March 28, 2024

గిలకమ్మ కతలు – “సారె పంచుడూ..వీపు దంచుడూ!”

రచన: కన్నెగంటి అనసూయ

“గిలకా ..! ఒసేయ్ గిలకా ..! తలుపుల్తీసే ఉన్నాయ్. ఏ కుక్కాన్నా వత్తేనో? మీకసల బయమెట్లేదేటే దేవుడు..? ఏ కుక్కన్నా వత్తేనో..”
దగ్గిరికేసున్న తలుపుల్ని తోసుకుని లోనికొత్తానే అరిగి, మట్టిగొట్టుకుపోయి తేగతొక్కల్లా ఏల్లాడతన్న అవాయి సెప్పుల్ని మూలకంటా ఇడుత్తా సరోజ్నీ ఎన్నిసార్లరిసినా ఎక్కడా అజాపజాలేదు గిలక.
“ ఎక్కడేం పుణుక్కుంటందో? ఇదో పెద్ద ముదిపేరక్క. ఎప్పుడూ..ఏదో ఒహటి పుణుక్కుంటానే ఉంటాది..ముసల్దాన్లాగ. నాయనమ్మ బుద్ధులు మరి. ఎక్కడికి పోతయ్..ఎతుక్కునెతుక్కుని మరీ వతనుగా వత్తయ్..” అని మనసులో గొణుక్కుని ..మళ్ళీ అరిసింది..
“ ఎక్కడ సచ్చేవే..? ఓసారి పిలిత్తే పలకవుగదా..? నా నోరడిపోవాలా?..” అంటా..
గిలక రాలేదుగానీ, కల్లు నులువుకుంటా..లేని ఏడుపు ముఖవంతా పులువుకుని ఎక్కెక్కి పడతా వచ్చేడు శీను..లోపలెక్కడ్నించో.
దగ్గిరికొచ్చే కొద్దీ రాగాన్ని పెంచేత్తన్న కొడుకునే సూత్తా …
“కొట్టుకు సచ్చేరా ఇద్దరూను. ? అనుకుంటానే ఉన్నాను. ఇంటికాడ ఏం కొట్టేసుకుంటన్నారో ఏటోనని. పట్టుమని పది నివషాలు ఇంట్లో లేపోతే జుట్టూ జుట్టూ పట్టుకుంటవేనేటల్లా? పెద్దోళ్లవుతున్నారు. ఇంకెప్పుడు నేర్సుకుంటారు? ఏదిలా దెగ్గిరికి రా…ఎక్కడ కొట్టిందో సూత్తాను.. ”
“ అక్క..నన్ను ఈడ్సేసిందమ్మా..సేతులు సూడు . ఎలా కొట్టుకుపొయ్యినియ్యో….” గొంతు పెంచేసేడాడు ఆల్లమ్మ కాతంత మెల్లిగా మాట్తాడేతలికి.
“ ఎంతుకీడ్సింది? దానికి సుద్దీ, బుద్దీ ఏం లేక ఏడుత్తుందది..సూసేవా మూసేతుల్రెండూ ఎలాక్కొట్టుకుపోయినియ్యో.! అయ్యో..అయ్యో..అదసలు మడిసేనా? దానికేవొచ్చిందో పొయ్యేకాలం….”
“ రోడ్రు మీద మట్టిలో ఈడ్సేసిందమ్మా..అందరూ సూసేరుకూడాను. మా క్లాసులో ఉండే గిరిగాడు…అడికసలు మార్కులయ్యీ గూడా ఏవీ రావు. మేస్టారు తిడతారత్తమానూను సరిగ్గా సదవడని. ఆడు నన్ను సూసి నవ్వేడమ్మా.. ” అంటా దగ్గిరికంటా రాబోతున్న కొడుకుని..
“ ఆసింటా..ఆసింటా. నన్ను ముట్టుకోకు. నేను నీళ్ళోసుకోవాలి.. పెట్ట్లోంచి కోకా , లంగా జాకిట్టూ తెత్తదంటే..ఎక్కడికి పోయిందో ఈ ఎదవ..” అంటా ఆడికి సేతుల్తోనే సెప్పింది సరోజ్ని తన్నంటుకోవద్దని..
“ ఊరికే అరవాపోతే..కాసేపు సూడొచ్చుగదా..అక్కడికినపడతంది..నీ గొంతు..”
అప్పుడే ఈత్తలుపు తెరుసుకుని లోనకొచ్చిందేవో..గిలక, వచ్చీరాటంతోనే తల్లినో అరుపరిసి…తన మీద సాడీలు సెప్తున్న శీనుగాడ్ని సుర్రా సుర్రా సూత్తా..
“ ఈడుత్తానా….ఇసిరిసిరి కొడతానా? తప్పుజేత్తే..రోడ్దేటి ఇల్లేటి. ఎదవా ఎదవకనా. అయినా నేనీడ్సేసేనని సెప్తున్నావ్ గానీ నువ్వెంత ఎఅదవపని సేసేవో సెప్పేవా అమ్మకి. .. సిగ్గులేనోడా “ తమ్ముడి మీద ఇంతెత్తున ఎగిరింది గిలక.
అలా అరుత్తున్నప్పుడు సూసేతీరాలి గిలకని…మొకవంతా కెంపు రంగైపోద్ది.
అలా అరిసేటప్పుడు సూత్తావుంటే సరోజ్నికి ఉన్న కోపం గూడా పోయి నవ్వొచ్చేత్తది. కాపోతే పైక్కనపడకుండా తమాయించుకుని కోపం నటిత్తాది పైపైకి.
“ అయ్నా..నీకు పెత్తనాలెక్కువయ్ నియ్యే గిలకా..! గిలకా గిలకా అని వందసార్లరిసేను..నాక్సలే సిరాగ్గా ఉందంతాను. అయినా ఏడుత్తుంటే ఆణ్నలాగే వదిలిపెట్తేసి ఎక్కడికి సచ్చేవ్?” ఇసుక్కుంది సరోజ్ని కూతుర్ని..
“ పెత్తనాలేటి పెత్తనాలు. కొయ్యలమూడోళ్ళింట్లో ఆయన్నయ్యకి పెళ్లయ్యింది సూడు..”
“ఎవళ్ళాల్లూ..?” మూతిరిసింది సరోజ్ని..
“ ఆళ్ళేనెహ్హే..అయ్యాల నాకు పట్టులంగా ఏసేవ్ గదా..పెళ్ళి కొడుకున్జేత్నారని..తమ్ముడికేవో..పేంటూ సొక్కా ఏసి సేతికి ఉంగరవెట్తేవ్ ..”
“ ఊ..ఊ..! ఆళ్ళా..! గేపకొవొచ్చిందిలే..సెప్పు..?”
“ ఆయన్నయ్య ఆళ్ల వదిని సారట్టుకొచ్చిందట. కావిళ్లేసుకుని పంచి పెడతన్నారు. కట్రోరు రావుడు మామ్మ నేనీదిలో నిలబడుంటే..
“గిలకా ఇట్రావే…! మీ తాతింట్లో లేడు. అలా సెంటర్లో కూకునొత్తానని ఎల్లేడు. మసిరి మీద పళ్లెవుంది. పీటెక్కి తీద్దుగాని” అంటే ఎల్లేను. నువ్విప్పుడొత్తావని నాకేవన్నా తెల్సా..కల్లోకొచ్చిగాని నువ్వేవైనా సెప్పేవా? “ అంది సేతులు తిప్పుతా..
“ మావూలుగా సెప్తేనే ఓ పట్తాన ఇనిపిచ్చుకుని సావ్వు. ఇంకా కల్లోగూడానా..ఉ..ఉఉ..” ఎటకారంగా అని గిలకింకా ఏదో సెప్పబోతంటే ..
“ ఇనేవోల్లుండాలే గానీ ..సెప్పూ పోతానే ఉంటావ్ ..ఆ సెప్పే సొల్లేదో..తర్వాజ్జప్దూలే గానీ..నాకు సిరాకొచ్చేత్తంది… ముందెల్లి పెట్లోంచి జాకిట్టూ, లంగా, సీరొకటి పట్రా.. అసలే సచ్చిపోయిన శవాన్ని జూసొచ్చేను”
తల్లి ఎటకారానికి ఒళ్ళుమండిపోయింది గిలక్కి..
” అడుగుతావు..సెప్పేదేవో..ఇనవ్. అంతుకే సిరాకొచ్చుద్ది నాకు నిన్ను సూత్తేని….” అంటా తల్లినిసుక్కుని..
“ ఏ సీర…” అంటా లంగా పైకెత్తి పట్టుకుని లోపలికి పరుగెట్తాబోతన్న గిలక..
“ ఆసి ముండకానా? తల్లిని సూత్తే సిరాకొత్తందేటే నీకు. పెద్దంతరం, సిన్నంత్రం ఉంటల్లేదు ఈకాలప్పిల్లలకి..” అంటా చనువుగా లోనికొచ్చిన సీతారత్నాన్ని సూసి ఆగిపోయి ఎనక్కొచ్చింది గిలక అక్కడే ఏడుత్తా కూకున్న తమ్ముడికేసోసారి ఓర సూపు సూత్తా..
“ రా సీతారత్నవొదినే..! మంచి నీళ్లిచ్చుకుంటావా? ఎప్పుడనగా బయల్దేరేవో ఏమో..” అని గిలకెనక్కి తిరిగి
“కుండలో నీళ్లట్రా మామ్మకి. సల్లగుంటాయ్. గిన్నెతో పట్రా మడేలు గూడా తాగుతాడు.” అని గిలక్కి సెప్పి ఇటు తిరిగేతలికి..సీతారత్నవంది..
“ .. కొయ్యలమూడి సుబ్రావు గారి కోళ్లొచ్చింది సరోజ్నొదినే …సారట్టుకుని. అదే..మొన్నపెళ్లయ్యింది గదా..రమేషు. ఆడి పెళ్ళాం. పసుపూ పిండీ పంచుతున్నాం.
“ అదే..అనుకున్నాన్లే..! ఈ లగ్గాల్లో మనూళ్లో అయిన పెళ్ళి అదొక్కటే గదా.! “అని..
వంటింటికేసి సూత్తా..” గిలకా..బేగిన్రావే..” అనో అరుపరిసి..
“ పిల్లోడు ఉజ్జోగం గదా..! కావురవెట్టేత్తారా..? “ ఆరాగా అంది సరోజ్ని..
“ మనకేం తెలుత్తాయమ్మా..! రేత్రి పొద్దుపోయేకా కవురెట్టేరు. పంచాలలాగని. తెల్లారగట్తే లేసి కాసిన్ని నీళ్ళోసుకుని ఆమట్నే పోయేను. ఇదిగో..ఇప్పటికింకా ఓ కొలిక్కి రాలేదు. కావురవెట్తేత్తారేవో..! పెళ్లయ్యాకా ఇంకెంతుకు? ఏదేవైనా గానీ సరోజ్నీ..ఇయ్యాల్టి రోజుల్లో పిల్లలు అదురుట్తవంతులనుకో..! ఎన్నాళ్లు సేసేవో.. ఉమ్మడి కాపురాలు. ఆడపడుసనీ, మరిదిగారనీ, అత్తగారనీ, మాంగారనీ ఏళ్ల తరబడి ఆళ్లందరికీ వండి, వార్సి పెట్టి ఆళ్లకి పెళ్ళీగిళ్ళీ అన్నీ అయ్యాకా ..అప్పుడు. అప్పుడుదాకా..గోగు పుల్లలూ..గొట్తాం ఊదుళ్ళూ..కళ్లల్లో నీళ్ళూ…! ఇప్పుడోళ్లకి ఏవున్నాయ్..అలాంటియ్యి..ఇలా ముడేత్తం..అలా ఎంటేసుకుపోతం..”
అని ఓ నిమిషం ఆగి..గిలకొంక సూత్తా.. గ్లాసందుకుని గట గటా తాగేసి..
“ పళ్ళాలు పట్రా పాపా..! గబుక్కున్రావాలి. పొద్దోతంది. స్వీటులకొకటీని, పసుపూ,పిండికొకటీని. రెండింటికీ సెరోటీ..పట్రా..” అని వెనకున్న ఆయనొంక తిరిగి..
“ సుబ్బారావా..నీళ్లు తాగేవా? కొబ్బరినీళ్లల్లే ఉన్నాయ్..సల్లగాను..తాగు తాగు” అంది.
“ తాగేనండా..” అన్నాడు కావిడి కమ్మ భుజమ్మీంచి కిందకి జారేత్తా..
ఊళ్లో ఎవరు కావిళ్లేసుకుని ఎయ్యి పంచిపెట్టుకోవాలన్నా సీతారత్నవే సాయం జేత్తది అందరికీని. ఊళ్ళో వోళ్లందరూ ఆవెకి దెలుసని ఆవెనే పిలుత్తారందరూనూ.
ఎవరన్నా సచ్చిపోతే గదప గడపకీ సలివిడీ, మిఠాయుండా పంచాలన్నా సీతారత్నవే. ఏ ఆడపిల్లైనా పెద్ద మనిషైతే కొంతమంది బూర్లు వండి పంచిపెట్టుకుంటారు ఊరంతాను. బాగా దగ్గిరోళ్లైతేనేమో, ఎనిమిదేసి, కాతంత ఎడవైనోళ్లైతేనేవో నాలుగేసి పూర్ణం బూర్లు పంచి పెట్టుకుంటా ఉంటారు. అలాటప్పుడూ..ఇదిగో ఎవరైనా కోదళ్ళు పసుపూ పిండితో వత్తే..అయ్యీ ఏటికైనా పంచాలంటే సీతారత్నవే.
అలా పిల్లుత్తుం వల్ల తెలుసో, లేక తెలుసని పిలవమంటారోగానీ సీతారత్నానికి ఊళ్ళో గడప గడపా కొట్టినపిండే. ఎవరు ఎవరికి సుట్తాలో..ఎవరెంత దగ్గిర దగ్గిర సుట్తాలో, ఎవరెవరికి వియ్యాలోళ్లో అన్నీ తెలుసు. ఓసారి సెప్తే సాలు. రెండోసారి సెప్పక్కాల్లేదు. తేడా రాదు. మరిసిపోదు. లెక్కెట్టి అన్నీ కావిళ్లల్లో ఏసేసి సీటీ ఇచ్చేత్తే సాలు. తేడా రానే రాదు.
పల్లెటూళ్లల్లో పొరపాటున ఎవర్నన్నా మర్సిపోతే తర్వాత్తర్వాత అదెంత దూరంపోద్దో ఎవరికీ తెల్వదు. తీరా సూత్తే ఆ పెట్టేయి ఎన్నో ఉండవ్. కానీ అయ్యే పంతాలూ పట్తింపుల్లైపోతాయ్.
అందుకే ఒకళ్ళిద్దర్కి సీతారత్నవంటే పడకపోయినా గొడవలెంతుకులే..పద్దతిగా పంచుద్దని ఆవెనే పిలుత్తారు పంచిపెడతాకి. తీరాసేసి ఆవెకేవన్నా ఇత్తారా ఇలా పంచినంతుకంటే అయ్యేం ఉండవ్ మళ్ళీని.
ఆవెకదో తృప్తి. అందరికీ నేనున్నాననుకుంటాది. ఆవిడ్నీ అలాగే సూత్తారందరూను. ఏ ఆనపకాయ ముక్కో, గుమ్మడికాయ్ ముక్కో, నాలుగు బీరపిందిలో, పులుసులోకి అడ్దం వత్తాయని గుప్పెడు సిక్కుడుకాయలో..ఎయ్యో ఒకటి సేలోనో , దొడ్లోనో ఏయి కాత్తే అయ్యి..సీతారత్నానికి పంపుతానే ఉంటారు ఎడా,పెడా అందరూను.
అంతుకే తల్లో నాలుక్కంటే మించుంటాది సీతారత్నం ఊల్లోవాళ్లకి.
ఎయ్యి పంచిపెట్నా..ఆవిడేం మొయ్యక్కాల్లేదు. కూడా మగమనిషుంటాడు కావిడి మోత్తాను.
గిలక పళ్లాలట్టుకునివొచ్చేలోపు..
“ ఆ బూరూపల్లోళ్ళ ముసలమ్మ పోయింది గదా..! “ అంటా మాట కలిపింది సీతారత్నంతో సరోజ్నీ..
“ఎవరూ..! బూరూపల్లి బుచ్చియ్య పెళ్లవా? “ అంది బుగ్గ మీచ్చేయ్యేసి ఇంత పొడుగున నోరు తెరిసి “ అయ్యా..! “ అంటా ఆచ్చెర్యపోతా సీతారత్నం.
“ అయ్యా..! ఇంకా నీదాకా రాలేదా? పొద్దున్నే పొయ్యిందంట..కూతురుక్కబురెట్తేరంట. ఆవిడొచ్చేతలికి మజ్జానం ఒంటిగంట దాటిందంట. ఇంకెంతుకులే మూడయ్యాకా తీసుకెల్దారని ఆగేరంట. ఎల్లొచ్చేత్తే పనయ్ పోద్దిగదాని ఒకడుగేసొచ్చేను..”
“ అవున్లే ..! ఒంటిగంట దాటితే తీసికెల్లరుగదా! ఆపేత్తారు. పట్టూ పోయేరా..అయితేనీ.? ఈ పన్లేపోతే ఒకడుగు అటేద్దును. ఎంతమంచిదో పాపం. ఈధరుగు మీద కూకునుండేది. ఎక్కడికెల్లినా పిల్సేది.. సీతారత్నవా ఇటొకడుగెయ్ అంటాను. ఊళ్ళో కబుర్ల కోసం. ఏదోటిచ్చేది..వచ్చేత్తుంటేని. ఏవీ లేపోతే కంద దుంపైనా సేతుల్లో పెట్తేది. ఎప్పుడూ ఉట్టి సేతుల్తో పంపలేదు..సచ్చేలోకానుందోగానీ మహాతల్లి..”
“ అవునంట.అంతా అదేమాటంటన్నారు..”
“పోన్లే..పెద్దదైపోయింది. అన్నీ సూసేసింది..ఇంక ఎల్తేనే మెరడు..” అంటా అప్పుడే పళ్లాల్తో వచ్చి నిలబడ్ద గిలక సేతిలో పల్లెం తీసుకుని గరిటెతో గరిటెడు కుంకం, రెండు గరిట్లు శెనగపిండీ, కర్పూరం అరటిపళ్లజోడీవేసిన పళ్ళెం గిలకమ్మకందించి మరో పళ్ళెం తీసుకుని మైసూరు పాకమ్ముక్కా, కాజా, మిఠాయుండా, సలివిడీ ..
ఏత్తంటే, ఏడుపాపేసి..అప్పటికే అక్కడికి సేరి ఎగాదిగా ఆటేనక్కే సూత్తన్న శీను గిలకెనక్కి సేరి గిలక భుజమ్మీదుగా సీట్లుంచిన పళ్ళెం వంక సూత్తా..
“ఉప్పుడే ..సెప్తున్నా..కాజా నాది..తీసుకున్నావంటే ఊరుకోను..” అంటా గొణిగాడు.
ఇందంటే పరువుపోద్దని నోర్ముయ్యమన్నట్టుగా ఒక్క గిల్లు గిల్లింది గిలక.
“ నువ్వు ఎన్ని గిల్లులు గిల్లినా కాజా మాత్రం నాకే..ఇవ్వాపోయావో..” మళ్ళీ గొణిగాడు..గిలకమ్మ సెవులో.
పళ్ళెం గిలకమ్మ సేతికిచ్చేసి..
” ఇంకా ఇదిగాక ..రెండీధిలున్నాయ్..పంచేసి..బూరూపల్లోంళ్ళింటికి ఒకడుగేసి ఎల్లిపోతాను. ” అంటా సీతారత్నం గడప దాటిందో లేదో… శీనుగాడి మీద ఇంతెత్తున ఎగిరింది గిలక పిక్కపాశం పెడతా..
కెవ్వుమన్నాడాడు..
“ ఏవొచ్చిందే పొయ్యే కాలం మీకు? ఎందుగ్గిల్లేవాణ్ని..?వచ్చినోళ్లు ఇంకా గుమ్మం దాటకముందే మొదలెట్తేసేరా..” కళ్ళురిమింది సరోజ్ని..
“ఇందాక్కూడా ఇంతే..! ఈ శీతారత్నం మామ్మ…ఇయ్యన్నీ పంచుతా పంచుతా..అక్కడెక్కడో బడికాడ కనపడిందంట ఈడికి. మన సుట్తాలైతే ఆళ్లే వచ్చి మనకు పెడతారు గదా..! ఈ సిగ్గులేనోడు..ఆ మామ్మ ఎనకెనకే తిరుగుతా..మా ఇంటికి రండి మా ఇంటికి రండి..అంటన్నాడంట. అచ్చూసి బేతినోరు పద్మొచ్చి సెప్పింది గిలకా మీతమ్ముడిలాగంటన్నాడని. కరువు పోతోడని అనుకోరా? ఎక్కడున్నాడో సూపిచ్చమని దాని కూడా ఎల్లి ఇంటికి లాక్కొచ్చేను ఎదవని.
ఆడేడుత్తుండగా నువ్వొచ్చేవ్. ఆడేడిత్తే సాలు . నువ్వు నన్ను తిడ్తావ్. ఆడేం సేసినా పర్వాలేదా?
టపారం ఎగిరిపోయేట్టు ఇంతెత్తున ఎగిరింది గిలక.
నోరిప్పితేనా సరోజ్ని..?
“సర్లేవే బాబా..! నువ్వే రైటుగానీ..ఆ సీరా, జాకిట్టూ ఇటాడేత్తావా? కాసిన్నీళ్లోసుకుని లోపలకొత్తాను..”
పీలగా అంది సరోజ్ని..
“ సెయ్యించుకునేటప్పుడు..బానే సెప్తావ్..మెల్లిగానూ..” సేతిలో సీట్లపళ్లెం శీనుగాడికందించి తప్పా తప్పా అడుగులేసుకుంటా లోపలికెల్తున్న గిలకెనక్కి ..మురిపెంగా సూసింది సరోజ్ని.

2 thoughts on “గిలకమ్మ కతలు – “సారె పంచుడూ..వీపు దంచుడూ!”

  1. సారె పంచుడూ..ఈపు దంచుడూ.. Thank god నాకు గిలకమ్మ లాంటి అక్క లేదు..లేకపోతే చిన్నప్పుడు సారెలో ఉండే చిలకల కోసం పంచేవారి వెంట వెంట తిరిగేదాన్ని..మా అమ్మ ఎన్నిసార్లు తిట్టినా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *