April 16, 2024

ముత్యాలరావు.. స్ధలాల మోజు

రచన: గిరిజారాణి కలవల

 

రోజూ పేపర్ల లో వచ్చే క్లాసిఫైడ్స్ చూడడం అలవాటు ముత్యాలరావుకి. రియల్ ఎస్టేట్ లూ.. స్ధలాలూ.. గజాలూ.. రేట్లూ.. కనుక్కోవడం ఇదే పని. ఆ బ్రోకర్లకి ఫోన్లు చేయడం.. వాళ్ళు కారులో వచ్చి, సైట్ల దగ్గరకి వెళ్లి.. ఆ స్ధలాల గురించి చెపుతూ వుంటే.. అన్నీ శ్రద్ధ గా వినేవాడు. పక్కనే ఉన్న స్దలాల ఓనర్స్ దగ్గర కి వెళ్ళి రేట్లు కనుక్కోవడం.. భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని బేరీజు వేసుకోవడం.. ఓ పదేళ్ల నుంచి ఇదే ప్రయత్నం లో వున్నాడు పాపం.

ఎప్పటికైనా.. ఐదొందల గజాల స్దలమైనా కొని ఇల్లు కట్టుకోవాలనే తపన. కానీ ఎక్కడా కలిసిరావడం లేదు. .. అతనికున్న విపరీత వాస్తు పిచ్చి..ఒక దాంట్లో ఈశాన్యం పెరిగిందంటాడు.. ఇంకో దాంట్లో ఆగ్నేయం తగ్గిందంటాడు.. మరోదానికిపక్కన వున్న గుడిగోపురం నీడ ఇందులో పడుతోంది అనేవాడు. ..  ఒకవేళ స్ధలం నచ్చి.. అన్నీ బావుంటే.. అబ్బే.. ఇది మరీ రోడ్డు పక్కనే వుంది.. పొల్యూషన్ ఎక్కువ ఇది వద్దనేవాడు. మరోటి రోడ్డు కి మరీ దూరమనేవాడు.  అద్దెలకి ఇచ్చేమాటుంటే.. ఇంత దూరం ఎవరూ అద్దెలకి రారని ఒకటి వదులుకున్నాడు.

ఏతావాతా.. ఏదో ఒక స్ధలం కొని పడేసి వుండు.. రేట్లు పెరిగినప్పుడు.. అమ్మి.. మంచి ఇల్లు కట్టించుకోవచ్చని.. హితోభిలాషులు చెపితే.. ఆ వేటలో పడ్డాడు.

ఇల్లు కట్టుకోవాలనే కోరికే కాదు.. ఓ చిన్నపాటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామనే కోరిక కూడా… తక్కువ లో స్ధలం కొని.. తర్వాత ఎక్కువ రేటుకి అమ్ముదామనే ఆలోచన వుంది ముత్యాలరావు కి. కానీ కాలమే కలసి రావడం లేదు.

ఎయిర్ పోర్ట్ వచ్చిందీ.. శంషాబాద్ లో అయితే.. తొందరగా రేట్లు పెరుగుతాయని అందరూ అంటూంటే.. ఓ బ్రోకర్ ని పట్టుకుని.. మూడొందల గజాలు కొని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆరేళ్ళయింది.. రేటు పెరగడం మాట అటుంచి.. తాను పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు కనపడలేదు.. ఈ ఆరేళ్ల కాలంలో..

తనకంటే చిన్నవాళ్ళూ. మొన్న మొన్న ఉద్యోగాలలో చేరిన వాళ్ళూ చూస్తూండగానే ఓ ఇంటివాళ్ళయిపోతున్నారు. ముత్యాలరావుకే జాతకంలో ఇల్లు యోగం కనపడ్డం లేదు.

ఆఫీసులో ఎవరో చెప్పారు ముత్యాల రావుకి.. ..  కామినేని హాస్పిటల్ నుంచి కాస్త.. పక్కకి  లోపలకి వెడితే.. ఇళ్ల స్ధలాలు కాస్త అందుబాటులో  వున్నాయని. ఆ మర్నాడే.. అటు వెళ్ళాడు, స్నేహితుడు ముకుందంతో కలిసి..  కనుచూపు మేరలో ఇంకా ఎవరూ ఇళ్లు కట్టిన దాఖలాలు లేవు.  స్దలాల నిండా చెత్తా చెదారం, ముళ్ళ మొక్కలు వున్నాయి. రెండొందల గజాల స్దలం రిజిస్ట్రేషన్ తో కలిపి రెండు లక్షలవుతుందట. బ్రోకర్ చెప్పాడు. బేరం చేస్తే.. ఇంకాస్త తగ్గొచ్చుకూడా అని సలహా కూడా చెప్పాడు… తీసుకోవాలో.. వద్దో అనే ఆలోచనలో పడ్డాడు ముత్యాలరావు. చాలా లోపలకి వుంది ఈ స్ధలం.. ఇప్పట్లో ఇటువేపు.. ఏవీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడ్డం లేదు.. ఇక్కడ లాభం లేదు తీసుకుని.. అని అనుకుని.. వద్దని చెప్పేసాడు ముత్యాలరావు.. తోడుగా వచ్చిన ముకుందరావు మాత్రం ఏం ఆలోచించాడో ఏంటో.. తూర్పు ఫేసింగ్ వున్న స్దలానికి.. ఓ పదివేలు అడ్వాన్స్ ఇచ్చి.. నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పాడు.  ” ఏంటోయ్.. ముకుందం.. పిచ్చా.. వెర్రా.. ఏముందని ఇక్కడ? ఇక్కడ కొంటానంటున్నావు? ఇంకేదైనా మంచిది చూద్దాం.. తొందరెందుకు.. ఇద్దరం పక్కపక్కనే తీసుకుందాం..” అని సలహా చెప్పాడు ముత్యాలరావు..

” నాకు తిరిగే ఓపికా లేదు.. ఇంతకంటే ఎక్కువ డబ్బు పెట్టే స్థోమతా లేదు.. చూద్దాం.. పెరిగిన నాడే పెరుగుతుంది.. నాకు ఇది చాల్లే.. ” అనేసాడు ముకుందం.

అతనినో వెర్రి వాడిలా జమకట్టేసి..” నీ ఖర్మ.. ” అనేసాడు ముత్యాలరావు..

ఆ తర్వాత హైదరాబాద్ నలుమూలలా స్ధలాల వేటలో తిరుగుతూనే వున్నాడు ముత్యాలరావు.

ముత్యాలరావు భార్య.. భర్త ని ఈ విషయంలో తిట్టని రోజు లేదు.. తెల్లారి లేచిన మొదలు.. ఎక్కడ స్దలాల రేట్లు ఎంతున్నాయీ.. తర్వాత ఎంతవరకూ పెరిగే అవకాశాలున్నాయీ.. ఇదివరలో తాను కొన్న శంషాబాద్ స్ధలం ఎంత పెరిగిందీ… ఇదే గోల.. ఇప్పటికి.. ఈ తిరుగుళ్ళకీ.. అక్కడక్కడా ఇచ్చిన అడ్వాన్స్ లూ అన్నీ కలిపితే… బంగారం లాంటి వంద గజాల స్ధలం నగరం నడిబొడ్డున వచ్చేదే.. అంటూ సాధిస్తూ వుంటుంది.

”  అనవే.. అను.. ఏదో ఒకరోజు నవ్విన నాపచేనే పండుతుంది. ఎక్కడోక్కడ మంచి స్ధలం కొనకపోతే.. నా పేరు ముత్యాలరావే కాదు..” అనేవాడు.

పేపర్ లో ఓ వార్త ముత్యాలరావుని ఆకర్షించింది. కోకాపేట లో స్ధలాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి… ఈ రోజు కొన్నవాడే అదృష్ట వంతుడూ.. ఈ రోజు రూపాయి పెట్టుబడి పెడితే.. నాలుగు రోజుల్లోనే నాలుగింతలవుతోంది.. అక్కడ పొలాలు అన్ని ప్లాట్లు గా పెట్టేసి అమ్ముతున్నారు.. అన్న వార్త చదవగానే.. పరుగు పరుగున కోకాపేట చేరాడు. నిజమో… అక్కడ వాతావరణం పేపర్లో చెప్పినట్టే వుంది. ఇప్పుడు ఎలాగోలా ఇబ్బంది పడి పెట్టుబడి పెడితే.. నాలుగు రోజుల్లోనే నాలుగింతలు లాభం వచ్చిందని.. అక్కడ వాళ్ళు చెప్పగానే..  భార్య వద్దని నెత్తీ నోరూ మొత్తుకున్నా.. తనకి  చేతకాకపోయినా… భారీగా అప్పు చేసి., భార్య నగలు అమ్మేసి.. చేతిలో వున్నదంతా ఊడ్చేసి.. ఓ ఎకరం  స్ధలం.. అక్కడ రైతు బూసయ్య దగ్గర కొనేసాడు. అమ్మిన బూసయ్య దగ్గర నుంచీ.. కొనుక్కున్న ముత్యాలరావు దగ్గర నుంచీ.. కమీషన్ తీసుకున్న బ్రోకర్.. సద్గుణరావు.. ఆనందంగా వెళ్లి పోయాడు. ఎంత వ్యవసాయం చేసినా రాని డబ్బు ఎకరాలు ఎకరాలు అమ్మేస్తే..  వచ్చిన డబ్బును సంచుల నిండా కూరుకుని.. బూసయ్య కి ప్రతిరోజూ పండగే.. తిరుగుళ్లు.. తాగుళ్ళు.. జల్సాలు..

ఇలా వుంటే.. మన ముత్యాలరావు ప్రతిరోజూ.. తాను కొన్న స్ధలం ఏదైనా రేటు పెరిగిందేమో అని ఎదురు చూపులే.. మనవాడి లెగ్గు మహత్యమో.. మరోటో.. ఆ తర్వాత.. అప్పటిదాకా.. ఆకాశాన్ని అంటిన స్ధలాల ఖరీదులు అమాంతంగ  పడిపోయాయి. పెళ్ళం మెడలో నగలు అమ్మి.. అప్పులు చేసి కొన్న కోకాపేట్ స్ధలం వెక్కిరించడం మొదలెట్టేసరికి ఏడుపే శరణ్యమయింది ముత్యాలరావు కి.

పుండు మీద కారం జల్లినట్టుగా.. మధ్యలో ముకుందరావు గృహప్రవేశం ఆహ్వానం ఒకటి.. అప్పుడు.. ముళ్ళచెట్లు.. చెత్తాచెదారం గా వుంది.. ఇక్కడ ఏం డెవలప్ అవలేదు.. తాను వద్దనుకున్నచోట.. స్ధలం కొనుక్కున్న ముకుందరావు బేంక్ లో లోను పెట్టి.. ఓ చిన్నపాటి డాబా ఇల్లు కట్టేసాడట.

గృహప్రవేశం కి వెళ్ళిన ముత్యాలరావు కి.. గిర్రున కళ్ళు తిరిగాయి. అప్పుడు తాను చూసిన స్ధలానికి ఇప్పుడు వున్న స్ధలానికి ఎంత తేడానో.. ఆ వరుసలో కనీసం పదిహేను ఇళ్లు లేచాయి.. కిరాణా కొట్లు.. ఓ బడి.. చిన్న డిస్పెన్సరీ.. ఇలా అవసరమయినవన్నీ కనపడ్ఢాయి. కాలనీ లోకే సిటీబస్సు వసతి వచ్చేసింది. ముకుందరావు చెప్పిన మాటలతో మతిపోయింది ముత్యాలరావు కి.  ” ఆ రోజు.. నీతో వచ్చినపుడు.. నేనూ కొంచెం సందేహించిన మాట నిజమే.. కానీ తక్కువలో వస్తోందని ధైర్యం చేసి కొనేసి నెమ్మదిగా స్ధలం బాగు చేయించి.. ఇల్లు కట్టడానికి పునాదులు వేయించాను. నన్ను చూసి మరి కొందరు ముందుకు వచ్చారు ఇల్లు కట్టడం మొదలెట్టీకున్నారు. అలా నెమ్మదిగా ఈ కాలనీ ఇలా పెరిగిపోయింది. తక్కువ లో వున్నాయని.. మా పిల్లలిద్దరి పేర్ల మీద ఇక్కడే రెండు స్ధలాలు కొనేసాను. అంతా నీ దయవల్లే. ఆ రోజు నువ్వూ కొనుక్కుని వుంటే బావుండేది.. ఇప్పుడు ఇక్కడ చాలా పెరిగిపోయాయి రేట్లు. ఏదో బేంక్ లో లోను పెట్టుకుని.. పైనా కిందా కలిపి నాలుగు పోర్షన్లు వేసాను. వచ్చే అద్దెలు వడ్డీకి సరిపోతాయి. ఇంతకీ నువ్వెక్కడైనా కొన్నావా? ” అని అడిగేసరికి…. లేదంటూ తల అడ్డంగా ఊపి.. గృహప్రవేశపు భోజనం చేసి బయటపడ్డాడు ముత్యాలరావు.

ఉన్న ఆస్థులూ.. దాచుకున్న డబ్బులు, నగలూ మొత్తం పోగేసి.. నాలుగురోజుల్లో కోటీశ్వరుడైపోదామనే ఆశతో కొనుక్కున్న కోకాపేట స్ధలం.. చేతులు చాపి తనని కబళించేసిందని చెప్పలేకపోయాడు.

తాను కొనుగోలు చేసిన కోకాపేట స్ధలంలో.. తానూ.. తన భార్యా కలిసి చిన్న కాఫీ హోటల్ పెట్టుకున్నట్లు చెప్పలేకపోయాడు ముత్యాలరావు.

ఆ కాఫీ హోటల్ లోనే.. సప్లయర్ కమ్ క్లీనర్ గా పని చేసేది .. ఆ స్ధలం అమ్ముకున్న  బూసయ్యే.. నడమంత్రపుసిరిగా ఒక్కసారిగా వచ్చి పడ్డ డబ్బు ఒక్కసారిగానే ఖర్చయిపోయేసరికి.. నిలువునా దివాలా తీసేసాడు బూసయ్య.

అమ్మిన బూసయ్యకీ.. కొనుక్కున్న ముత్యాలరావుకీ అచ్చిరాని కోకాపేట స్ధలం.. ఇద్దరినీ చూసి నవ్వుతోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *