February 21, 2024

అమలిన శృంగారం

రచన: అనిల్ ప్రసాద్ లింగం

“అరే…… విజయోత్సవ చిత్రాల రచయితా – అందాల తారా కలిసి మా ఇంటికి విచ్చేశారే. ఎంత శుభదినం ఇది. రండ్రండీ…” ఇంట్లోకి ఆహ్వానించాడు డాక్టర్. దివాకర్, వేకువ జామునే వచ్చిన అతిథుల్ని.
“ఆపరా వెధవా. ఎక్కడా పెళ్లి కూతురు ?” సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు తన భార్యతో కలిసొచ్చిన ప్రముఖ సినీ రచయిత అనిరుధ. దివాకర్ తన భార్యను పిలిచి, “చెల్లిని పిలు, వీళ్ళు ఆశీర్వదించి వెళతారు” అన్నాడు.
“ఏరా ? మేముండకూడదా ?” అడిగాడు మిత్రుడు.
“అది కాదురా మళ్ళీ చుట్టాలు రావడం మొదలైతే అందరూ మీ ఇద్దర్నీ చుట్టుముడతారు. అందుకే త్వరగా కనపడి వెళ్ళదామని వచ్చారేమోనని…..” నసిగాడు డాక్టర్.
“అదేమీ కాదురా. చెల్లి పెళ్లి దగ్గరుండి జరిపించి అప్పగింతలయ్యాక వెళ్తాం. మాకు మర్యాదలు తక్కువ కాకూడద్రోయి!” చనువుగా చెప్పాడు కవి.
ఆలి వైపు తిరిగి దివాకర్, “చూసావా, శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వేమన్నావు? మనం ఇవ్వడమే కానీ వాళ్ళు మన ఇంటికొస్తారా అన్లేదూ ? ఇప్పుడు చూడు నా దోస్తుని” నిజంగానే సంబర పడిపోయాడు.
“నేనా ? ఆ మాటన్నది మీరు” వెంటనే అంటించింది వాళ్ళ ఆవిడ.
“ఏయ్! ఏం మాటాడుతున్నావే? మంచీ మర్యాద లేదు. ముందు అమ్మాయిని లోపలి తీసుకెళ్ళు” అని తొందర పెట్టాడు.
“రారా కొత్త పెళ్ళికొడకా నా రూంకెళదాం” అని తీసుకుపోయి సరుగులోనుంచి మందు బాటిల్ తీసాడు.
“ఇదేంట్రా? తెల్లవారిందా, అసలు ఇన్ని పనులు పెట్టుకొని ….” అనిరుధ ఆశ్చర్యపోయాడు.
“పనులు ఎప్పుడూ ఉంటాయి లేరా. కొంచెం వేసుకుందాం” అంటూ మూత తీసి గ్లాస్ అందుకున్నాడు.
“ఆపరా. ఏంటిది ఇంట్లో శుభకార్యం పెట్టుకొని – పొద్దున్నే…”
“అయ్యయ్యో ఏం వేషాల్రా…? మొన్నా మధ్య నువ్వు రాసిందే కదా ‘నువంటే నా కిష్టం’ సినిమా – అందులో పెళ్లి పనుల్లో పిల్ల తండ్రీ, బాబాయిలు మందుకొట్టి కాదా పనులు చేసింది?”
“అది సినిమారా దరిద్రుడా. ముందు టిఫిన్ పెట్టించు” అని బాటిల్ పక్కన పెట్టేసాడు అనిరుధ.

************

కళాశాలలో సహాధ్యాయులైన దివాకర్, అనిరుధలు చదువులయ్యాక కూడా తమ స్నేహాన్ని కొనసాగించారు. పై చదువులకి వేరే ఊళ్లకెళ్లినా కుదిరినప్పుడు కలుసుకోవడం, ఒకరిళ్ళకి ఒకరెళ్ళుతుండటంతో వారి కుటుంబాల మధ్యన కూడా అనుబంధం ఏర్పడింది. కాలక్రమేణా మానసిక వైదుడిగా దివాకర్ స్థిరపడగా, తనకున్నా సాహితీ పరిజ్ఞానంతో అనిరుధ సినీ జగత్తులో నిలదొక్కుకున్నాడు. ఈ మధ్యనే ఓ యువ తారామణిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.
జీవనయానంలో తీరికలేకున్నా అప్పుడప్పుడు ఇలా సందర్భానుసారం కలుసుకుంటూ తమ స్నేహాన్ని పెంపొందించుకుంటూనే ఉన్నారిరువురు.
“ఎరా చెల్లిని కలిసావా?” బయటనుంచి వస్తూ అడిగాడు దివాకర్.
“హా…!” బదులిచ్చాడనిరుద్ధ.
” ఏమన్నా చెప్పిందా ?”
“దేని గురించి?”
“అదే ఈ పెళ్లి తనకిష్టమో కాదో అని”
“అదేంట్రా? నువ్వడగలేదా?”
“ఉహూ !”
“అయితే మాత్రం ఇప్పుడేంట్రా, ఇంతదాకా వచ్చాకా….”
“అదేరా నీ సిన్మాలన్నింటిలో పెళ్లిళ్లు పీటలమీదే ఆగిపోతాయి కదా, అటువంటిదేమన్నా…….” అనిరుధ వెంటనే ఫ్రెండ్ తల మీద మొట్టి, “ఒరేయ్..అవి . కధల్రా, చెల్లి విషయంలో అలా ఎందుకవుతుంది?” అన్నాడు. హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నాడు దివాకర్.

**************

మధ్యహ్నం భోజనాలయ్యాక అందరూ హాళ్ళో చేరారు. మ్యూజిక్ పెట్టుకొని పిల్లలు డాన్స్ చేస్తున్నారు.
“ఆగండర్రా ఇప్పుడు మన హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తారు” అని ప్రకటించి అనిరుద్ధని ముందుకు లాగాడు దివాకర్. చెయ్యి విడిపించుకొని “వదులేహే. తను ఏదో అక్కడ డాన్స్ మాస్టర్ చెప్తే చేస్తుంది, అంతే తనకేమీ రాదు. నేనెప్పుడన్నా ఎగరడం నువ్వుచూసావా? అసలు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఈ గోలేంట్రా?” విసుక్కున్నాడు అతిథి.
“మరి అన్ని సినిమాల్లో ఒక పాట పెడతావ్ కదరా ఇంటిల్లపాదీ ముసలీ ముతకా, పిల్లా పీచూ – అంతా కలిసి తెగ ఆడతారు కదా అప్పుడు” స్థాణువై కాసేపు నిలుచుండిపోయిన అనిరుద్ధ, మిత్రుడిని పక్క గదిలోకి లాక్కెళ్లాడు.

************

“రేయ్, ఏమైంద్రా నీకు? వచ్చిందగ్గరనుంచి చూస్తున్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్. అర్ యూ ఆల్రైట్ ?” తలుపు మూసి, భుజం మీద చెయ్యి వేసి పలకరించాడు స్నేహితుడు.
“ఎస్ ఐయామ్. మరి నీకేమైంద్రా ? నువెందుకలా చేస్తున్నావ్ ?” తిరిగి ప్రశ్నించాడు డాక్టర్.
“నేనేమి చేశాన్రా ?”
“నువ్వు రాసే సినిమాల్లో నీ పాత్రలు ప్రవర్తించే తీరుకు, నువ్వు బయట నడుచుకునే విధానంకి ఉండాల్సిన తేడా గురించి నీకు స్పష్టతుంది. మరి అదే విధంగా తెర మీద నీ భార్య నటించే పాత్రలని, తను వ్యక్తిగతంగా నీతో కలిసి ఉండే జీవితాన్ని నువ్వెందుకు వేరు చేసి చూడలేకున్నావ్రా?” మెల్లగా చెయ్యితీసి ఆవలకి తిరిగాడు అనిరుద్ధ.
కాసేపు మౌనం వహించిన డాక్టర్ టీ తెమ్మని కబురంపి వచ్చి “ఒరేయ్, రచయితగా నువెన్నో పాత్రలు సృష్టించి, వాటికి నడతా, నడకా, హావభావులు, మేనరిజాలు అన్నీ కల్పించి అవి తెర మీద పండేలాగా చేస్తావు – అంతవరకే. ఆపైన నీ మీద ఆ పాత్రల ప్రభావం ఇసుమంత కూడా ఉండదు. మరి అలాగే ఎవరో పుట్టించిన పాత్రల్లో నటించి వచ్చినామె నీ ముందు కూడా అలాగే చెయ్యాలనుకోవడమేంట్రా? నీకున్నా స్థితప్రజ్ఞత ఆమెకు ఎందుకు ఉండదనుకున్నావ్రా?”
తలుపు తట్టి లోపలికొచ్చిన పనిమనిషి టేబుల్ మీద టీ పెట్టి వెళ్ళిపోయింది. కప్పు తీసుకొచ్చి స్నేహితుడికి అందించాడు దివాకర్. మెల్లగా గుటకేసిన రచయిత మాటలాడలేదు.
“తెర మీదేరా తను నటి. ఇంటికొచ్చాక, భర్త దగ్గర తాను సాటి ఆడదేరా. తొలిరాత్రి సిగ్గుపడుతూ పాలగ్లాసుతో వస్తే, ఫలానా సినిమాలోలా మందు తేవచ్చుగా అని నువ్వంటే – నీ కొంటెతనం నచ్చి సర్దుకుంది. ప్రేమగా ముద్దాడేవేళ ఆ సిన్మాలో, వాడెవడో హీరో పక్కన, కెమెరాకిచ్చిన ఎక్స్ప్రెషన్ ఇవ్వమంటే నీ నిశిత దృష్టికి మురిసిపోయింది. కానీ ఎంతసేపు తాను కాని ఇంకెవరినో నీ ముందు పెట్టమంటే, తనని తానుగా నువ్వు స్వీకరించడంలేదని బాధ పెంచుకుంది. బంధుగణాల్లో మరుగున పడిన అభిమానాలని నీ సినిమాల్లో నేర్పుగా తవ్వి తీసే నీకు నీ అర్ధాంగిలో నిభిలీకృతమైయున్న ఈ దృక్కోణం గోచరించలేదేరా?” టీ అయ్యిపోయింది కానీ మాట పెగలలేదు అనిరుద్ధకి.
“నీ భార్య నీకు విడాకులివ్వడానికి ఆలోచిస్తుందిరా” తల ఎత్తిన కవి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పుకుపోయాడు దివాకర్. “అవున్రా! ఇది నిజం” అయోమయావస్థలో పడిపోయిన మిత్రుడిని సమీపించి, “నాకు తెల్సురా ఇప్పుడు నువ్వేమి ఆలోచిస్తున్నావో. పూర్తిగా వ్యక్తిగతమయిన విషయాలు నాకెలా తెలిసాయని. అలాగే ఇంతకాలం నీకెంతో విలువిచ్చిన నేను ఇకపై నిన్నెలా గౌరవిస్తాననేకదా. మొన్నామధ్య విదేశాల్లో ఒక కాన్ఫరెన్సుకి వెళ్ళాన్రా. అక్కడి హాస్పిటల్లో నీ భార్యని చూసాను. ఏదైనా షూటింగుకి వచ్చిందేమోనని విచారిస్తే ఆమె అక్కడ డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలిసిందిరా. కొత్తగా పెళ్లైనప్పుడు ఇలాటివి సహజం. అందునా మీరిద్దరూ ఎంతో పేరెన్నికగన్నవారు, మీ చుట్టూ ఎప్పుడూ ఎంతో మంది జనాలు, ఇప్పుడు సెలబ్రిటీలంటే మొత్తంగా సమాజానికి చెందినవాళ్ళైపోయారు కదా, ఏదైనా ఇబ్బంది కలిగిందేమోననే ఆలోచనతో స్నేహ ధర్మంగా, మీకు సాయపడాలనే ఉదేశ్యంతో ఆ హాస్పిటల్ వాళ్లతో మాట్లాడి ఒక హిప్నోటిక్ సెషన్ తనకి నేను తీసుకున్నా. అలా నాకీ విషయాలు తెలిసాయి. తాను ట్రాన్స్లో ఉన్నప్పుడు మాటలాడాను, తనకెక్కడా ఎదురు పడలేదు కాబట్టి ఆమెకీ విషయం తెలీదు” స్నేహితుడి చెయ్యి పట్టుకొని అనునయంగా “ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉంటుంది” అని భరోసా ఇచ్చాడు.
“తళుకు బెళుకుల జీవితాల గురించి విని ఉన్నాను అయినా మీది వేరుగా తోచింది. దీపికా పడుకొనే అంతటి నటి తానూ డిప్రెషన్కి గురయ్యానంటే ‘ఆమెకేమి సమస్యలుంటాయి?’ అనుకునే వాళ్ళేగానీ వాళ్ళూ మనుషులేనని, వాళ్ళకీ మనసుంటుందని అర్ధం చేసుకోలేరురా చాలా మంది. మానసిక వైద్యుడిని కదా, అసలేమైయుంటదా అనాలోచించాను. తెల్సుకొని ముందు నీకే చెప్దామనుకున్నా కానీ నువ్వే సమస్యని తెలిసి బాధపడ్డా పెళ్ళైన మూడు నెలలకే విడాకుల గురించి ఆ పిచ్చి తల్లి ఎందుకాలోచించిందో తెల్సురా?, నువ్వు తెర మీద ఉండే తన పట్ల చూపిస్తున్న ఆపేక్షకు పొంగిపోవాలో, ఎదురగున్నామే మీది ఆలక్ష్యానికి దిగులు పడాలో తెలీని సంకట స్థితిలో డాక్టర్ని ఆశ్రయించింది. ఏ మత్తు మందులకో బానిస కాకుండా నిన్నూ, నీ మర్యాదనీ, అలాగే నీతో నడచిన ఎడడుగుల బంధాన్ని ఎల్లకాలం నిలుపుకోవాలని తాపత్రయపడింది. అది నచ్చే నీ కాపురం నిలబెట్టాలని ఈ చొరవ చేసాను. ఎంతో విద్వత్తు కలవాడివి, ఎన్నో జీవితాల్ని చూసినవాడివి, తప్పో ఒప్పో జరిగినదాన్ని సరిదిద్దుకొని ఆ అమ్మాయి నిర్ణయం మార్చుకునేలా నీ ప్రవర్తనలో తేడా చూపించు. మళ్ళీ చెల్లీ శ్రీమంతానికి వచ్చేటప్పుడు ఇరువురూ జంటగా, సంతోషంగా శుభవార్తతో రావాలి ” అన్నా డాక్టర్. దివాకర్ని హత్తుకొని, ఒకరి భుజాల మీదొకరు చేతులేసుకుని బయటకి నడిచారు మిత్రులిరువురూ.

1 thought on “అమలిన శృంగారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *