March 28, 2024

నడక-నడత

రచన: శారదాప్రసాద్

(Eingeschränkte Rechte für bestimmte redaktionelle Kunden in Deutschland. Limited rights for specific editorial clients in Germany.) MOHANDAS GANDHI (1869-1948). Hindu nationalist and spiritual leader. Photographed at the Sevagram Ashram. (Photo by Rühe/ullstein bild via Getty Images)

ఈ రోజుల్లో ప్రతివారూ నడకను గురించి మాట్లాడేవాళ్లే! సాధారణ నడక చాలని నా అభిప్రాయం. బజార్ కెళ్ళి మన పనులు మనం చేసుకుంటే చాలు. అతిగా నడవటం వలన అనర్ధకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెను వేగంగా పరిగెత్తిస్తుంటారు. ఈ నడక పిచ్చివాళ్లల్లో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది . నేను 10 రౌండ్లు వేశానని ఒకాయన అంటే మరొకాయన నేను 12 వేసాను అంటాడు! ఇంతకీ ఆ రౌండ్స్ ఏమిటో? నడక పూర్తి అయిన తర్వాత , స్టేడియం వెలుపలే
కొన్ని తినుబండారాల స్టాల్స్ ఉంటాయి. అలసి సొలసిన ఈ నడకదారులు-ఇక షాపుల మీద పడి తెగతింటారు. అంతసేపు నడిచినవారికెవరికైనా ఆకలి కావటం సహజం! కడుపు మాత్రం ఊరుకుంటుందా? ఒక కప్ కాఫీ తాగితే 250 గ్రాముల ఫాట్ పెరుగుతుందట! ఈ లెక్కన ఈ నడకరాయుళ్లకు ఫాట్ (క్షమించండి–పొగరు కాదు)ఎంత పెరుగుతుందో మీరే ఆలోచించండి! నా స్నేహితుడొకడు 100 కిలోల బరువు ఉంటాడు, షుగర్ వ్యాధి, రక్తపోటు లాంటి qualifications అన్నీ ఉన్నాయి. రోజూ ఉదయం , సాయంత్రం రెండుపూటలా నడుస్తాడు. ఉదయం నడక పూర్తి కాగానే మార్గ మధ్యంలో అల్పాహారం చేసివస్తాడు. ఇంట్లో తయారు చేసేటప్పటికి ఆలస్యం అవుతుందని! ఇక సాయంత్రం పూట నడక పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు, బజ్జీలు , పునుగులు . . . తెచ్చుకుంటాడు. రాత్రి 11 గంటలకు ఆకలవుతుందట ! అంత ముందు చూపున్న క్రాంతదర్శి ఆయన! ఇంత వాకింగ్ చేస్తున్నప్పటికీ ఆయన బరువు ఒక గ్రాము కూడా తప్పకపోగా, ప్రస్తుతం 105 కిలో వైపుగా అభివృద్ధివైపు దూసుకెళుతున్నాడు . చాలా రోజుల క్రితం ఒక Cardiologist మిత్రుడు చెప్పింది ఏమంటే–సాధారణ నడక చాలు.
అమెరికాలోని కొందరు వాకింగ్ షూస్ అమ్మేవాళ్ళు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ని పాటించారని , అసలు సీక్రెట్ చెప్పాడు. వాకింగ్ వలన రకరకాల సమస్యలు కూడా లేకపోలేదు. కొందరికి బౌల్స్ regulate అయ్యి ఎక్కడ పడితే అక్కడికి టాయిలెట్ కు వెళ్లాల్సిందే, లేకపోతే స్వచ్ఛ భారత్ కాస్తా మరేదో అవుతుంది. నాకు కూడా హార్ట్ సర్జరీ అయిన తర్వాత, పిల్లలు అలారం పెట్టి మరీ నిద్రలేపి బలవంతంగా వాకింగ్ కు పంపించేవారు. నాకు companion ఆ బౌలింగ్ ప్రాబ్లెమ్ ఉన్న స్నేహితుడు. ఎక్కడికి వాకింగ్ కు వెళ్ళాలి అనేది ఆయనే డిసైడ్ చేస్తాడు. దగ్గరలో స్నేహితుల ఇళ్ళు ఉండాలి మరి! ఎక్కడ తొందరైతే , అక్కడ పని పూర్తి చేసుకోవటానికి! చలికాలం అయితే , మంకీ కాప్, స్వెట్టర్ , చేతిలో ఒక కర్ర , షూస్ . . ఇవన్నీ వేసుకొని వెళ్లేవారం ! చేతిలో కర్ర ఎందుకంటే, కుక్కలు వెంటపడకుండా! వాకింగ్ ను ఎప్పుడు ఆపెయ్యాలో నిర్ణయించేది కూడా నా మిత్రుడే! కాదంటే తిడతాడు, మొహమాటం లేకుండా! జీవితంలో నేను భయపడేది ఆ మిత్రుడికే ! ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా చెప్పిన మాట వినకపోతే, మీ స్నేహితుడికి చెబుతాం అని బెదిరించేవారు కూడా! తెల్లవారుఝామున 4 గంటలకు ప్రారంభించే నడక ఉదయం 8 గంటలకు ముగుస్తుంది. ఈ లోపు హైదరాబాద్ నుండి నా తమ్ముడు రెండు సార్లు ఫోన్ చేసి, ఇంకా వాకింగ్ నుంచి రాలేదా? అయితే కొద్ధిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటాడేమో అని ఛలోక్తి విసిరేవాడు. కొంతకాలం ఇలా అందరికీ భయపడి నడిచాను, ఇష్టపూర్వకంగా కాదు! నా పిల్లలు ‘చూడు నాన్నా! ఉదయాన్నే ఎంతమంది నడుస్తున్నారో? నీకెందుకు ఇంత బద్ధకం? ‘ అని దెప్పి పొడిచేవారు. విసుగుపుట్టి వాళ్లందరికీ ఒకటే సమాధానం చెప్పాను. వాళ్లందరికీ ఏదో ఒక రోగమో, రొస్టో ఉంటుంది, లేకపోతే ఆ చలిలో ఎందుకు నడుస్తారని తిరగపడి చెప్పాను. మా బంధువుల్లో ఒకామె ఇలానే అతిగా నడిచి , మోకాళ్ళ నొప్పులతో బాధపడి, ఆపరేషన్ కూడా చేయించుకుంది.
ఏదీ అతి కాకూడదు. దేహమే మనం ఏ పనులు చేయాలో నిర్ణయిస్తుంది. ఒకప్పుడు మంతెన వారు -రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగమని చెప్పారు. మనది కడుపా లేక పెదకళ్ళేపలి చెరువా? మనం ఎన్ని నీళ్లు తాగాలో దేహం డిమాండ్ చేస్తుంది. మనుషులే సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు, కుక్కలు ఎందుకు చేయించుకోవని అర్ధం పర్ధం లేని ఉపన్యాసాలిచ్చేవారు. ఆయన చెప్పినట్లు చేస్తే , నాకు విరేచనం సాఫీగా అయ్యేది . అదే విషయాన్ని ఆయనకు నా బాణీలో –టాయిలెట్ కు పోయినప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారని చెప్పాను. ఇంత ఆహార నియామాలు పాటించిన ఆయనకు బై పాస్ సర్జరీ అయిందని ఎవరో చెప్పారు. ఆయన తర్వాత ఏచూరి వారు కొంతకాలం ఊదరగొట్టారు. ఇంట్లోనే అన్ని మందులను చేయించుకోమని! వాటిని ఇంట్లో చేసుకోవటం కన్నా, బైద్యనాద్ వారి మందులు కొనటం వలన ఖర్చు కూడా తక్కువే!
మా అపార్ట్మెంట్ లో ఒక నా వయసంతామె, ఒక బుట్ట గులాబీ పూలు తెచ్చుకుంటూ కనపడింది. ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా అని అడిగాను. దానికి ఆమె చెప్పిన సమాధానం విని సిగ్గుతో తలదించుకుని వెళ్లాను! ఇంతకీ ఆ సమాధానము ఏమిటంటే ఒక పెద్ద గంగాళం నిండా నీళ్ళుపోసి, ఆ నీళ్ళల్లో గులాబీలను వేసి, ఒక అరగంట నగ్నంగా కూచుంటే తెల్లపడతారట! గంగాళం ముందే కొని ఉంచారట! ఇదంతా పిచ్చి వ్యామోహం, వృద్ధాప్యంలో యవ్వనంగా కనిపించాలనుకోవటం కూడా జబ్బేనేమో! 70 ఏళ్ళు వయసుదాటిన వారు కూడా జుట్టుకు రంగు వేసుకోవటం, ఉన్న కాస్త జుట్టును కత్తిరించుకోవటం దేనికో? తర్వాత వీరమాచనేని వారొచ్చారు. మాట్లాడితే కొబ్బరి నూనె తాగమంటాడు ఆయన! టాయిలెట్ కు పోతే ఆ జిడ్డు ఒక పట్టాన వదలదు. ఇప్పుడు ఖాదర్ వలి గారి టైం. అన్ని ఆకులతో కషాయం చేసుకొని తాగమంటాడు. కొన్ని ఆకులను మనం గురుపట్టలేం! పొద్దున్నేలేచి పోటీల పందెం లాగా జామచెట్ల మీద దాడి చేస్తున్నారు జనాలు. చెట్టుకు ఒక్క ఆకు కూడా కనపడటం లేదు. చెట్లు కూడా తిరుపతి పోయోచ్చాయా అన్నట్లుగా ఉంది.
సిరి ధాన్యాలను విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. కొర్రలతోటి కారప్పూసలను చేసి అమ్ముతున్నారు. ప్రతి దాంట్లో వ్యాపార దృక్పధం తెచ్చేది-గుజరాతీలు మరియు మనమేనేమో! ఇంతకీ నేను చెప్పోచ్చేదామంటే, ఏదైనా మితంగా తింటే చాలని. ఈ సందర్భంలో మా గురువుగారైన ‘ ముని’ మాణిక్యం నరసింహారావు గారు కాంతానికి ఒక సారి దీన్ని గురించే ఇలా క్లాస్ పీకారట – మనం పండ్లుతిని తొక్కలను పారేస్తాం , అసలు తొక్కలోనే విటమిన్లు అన్నిఉంటాయని! దానికి కాంతం–సరేలేండీ! రేపటి నుంచి పళ్ళను నేనూ, పిల్లలం తిని , తొక్కలను మీకుంచాతాం అంది ! మునిమాణిక్యం వారు బిత్తర చూపులు చూడక తప్పలేదట! బాబారాందేవ్ (పతంజలి) వారిని గురించి కూడా పనిలో పనిగా ఒక్క మాటలో చెబుతా! కడుపును క్లీన్ చేసుకోవట కోసం ఆయన కడుపును వెన్నెముకకు తాకించి మరలా దాన్ని సాధారణ స్థాయికి తేవటం మీరు కూడా టీవీల్లో చూసేవుంటారు. ఒకసారి అలా కడుపు లోపలికిపోయి మళ్ళీ సాధారణ స్థితికి రాకపోతే ఆపరేషన్ చేయించుకున్నాడని వినికిడి! ఇలా రాస్తూ పోతే ఎంతైనా చెప్పొచ్చు! దాదాపుగా సంవత్సరం పైగా నడిచిన జగన్ ను గురించి ఒక్క మాట కూడా చెప్పకుంటే , ఇది అసంపూర్ణం అవుతుంది! ఇక రోజు నడవక పోతే ఆయనకు తోచదేమో! అభ్యాసం వ్యసనం కాకూడదు!

 

నడక ముఖ్యమే! దానికన్నాముఖ్యమైంది నడత!

ఇది ఎవరినీ నొప్పించటానికోసం నేను వ్రాయలేదు, కొంత యదార్ధం లేకపోలేదు. వివరణ ఇచ్చినా ఇంకా ఎవరైనా బాధపడితే అది వారి ఖర్మ!

20 thoughts on “నడక-నడత

  1. అందరూ తరచుగా చర్చించుకునే విషయాలను స్పృశించారు. వైద్యవిద్య చదవనివారు ఛానల్స్ లో ఆరోగ్యసంబంధమైన సలహాలు ఇస్తుంటే అవి పాటించడం ప్రమాదకరం కావచ్చు.

  2. అతి సర్వత్ర వర్జయేత్
    చాలా మంచి సలహలు ఇచ్చారు సార్

  3. మీ రచనా శైలి బాగుండటమే కాకుండా,మీరు వ్రాసేవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి !అభినందనలు!

  4. మంచి విషయం. ఈ రోజుల్లో నడక ఒక ఆరోగ్యపు అలవాటుగా కాకుండా వ్యసనంగా భావించే వాళ్ళున్నారు. మొన్నా మధ్యన ఒక మ్యాగజైన్ లో ఒక ప్రముఖ డాక్టర్ ఇలా ఉటంకించారు. “మానవుని గుండె సగటున 70-80 సంవత్సరాల కాలం పనిచేసేలా నిర్దుష్టమైన జీవనవిధానంలో
    ఏర్పాటుచేయబడి ఉంటుంది. నడకలు, వ్యాయామాలు అతిగా చేయడం వలన ఆ గుండెను మనం కావాల్సినదాని కంటే ఎక్కువగా పనిచేయించడం అవుతుంది. తద్వారా గుండె యొక్క జీవితకాలం కుదించబడుతుంది. ఎక్కువగా నడవడం కంటే వీలున్న మేరకు నిద్రపోవాలి. అంటే గుండెకి ఎక్కువ విశ్రాంతినివ్వాలి.”

    ఇవి సదరు డాక్టర్ చెప్పిన మాటలు. ఆ మ్యాగజైన్ పేరు, డాక్టర్ పేరు గుర్తులేదు. దొరికిన వెంటనే మీకు తెలియజేస్తాను.

  5. శ్రీ శాస్రిగారు చాలా ఖరెక్అ్ గా చెప్పారండి. నేను రిటైర్ ఈన కొత్తల్లో ” వాకింగ్” తెగ నడిచా అప్పటికీ నా భార్య వారిస్తున్నా వినల. ఫలితం మోకాళదళు అరిగాయి. వీరన్నట్లు అతి సర్వదా వర్జయేత్

  6. నమస్తే గురువు గారు,
    శారద శాస్త్రి గారు ఉన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో దిట్ట.వారు వాస్తవాన్ని ఎవరిని నొప్పించకుండా హాస్యాన్ని జోడించి మరి చెబుతారు.వారు చెప్పే విషయాలు మనస్సుకు హత్తుకుంటాయి.జరుగుతున్న విషయాలను ప్రజల వేలం వెర్రిని కళ్ళకు కట్టినట్టు తెలిపారు ధన్యవాదాలు సార్.

  7. మిత్రులకు నమస్తే,
    మీ” నడక నడత” రచన బాగుంది. ప్రతి విషయంలో మంచిచెడు రెండూ వుంటాయి.ఏది ఆచరించాలి కూడదు అనేది మన విచక్షణ వివేకం మీద ఆధారపడివుంటుంది.
    మన నడక నడత లమీద మన ఆరోగ్యం, వ్యక్తిత్వం ఆధారపడి వుంటుందని నా అభిప్రాయం.
    రచనాశైలీబాగుంది.

  8. Nadaka–Nadatha–Andulo Madatha
    Budatha…la .ku..kudaa…ardham…paramaardham…navvu…puttinchelaa…Mee..kathanam…baagundi..

Leave a Reply to K.Nageswara Rao. Cancel reply

Your email address will not be published. Required fields are marked *