April 24, 2024

విశ్వనాథ వారి భ్రమరవాసిని

రచన: రాజన్


అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి మనకందించిన ఋషులవంటి మహనీయులున్నారు. గత వంద, రెండువందలేండ్ల కాలములో చూసినట్లయితే అటువంటి మహారచయిత ఒకరు పవిత్ర కృష్ణానదీ తీరాన జన్మించి, మనసుకు ఆహ్లాదాన్ని, బుద్ధికి విజ్ఞానాన్ని, ఆత్మకు ఆనందాన్ని కలిగించగల తన రచనలతో కవికుల సమ్రాట్టుయై, రాశీభూత విజ్ఞానమై, ఆంధ్రుల మహద్భాగ్యమై ప్రకాశించెను. ఆ ప్రభావశీల ప్రకాశరేఖలు నేటికీ అనేకుల మనస్సులలో.. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురువరేణ్యుల రూపమున మూర్తికట్టి వెలుగొందుచున్నవి. పురాణవైర గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, వేయిపడగలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చెలియలికట్ట మొదలైన అనేకానేక నవలలు కలియుగ రాజవంశ నిజ చరిత్రను, లౌకిక విజ్ఞానాన్ని, ఇంకా మనిషి ఆలోచనపు లోతులను మనకందిస్తాయి. అంతేకాక మనస్సును పట్టి కుదుపుతూ, దానిని దాటి మరింత లోతుగా వెళ్లడానికి ప్రయత్నించే భావనాతరంగమొకటి పుస్తకం చదువుచున్నంతసేపు మనలో కదలాడుతూనే యుంటుంది. అటువంటి రచనలలో నొకటి… కాశ్మీర రాజవంశ చరిత్ర నందలి ఆరవ మరియు ఆఖరి నవల… భ్రమరవాసిని.
కాశ్మీరాధిపతి రణాదిత్యుని శోభనపు గదిలో కథ మొదలౌతుంది. నూత్న వధువు రణరంభాదేవి రాకకై ఎదురుచూస్తున్న రణాదిత్యుని మనస్సును… అప్పటివరకూ జరిగిన సంఘటనలు, గోడలపై చిత్రాలు, ద్వారబంధము ప్రక్కనే ముమ్మూర్తులా రణరంభాదేవిలా యున్న ఒక శిల్పము కలవరపెడుతుంటాయి. అటుపై ఆమె గదిలో అడుగిడిన తదుపరి వారి మధ్య జరిగిన సంభాషణ, రాజును మరింత విస్మయానికి గురిచేస్తుంది. రణరంభాదేవి, తాను సాక్షాత్ శ్రీమహాలక్ష్మి స్వరూపమగు భ్రమరవాసినినని, రణాదిత్యుని కోరిక మేరకు రణరంభగా జనించి ఆతని భార్యనైతినని, ఆమెనాతడు స్పృశింప సాధ్యము కాదని చెప్పును. అంతియేకాక, అతనిని మోహవశుడను జేసిన ద్వారబంధము దగ్గరి ప్రతిమను మంచముపై పరుండబెట్టు మని చెప్పి, తాను భ్రమరమై భ్రమరీనినాదము జేయుచూ ఆతనిని నిద్రపుచ్చుటతో కథ ప్రథమ భాగము పూర్తియగును.
పెండ్లి జరిగిన కులూతదేశము నుండి కాశ్మీరానికి బయలుదేరిన పెండ్లి బృందముతో కులూతదేశ యువరాణి అమృతప్రభ ను కూడా తీసుకువచ్చిన రణరంభాదేవి, మార్గమధ్యములో సర్వాంగీకారముతో ఆమెకు రణాదిత్యునకు వివాహము జరిపించును. శ్రీనగరము చేరిన పిమ్మట రణాదిత్యుడు స్వప్నములలో తన పూర్వజన్మ కథయంతయూ తెలుసుకొనును. అతడు క్రితం జన్మమున మధుసూధనుడను సంపన్న బ్రాహ్మణుడు. పెద్దల బలవంతము మీద ఇష్టము లేకున్ననూ రూపవతి కానటువంటి నీలమణిని వివాహమాడతాడు. నాలుగేండ్ల వారి వివాహజీవితములో అతడామెతో సంసార సుఖమనుభవించడు. కాలక్రమాన వ్యసనపరుడై ఆస్థి యందలి పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. నీలమణి మాత్రం భర్త తెచ్చిన మహాలక్ష్మీ విగ్రహాన్ని ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తూ, శుక్రవారం పూజలు చేస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తుంటుంది. భార్యను అమ్మాయని పిలుచుట ప్రారంభించిన భర్తతో నీలమణి నిష్ఠూరంగా అన్నట్టి “మీకు అమ్మ భార్య. భార్య అమ్మ” మాటలు ఒక శాపంగా పరిణమించి భవిష్యద్కథకు దోహదం చేస్తాయి. మధుసూధనుడు పరివర్తన దశలో యుండగానే, నీలమణి తన సవతి తల్లి అసూయకు బలైపోతుంది. విరక్తుడై తిరుగుచున్న మధుసూధనుడు, అనుకోకుండా ఒకనాడు తన ఇంట పూజామందిరంలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చదువుతాడు. అందులో వివరింపబడిన అతి క్లిష్టమయిన భ్రమరవాసినీ వ్రతాన్ని బూని, ఇంటినీ, ఉరునీ విడచి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, చివరకు దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మ అనుగ్రహించేవేళ సమ్రాజ్యాధిపత్యముతోపాటు, వివేకహీనుడై ఆ అమ్మనే భార్యగా కోరతాడు. దయామయి అయిన అమ్మ అనుగ్రహించి అంతర్హితురాలౌతుంది. ఇదీ రణాదిత్యుని స్వప్న వృత్తాంతం. అప్పటి మధుసూధనుడే ఇప్పటి రణాదిత్యుడు, నీలమణియే అమృతప్రభ, సాక్షాత్ శ్రీ వైష్ణవీ మహామాయయగు భ్రమరవాసినియే రణరంభాదేవి.


ఆ తరువాత రణాదిత్యునితో జైత్రయాత్ర గావింపజేసిన రణరంభాదేవి, అతనిని సామ్రజ్యాధిపతిగా, భారత చక్రవర్తిగా చేస్తుంది. చివరగా రణాదిత్యునికి పాతాళలోక వాసముననుగ్రహించి, తాను శ్వేతద్వీపమున వింధ్యపర్వత గుహాంతర్భాగములో భ్రమరవాసినిగా భక్తులననుగ్రహిస్తూ వెలుగొందుతుంటుంది. ఇదీ స్థూలంగా భ్రమరవాసిని కథ.
కథ గొప్పదనం ఒకెత్తయితే, కథకుడు దానిని నడిపిన వైనం రెండెత్తులనవచ్చును. విశ్వనాథ వారి ప్రతిరచన యందు ఒక విశిష్టత యుంటుంది. పాత్రల మధ్య సంభాషణలతో ఒక విషయాన్ని చర్చించి అవకాశమున్నంత వరకూ వాదానికిరువైపులా పదునుపెట్టించి పరుగులెత్తించి చివరకు సత్యాన్ని రూఢీ చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ కథలో కూడా భ్రమరవాసినీ రణాదిత్యుల మధ్య సంభాషణలటువంటివే. ఇక పాత్ర చిత్రీకరణల విషయానికి వస్తే… రణరంభాదేవి దయాస్వరూపిణి, తనను కోరిన భక్తుని అవివేకాన్ని మన్నించి ననుగ్రహించిన తల్లి. అతని కోరికీడేర్చుటకు మానవకాంతగ జనించి, రణాదిత్యుని పట్టమహిషియై ఆతనికి సామ్రాజ్యత్వమును కట్టబెట్టిన వైష్ణవీ మహాశక్తి. రణాదిత్యుని పాత్ర ఓ తరహా వైచిత్రి కలిగిన పాత్ర. అతడెంతటి మహావీరుడైనప్పటికీ కథలో ముప్పావుపాలు అయ్యేవరకూ జరిగేదంతా ఎందుకు జరుగుచున్నదో, తనకు వచ్చే కలల రహస్యమేమిటో తెలియక సంధిగ్థంలో నడిచే పాత్ర. సౌందర్యం, అమాయకత్వం రంగరించబడిన పాత్ర అమృతప్రభది. భర్త తిరస్కారానికి గురైనప్పటికీ, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మహాలక్ష్మీ ఆరాధనలో తన్మయత్వాన్ని పొందే పాత్ర నీలమణిది. నచ్చని పెళ్లి చేసుకుని, వ్యసనపరుడై తిరిగి పరివర్తన చెంది దేవ్యనుగ్రహాన్ని పొందినవాడు మధుసూధనుడు. ఇలా ప్రతిపాత్ర అద్భుతంగా మలచబడి నడపబడినవే.
ఇది యంతా కథేమిటో చెప్పడానికి ఉపయోగపడుతుంది గానీ, కథామాధుర్యాన్ని చవిచూడాలంటే మాత్రం భ్రమరవాసిని చదవవలసినదే. తన్మయమొందిన హృదయముతో నిద్దురలో భ్రమరీనినాదము వినవలసినదే.

1 thought on “విశ్వనాథ వారి భ్రమరవాసిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *