June 19, 2024

కౌండిన్య హాస్యకథలు – కాసాబ్లాంకా

రచన:కౌండిన్య (రమేష్ కలవల)

ఆ కొత్తగా వచ్చిన మేనేజర్ గారి పేరు కాకరకాయల సారంగపాణి(కాసా) ఆయన మొహం చూడగానే బ్లాంక్ గా ఉండి హావభావాలు ఏమాత్రం తెలియవు. ఆయన చేరిన ఓ వారం రోజులకే ఆఫీసులో అందరి జీవితాలు కాకరకాయంత చేదుగా తయారయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదు.

సారంగపాణి బట్టతల పైన ఒకే ఒక్క జుట్టు ఉండి ఎడారిలో మొలిచిన ఒకే ఒక్క మొక్కలా ఉంటుంది. మరీ కొట్టొచ్చినట్లు కనిపించక పోయినా దగ్గరగా చూసిన వారికి మాత్రం చిరునవ్వు తెప్పించక మానదు.

ఆయన చేరిన దగ్గరనుండి ఆఫీసులో లేటుగా పనిచేయిస్తున్నందులకు ఒకరోజు ఒకాయన ఉండబట్టలేక “హెయిర్ కటింగ్ సెలూన్ మూసేస్తారు సార్.. మీకైతే దాని అవసరం లేకపోవచ్చు” అని నోరు కూడా జారాడు. ఆ రోజు రాత్రి పదింటి వరకూ పని చేయించాడు సారంగపాణి.

చూడటానికి మనిషి సన్నగా పుల్లలాగా ఉండి లోపల రెండు జతలు తొడుక్కుండాడని అందరి అనుమానం.

అప్పటి ఆ ఆఫీసులో మందకోడిగా సాగే పనులన్నీ ఆయన వచ్చిన తరువాత టంచనుగా అందరి ఒళ్ళు వొంచేలా చేయించడంతో, ఇక ఇలా కుదరదని ఆఫీసులో అందరూ కుమ్మకై ఆయనకున్న వీక్నెస్ ఏమిటో తెలుసుకొని, ఆయన ధోరణి మార్చేలా చేద్దామని ఓ సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. దాని కోడ్ వర్డ్ “కాసాబ్లాంకా”.

——

కూరగాయల మార్కెట్టు. సారంగపాణి, పక్కన ఒక ఆవిడ కూరలు కొంటూ సరదాగా మాట్లాడుకోవడం చూసి ఆయనకు తెలియకుండ ఫాలో చేస్తున్నారు కోటేశ్వరరావు, ఆపరేషన్ లీడర్ కామేశ్వరరావు.

సారంగపాణి, ఆవిడ ఒక షాపులోకి వెళ్ళబోతుంటే ముందుగా కూడబలుక్కొని సారంగపాణి కాలు వేసే చోట ఓ కిలో కుళ్ళిపోయిన టమాటోలు పోయడంతో ఆయన కాలు జారి కింద పడి మూర్చబోయారు.. ఆ పక్కన అదిరిపోయి చూస్తున్న ఆవితతో “మీ అన్నయ్య గారి లాగా ఉన్నారు” అన్నాడు కోటేశ్వరరావు.
“అయ్యో! ఆయన మా ఆయనండి. బ్రతికే ఉన్నాడంటారా?..” అంది ఆందోళన పడుతూ
“ఏం ఫర్వాలేదు..ఓ చెంబుడు నీళ్ళు పోయండి, ఆయనే లేస్తారు” అంటూ సలహా ఇచ్చి తుర్రున అక్కడినుండి పారిపాయారు . ఇద్దరికీ ఆ పక్కన ఉన్నఆవిడ భార్యేనని, ఆయన్ని బ్లాక్ మెయిల్ చేయటానికి కుదరదని నిర్ణయానికి వచ్చారు..

——

ఆఫీసు, ఉదయం పదకొండు కావొస్తోంది. సారంగపాణ ఇంటర్ కామ్ లో ఫోను చేసి కాత్యాయినిని ఆ ఫైలు పట్టుకురమ్మన్నారు. కాత్యాయిని ఆపరేషన్ లీడర్ దగ్గరకు పరిగెత్తింది.

కామేశ్వరరావు ఏం చేయాలో చెప్పాడు, తన జేబులోంచి రెండు వందలు తీసి ఇచ్చాడు. కాత్యాయిని కోటేశ్వరరావు దగ్గరకు ప్లాను చెప్పింది, అతను రెండు వందలు తీసి ఇచ్చాడు. ఆ పక్క డెస్కు రామారావు దగ్గర, ఎదురు రమావతి దగ్గర, ఈ పక్క కృష్ణారావు దగ్గరా తలో రెండు వందలు తీసుకొని ఆ ఫైలులో పెట్టి సారంగపాణి ఆఫీసులోకి నడిచింది.

నిశ్శబ్దం. బయట అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. కొంత సేపటికి ఢాం ఢూం అంటూ గట్టిగా చివాట్లు వినపడటంతో ఆపరేషన్ లీడర్ కామేశ్వరరావు లోపలకు పరుగెత్తాడు.

సారంగపాణి వైపు దీనంగా చూస్తున్న కాత్యాయినితో “ఆ చేతిలో ఫైలులో ఇందాక నువ్వు అమ్ముతానన్న టి వి తాలుకు డబ్బులు పెట్టాను, పొద్దున్నే బ్యాంకులో తెచ్చాను. నువ్వు చూసావొ లేదో” అన్నాడు.

“చెప్పాను కదండి సారంగపాణి గారు, ఏదో పొరపాటని ..ఇది లంచం కాదని. ఈ ఫైలులో డబ్బులు ఎలా వచ్చాయో తెలియదండి” అంది.

సారంగపాణి గొంతు సవరించి ఇక వెళ్ళ మని సైగలు చేసాడు. ఇద్దరూ బయటకు నడిచి ఆపరేషన్ ఫైయిల్ అంటూ సైగలు చేస్తూ “అమ్మో లంచాలకు లొంగే మనిషిలా కనిపించడం లేదు” అని గుసగుసలాడారు.

——

ఆ రోజు ఆఫీసులో చీకటిపడేంత వరకూ పని చేయించి అందరినీ ఇంటికి వెళ్ళమని చివరగా తను బయలుదేరాడు. ఆఫీసు బయటకు రాగానే ఎదురుగా ఒకతను నల్లగా, పొడుగ్గా, బలంగా నిగ నిగలాడే శరీరంతో తన ఒంటి చేత్తో పుల్లలా ఉన్న సారంగపాణి ని ఎడం చేత్తో పైకి ఎత్తాడు. ఆ ప్రక్కనే దగ్గరలో చీకట్లో దాక్కున్న అందరికీ ఆయన సంగతి ఇక ఇంతే అనుకున్నారు. దింపమని బ్రతిమలాడుతారు అనుకున్నారు.

ఒక్కసారిగా మార్షల్ ఆర్టు ఫోస్ పెట్టి అతని తలమీద బలంగా ఒక్కటి కొట్టారు. పట్టువదిలి క్రిందకు దించగానే రకరకాల కరాటే ఫోజులు పెట్టి అతన్ని ఓ నాలుగు పీకాడు, అంతే అతను నిమిషంలో చీకట్లో మాయమయ్యాడు.

చాటుగా ఉన్న అందరూ సారంగపాణితో పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చి ఎటు వాళ్ళు అటు జారుకున్నారు. ముచ్చటగా మూడో సారి కూడా ఆపరేషన్ ఫెయిల్ అని అంతా అనుకున్నారు.

మూడేంటి తరువాత ముప్పై సార్లు అలానే అన్ని ఫెయిల్యూర్లే. చివరకు ఆయనకు మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఆయనకు ప్రాణమైన తాపేశ్వరం కాజాలు రోజుకు తలో కిలో ఏదో సందర్భం చెప్పి ఇచ్చినా ఆయన మారనులేదు కదా ఆయన చెప్పిన పని మాత్రం చేయకపోతే ఇంకా చీకటి పడే వరకు కూర్చొబెట్టి మరీ పని చేయిస్తున్నారు..

——

ఆ రోజు సారంగపాణి అందరినీ మీటింగు కు పిలిచారు. మొదలు పెట్టే ముందు ఆయనకున్న ఆ ఒక్క జుట్టు సరిచేసుకొని “ఈ క్వార్టర్ లో గనుక మన ఆఫీసు బ్రాంచి టార్గెట్ రీచ్ అయితే గనుక మిమ్మల్ని ఓ విదేశానికి ట్రైనింగ్ కు పంపించే బాధ్యత నాది” అంటూ ఎనౌన్స్ చేసారు.

“ఇంతకీ ఏ కంట్రీ సార్”అని అడిగాడు కోటేశ్వరరావు.

“అది మాత్రం చెప్పను” అన్నారు.

“కష్టపడి చేస్తే నిజంగా పంపిస్తారా?” అని అడిగింది కాత్యాయిని.

“నేను మాట మీద నిలబడే మనిషిని” అన్నాడు.

“అయితే, వీళ్ళందరితో చేయించే బాధ్యత నాది సార్” అన్నాడు కామేశ్వరరావు.

సారంగపాణి అటు నడవగానే అందరూ కలిసి దీని ఆపరేషన్ “కష్టేఫలి” అని పేరు పెట్టారు.

ఆ రోజు సాయంత్రం పదకొండింట వరకూ పనిచేసి ఇంకా చేస్తానంటూ కూర్చున్న రామారావును లాక్కొని తీసుకెళ్ళాల్సి వచ్చింది.

ఒక రామారావు ఏంటి… కాత్యాయిని, రమావతి, కృష్ణారావు, కోటేశ్వరరావు అలసట లేకుండా పనిచేసి మూడు నెలలో ఉన్న పనంతా అవ్వగొట్టటమే కాకుండా ఆఫీసులో మిగిలి పాత పనులన్నీ కానించేసారు.

అది గమనించిన సారంగపాణి సహృదయంతో ఇంకా పెళ్ళి కాని రామారావును పిల్లని చూసుకొని రమ్మని ఓ రెండు వారాలు, త్వరలో రిటైర్ అవుతున్న రమావతికు పెన్షన్ ఆఫీసులో పనులు చూసుకోమని, కోటేశ్వరరావుకు వాళ్ళడివిడ ఒంట్లో బాలేదని కూరగాయలు మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని తీసుకెళ్ళమని లాంటివి, పైగా వచ్చే ఏడాది ఎలాంటి పనులు చేయాలో ఖాళీగా ఉన్న కామేశ్వరరావు గారితో చర్చించిడం లాంటివి చేసారు.

—-
డెడ్లైన్ పూర్తయిన రోజు. సారంగపాణి అందరినీ మీటింగుకు పిలిచారు. గొంతు సవరించుకొని “మీరు గమనించారో లేదో.. ఈ రోజు హెయిర్ కట్ చేయించుకున్నాను” అన్నారు. ఫక్కున నవ్వబోయి కోటేశ్వరరావు నోరు నొక్కేసుకున్నాడు.

“ఈ విషయం పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే..” అంటూ “నేను చేరి సరిగ్గా సంవత్సం అయ్యింది. ముందుగా మీరు పని ముభావంగా చేసినా , తరువాత చక్కటి పనితీరు ప్రదర్శించి మన టార్గెట్ ముందుగా రీచ్ చేసారు”. అందరూ చప్పట్లు కొట్టారు. అందరి పనితనాన్ని కొనియాడి చివరగా తన జేబులోంచి టికెట్లు తీస్తూ “ ఇవి కొబ్బర్లంక టికెట్ ” అన్నారు.

నిశ్శబ్ధం. ఇంతలో కామేశ్వరరావు “ఇది అన్యాయం. కష్ట పడి పనిచేస్తే అందరినీ విదేశాలకు తీసుకెడతాను అన్నారు” అన్నాడు.

“అందరం ఓ నెల ముందరే పని పూర్తి చేసాం సార్” అంది కాత్యాయిని.

సారంగపాణి ఏమి మాట్లాడకుండా మీటింగు ముగిసినట్లుగా సైగలు చేసి బయలుదేరబోయాడు.

అందరూ నిరుత్సాహ పడుతూ, కృంగిన భుజాలతో చూస్తుండగా వెనక్కు తిరిగి “ఆ టికెట్లు నాకోసం” అన్నాడు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

“ఇంతకీ మమల్ని ఎక్కడకు పంపుతున్నారు సార్..” అని అడిగారు ముక్తకంఠంతో.

“ఆఫ్రికాలోని మొరాకో” అన్నాడు

“ఆ దేశంలో ఏ ఊరు?” అవి అడిగాడు కోటేశ్వరరావు ఆత్రుతతో.

“కాసాబ్లాంకా” అని జవాబు ఇచ్చాడు. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.

“ఆ ఊరు ఎవరైనా విన్నారా?” అంటూ ప్రశ్నించాడు.

“పక్కనున్న కొబ్బర్లంక గురించే సరిగా తెలీదు, ఇక ఎక్కడో మొరాకో లోఉన్న కాసాబ్లాంకా గురించి మాకు ఎలా తెలుస్తుందిలేండి సారంగపాణి గారు” అన్నారు.

——

శుభం భూయాత్!

1 thought on “కౌండిన్య హాస్యకథలు – కాసాబ్లాంకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *