April 17, 2024

జలగ

రచన: శ్రీపాద

ఏమిటో నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే వుంది.
అక్కడికీ నన్ను నేను చాలానే విశ్లేషించుకున్నాను.
నాకే ఏదైనా అహమూ గిహమూ ఉన్నయేమోనని అనుమానం.
చిన్నప్పుడు ఏ మాత్రం దాపరికం లేకుండా లొడలొడా వాగేదాన్నని అమ్మ చెప్తూనే ఉండేది. అవును , చాలా రోజులు అనుకున్నది లోలోనికి తోసేసి పెదవుల మీద అబద్దాలు దొర్లించగలమని తెలియదు నాకు.
అనుకున్నది నిష్కర్షగా చెప్పెయ్యడమే.
స్వచ్చంగా ఉంటేనే ఆత్మానందం అనుకునేదాన్ని.
కాని ఎంత దాపరికం ఉంటే అంత గొప్ప అని అనుకోలేదు.
అదీ అరవై ఏళ్ళూ నిండి మరో ప్రస్థానంలోకి ప్రవేశించాక కూడా..
నలభై నాలుగేళ్ళ క్రితం కులమతాలు వదిలి ఎలాటి సంశయమూ లేకుండా అతనిని జీవన సహచరుడిని చేసుకోడం గర్వ కారణమే కాని ఎప్పుడూ విచారించలేదు.
ఆశ్చర్యపోయే విషయం చెప్పనా పెళ్ళికి ముందు ఆ ప్రసక్తే రాలేదు ఇద్దరి మధ్యనా.
తరువాత కూడా నలభై నాలుగేళ్ళలో ఎప్పుడూ ఇద్దరమూ ఆ మాటే ఎత్తలేదు.
అది మాఇద్దరి సంస్కారం.
ఎవరైనా డొంక తిరుగుడుగా ఇంటి పేరేమిటి? గోత్రమేమిటి అని ఆరాలు తీసినా చటుక్కున సూటిగానే చెప్పేసేదాన్ని.
“నేను ఫలానా ఫలానా మా ఆయనా ఫలానా ఫలానా మాది కులంతర వివాహం అని” అంత ముక్కు సూటిగా ఊండటం ఎంత చేటో ఈ మధ్యే తెలిసి వచ్చింది.
” ఎవరో గౌడ్ ను పెళ్ళి చేసుకున్నావటగదా ?” అని ఆ పెద్దావిడ అడగకముందే ఒక గౌడ్ మిత్రుడు ఏదైనా పెళ్ళి సంబంధం మనవాళ్ళలో ఉంటే మా అమ్మాయికి చెప్పండి అని అడిగినప్పుడు నాకేమీ అర్ధం కాలేదు.
ఆ పెద్దావిడ అడిగినప్పుడు చెప్పానుకూడా “ఎవరండీ మీకు అలా చెప్త ఆయన గౌడ్ కాదు మరో ఫలానా కులం “అని.
కధ అక్కడితో అయిపోతే బాగుండేది.
మరో ఆర్నెల్ల తరువాత ఆ పెద్దావిడకూ మరో మిత్రురాలికీ పొసగక నా దగ్గర వాపోతూ
“అందరి గురించీ ఆవిడ అంతే ఏడుపు. నీ గురించీ చెప్పింది. ఆ పిల్ల ( అరవై రెండేళ్ళు) తక్కువది కాదు దాన్ని మామూలుగా అంచనా వెయ్యకండి. ఎవడో ఫలానా కులం వాడిని చేసుకుందట. వాడిని ఎలా పట్టిందో ఏమిటో ..” అంటూ
ఫక్కున నవ్వొచ్చింది.
“నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అమ్మడూ ” అనే మా ఆయన గుర్తుకు వచ్హి.
పట్టడానికి జలగను కాదుగదా, ఆవిడెనేమో మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *