April 25, 2024

బ్రహ్మలిఖితం

రచన: మన్నెం శారద

చూస్తూ చూస్తూ కుక్కని వదిలేయలేను. అలాగని కుక్కతో కాపురం చేయలేను. నేనేం చేయను.” అంది బాధగా.
జనంలో కొంతమంది వస్తున్న నవ్వు ఆపుకున్నారు.
“నేనెప్పుడో చెప్పేను నీకు. ఇదంతా కట్టు కథ!” అన్నాడు ఓంకారస్వామి.’
“ఎందుకు చెప్పలేదు. మీరు నా భర్త గత జన్మలో పెంపుడు కుక్కని చెప్పేరు. గత జన్మలో వెంకట్ నా భర్తని చెప్పి అహోబిళంలో నా పెళ్ళి కూడా చేయించేరు. కాని అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. నేనిప్పుడేం చేయాలి?” అంటూ ఉక్రొషంగా లేచింది ఈశ్వరి.
“అబద్ధం!” అన్నాడు ఓంకారస్వామి.
“ఏంటబద్ధం! అహోబిళంలో అభుక్తేశ్వరస్వామిని కలవమని చెప్పడం అబద్ధమా?”
“అంతా అబద్ధం.”
“లేదు అంతా నిజం. నేను ఈ సంగతి తెలియక వెంకట్‌ని పెళ్లి చేసుకున్నాను. ఓంకారస్వామికి సమర్పించుకోవడానికి చెరొక లక్ష అర్జెంటుగా తీసుకొస్తేగాని మమ్మల్నేలుకోనని చెప్పి పంపించేసేడు వెంకట్” అంది జనంలోంచి లేచిన కనకమహాలక్ష్మి.
“నువ్వెవరివో నాకసలు తెలియదు.” అన్నాడు ఓంకారస్వామి.
“పోనీ వీడయినా తెలుసా?” అంటూ ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చేడు ఎస్.ఐ. ఒకతన్ని.
ఓంకారస్వామి దిగ్భ్రాంతిగా చూసి “ఎవరతను?” అనడిగేడు.
“అహోబిళంలోని దొంగ భుక్తేశ్వర స్వామిగాడు వీడే. గతంలో వీడు ఇక్కడే చిల్లర దొంగ. వీడు అతి సన్నిహితుడైన రాజుగాడి తమ్ముడు. వీడే సాక్షాత్తు వెంకట్‌కి, ఈశ్వరికి పెళ్ళి చేసింది” అన్నారు డిజిపిగారు లేచి.
ఓంకారస్వామి వేషంలో ఉన్న నారాయణ నీళ్ళు కారిపోయేడా మాతలు విని.
“ఇదంతా ఏదో కట్టు కథలా వుంది. గిట్టని వాళ్లు నా మీద పన్నుతున్న పన్నాగం. దేవుడి మీద నిందలేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు” అన్నాడు మేకపోతు గాంభీర్యం వహిస్తూ.
“ఏం జరుగుతుందో చూద్దామనే స్వయంగా వచ్చేను. ఈ ఫోటో చూడు!” అన్నాడు దిజిపి ఒక ఫోటో అతనికందిస్తూ.
ఓంకారస్వామి దాన్నందుకున్నాడు.
అది సాక్షాత్తు అతనిదే. జైల్లో నారాయణగా వున్నప్పటి ఫోటో.
అతను పేలవంగా డిజిపిగారివైపు చూశాడు.
“యూ రాస్కెల్. కొన్నాళ్ళు నిత్య పెళ్ళికొడుకు వేషమేసి దొంగ పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల గొంతులు కోసేవ్. ఇప్పుడు స్వాములవారి రూపమెత్తి దద్దోజనాలు, చక్రపొంగళ్లు తిని తెగ బలిసి పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేయిస్తున్నావు. పద నిన్నిక పర్మనెంటుగా శ్రీకృష్ణ జన్మస్థానంలొ పెట్టేస్తాను. అరెస్ట్ హిం” అన్నారు డిజిపి ఉగ్రంగా.
ఓంకారస్వామి రూపంలో నారాయణ చేతులకు బేడీలు పడ్డాయి. వెనువెంటనే అతనికి సహాయపడిన రాజుని, సంపెంగిని కూడా అరెస్టు చేసేరు.
“ఏడి ఆ వెంకట్ గాడేడి?”
అప్పుడందరూ హాలంతా గాలమేసినట్లుగా చూశారు.
అప్పలనరసమ్మ కంగారుపడుతూ “దొంగ సచ్చినోడు. తప్పించుకున్నాడు బాబు. నాను సెవులు మెలేసి అట్టుకొచ్చినాను. కల్లమీన గూండారేసి పారెల్లిపోనాడు పాపిష్టెదవ” అంది.
“ఎక్కడికి పోతాడులే. ఇరవై నాలుగ్గంటల్లో పట్టేస్తాం” అంటూ డిజిపిగారు కేయూరవల్లి దగ్గరకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేరు.
“నాదేముంది సర్! సమయానికి మీరొచ్చి సహాయపడ్డారు. లేకపోతే ఈ పిల్ల జీవితం అన్యాయమైపోయేది. ” అంది ఈశ్వరిని చూపిస్తూ.
ఈశ్వరి అపరాధిలా తల దించుకుంది.
“జరిగింది మరచిపో. హాయిగా భర్తతో కాపురం చేసుకుని సుఖంగా వుండు. ప్రస్తుత జన్మని నరకం చేసుకుంటూ పూర్వ జన్మల గురించి ఆలొచించడం దేనికి? నీలాంటి అమాయకులున్నంతవరకు ఇలాంటి దొంగస్వాములు పుట్టుకొస్తూనే వుంటారు.” అని ఈశ్వరిని మందలించేరు డిజిపి గారు వెళ్తూ వెళ్తూ.
ఈశరి పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చింది.
“నీకోసం నా జీవితంలో మొదటిసారి నటించేను. నువ్విక మారినట్లేనా?” అంది డాక్టరు ప్రభంజన ఈశ్వరి వంక నవ్వుతూ చూసి.
ఈశ్వరి నీరు నిండిన కళ్లతో నవ్వింది.
“హమ్మయ్యా ఇక మీ ఆవిణ్ణి తీసుకెళ్ళొచ్చు. నే చెప్పిన విషయాలు మరచిపోకండి” అంది ప్రభంజన కుటుంబరావుతో.
అందరూ ఎవరిళ్లకి వాళ్లెళుతుంటే కేయూర ఒంటరిగా తన కారులో బయల్దేరింది లిఖిత గురించి ఆలోచిస్తూ దిగులుగా.
తననే క్షణమన్నా పోలీసులు వెంటాడి పట్టుకుంటారని తెలిసిన వెంకట్ ఆటోలో అతివేగంగా రైల్వే స్టేషనుకెళ్ళి కదులుతున్న రైలెక్కేసేడు.
రైలు వేగం పుంజుకుంటుండగా అతను మెల్లగా కంపార్టుమెంటులోకి నడిచేడు. ఆ రైలెక్కడికెల్తున్నదో అతనికి తెలియదు. ఎవర్నన్నా అడిగితే తనని అనుమానించే అవకాశమున్నదని అతడు ముందు ముందుకి నడుస్తూ అక్కడ కిటికీ వైపు కూర్చుని శూన్యంలోకి చూస్తున్న లిఖితని చూసి షాక్కొట్టినట్టుగా వెనక్కి అడుగేసేడు.
నిజంగా ఆమె లిఖితేనా?
తను పొరబడ్డాడేమో?
అతను ఆమె తనని చూడకుండా జాగ్రత్తపడుతూ మెల్లిగా మరోసారామెను పరీక్షించి చూశాడు.
నిస్సందేహంగా ఆమె లిఖితే.
కేరళ కీకారణ్యాలలో ఖచ్చితంగా చచ్చిపోయి వుంటుందనుకున్నాడు తాను.
కాని.. తన అంచనాలని తారుమారు చేస్తూ ఆమె పశ్చిమ కనుమల నుండి తూర్పు కనుముల వైపు ప్రయాణం చేస్తోంది.
ఇందులో ఏదో విశేషముండి ఉంటుంది
అదేదో తాను తెలుసుకొని తీరాలి. లేదా తనని పోలీసులకి పట్టిచ్చే పథకం వేసిన కేయూరవల్లి మీద పగ తీర్చుకోవాలను కుంటే ఆమె నీ అడవుల్లోనే భూస్థాపితం చేయాలి. అలా ఆలోచిస్తూ ఆమెకి మరోవైపుగా కూర్చున్నాడు వెంకట్.
రైలు రెండు కొండ కొనలకి కట్టిన ఊయలలాంటి సస్పెన్షన్ బ్రిడ్జిమీద కొండచిలువలా పాకుతూ కలుగులోకి దూరుతున్న పాములా త్రవ్విన కొండగుహలోకి వెళ్లి బయటకు వస్తోంది. మళ్ళీ అఘాతమైన లోయ. దాని మీద ఊగిసలాడే బ్రిడ్జి. క్రిందకి తొంగి చూస్తే లోతెంతో తెలియని చీకటి పరచుకున్న అడవి. కిటికీ పక్కనే సందేశాలు మొసుకొస్తున్న మేఘశకలాల పరుగులు.
మనసులో ఏ ఆలోచనలూ, బాధలూ లేకపోతె రైలులో అరకు ప్రయాణమంత థ్రిల్ మరొకటి వుండదు.
లిఖిత తండ్రి గురించి ఆరాటంలో ఆ ప్రయాణాన్ని ఆనందించలేకపోతోంది.
రైలు వెళ్తుండగా సన్నని తుంపరలాంటి వర్షం ప్రారంభమైంది.
సాయంత్రం మూడు గంటలకే చీకటి పడినట్లుగా తయారైంది వాతావరణం.
మరి కాస్సేపటికి రైలు బొర్ర గుహలు అని బోర్డున్న స్టేషనులో ఆగింది. అక్కడొక చిన్న స్టేషను తప్ప చుటూ అడవే కాని ఊరేం కనిపించడం లేదు.
లిఖితకి అక్కడ దిగాలంటేనే భయమనిపించింది.
ఎలాగో మనసుకి నచ్చచెప్పుకొని రైలు దిగింది ఆమె దిగడం చూసి వెంకట్ కూడా దిగేడు. ఆమెకి కనిపించకుండా అనుసరిస్తూ.
లిఖిత వర్షంలో తడుస్తూ స్టేషన్ బయటికొచ్చింది. ఎటెళ్లాలో, ఎవరిననుసరించాలో తెలియడం లేదు.
చుట్టూ వాతావరణం నీటిలో ముంచి ఆరేసిన నల్లని గుడ్డలా వుంది. ఎప్పటికీ ఎడతెగని వర్షపు నీటిని పీల్చిన చెట్లు భారంగా వూగుతున్నాయి.
అక్కడే బీడీ కాలుస్తూ నిలబడ్డ ఒక కోయ మనిషి మీద పడింది లిఖిత దృష్టి. అతను శబరిమలై వెళ్తుండగా తమతో ప్రయాణం చేసినవాడు.
లిఖితకు అతన్ని చూసి ప్రానం లేచొచ్చినట్లయింది.
వెంటనే అతని దగ్గరగా వెళ్ళి “బాగున్నావా?” అనడిగింది నవ్వుతూ.
అతను మొదట లిఖితని చూసి బిత్తరపోయేడు.
“ఏంటి సిన్నమ్మా నా మీన నిగా ఏసావేంటి? ఇక్కడిదాకా వొచ్చేవు?” అన్నాడు.
“అదేం లేదు కానీ. నువ్వేంటి భద్రాచలం అడవిలో వుంటానని ఇక్కడ ప్రత్యక్షమయ్యేవు. “అనడిగింది చొరవగా.
“భద్రాచలం చింతపల్లి సీలేరు ఇయ్యన్నీ అడ్డదారిన దగ్గరే బొట్టీ. నాను కట్టుకున్న దానూరు ఇక్కడే. అద్సరే ఏటి వానలో పడవలా తిరగుతున్నావు. ఏదైనా అడవుల మీన బుక్కు రాస్తన్నావేంటి?” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“అదేం లేదు. ఇక్కడ కపాల బ్రహ్మని ఒక గొప్ప సాధువున్నాడంట. నీకు తెలుసా?”
కొండ దొర గడ్డం బరుక్కుని “సాధువా! కాసాయ గుడ్డలు కట్టినోల్లు బోల్డంత మందుంతారు అడవుల్లో. మరి నీక్కావాల్సినోడెవరో?” అన్నాడు.
లిఖిత అతనివైపు నిస్పృహగా చూస్తూ “అతనెవరితోనూ మాట్లాడట. ఏదో కొండ మీద. గుడి దగ్గర..”
“ఆయనా.. తెల్సులే. నేన్ జూపిస్తా. ఈ రోజుకి మా గూడెంకి రా. మా ఆడది సూసి మురిసిపోతది. కాస్త జుంటి తేనె తగి, జింక మాంసం తిందువు గాని” అన్నాడు కొండ దొర మధ్యలోనే అందుకొని.
“లేదు. అంత టైము లేదు. తిరిగొచ్చేటప్పుడొస్తాను. ముందు నాకు దారి చూపించు” అంది లిఖిత గాభరాపడుతూ.
“ఆర్నెల్లు నవారల్లి అర్ధగంటలో మంచం ఇరగదీసినట్టు ఏంటంత తొందరపడుతన్నావు బొట్టీ అసలు కతేంటి?” అనడిగేడు కోయదొర.
“పద నడుస్తూ చెబుతాను”.
ఇద్దరూ అక్కడే టీ తాగి అడవి దారిన నడక సాగించేరు.
నేలంతా తడిచి జారుతున్నది.
“భద్రం! పాములుంటాయి” అంటూ హెచ్చరించేడు కోయదొర హడావుడిగా నడుస్తున్న లిఖితని.
పాములే కాదు పులి ఎదురొచ్చి నిలబడినా భయపడే పరిస్థితి కాదామెది. తెల్లారితే కపాల బ్రహ్మ సమాధవుతాడు. అసలు తన తండ్రి అతన్ని కలిసేడో లేదో. ఎలాగైనా తండ్రిని వెంటనే కలవాలన్న పట్టుదల ఆమెకి ఎనలేని శక్తిని ఇస్తోంది.
“ఇంతకీ సంగతి సెప్పేవు కాదు బొట్టే. అలుపన్నా తీరతది. అసలు సంగతి సెప్పు”
లిఖిత తన తండ్రి పట్టుదల, వైఫల్యం, కపాల బ్రహ్మకి తెలిసిన మృతసంజీవినీ విద్య, తండ్రి తిరిగి అక్కడికెళ్ళడం అన్నీ క్లుప్తంగా చెప్పింది. కోయదొర ఆ కథంతా విని ఆశ్చర్యపోయేడు.
కోయదొరతో పాటు రహస్యంగా తను చెప్పిన కథని తనని వెంబడిస్తున్న వెంకట్ కూడా విన్న సంగతి ఆమెకి తెలియదు.
*****
ఆ అర్ధరాత్రి కేయూర మనసు మనసులో లేదు. ఏదో విపత్తునూహించినట్లుగా మనసు ఆటుపోట్లకి గురవుతున్న సముద్రంలా అల్లకల్లోలమవుతున్నది. ఎంత ప్రయత్నించినా నిద్రని నెట్టేస్తున్నాయి కళ్ళు.
వేసుకున్న ట్రాంక్విలైజర్స్ ఏ మాత్రం పని చేయడం లేదు.
ఆమె అస్థిమితంగా బాల్కనీలో కొచ్చి నిలబడింది.
తను ఈశ్వరి జీవితాన్ని చక్కబరచగల్గింది. ఓంకార స్వామి దొంగవేషాలు కట్టించగల్గింది. మతి చెడి దొంగస్వాముల మీద పుస్తకాలు రాసి ప్రజల్ని పక్కదారి పట్టించొద్దని ప్రొఫెసర్ మల్లన్నకి బుధ్ది చెప్పగల్గింది. కాని.. ఆ వెంకట్‌ని పట్టుకోలేక పోయింది. అన్నిటికన్నా తన కన్నకూతురి సమాచారం ఏ మాత్రం తెలుసుకోలేకపోయింది.
లిఖిత వెంకట్‌గాడు కూసినట్లు.. ఇక తిరిగి రాదా? తనని రక్షించే వారెవరు?
అలా అనుకోగానే ఆమె కళ్లు నీటితో మూసుకుపోయేయి. దుఃఖం జలపాతంలా బయటికి దూకింది. వెక్కిళ్ళు తెలియకుండానే తన్నుకు రాసాగేయి.
అలా ఎంతసేపు గడిచిందో..!
నెమ్మది నెమ్మదిగా మనసుని మూసేసిన కారు మబ్బులు కరిగి దుఃఖం ఉపశమించింది.
కళ్లు కడిగిన నందివర్దనాలయ్యేయి.
ఎదురుగా ముసిరిన మసక తొలగి గోడకి తలిగించిన నిలువెత్తు సాయి సాక్షాత్కరించేడు. మనసుకేదో ధైర్యం లభించి నట్లయింది. వెంటనే నందనవనం సుబ్బరాయశర్మగారి ప్రవచనాలు, పలుకులూ గుర్తొచ్చేయి.
ఆమె పెదవులు వాటిని ఉచ్చరించసాగేయి.
అంధకార గుహాంతరంబున
అరయరానిది సాయి నామము
సంధ్యకాలము నందు దోచే
సాక్షి యీ శ్రీ సాయి నామము
ధర్మరూపము దాల్చి సర్వము
తానెయైనది సాయి నామము
కర్మచే సాధింపనేరని
మర్మమీ శ్రీ సాయినామము.
ఆమె ప్రార్ధనలో వుండగానే ఫోను రింగయింది. కేయూర వెళ్లి రిసీవర్ అందుకొంది.
“సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. నేను డి.జి.పి ని మాట్లాడుతున్నానమ్మా. వెంకట్ కిరండయిల్ పాసింజరెక్కి అరకువైపు వెళ్లినట్లుగా మన పోలీసులు తెలుసుకున్నారు. దారి పొడుగునా అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్‌లెస్ మెసేజ్‌లు పంపించేం.
మీరు సంతోషపడే మరో విషయం చెప్పమంటారా?”
“ఏంటి సర్ అది?” ఎంతో ఉద్విగ్నతకి లోనవుతూ అడిగింది కేయూరవల్లి.
“మీ అమ్మాయి లిఖిత్ కూడా తూర్పు కనుమల అడవుల్లోకి వెళ్ళినట్లుగా కొంత ఆధారాలు దొరికేయి. వెంకట్ ఆమెని వెంబడించేడేమోనని అనుమానంగా ఉంది. అయిన ఇంకా పూర్తి వివరాలు రాలేదు. మీరేం వర్రీ కాకండి. అమ్మాయిని భద్రంగా మీకప్పగించే బాధ్యత మాది.”
“థాంక్యూ సర్. థాంక్యూ” అంది కేయూర కంపిస్తున్న స్వరంతో రిసీవర్ క్రెడిల్ చేస్తూ.
ఎదురుగా వున్న సాయి మొహంలో ఒక దివ్య కాంతి కనిపించిందామె కళ్లకి.
ఊరకుండిన సర్వజగముల
నూపు చున్నది సాయి నామము
తేరి చూడగ రాక వెలిగే
తేజమీ శ్రీ సాయి నామము.
*****
బొర్రా గుహలకి రెండు కిలోమీటర్ల అవతలగా వున్న అరణ్యంలో వున్న ఓ కొండ దగ్గరకి చేరుకున్నారు లిఖిత, కోయదొర.
చిన్న పెన్ టార్చి సహాయంతో అడవిలోని కాలిబాట వెంట పాముల్ని, ఇతర వింత వికృత జంతువుల్ని తప్పించుకొని అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలు దాటింది.
“ఇప్పుడేటి సేద్దాం. రేపొద్దున్నెక్కుదామా కొండ” అన్నాడు కోయదొర ఆయాసంతో రొప్పుతున్న లిఖితతో.
“లేదు. తెల్లారితే ఆయన సమాధయిపొతాడు. అసలు మా డేడి ఇక్కడికి చేరుకున్నారో లేదొ!” అంది వేదనగా లిఖిత.
సరిగ్గా అప్పుడే తడి బట్టలతో స్నానం చేసి సన్నగా వణుకుతున్న శరీరంతో జపం చేస్తూ మట్టితోనే అమర్చిన మెట్లెక్కుతున్న వ్యక్తి మీద పడింది లిఖిత దృష్టి.
ఒకలాంటి అనుమానంతో ఆయన్ని సమీపించి “స్వామి!” అంది.
ఆయన వెనక్కు తిరిగి చూశాడు.
లిఖిత పెన్ టార్చి వెలిగించింది.
ఆ వెలుగులో అతన్ని చూసి లిఖిత కళ్లు మెరిసేయి.
“డేడీ!” అంది దుఃఖం, ఆనందం కలగలుపయిన కంఠస్వరంతో.
అతను లిఖితను గుర్తించి “నువ్విక్కడిక్కూడా వచ్చేవా బేబీ!” అన్నాడు ఆశ్చర్యంగా.
“రాకేం చేయను. అమ్మని చూడాలని వుందని, ఈ ప్రయత్నం ఇక మానుకుంటానని చెప్పి నేను నిద్రలో వుండగా ఇలా చెప్పకుండా వచ్చేయడం ఏం బాగుంది డేడి. అమ్మకి నా మొహం చూపించలేక నేనూ నిన్ను వెదుకుంటూ వచ్చేసేను.”అంది లిఖిత కన్నీళ్లతో.
కార్తికేయన్ అపరాధిలా తల దించుకొని “ఏం చేయను. నా జీవితకాల కోరిక తీర్చే మనిషి ఇక్కడున్నారని తెలిసేక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయేను. ఇరవై నాలుగ్గంటలు పట్టింది అతను నన్ను పలకరించడానికి” అన్నాడు.
“ఇంతకీ ఆయన.. మీకా మంత్రం ఉపదేశిస్తానన్నారా?’ ఎంతో ఆత్రుతగా అడిగింది లిఖిత.
“ఆ! అతి కష్టమ్మీద. అది ఎవరికీ తెలియడం మంచిది కాదన్నారాయన. కేవల అద్భుత శక్తి సంపన్నులయిన మేధావుల్ని కాపాడటం కోసం దాన్ని వినియోగిస్తానని చెబితే అతి కష్టమ్మీద ఒప్పుకున్నారు.”
లిఖిత ఆయన వైపు నమ్మలేనట్లుగా చూసింది.
“నిజంగానా?”
“నీ మీద ఒట్టు తల్లీ!”
“డేడీ!”
“ఊ”
“రేప్ప్రొద్దుటే మీకుపదేశమవుతుందా?”
“ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే. ఏ మాత్రం వెలుగు రేఖ కనిపించినా ఆయన శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోతారట. అందుకే ఈ రాత్రే వెళ్లి ఆయన ముందే కూర్చుంటాను. ఆయన సమాధి ముందు తీవ్ర ప్రార్ధన చేస్తున్నారు.
ఎప్పుడో తెల్లవారే ముందు ఆయన నాకీ మంత్రం కళ్లు తెరవకుండానే ఉపదేశించి సమాధవుతారట. ఇది నా అదృష్టం!” అన్నాడు కార్తికేయన్ ఆనందంగా.
“డేడీ!”
“చెప్పు తల్లీ! ఈ చీకటిలో నేను కొండ ఎక్కడం కష్టమవుతుంది”
“ఒకవేళ ఈ రాత్రి నన్నే పామన్నా కరచి మరణిస్తే?”
“అవేం మాటలు?”
“మాటలు కావు. నువ్వు నేర్చుకున్న మృతసంజీవినీ విద్యతో నన్ను బ్రతికిస్తావా?”
కూతురి ప్రశ్నకి పరిహాసంగా నవ్వి “నీకిక చావే లేదు బేబీ. చావులేని విద్య నేర్చుకున్న తండ్రి వుండగా నీకు చావెలా వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలొచనలు చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఇక్కడే వుండు.” అంటూ కార్తికేయన్ కొండ మీదకి నడక సాగించేడు.
లిఖిత నిర్వేదంగా చూస్తూ నిలబడిపోయింది చాలా సేపు.
“రా బొట్టీ! ఆయన తన పట్టు ఒదిలే మడిసి కాడు. మనమీ రాత్రి ఇక్కడే కూర్చుందాం.” అన్నాడు.
సరిగ్గా అదే సమయానికి చాటుగా వుండి అంతా విన్న వెంకట్ అడ్డదారిన కార్తికేయన్‌ని వెంబడించేడు. కొండంతా చెట్లతో నిండి చీకటినిన్ నింపుకొని ఉంది.
అదే అదనుగా అతను కార్తికేయన్ వెనకగా వెళ్ళి ఆమాంతం మీద పడి అతని నోరు నొక్కేసేడు.
అనుకోని ఆ ఆకస్మిక చర్యకి నిర్విణ్నుడయిన కార్తికేయన్ గింజుకోవడానికి ప్రయత్నించేడు. అయినా ప్రయోజనం లేకపోయింది.
వెంకట్ అతని భుజమ్మీద తడి ఉత్తరీయన్ని కార్తికేయన్ నోట్లో కుక్కి చేతుల్ని దొరికిన చెత్ల నారతో బిగించి కట్టేసి ఒక పొదలో పడేసేడు.
ఆ తర్వాత వడివడిగా కొండెక్కడం ప్రారంభించేడు విపరీతమైన ఆనందంతో.
*****
తెల్లవారు ఝామున నాలుగు గంటలయింది.
లిఖిత అస్థిమితంగా నిద్రపొతున్న కోయదొర వైపు చూసింది.
ఇంకాసేపటిలో తన తండ్రికి ఆ మంత్రోపదేశం జరిగిపోతుంది. ఆయన్ని పట్టేవారెవరూ ఉండరు.
“నో! అలా జరగడానికి వీల్లేదు”
ఆమె అరుపుకి ఉలిక్కిపడి లేచేడు కోయదొర.
“ఏంటి బొట్టీ! ఏటయినా కలగన్నావా? ఏంటంత కూత పెట్టేవ్?” అనడిగేడు.
“నేనసలు నిద్రపోతేగా కల కనడానికి. మనమో పని చెయ్యాలి. నాకు సహాయం చేస్తావా?”
“చెప్పు తోలొలిచి ఇమ్మన్నా యిస్తా”
“మా డేడీకి ఆ ఉపదేశం జరక్కుండా చూడాలి!”
కోయదొర ఆమె వైపు పిచ్చిదాన్ని చూసినట్టు చూసి “నీకు ఒంటి మీద తెలివుండే మాటాడతన్నావా? ఇన్నాల్లకి నీ తండ్రి అనుకున్నది జరగతావుంటే అడ్డు పుల్లేస్తావా?” అన్నాడు.
“నీకు తెలియదు కోయరాజూ. మా డేడీ కపాల బ్రహ్మకేమని చెప్పేడు. ఆ విద్యని కేవలం మేధావులు, మహానుభావుల కోసమే వాడతానన్నారు. కాని రాత్రి నేను చచ్చిపోతానేమోనంటే.. నాకిక చావే లేదని చెప్పేరు. అంటే ఆయనలో స్వార్ధం మొలకెత్తింది. ఆయనలో రాక్షసత్వం చోటు చేసుకుంటే.. ఇక ఆ విద్యకి ప్రయోజనముండదు. మనిషికి చావుందని తెలిస్తేనే.. అందులో దానికొక నిర్ణీత కాలం లేదని తెలిసి కూడా మనిషి మించిన రాక్షసుండుంటాడా? నీకు హిరణ్యకశిపుడు కథ తెలుసు కదా?”
“మరేం చేద్దామంటావు పెట్టా?”
లిఖిత ఒక క్షణం ఆలోచించింది.
వెంటనే ఉపాయం స్ఫురించినట్లు ఆమె కళ్లు మెరిసేయి.
“ఈ కొండకి తూర్పెటు?”
కోయదొర చూపించేడు.
“పద వెంటనే అటు మంట వేద్దాం. ఆ వెలుగు రేఖలు చూసి సూర్యుడు ఉదయించేడనుకొని కపాల బ్రహ్మ సమాధి అవుతారు. ఆయనతో పాటే ఆ విద్య కూడా సమాధవుతుంది.” అంది లిఖిత కొండకి తూర్పు వైపు ఆ చీకటిలో అడుగులేస్తూ.
“ఇదిగో బొట్టీ కొంచెమాగు”
ఏంటన్నట్టుగా చూసింది లిఖిత అతనివైపు.
“నీ ఆలోచన శానా బాగుంది గాని. ఈ చిత్తడి వానలో నీకు ఎండుపుల్లలు దొరుకుతాయా? మంట పైకల్లా ఎర్రగా అగపడాలంటే ఎన్ని పుల్లలు కావాలి?” అన్నాడతను.
అతని మాటలు విని పూర్తిగా నిరాశపడిపోయింది లిఖిత.
“ఏం చేయాలి. ఎలా మనం డేడీకి ఆ విద్య తెలీకుండా ఆపగలం.” అంది నిస్సహాయంగా చూస్తూ.
కోయదొర ఒక్క క్షణమాలోచించి నోటిలో వేలుపెట్టి చిత్రంగా మూడుసార్లు ఈల వేసేడు. అరక్షణంలో ఆ ఈలకి బదులు కొన్ని ఈలలు వినిపించేయి. కోయదొర మళ్లీ ఈల వేసేడు.
అంతే.
కొని క్షణాల్లో కొన్ని వందల కాగడాలతో కోయలు, చెంచులు ఆ ప్రాంతానికి పరుగున చేరేరు.
లిఖిత ఆ దృశ్యం చూసి నివ్వెరపోయింది.
“ఏంటి ఒక్క ఈల వేస్తే ఇంత మందొచ్చేస్తున్నారు?” అంది లిఖిత.
కోయదొర నవ్వి “మాకు మీలా మాటాడే పెట్టెలు(టెలిఫోన్లు) లేవు పిట్టా. అయితే మాకుందల్లా కట్టడి. మాలో ఒకడికి కష్టం వచ్చిందంతే అందరూ కట్టకట్టుకు వాల్తారు. మీ సదువుకున్నోళ్ళంతా తలుపులు మూసుకోరు” అని వాళ్ళ వైపు తిరిగి “మీరంతా కొండకి తూరుపు భాగానికెల్లి కాగడాల్ని పైకెత్తండి. శబ్దం చెయ్యొద్దు అన్నాడు.
ఒక వెలుగు ప్రవాహం కొండ తూరుపు వైపు చేరింది.
సరిగ్గా అప్పుడే వెంకట్ కపాలబ్రహ్మ ఎదురుగా కూర్చుని అసహనంగా అతనెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చూస్తున్నాడు.
కపాల బ్రహ్మ తన ప్రార్ధన ముగించి అర్ధనిమిలితంగా కళ్లు తెరిచి “నువ్వు సిద్ధంగా వున్నావా?మంత్రం ఉపదేశిస్తాను” అన్నాడు.
“చిత్తం” అన్నాడు వెంకట్ మనసు ఆనందంతో పొంగిపోతుండగా.
కపాల బ్రహ్మ మరలా కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి తిరిగి కళ్లు తెరిచేడు.
తెరవగానే అతని కళ్ళబడిన దృశ్యం .. ఎదురుగా తూర్పు వైపు ఎర్రని కాంతి అలుముకోవదం.
కపాల బ్రహ్మ కళ్ళు పెద్దవి చేసి “సూర్యోదయమైపోతున్నది” అను గొణిగేడు.
వెంటనే అతను ఊపిరిని స్తంభింపచేసి తనువు చాలించేడన్న విషయం వెంకట్‌కి చాలాసేపటి వరకు అర్ధం కాలేదు.
అతను కపాల బ్రహ్మని పట్టుకొని గట్టిగా కుదిపి “మంత్రం ఉపదేశించండి స్వామి” అన్నాడు. వెంటనే అతని చేతుల్లో ఒరిగిపోయింది కపాల బ్రహ్మ విగత శరీరం.
అతను ఆ షాక్ నుండి తేరుకోక మునుపే చీమల బారులా కాగడాలతో కొండపైకి ఎక్కుతున్న కోయవాళ్ళు ఆ వెనుక లిఖిత రావడం కనిపించింది.
వెంకట్ ని చూసి లిఖిత నివ్వెరపోయింది.
“నువ్వా.. మా డేడీ ఏరి?” అంది.
వెంకట్ జవాబు చెప్పే స్థితిలో లేడు.
ఏం చెప్పినా క్షణాల్లో కోయవాళ్ళు తనని చుట్టుముట్టి చంపేస్తారన్న నిజమర్ధమయి కొండ వెనుక భాగంలోకి పరిగెత్తేడు. కొంతమంది కోయవాళ్లు అతని వెంట పడ్డారు.
“మా డేడీని ఏం చేసేడో ఈ నీచుడు” అంది లిఖిత దుఃఖభారంతో.
“పైన దేవుడున్నాడు. మీ నాన్నకేం కాదు పద!” అన్నాడు కోయదొర ఆమె నూరడిస్తూ.
లిఖిత కోయదొర సాయంతో వెతుకుతుండగా కొండ క్రింద కొన్ని జీపులు, వేన్‌లూ ఆగేయి. వాటి కాంతిలో ఒక చోట మూటలా కట్టేయబడిన కార్తికేయన్ కనిపించి అటు పరిగెత్తేరు లిఖిత, కోయదొర.అప్పటికే పోలీసులు జీప్‌లు, వేన్‌లూ దిగి చకచకా కొండ మీద కొచ్చేసేరు.
లిఖిత కార్తికేయన్ తల ఒళ్ళో పెట్టుకుని “డేడీ!డేడీ!” అని పిలిచింది కంగారుగా.
కోయదొర అతని నోట్లో గుడ్డ తీసి కట్లు విప్పేడు. అతను నీరసంగా మూలుగుతూ “వాడెవడో.. వాడు …నన్ను..”అన్నాడు హీనస్వరంతో.
“మీరు ప్రస్తుతం ఏమీ మాట్లాడకండి” అంది లిఖిత ఆయన తల నిమురుతూ.
పోలీసులు లిఖిత దగ్గరగా వచ్చి “మీరు లిఖిత కదూ!”అనడిగేరు.
“అవును” అందిలిఖిత.
“రండి మిమ్మల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చమని మా డి.జి.పి గారి ఆర్డర్. ఆ వెంకట్ అనేవాడు కూడా ఇటొచ్చేడని తెలిసింది?” అనడిగేడు ఇన్సపెక్టర్.
“వాడు కొండ వెనుకకి పారిపోయేడు”
“పదండి. వాణ్ణి పటుకోండి” అని పోలీసులకి ఆర్డర్ జారీ చేసేడు ఇన్స్‌పెక్టర్.
“ఆణ్ణింక పట్టుకొని ఏం సేసుకుంతారు. ఆడు కాలు జారి లోయలో పడి కుక్క సావు సచ్చేడు” అంటూ వచ్చి చెప్పేరు కోయవాళ్లు.
“దేవుడే ఆణ్ణి శిచ్చిందలసుకున్నాడు. మీరిక బయల్దేరండి. మీ నాన్నగారికి నీరసంగా వుంది” అన్నాడు కోయదొర.
లిఖిత అతనికి నమస్కరించింది.
కూటికోసం కోటి విద్యలు నేర్చినా, చదువూ సంస్కారమెరుగని ఆ అడవి జాతి మనుషులు మనుషుల్లా ప్రవర్తించి తననాదుకున్నారు. ఆ విషయం గుర్తొచ్చి ఆమె కళ్లు చెమర్చేయి.
“అప్పుడే అలా దిగులు మొకమెడతావేంటి బొట్టేఎ. నాను నీ తలంబ్రాలకి రానూ!” అన్నాడు కోయదొర.
లిఖిత నవ్వింది నీరు నిండిన కళ్లతో..
కార్తికేయన్ లిఖిత జీప్ ఎక్కేరు.
“జాగ్రత్తగా ఎల్లిరండి. బాబూ నువ్వింక పెళ్లాం బిడ్డలతో సుకంగా కాపరం సేసుకో. బెమ్మలికితాన్ని ఎవరూ సెరపలేరు బాబూ. ఇక సావు సంగతొదిలేసి బతికనన్నాల్లూ సుకంగా బతకండి..” అన్నాడు కోయదొర.
జీప్‌లూ, వేన్‌లూ కదిలేయి. అడవిలోని ఘాట్ రోడ్డుల వెంట మెలికలు తిరుగుతూ అగ్గిపెట్టెల్లా..
లిఖిత తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని. ఇంకెన్నడూ వదలనని.
సరిగ్గా అదే సమయంలో కేయూరవల్లి శిరిడి సాయి ఎదుట ధ్యాన నిమగ్నమై వుంది. ఒక రకమైన నిశ్చింతతో, నమ్మకంతో..
ఛత్రమై తన భక్తులకు
ఆచ్చాదనంబిడు సాయి నామము
సాధనలచే నెరుగవలసిన
సత్యమీ శ్రీ సాయినామము.

సమాప్తము.

 

 

అంకితము:

కేరళ అందాలు నాకు చూపించి ఈ నవల వ్రాయడానికి పట్టుని, స్ఫూర్తిని పరోక్షంగా కల్పించిన సోదరితుల్యురాలు శ్రీమతి లక్ష్మీ కోటేశ్వర్రావుగారికి, శ్రీ కోటేశ్వర్రావు(ఐ.జి)గారికి కృతజ్ఞతాభివందనాలతో..

మన్నెం శారద

1 thought on “బ్రహ్మలిఖితం

  1. మొత్తానికి కథ సుఖాంతం అయిపోయింది..
    దేవుడిచ్చిన అయుష్హును సక్రమంగా వాడుకోకుండా పెళ్ళాం పిల్లలను గాలికి వదిలేసి మరణమే లేకుండా సిద్దులు పొంది ఏమి ఉద్దరించాలనుకుంటారో… కార్తికేయన్ లాంటి వారిని;..పూర్వజన్మ,వచ్చే జన్మ అంటూ ఉన్న జన్మ సక్రమంగా అనుభవించకుండా పిచ్చివాళ్ళలా ప్రవర్తించే ఈశ్వరి లాంటి వాళ్ళను చూస్తే జాలి పడాలో అసహయించుకోవాలో కూడా అర్ఢంకాదు..ఏది ఏమైనా ఇలాంటి వారు ఉన్నంతకాలం దొంగబాబాలకు కొదఉండదు..
    మంచి ముగింపునిచ్చి కథ సుఖాంతం చేశారు..అభినందనలు శారద గారూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *