుడెవ్వరినీ అడుక్కోవక్కరలేదు. ”భవిష్యత్తుని అందంగా చూపించింది.

వాడు యెగాదిగా చూసాడు కాంతాన్ని. పక్కన వున్న కాంతం కొడుకుని చూసాడు.   “నీ కొడుకేనా?”

“అవును”

“యెంత సంపాయిస్తడు?”

“అప్పుడే సంపాదన యేంటి?చదువుకుంటున్నాడు”

“మరి నేను నెలకు మూడువేలు సంపాయిస్త. నీ ఇంటికొస్తే యేమొస్తది?పని చేపించుకుంటవ్” షాక్ నుండి తేరుకుని చూసేటప్పటికి వాడు కనపడలేదు. పక్కనే వున్న కూతురు ఇచ్చిన మంచినీళ్ళను గట గటా తాగేసింది.

పోనీ అలా అయిందని వూర్కుందా?

ఒకసారి ఆటోలో యెక్కడికో వెళ్తున్నారు. సిగ్నల్ పడడంతో ఆగిన ఆటోల దగ్గరికి పిల్లలందరు వచ్చి అడుక్కోసాగారు. అలాగే వీళ్ళ ఆటో దగ్గరికి కూడా ఒక పిల్ల వచ్చింది.

“ఒక రూపాయుంటే ఇయ్యమ్మా” అని అడిగింది.

“ఈ రూపాయి లెక్కేంటి?”అడిగింది కాంతం.

“అట్టా డిసైడ్ చేసినం. ” నిర్లక్ష్యంగా చెప్పింది.

“ఎందుకని?”

“షాపులోళ్ళు అర్థరూపాయి తీసుకోవట్లేదు. ”

అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి నిజమే కదా అనుకుంది అమాయకంగా.

ఒకరోజు హోటల్ నుండి బయటికి వచ్చి రోడ్డు దాటబోతుండగా ఒకామె వచ్చి చేయి చాపింది. పర్స్ లో నుండి చేతికి వచ్చిన ఒక కాయిన్ తీసి ఆమె చేతిలో వేసి ట్రాఫిక్ కాస్త తగ్గడంతో గబ గబా ముందుకు కదిలి రోడ్డు సగంలో కొచ్చేసరికి వెనక నుండి యెవరో పిలుస్తున్నట్లుగా అని పించి వెనక్కి చూసేసరికి ఇందాక చేయి చాపినామె వురుక్కుంటూ వచ్చింది.

“ఇదిగోమ్మో! నీ డబ్బులు. అర్థరూపాయి ఇస్తే ఎవడు తీసుకుంటరమ్మో?” కాంతం చేయి లాగి ఆ చేతిలో కాయిన్ పెట్టేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.

చుట్టూ హారన్ల మోతకి గాని తేరుకోలేకపోయింది.

“ఓ అమ్మో రూపాయి” మళ్ళీ గుర్తు చేసిందా పిల్ల.

పడుకున్న మాతృదేవత మళ్ళీ నిద్ర లేచింది.

“అలా కాదుగానమ్మా. చక్కగా నాతొ పాటు రా. మీ కోసం ప్రభుత్వమే కాక చాలామంది ఎన్నో చేస్తున్నారు. మా ఇంట్లో వుంచుకోవడమో లేక వాళ్ళ దగ్గరికి నిన్ను చేర్చడమో చేస్తాను. బాగా చదువుకోవచ్చు” ఎంతో దయగా చెప్పింది. కాదు చెప్పా ననుకుంది.

సిగ్నల్ ఇక ముప్పై సెకన్ల లోకి వచ్చింది. ఆ అమ్మాయికి నచ్చ చెప్పటానికి ఆటో దిగడానికి  రెడీ అయింది. ఈ లోపల

“ఒక్క రూపాయి ఇయ్యనీకి నూరు పెస్నలడగబట్టె . గీయమ్మంట నన్నుతోల్కెళ్ళి సదివిస్తదంట” అప్పుడే వచ్చిన ఇంకో పిల్లతో యెగతాళిగా చెప్తూ ఈ పిల్ల వెళ్ళిపోవడమూ,  సిగ్నల్ వచ్చి బయట పెట్టబోయిన కాలు లోపలికి లాక్కునే లోపల ఆటో ముందుకు కదలడమూ,  పక్కన కూర్చున్న మేనకోడలు . పకా పకా నవ్వడమూ అన్నీ ఏకకాలంలో జరిగాయి.

ఇన్ని జరిగినా ఇంకా కాంతం మనసు ఆరాటపడుతూనే వున్నది. యేదో చెయ్యాలనే ఆరాటం అణగటం లేదు. కాకపోతే ఒక్కటర్థమయింది. అడుక్కోటానికి వచ్చిన వాళ్ళకు యేదో చెప్పబోతే వినే ఓపిక వుండదు. వాళ్ళకు కావల్సింది . నువ్వేసావా లేదా అనే.

ఈ జ్ఞానోదయం కాగానె “అరె!నాకీ విషయం ఇంతవరకు తట్టలేదే” అని బోల్డు ఆశ్చర్యబోయింది. ఇక ఈసారి ఆ పొరబాటు అస్సలు చేయకూడదు. డబ్బులిచ్చి చెబ్దాము అని నిర్ణయించుకుంది.

ఆ వెంటనే కొన్నాళ్ళకి విజయవాడ వెళ్ళడానికి నాంపల్లి స్టేషన్ లో దిగడమేమిటి ఒకామె చంకలో ఒక పిల్ల, చేత్తో పట్టుకుని ఒక పిల్లడు, ఆమె చీర ఒక చేత్తో పట్టుకుని రెండో చేయి నోట్లో వేసుకుని ఇద్దరు పిల్లలు అందరూ కూడా అయిదేళ్ళలోపు వాళ్ళే వుండగా “అమ్మా పిల్లలకి ఆకలెస్తందమ్మా ,  ”అంటూ కాళ్ళకి అడ్డం పడింది.

ముందు అనుభవంతో ముందు జాగ్రత్తగా పర్సులో నుండి పది నోటు తీసి ఆమె చేతిలో పెట్టింది. అక్కడికి పనై పోయింది వెళ్ళొచ్చుగా అలా యెలా వెళ్తుంది? అందుకని డబ్బులుచ్చుకుని వెళ్తున్న ఆమెని ఆపి

“యేమమ్మా పిల్లలకి పెట్టడానికి లేదంటున్నావు. మరి ఇంతమందిని యెందుకు కన్నావు?ఒకళ్ళిద్దరితో ఆపొచ్చుగా?”అనునయంగా అడిగాననుకుంది.

వూహించలేదు ఆమెకంత కోపం వస్తుందని

“యేమమ్మో నువ్విచ్చిన పది రూపాయలతొనే నా పిల్కాయల్ని సాత్తానా?అయినా నువ్వెట్టా కన్నావో నేనట్టె కంటి. ఆ మాత్రం తెలీదా ఆడుదానివై వుండి?” పిల్లాడ్ని వదిలేసి చేయి తిప్పుకుంటూ అరిచింది.

సిగ్గుతో చచ్చినంత పనై ఇక మాట్లాడకుండా వెళ్ళి పోయింది కాంతం ఆమె ఇంకా వెనకాలనుండి యేమో అంటున్నా.

ఇన్ని అనుభవాలతో తల పండినా ఈ మధ్యే అయిన స్వచ్చ్ భారత్ ప్రాజెక్ట్ తో బొప్పి కట్టినా కాంతం ఆరాటం ఆగటం లేదు . యెవరన్నా సంఘ సేవ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే ఆరాధన. వాళ్ళు అంత కరెక్ట్ గా అవసరం వున్న వాళ్ళని యెలా కని పెడతారో,   ఆ అవసరం సమయానికి యెలా తీర్చ గలుగుతున్నారో అని గొప్ప ఆశ్చర్యం. అందుకే అలాంటి వాళ్ళను కలిసినప్పుడు తనకు తోచిందేదో ఇస్తూ వుంటుంది.

*********************

“యేంటి కాంతం?అలా కామెడీ షో చూస్తున్నదానిలా మొహం సీరియస్ తో కూడిన దిగులుతో పెట్టుకుని కూర్చున్నావు?”అడిగాడు కనకం లోపలికి వస్తూ.

తన మనసులో వున్న ఆలోచన తన దిగులు అన్నీ చెప్పింది.

“కాంతం! వాళ్ళు చూస్తున్న ప్రపంచం వాళ్ళకు మనుషుల్ని నమ్మక పోవడం నేర్పింది. సడన్ గా ఆటోలో కూర్చుని వెళ్తూ నీతో పాటు రమ్మంటే యెలా రాగలరు?నిన్నెలా నమ్మడం?అందుకే నీతో పాటు రారు. వాళ్ళల్లో నమ్మకం కలిగించాలంటే వాళ్లను కలుస్తుండాలి. నీ మీద వాళ్ళకు నమ్మకం యేర్పడాలి. నువు వాళ్ళకు యేదో చేస్తావు అన్న ఆశ వాళ్ళకి రావాలి. ఇవ్వన్నీ ఆ క్షణంలో యేర్పడవు. దానికి చాలా డెడికేటేడ్ గా వర్కవుట్స్ చెయ్యాలి. అవి మనలాంటి సామాన్యుల వల్ల కాదు. అందుకే. అవి చేసేవాళ్ళకు మన వంతు చేయూత మనం ఇవ్వగలిగితే అదే మనం దేశానికి చేసే సేవ. ” వివరంగా చెప్పాడు కనకం

అర్థమయినట్లుగా తల వూపింది కాంతం.

మరునాడు పొద్దున్న టిఫిన్ల కార్యక్రమం అయ్యాక  పెద్ద క్యారేజి పట్టుకొచ్చి “పదండి” అన్నది కాంతం.

“యెక్కడికే?” అడిగాడు కనకం.

“మీరేగా వాళ్ళల్లో నమ్మకం కలిగించాలన్నారు? అందుకే సిగ్నల్ దగ్గర పిల్లలకి వంట చేసి క్యారేజి సర్దాను. వాళ్ళకి పెట్టొద్దాము పదండి” హుషారుగా కదిలింది కాంతం.

తీసుకెళ్ళిన క్యారేజి అన్నం సరిపోక వాళ్ళందరు కాంతం మీద పడుతున్న సీను వూహించుకున్న కనకం కళ్ళు తిరిగి ఢామ్మని పడిపోయాడు.

 

****************

 

 

8 thoughts on “కాంతం సంఘసేవ

  1. అప్పట్లో స్వచ్ఛభారత్ కాదు బొచ్చె భారత్ కదా .
    ఈ కాంతం ఎవరబ్బా అని ? సాంతం చదివించింది ..

  2. సమకాలీన సమాజంలో సంఘర్షణ అనివార్యం.మారుతున్న ఆలోచనాధోరణికి సజీవ చిత్రం ఈ కధనం….శుభం….

Leave a Reply to P Naga Lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *