June 19, 2024

కంభంపాటి కథలు – Some బంధం

రచన: రవీంద్ర కంభంపాటి

‘ఇదిగో. ఇలా ఓసారి రండి ‘ పిల్చింది మా ఆవిడ

హాల్లో కూచుని టీ తాగుతూ టీవీ చూస్తున్న నేను , ‘ఏమైంది ?’ అన్నాను కదలకుండా

‘ఏమిటో చెబితే గానీ రారా ఏమిటి ?.. వెంటనే రండీ ‘ అంది

‘ఆ బాల్కనీలో కూచుని వీళ్ళనీ వాళ్ళనీ చూడకపోయేబదులు నువ్వే రావచ్చుగా ‘ అన్నాన్నేను (నేనెందుకు మెట్టు దిగాలి అనుకుంటూ )

‘సరే. మీ ఇష్టం. కార్తీక ఫేస్బుక్ లో కొత్త ఫోటో పెట్టింది.. చూస్తారేమోనని అడిగేను ‘ అంది

‘ఆ పిల్ల పెళ్ళైపోయి అమెరికాలో ఉంది. రోజుకో ఫోటో పెడుతుంది. ప్రతీదీ మనేమేమీ నోరెళ్ళబెట్టుకుని చూసెయ్యక్కర్లేదు. మనం కూడా పిల్లల దగ్గిరికి ఆర్నెల్లకోసారి వెళ్తూనే ఉంటాం కదా ‘ కసిరేను

‘ఈ ఫోటో మటుకూ నోరెళ్ళబెట్టుకుని చూడాల్సిన ఫోటోయే ‘ అంది , నా విసుగుని పట్టించుకోకుండా !

ఏవో జ్ఞాపకాలు కళ్ళముందు తిరుగుతున్నాయి !

కార్తీక, మాకెదురు అపార్ట్మెంటు బిల్డింగులో ఉండే అర్జునరావుగారి అమ్మాయి. పిల్లకి అందంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఇచ్చేడు దేవుడు.మా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళైపోయి అమెరికాకెళ్ళిపోయి సెటిలైపోడంతో , ఇక్కడ ఏ పిల్లల్ని చూసినా మా పిల్లలే గుర్తుకొస్తూంటారు . కార్తీకని చూసినప్పుడల్లా మా అమ్మాయే గుర్తుకొచ్చేది , దానికితోడు పిల్ల మంచి ర్యాంకు తెచ్చుకుని , హైదరాబాద్ ఐఐటీ లో సీటు తెచ్చుకునేసరికి , ఏదో మా అమ్మాయే సీటు తెచుకున్నంత సంతోషపడిపోయేము !

ఆ పిల్ల ఇంజినీరింగు మూడో ఏడాదిలో ఉన్నప్పుడనుకుంటాను , మా ఆవిడ చెప్పింది , ‘ఇందాక మన బాల్కనీలోంచి చూసేను. అర్జునరావుగారి ఫ్లాట్ లో నిఖిల్ ఉన్నాడు ‘

‘నిఖిల్ అంటే ? సినిమాల్లో వేసే కుర్రాడా ? ఆ కుర్రాడికి అర్జునరావు గారింట్లో ఏం పని ?’ అడిగేను

‘నన్నెప్పుడైనా మీరు పూర్తిగా చెప్పనిచ్చేరా?.. నిఖిల్ అంటే సినిమా ఏక్టర్ కాదు. రామశర్మ గారబ్బాయి ‘

‘పోన్లే. ఎవరో ఒకరి అబ్బాయి. వీళ్ళింటికొస్తే ఏమిటి నీకు ఇబ్బంది ?’ అన్నాను

‘నాకేం ఇబ్బంది లేదు.. నిన్ననే అర్జునరావు గారి పెళ్ళాం ” పెళ్ళికని మూడ్రోజులు ఊరెళ్తున్నాం. మా కార్తీని ఓ కంట కనిపెట్టండి ” అని నాతో చెప్పింది ‘ అంది మా ఆవిడ

‘ఆ కుర్రాడు కూడా ఇంజినీరింగ్ చదువుతున్నాడు కదా.. ఏదో పని మీద వచ్చేడేమో ‘ అన్నాను

‘అవునులెండి. ఆ పిల్లని ఆ కుర్రాడు ముద్దు పెట్టుకోడం కూడా పని కిందకే వస్తుందన్నమాట ‘ అని తను అనేసరికి, బాంబు పడ్డట్టు అదిరిపడ్డాను !

వెంటనే బాల్కనీ లోకెళ్ళి వాళ్ళ ఫ్లాట్ వేపు చూసేను. వాళ్ళ హాలు, కిచెన్ గదులు మా బాల్కనీ లోంచి స్పష్టంగా కనిపిస్తాయి.కార్తీక ఇల్లంతా పరిగెడుతూంటే , వెనక్కాలే పరిగెడుతూ, గట్టిగా హత్తుకున్నాడా నిఖిల్!

‘ప్రేమలో పడ్డారేమో ‘ అన్నాను

‘పడితే పడ్డారు. కానీ ఇంట్లోవాళ్ళు లేనప్పుడు ఇలా ఆ కుర్రాణ్ణి రానివ్వడమేంటండీ ?’ అంది

‘మరి ఇంట్లోవాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ముద్దులెట్టుకోడానికీ, హత్తుకోడానికీ ఒప్పుకోరుగా. అందుకే. అయినా, వాళ్ళు పెళ్లి చేసుకుందామనుకుంటున్నారేమో. ‘ అన్నాను

‘ఆఁ. అదొకటి తక్కువయ్యింది. ఇద్దరూ చదువుకుంటున్నారు. నయాపైసా సంపాదన లేదు. పైగా వేర్వేరు కులాలు ‘ అంది తను

‘ఈ రోజుల్లో కులాలెవరు పట్టించుకుంటున్నారే ?’ అన్నాను

‘ఈ రోజుల్లోనే కాదు. ఏ రోజులైనా , ఎన్ని రోజులైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళు పట్టించుకునేది కులాన్ని , డబ్బునే. కాబట్టి.మీరు నా మాటలు తేలిగ్గా తీసేయకుండా. వాళ్ళ ఇంట్లోవాళ్ళకి ఏం చెప్పాలో , ఎలా చెప్పాలో ఆలోచించండి ‘ అంది తను కోపంగా !

‘ఏముందీ. రామశర్మగారి భార్య శర్మిష్ట నీకు ఫ్రెండే కదా. ఆవిడతో నువ్వు మాట్లాడు. నాతో అర్జునరావు గారు క్లోజ్ గానే ఉంటారు కాబట్టి.నేను ఆయనతో మాటాడతాను ‘ అన్నాను

‘అంటే. ఇప్పుడు నేను శర్మిష్టకి ఫోన్ చెయ్యనా ?’ అడిగింది

‘ఇప్పుడు అర్జెంటుగా ఏమీ చెయ్యకు. సాయంత్రం కిందకి వాకింగ్ కి వెళ్తావు కదా. అప్పుడు మాట్లాడు ‘ అని నేనంటే సరేనంది తను

సాయంత్రం ఏడింటికి నేను యధాప్రకారం హాల్లో కూచుని టీవీ చూస్తూంటే , వాకింగ్ కి వెళ్లొచ్చిన మా ఆవిడని చూసి అడిగేను , ‘మాట్లాడేవా శర్మిష్ట గారితో ?’

‘ఉండండి. అంత ఆత్రుత పనికి రాదు.. ‘ అంటూ , ఫ్రిజ్ లోంచి నీళ్లు తీసుకుని తాగి, ఫానేసుకుని కూచుని చెప్పడం మొదలెట్టింది , ‘శర్మిష్టని కలిసేను. విషయం చెప్పేను. వాడెన్ని తిరుగుళ్ళు తిరిగితేనేం. మేం చెప్పిన పిల్లని చేసుకుంటే చాలు అందావిడ ‘

‘అదేమిటీ.ఆ చేసుకునేదేదో కార్తీకనే చేసుకోవచ్చు కదా ?’ అడిగేను

‘కార్తీక వాళ్ళు మా క్యాస్ట్ కాదు. పైగా వాళ్ళు నాన్ వెజ్ తింటారు.. రేప్పొద్దున ఆ పిల్లని చేసుకున్నామనుకో , వాళ్ళింటికెళ్తే , కొంచెం చికెన్ మంచూరియన్ తినండత్తయ్యా అంటేనో , అని డవుటడిగిందావిడ ‘ అంది తను

‘ఆవిడకి పిచ్చా ఏమిటి ? వీళ్ళు బ్రామ్మలని తెలిసిన తర్వాత ఏ కోడలైనా తగ్గట్టుగా మసలు కుంటుంది గానీ చికెన్ మంచురియా తినండత్తయ్యా , రొయ్యల ఇగురు మింగండత్తయ్యా అని బలవంతపెడుతుందా ఏమిటీ ?’ అన్నాను

‘అవన్నీ ఎలా ఉన్నా. కార్తీకని మటుకు నిఖిల్ కి ఇచ్చి చెయ్యరు అనే విషయం అర్ధమైంది కదా. మీరు అర్జునరావు గారొచ్చేక మాట్లాడండి ‘ అంది

సరే. ఆ అర్జునరావు ఊరినుంచొచ్చాక మాట్లాడమనుకున్నాను . ఈ లోపల మా బాల్కనీ లోంచి రోజూ కనిపిస్తున్న నిఖిల్, కార్తీక ల రొమాన్సు రిపోర్టులు ఎప్పటికప్పుడు మా ఆవిడ నాకు చెబుతూనే ఉంది .

ఆ ఆదివారం మార్నింగ్ వాక్ నుంచొస్తూంటే కనిపించిన అర్జునరావుని , మా అపార్టుమెంటు లాన్ లో కూచోబెట్టి , విషయం చెప్పేను నేను . షాకైపోయేడాయన .

‘నాకసలు ఆ నిఖిల్ అంటే అంత మంచి అభిప్రాయం లేదండీ. ఎవడూ దొరకనట్టు. మరీ ఆ వెధవతోనా. మీతోపాటు ఇంకా ఎంతమందికి తెలిసిపోయిందో ఈ విషయం. పైగా. దీనికి పెళ్లి కూడా కుదిర్చేను. మా బంధువుల్లోంచే వచ్చింది సంబంధం. అమెరికా లో ఉంటాడు కుర్రాడు’ అన్నాడాయన

‘మరి. ఈ పెళ్లి సంబంధం విషయం కార్తీకకి తెలుసా ?’ బాధగా అడిగేను

‘భలేవారే. ఎందుకు తెలీదు? ఇద్దరూ రోజూ స్కైప్ లో మాటాడుకుంటూనే ఉంటారు ‘ అని ఆయననేసరికి , ఉలిక్కిపడ్డాను .

ఇంటికొచ్చి , మా ఆవిడకి విషయం చెప్పేసరికి ,ఇంకేం మాటాడక అలా సోఫాలో కూలబడిపోయింది . కాస్సేపటికి తేరుకుని , ‘ఏమిటో ఈ కాలం పిల్లలు ‘ అంది

‘పిల్లలే కాదు. పెద్దలు కూడా ‘ అని శర్మిష్ట గారి మాటలు గుర్తు చేసేను .

కార్తీక ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోగానే , వాళ్ళ అమెరికా కజిన్ తో పెళ్లైపోయి, అమెరికా వెళ్ళిపోయింది .

జరిగిందంతా కళ్ళ ముందుకి జ్ఞాపకం రావడంతో , ఆలోచనల్లో ఉండిపోయేను..

‘వస్తున్నారా?’ అని బాల్కనీలోంచి మళ్ళీ అరిచింది మా ఆవిడ

ఇదిగో. ఈ మధ్య రిలయన్స్ జియో పుణ్యమా అని , మా ఆవిడకి మొబైల్ ఇంటర్నెట్ బాగా అలవాటయ్యి , బాల్కనీ లోంచి బయటకి చూడ్డం మానేసి , అదే బాల్కనీ లో కూచుని , ఫేస్బుక్ చూసుకుంటూంది !

‘అబ్బా. ఏమిటో అంత గొప్ప ఫోటో ? ఇదిగో వచ్చేను. చూపించు ‘ అని నేనంటే , తన ఫోన్లో ఫేస్బుక్ లో కార్తీక ఫోటో చూపించింది

‘మీటింగ్ మై స్వీట్ బ్రదర్ అండ్ హిస్ వైఫ్ ఆఫ్టర్ ఆ లాంగ్ టైం ‘ అని కాప్షన్ పెట్టి , తనూ , వాళ్ళాయన, నిఖిల్, వాళ్ళావిడతో కలిసి తీయించుకున్న ఫోటో ఉందక్కడ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *