April 24, 2024

తేనెలొలుకు తెలుగు – పర్యాయ పదాలు, నానార్థాలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

గత నెల తెలుగుభాషలో ఆమ్రేడితాల గురించి చర్చించుకున్నాం. ఒక భాష సుసంపన్నం, సుందరంగా రూపొందాలంటే అనేక విషయాలు పాటించాలి. భాషా సౌందర్యం మనం వాడే పదాల ఎంపికతో ఇనుమ డిస్తుంది. దానికి భాషలోని అనేక పదాలమీద అవగాహన, సాధికారికత ఉండాలి. అవసరమైనప్పుడు, ఎక్కువ విశదంగా చెప్పటం, అవసరంలేనప్పుడు సంక్షిప్తంగా చెప్పటం ఆవశ్యకం. సాధ్యమైనంతవరకు భావం పునః ప్రస్తావన రాకుండా, పదాలు పునరుక్తి కాకుండా, శబ్దాలంకారము, యతి ప్రాసలు మొదలైనవాటి మీద దృష్టి ఉంటే ఆ రచన చదివాలనిపిస్తుంది. ఎంత ఆకలి లేని వారికైనా బాగా రుచికరమైన పదార్థం నోటికి తగిలితే తినాలనే కోరిక కలుగుతుంది. మాట ఇంపు రావాలంటే పునరుక్తులు లేకుండా ఉండటం కూడా పరిగణనీయ మైన అంశమే.
పునరుక్తి ఎప్పుడు సంభవిస్తుంది?. ఒకే విషయం అనేకసార్లు చెప్పాల్సి వచ్చినపుడు. అంటే ఒక నది గురించో, ఒక ప్రదేశం గురించో, ఒక వ్యక్తి గురించో చెప్పాల్సి వచ్చినపుడు, సర్వనామం కొంత పునరుక్తిని తగ్గిస్తుంది. కాని అదే పనిగా సర్వనామం వాడినా చదువరికి విసుగు పుడుతుంది. అలా విసుగు కలుగకుండా ఉండాలంటే పర్యాయ పదాలు వాడాలి. మరి పర్యాయ పదం అంటే ఏమిటి? పర్యాయపదమంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదం బదులుగా వాడబడే పదం. ఉదాహరణకు ‘ఇల్లు’ అనే పదం ఉంది. ఇల్లు అనే పదానికి పర్యాయంగా, గృహము, నివాసము, వాసము, గేహము మొదలైనవి ఉన్నాయి. అలాగే సూర్యుడు అనే పదానికి కొన్ని తెలిసిన పర్యాయ పదాలు చూస్తే రవి, అర్కుడు, భానుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, మిత్రుడు
మార్తాండుడు వంటివి చాలా ఉన్నాయి.
అలాగే రాజు అనే పదానికి ప్రభువు, నృపతి, భూపతి, ఏలిక, నరపతి, మహీపతి, క్ష్మాపాలుడు, క్షితిపతి, ధరణీపతిఇలా చాలా ఉంటాయి. ఇంకా భూమికి, ఆకాశానికి సముద్రానికి, పర్వతానికి, అగ్నికి, గాలికి, నీటికి, ఆవుకు, అమ్మకు, నాన్నకు, కొడుకుకు, కూతురుకు, తిండి. పదార్థాలకు, జలచరాలకు, పాముకు, కప్పకు, ఇలా అనేక విషయాలకు పర్యాయపదాలు ఉంటాయి. ముఖ్యంగా పద్యరచన చేసేవారికి పర్యాయ పదాల అవసరం ఎక్కువ. గణాలలో భావానికి సరిపడిన పదం వెయ్యాల్సి ఉంటుంది. సంస్కృతంలో నామలింగాను శాసనం లేదా అమరకోశం అని పర్యాయ పద నిఘంటువు ఇప్పటికీ ఎంతో ప్రాచు ర్యంలో ఉంది. తెలుగులో కూడా పద్యరూ పకంగా కొన్ని, నిఘంటు రూపంలో కొన్ని పర్యాయ పదాల సంకలనాలు ఉన్నాయి.
ఇక పర్యాయ పదవినియోగానికి వస్తే
ఈ పద్యం చూడండి. ఆంధ్ర మహాభారతం విరాట పర్వంలో ఉత్తరగోగ్రహణ సందర్భం. కౌరవుల పన్నాగంతో విరటుని కొల్వున రాజాంతఃపురస్త్రీలు మాత్రమే ఉన్నారు.
యువరాజు ఉత్తరుడు బృహన్నల రూపంలో అర్జునుడు ఉన్నప్పుడు కౌరవసేన అజ్ఞాతంలో ఉన్న పాండవులను కనుగొనాలని కురుముఖ్యులందరూ ఉత్తర గోగ్రహణానికి వచ్చారు . ప్రగల్భాలు పలికే ఉత్తరుణ్ని తీసుకుని అర్జునుడు బయలుదేరుతుంటే విరాటరాజు పుత్రిక ఉత్తర కౌరవవీరుల తలపాగాల కుచ్చులు తెమ్మని సోదరుడు ఉత్తరునికి చెబుతుంది. ఓస్ అదెంత పని అన్న ఉత్తరుడు తీరా రణరంగం దరికి చేరేసరికి బెంబేలెత్తుతాడు. గడగడవణుకుతున్న ఉత్తరునికి ధైర్యం చెప్పి సమ్మోహనాస్త్రం ప్రయోగించగానే కౌరవ సేనంతా మూర్ఛలోకి పోతారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుణ్ని వెళ్లి తలపాగాల కుచ్చులు తన చెల్లెలుకోసం తెచ్చుకొమ్మని పంపిస్తూ కౌరవముఖ్యులు ఎవరెవర్ని ఎలా గుర్తు పట్టాలో తెలిపే పద్యం ఇది.

సీ. కాంచనమయవేదికాకనోత్కేతనోజ్వల
విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగ కేతు
ప్రేంఖణమువాడు ద్రోణ సుతుడు
కనకనోవృషసాంద్రకాంతి పరిస్ఫుట
ధ్వజసముల్లాసంబువాడు కృపుడు
లలితకంబు ప్రభాకలిత పతాకావిహా
రంబు వాడు రాధాత్మజుండు
గీ. మణిమయోరగ రుచిజాల మహితమైన
పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘన
శిఖరతాళ తరువగు సిడమువాడు
సురనదీ సూనుడేర్పడ జూచికొనుము

ఈ పద్యంలో కౌరవవీరుల రథాల పైన ఎగురుతున్న జండాలను చూపిస్తూ ఒక్కొక్క వీరుణ్ని పరిచయం చేయడం రసరమ్యంగా ఉంది. పద్యంలో కేతనము, ప్రేంఖణము, ధ్వజము, పతాకము, పడగ, సిడము అనే పర్యాయపదాలతో అందమైన పద్యం రూపొందింది.
ఇది పర్యాయ పదావినియోగానికి ఒక మచ్చు తునక మాత్రమే. పర్యాయపద దృష్టితో కావ్యాలు పఠిస్తే పర్యాయ పద సౌందర్యం కనుపిస్తుంది.
అలాగే నానార్థాలు కూడా అంతే. ఇవి ఒక రకంగా పర్యాయ పదానికి విపర్యయం లాంటివి. అక్కడ వస్తువును సూచించే అనేక పదాలయితే, ఇక్కడ ఒకే పదం సూచించే అనేక అర్థాలు. పదం ఒకటే ఉండి అనేక అర్థాలున్న పదాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పదాలకున్న అనేక అర్థాలను నానార్థాలు అంటారు.
ఒక వాక్యం చూద్దాం. ఉదా: చచ్చిన తేలు నీటిపై తేలుతుంది.
ఇక్కడ తేలు కీటకాన్ని సూచించే నామవాచకంగానూ, తేలుట అనే క్రియా పదంగానూ వాడబడింది. నానార్థాలు కలిగిన పదాలు కను-చూచు, ప్రసవించు, రుచి-చవి(పదార్థగుణం నాలుకతో గ్రహించేది), కాంతి, కాలు-శరీరావయం, కాలుట అగ్ని సంబంధమైనది, కాలుడు (ఉదా:కాలుని దున్నపోతు చిరుగంటలమ్రోతకుగాక సంధివాక్యాలకు వీనులొగ్గుదురటయ్య-విజయశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి) అంటే యమధర్మ రాజుకూడా. ఇలా నానార్థాలతో అందమైన పాటలు రాసిన సినీ కవులున్నారు.
అచ్చెరువున అచ్చెరువున అనే పాటలో ఆశ్చర్యంతో ఆ చెరువులోని అనే అర్థంతో భావించి వినగానే ఆనందం కలుగుతుంది.
అలాగే మరో పాట ‘శివశివ శంకర’(భక్త కన్నప్ప) లో ‘మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీసేవకు’ అంటాడు కవి. ఇది కృతక పదమే అయినా మారేడు అంటే ఒక అర్థం మా రాజువనీ, మరో అర్థం శివునికిష్టమయిన మారేడు దళాలనీ తీసుకుంటే కలిగే హాయి అనిర్వచనీయం. నానార్థ పద నిఘంటువులు కూడా ఉన్నాయి.
తిరువేంగళనాథుడనే ఆయన పద్యాలలో నానార్థ నిఘంటువు తయారు చేశాడు. అందులో ఒక పద్యం చూడండి.
కం. కచమన కొప్పును బాహువు
కచమనగా ముఖము ముక్కు కౌనును నడుమున్
కచమన పాపెట బొట్టును
కచమన రాకిణియు బొట్టు గణుతింపదగున్

ఇలా భాషలోని సర్వాంగాలను పరిశీలిస్తూ ప్రసిద్ధ కవులు రచయితల ప్రయోగాలను పరికిస్తే పర్యాయపదాలు, నానార్థాల సొబగు తెలుస్తుంది.

2 thoughts on “తేనెలొలుకు తెలుగు – పర్యాయ పదాలు, నానార్థాలు

  1. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి బిరుదు “కరుణశ్రీ”
    విజయశ్రీ కాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *