April 19, 2024

ఆసరా!

రచన: పద్మజ యలమంచిలి

అందమైన తీగకు పందిరుంటే చాలునూ.పైకి పైకి పాకుతుంది చినవాడా..ఎఫ్.ఎమ్.రైన్బో లో పాటవింటూ బయటకు చూశా!
లంచ్ అవర్. పిల్లాలంతా గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న ఆహారాన్ని ఒకరికొకరు పంచుకుంటూ
జోకులేసుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు.

స్టాఫ్ రూం లో టీచర్లందరూ కూడా అదే పనిమీద ఉన్నారు.

ఎక్కడా నీరజ కనపడలేదు. ఇద్దరికీ కారేజీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది రత్తాలు.

మాటైతే ఇచ్చాను కానీ. ఇద్దరు బిడ్దలనూ పోగొట్టుకుని దిగాలు పడుతూ ఒంటరిగా నా చెంత చేరిన నీరజ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలనో అనే బెంగ మనసులో వెంటాడుతూనే ఉంది.

నాతోపాటు రోజూ స్కూల్ కి వచ్చి పాఠాలు చెపుతూ పిల్లలతో బాగానే అడ్జస్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ
లోలోపల దిగులు నా దృష్టిని దాటిపోలేదు.

భోజనానికి పిలుద్డామని బయట వెతుకుతుంటే గేట్ దగ్గర వాళ్ళ ఆయనతో ఏడుస్తూ తలూపడ౦ కనపడింది.
ఇద్దరిమధ్యకు ఇప్పుడు వెళ్ళడం సరికాదని లోపలికి వచ్చేశాను.

కాసేపటికి తానూ వచ్చి క్లాస్ కి టైమ్ అయిపోయింది.మీరు తినేయండి ఆంటీ అంటూ వెళ్లబోతున్న తనని ఆపి
పర్వాలేదు ఆ క్లాసుకి వేరే టీచర్ ను పంపాలే. ఇద్దరం తిందాం అని కూర్చోబెట్టా.
నోటిలో ముద్ద పెట్టుకుని దుఖం అడ్డుపడటం వల్లేమో మింగలేక మొహం తిప్పుకోవడం నేను గమనించక పోలేదు.
నెమ్మదిగా తనే సంభాళి౦చుకుని ఇంటికి రమ్మంటున్నాడు అంది.
ఉలిక్కిపడి ఎందుకు అన్నా.

తాను ఒక పార్టీలో చురుకైన కార్యకర్తనని,ఇప్పుడు విడిపోతే తన రాజకీయ భవిష్యత్తు నాశనమైపోతుందని వచ్చేయమంటున్నాడు.
ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉందేమో.మీరైతే ఏం చేస్తారు ఆంటీ అంది.

************

ఏం చెప్పను.ఒక్క క్షణం నా గతం కళ్ళముందు కదలాడింది.
తనదీ ఇదే పరిస్థితి.. కోపంతో అవమానంతో ఇద్దరు బిడ్దలనీ తీసుకుని కృష్ణలో దూకింది. పసిప్రాణాలు వెంటనే పోయాయి. ఎవరో దూకి తనను ఒడ్డున పడేశారు ఎందుకు బ్రతికించారా అని రోజూ ఏడ్చేలా!
కన్నతల్లి, తోబుట్టువులు, చుట్టాలు, ఇంటి కోడలు ఒక్కరేమిటి. ఎక్కడ తమ మీద ఆధారపడి బ్రతికేస్తానో అనే అభద్రతాభావంతో మళ్ళీ చచ్చిపోవాలి అనిపించేలా సూటీపోటీ మాటలు.
అన్నగారైతే పెళ్ళాం మాటలు విని గొంతు పిసికి చంపేయడానికి కూడా వెనుకాడలేదు.
అదిగో.. సరిగ్గా అదేసమయంలో ఇలాగే నాకు ఆస్తి, చదువు లేకపోయినా పార్టీలో కార్యకర్తగా పేరుంది. ముందు ముందు రాజకీయంగా ఎదగాలంటే ఎలాంటి మచ్చలు బయటకి తెలియకూడదు. ఇంటికి వెళ్ళిపోదాం పద.
అంటూ వచ్చాడు నాభర్త.
ఎప్పుడు పోతానా అని చూసే కుటుంబసభ్యులను చూస్తూ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా తనతో పాటు బయటపడ్డా.
తను,తన ప్రియురాలు ఎటు పోయినా మధ్యలో కలగజేసుకోకుండా, నా పని నేను చూసుకుంటూ, యల్. ఐ. సీ పాలసీలు కట్టిస్తూ, సర్జికల్స్ మార్కెటింగ్ చేస్తూ కొంచెం నిలదొక్కుకున్నా. ఎలాగైనా నా పిల్లలను నేను తిరిగి పొందాలనే కోరిక బలంగా గుండెల్లో ఉండిపోయింది!
పార్టీ తరపున అతనికి ఏదో కాంట్రాక్టు పని దక్కింది. దానికి రోడ్డు వేసే ముఠాను తీసుకురావడం కోసం లారీ ఎక్కారు.
అది కాస్తా ఆగిఉన్న మరో లారీని ఢీ కొట్టడంతో ఈయనగారి రెండు కాళ్ళూ విరిగిపోయాయి. మోహమంతా గాజుపెంకులు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ ఉన్న తనని హై వే సెక్యూరిటీ వాళ్ళు హాస్పిటల్ లో జాయిన్ చేసి నాకు కబురుపెట్టారు.
కాళ్ళు విరగడంతో పాటు వెన్నుపూసకు దెబ్బ తగలడంతో సంసారానికి పనికిరాడని డాక్టర్లు తేల్చి చెప్పారు.

తన ప్రియురాలు ఈయన పరిస్థితిని చూసి దరిదాపులకి కూడా రాలేదు.సరికదా.తనకి ఎక్కడ బర్డెన్ అయిపోతాడో అనుకుందేమో అడ్రెస్ కూడా తెలియనీయకుండా మాయమైపోయింది!

*************

దరిదాపు మూడు సంవత్సరాలు అన్నీ మంచంమీదే. చిన్న పిల్లాడికి మల్లే సేవలు చేస్తూనే.దగ్గరలో ఉన్న ఇన్ స్టిట్యూట్లో PGDCA పూర్తిచేయడంతో పాటు గ్రాఫిక్స్, డీ టీ పి మీద పట్టు సాధించా. మార్కెటింగ్ లో నాకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నా!
లేచి నడవగలుగుతున్నాడు. తన పనులు తను చేసుకుంటూ నాకు గులాం చేస్తున్నాడు.. చుట్టాల రాకలు, దొంగ ప్రేమలు యథాతధంగానే మొదలైయ్యాయి! సంపాదించేది నేను అని జనాలకు తెలియకుండా మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేవాడు!
సంపాదించిన డబ్బులు పట్టుకుని ఇద్దరం చెన్నై అప్పోలోలో IVF చేయించుకుని ఇద్దరి బిడ్దలను తిరిగిపొందాను. ఇది కూడా ఎవ్వరికీ తెలియకుండా ఒట్టు వేయించుకున్నాడు
అన్నీ సుఖంగానే ఉన్నాయి అనుకునే టప్పటికి అతనికి కాన్సర్ అటాక్ అయి ఫైనల్ స్టేజ్ లో బయటపడింది.
మళ్ళీ.
నా బ్రతుకు జనాల నోళ్ళలో నానడం మొదలైంది.ఎ క్కడ ఇద్దరి పిల్లలతో పాటు వాళ్ళ మీద వచ్చి వాలిపోతానో అని ఆయన చనిపోయిన అయిదోరోజునే ఖర్మలన్నీ కానిచ్చేసి పత్తా లేకుండా పోయారు.
మూడు నిమిషాలు సుఖపడితే పుట్టిన పిల్లలుకాదు నా పిల్లలు.
ముప్పైకోట్ల కష్టాలు ఎదుర్కుని బలవంతంగా ఈ భూమిమీదకు తీసుకువచ్చా వాళ్ళని.
అమ్మను, నాన్నను, బంధువుల ప్రేమను కూడా నేనే అందించి పెంచుకొచ్చి చదివించి వాళ్లకో భద్రత కల్పించా.
ఇక అన్ని భాద్యతలు తీరాయి అనుకున్నాకా ఇలా చిన్నపిల్లలతో కాలక్షేపం చేయొచ్చని ఈ స్కూల్ పెట్టా!
భర్తపోయిన ఆడదాన్ని చిన్నచూపు చూసే జనాలను అసహ్యి౦చుకుంటూ, కపటప్రేమలకు, చాందసవాదులకు దూరంగా ఆత్మాభిమానంతో హాయిగా జీవిస్తున్నా!

***********

నీరజా.. నీకూ నాలాగే జరుగుతుందని గ్యారెంటీ లేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
అందుకే ముందు వాడితో వెళ్ళటం అనే ఆలోచన విరమించుకో. నీ క్వాలిఫికేషన్స్ పెంచుకో. నీకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలబెట్టుకో. వాడి రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఉపయోగపడకు. గుండె బలం పెంచుకో. అభద్రతా భావాన్ని మనసు నుంచి తీసెయ్..
నీకు నచ్చిన వాడిని, నిన్ను మెచ్చినవాడిని కావాలంటే ఎవరేమన్నా లెక్కచేయకుండా ఆహ్వానించు. ఉన్నది ఒకటే జీవితం. దానిని బానిసలా బ్రతకడం కాక తృప్తిగా జీవించడం నేర్చుకో!
ఇన్నిరోజులూ మనసులో ఉన్న భారాన్ని నేను తగ్గించుకుంటే. నా మాటలతో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తను పెంచుకుంది!

***********

కష్టంలో ఉన్న ఏ స్త్రీ కైనా మానసిక స్వాంతన చేకూర్చే చిన్న మాట, కూసింత భరోసా ఇస్తే చాలు. తాను బ్రతకడమే కాకుండా ఎంతోమందికి ఆసరాగా నిలబడగలుగుతుంది అనేది ఈ మధ్యే N G O గా తను చేసే కార్యక్రమాలను చూశాకా అర్ధమైంది!

1 thought on “ఆసరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *