April 20, 2024

నవరసాలు..నవకథలు.. అద్భుతం 9

రచనః శ్రీమతి నండూరి సుందరీ నాగమణి.

నదీ సుందరి నర్మద

ఆకాశంలో ఇంద్రధనువును చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నర్మదను చూసినా అంతే నాకు. పూలలోని మకరందాన్ని, ఆకాశంలోని అనంతాన్ని, కడలిలోని గాంభీర్యాన్ని, హిమవన్నగాల ఔన్నత్యాన్ని, సంగీతంలోని మాధుర్యాన్ని, సూరీడి వెచ్చదనాన్ని, జాబిల్లి చల్లదనాన్ని, మల్లెపూవుల సౌరభాన్ని కలిపి రంగరించి నర్మదను తయారుచేసాడేమో ఆ బ్రహ్మ! అదీ నా కోసం. ఆమె ఎప్పుడూ అద్భుతమే మరి నాకు!

***

నేను వేదిక మీద పాడినపుడు పరిచయమైంది నర్మద. స్థానిక సంగీత కళాశాలలో వేణుగాన అధ్యాపకుడిగా పనిచేసే నేను వేణుగానమే కాకుండా, నా గొంతుతో కూడా పాడతాను. ఒక సంగీత కార్యక్రమంలో నేను అన్నమాచార్య కీర్తనలను ఆలపించినపుడు, ఆ కచేరి అయిపోగానే దగ్గరకు వచ్చి ప్రశంసించిన నర్మద నాకు అత్యంత దగ్గరి స్నేహితురాలిలా అనిపించింది. మా పరిచయం కొనసాగి, క్రమేపీ అది స్నేహంగా పరిమళించింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగి ఐన నర్మద, నేను ప్రతీ ఆదివారం ఏదో ఒక సంగీత సభలో కలిసేవాళ్ళము.

ఎక్కువగా మా సంభాషణలు సంగీతం మీదనే సాగేవి. ఆమె పాడకపోయినా, పాటల సాహిత్యం మీద మక్కువ ఎక్కువ అయినది కావటం వలన నేను పాడే కీర్తనల సాహిత్యాన్ని విడమరచి చెప్పేది. ఒక సారి పత్రికా విలేఖరి అయిన తన స్నేహితురాలిని పిలిపించి, నా ఇంటర్వ్యూ వేయించింది ఆ పత్రికలో. దానితో నాకెంతో మంచి పేరు రాసాగింది. నాకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అయ్యాయి.

ఆ దశలోనే ఒక సలహా ఇచ్చింది నర్మద. నన్ను చిత్రగీతాలు ఆలపించమని. సాధారణంగా శాస్త్రీయ సంగీతం పాడే వారికి, బోధించేవారికి, చిత్రగీతాలు రుచించవు. కారణం సంగీత రాగాలను కలిపేసి, అన్య స్వరాలను వేసేసి లేదా వక్రసంచారం చేయించి పాటల్లో వాడేస్తారన్న ఒక భావన.

మా గురువు గారు కూడా సంగీతం నేర్పే ముందావిషయమే చెప్పి, చిత్రగీతాలను పాడితే అసలైన సంగీతం రాదని చెప్పారు. కేవలం నర్మద మాట తీసెయ్యలేక నేను పాత హిందీ, తెలుగు చిత్రగీతాలను వినటం మొదలుపెట్టాను.

***

నాకింతవరకూ తెలియని ఒక గొప్ప ప్రపంచం నాకు పరిచయమైంది. ఆహా ఎన్ని గీతాలని? హిందీ చిత్రగీతాలలోని మాధుర్యాన్ని వర్ణించే మాటలే నాకు దొరకలేదు.

కె యల్ సైగల్, ముఖేష్, మహమ్మద్ రఫీ, మహేందర్ కపూర్, మన్నాడే, కిషోర్ కుమార్ గండుకోయిలలైతే, లతా, ఉషా, ఆషా సోదరీమణులు, అనూరాధా పౌడ్వాల్, సాధనా సర్గం, అల్కా యాగ్నిక్, సురయ్యా వంటి మత్తకోకిలలు…

జేసుదాస్ వంటి కారణజన్ముడు అటు శాస్త్రీయ సంగీతమే కాకుండా ఇటు హిందీ రంగం లోనూ, అటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర సంగీత రంగాల లోనూ సంగీతామృత మథనం సలుపుతున్న గొప్ప గాయకుడు.

ఇక మన మాతృభాష అయిన తెలుగు పాటల తీయదనం తీరేవేరు. చక్కని చిక్కని సాహిత్యానికి అంతకన్నా మక్కువైన బాణీలు కట్టిన స్వరసారధులు ఎంత మందో…

తన గళమంటేనే మాధుర్యానికి మారుపేరని ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, మధురిమ, చిలిపిదనం, ప్రణయవల్లరి కలబోతతో తొలినాటి పాటలతో మనసు దోచిన బాలసుబ్రహ్మణ్యం గారు, తీపిరాగాలను పంచిన పీబీ శ్రీనివాస్ గారు, మెత్తని గొంతుతో పాడిన ఎ యం రాజా గారు, మెలొడీతో ప్రాణం తీసేసే జేసుదాస్ గారు, రామకృష్ణ, ఆనంద్ ఎంత మంది గాయకులనీ…

అలాగే వనితామణులలో లీల, సుశీల, యస్ వరలక్ష్మి, రావు బాలసరస్వతి, వసంత, యల్లార్ ఈశ్వరి, యస్ జానకి, వాణీజయరామ్… ఆ తర్వాతి తరం లో చిత్ర, ఉష, గోపికాపూర్ణిమ, సునీత ఇంకా ఎంతమంది గాయనీమణులు?

ఆ పాటలు వింటూ ఉంటే, ఆ వాద్యసహకార సమ్మేళన అందలాలలో ఊరేగే పదాల వధువుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇక వేరే ప్రపంచమే వద్దని అనిపిస్తూ ఉండేది.

అలా ఒక మూడు నెలలపాటు నిర్విరామంగా చిత్ర సంగీతం విన్నాను. వింటున్న కొద్దీ కొత్త విషయాలు తెలిసేవి.

నిజానికి శాస్త్రీయ సంగీతాన్ని చిత్రరంగం ఉపయోగించుకున్నట్టు, విశ్వవ్యాప్తం చేసినట్టు మరే మీడియా చేసి ఉండదేమో…

అద్భుతమైన దర్బారీ కానడ రాగాన్ని ‘శివశంకరీ’ పాట ద్వారా అందరికీ తెలిసేట్టు చేసిన పెండ్యాల వారి, ఘంటసాల వారి కృషిని ఎలా విస్మరించగలము?

ఆనందభైరవి, హంసానందిని, వసంత, వలజి, కళ్యాణి, అమృత వర్షిణి, చక్రవాకం, శంకరాభరణం, కానడ, సింధుభైరవి… ఎన్నెన్ని రాగాలని? ఎన్నెన్ని గీతాలని? ఇక హిందోళ, మోహనాలయితే ఎన్ని గీతాలలోనో మోహనాలే… సమ్మోహనాలే…

చిత్రగీతాలను నేర్చుకుని పాడాలన్న అభిలాష కలిగింది నాకు. లిరిక్స్ కావాలంటే ఏ పాట కావాలన్నా క్షణంలో సరఫరా చేసేది నర్మద. కొన్ని మంచి హిందీ, తెలుగు చిత్రగీతాలు నేర్చుకున్నాను.

ప్రతీరోజూ చేసే శాస్త్రీయ సంగీత సాధనతో పాటుగా ఈ గీతాల గాన సాధననూ కొనసాగిస్తూ ఉండేవాడిని. వేణువు మీద ఇళయరాజా గారి చిత్రగీతాల ఇంటర్ ల్యూడ్స్ ని వాయించేవాడిని. ముఖ్యంగా ‘సాగరసంగమం’ చిత్రంలోని ‘మౌనమేలనోయి’ పాటకు ముందు వచ్చే వేణువు బిట్ ని వాయిస్తూ ఉంటే ఆ సమ్మోహన మాధుర్యానికి ప్రాణం పోయినంత పనయ్యేది… రససిద్ధి కలిగి కళ్ళలోంచి కన్నీరు పొంగి వచ్చేది. ఇంత అద్భుతమైన మాధుర్యాన్ని పరిచయించిన నర్మద ఋణాన్ని ఎలా తీర్చుకోగలను?

అప్పుడప్పుడూ వేదికల మీద చిత్రగీతాలను పాడటం లేదా వాటికి ఫ్లూట్ బిట్స్ అందించటంలాంటివి నర్మద స్నేహితుల ద్వారా సాధ్యమైంది. అందరూ అందించే ప్రశంసలు నా బలాన్ని పెంచేవి.

***

అమ్మానాన్నలు నా పెళ్ళికి వత్తిడి చేయసాగారు. కొన్ని కారణాల వలన నేను పెళ్ళి చేసుకోదలచుకోలేదు. నా తమ్ముడికీ, చెల్లెలికీ మంచిచదువులు చదివించి పెళ్ళిళ్ళు చేయాలన్నదే నా సంకల్పం. నా సంగీత విద్యను బోధించటం ద్వారానే దానికి సార్థకత కలిగించాలన్నది నా ధ్యేయమైనది.

ఒక ఆదివారం నర్మద మా యింటికి వచ్చినపుడు ఈ ప్రసక్తి వచ్చింది. నర్మద అప్పటికే మా అమ్మానాన్నలకు ఎంతో దగ్గరైంది. తమ్ముడు మురళీ, చెల్లెలు హరిణీ కూడా ఎంతో చనువుగా ఉండేవారు తన దగ్గర.

అమ్మ నా పెళ్ళి ప్రసక్తి తేగానే నా ముఖంలో చిరాకు ప్రదర్శితమైంది. అసలే నాకిష్టం లేని టాపిక్, పైగా నర్మద ఇంటికి వచ్చినపుడు… కోపంగా అమ్మ వైపు చూసాను.

“అయ్యో, ఎందుకంత కోపం? అమ్మ మాత్రం ఏమడిగారని? ఏ వయసుకా ముచ్చట కదండీ? మీరు ఒకింటి వారైతే చూడాలని పెద్దవారి ఆశ…” అంది నర్మద నచ్చజెబుతున్నట్టుగా.

“చాల్లెండి… ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ… అవసరం లేదు… నన్నిలా ఉండనీయండి…” అని లేచి వడివడిగా నా గదిలోకి వెళ్ళిపోయాను.

ఎందుకో చాలా నిస్సహాయంగా అనిపించింది. నర్మద నా మనసంతా నిండి ఉంది. అలా అని ఆమెను అడగలేను, నా ప్రేమను వ్యక్తమూ చేయలేను. ఒక వేళ తాను కాదంటే ఈ స్నేహం కూడా మిగలదు మా మధ్య!

ఎప్పటికీ నేనందుకోలేని అందమైన తీరమే నర్మద…

***

మర్నాడు ఉదయం ఐదు గంటలకల్లా లేచి స్నానాదులు పూర్తి చేసుకుని, డాబా మీద కూర్చుని నా సంగీత సాధన మొదలుపెట్టాను. ఎప్పట్లాగానే ఒక ఐదు కీర్తనలు పాడుకున్నాక, వేణువు తీసి వాయించసాగాను.

నాకు తెలియకుండానే నా మురళి నుంచి ‘రా…రా… రాగమై, నా… నా… నాదమై’ అనే పాట వెలువడింది. నర్మదను తలచుకుంటూ నాదాన్ని నాభి నుంచి ఊదుతూ మురళిలో పలికిస్తూ ఉంటే మనోదేహాల అణువణువూ జలదరింపుతో ఒక్కసారిగా వణికింది.

తాదాత్మ్యతను మించినదేదో నన్ను ఆవహించగా పాట వాయించటం పూర్తికాగానే సొమ్మసిల్లిపోయినట్టు అయిపోయాను.

పది నిమిషాల పైగా అలాగే మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్టు ఉండిపోయిన నేను నా మొబైల్ రింగ్ అవుతుంటే చేయి చాచి దాన్ని అందుకున్నాను.

“హలో నేను నర్మదను మాట్లాడుతున్నాను…” నాగస్వరం విన్నట్టే అయింది నా మనసు.

అవతలినుంచి ఆమె చెబుతున్నది వింటుంటే నా కళ్ళలోంచి ధారలుగా కన్నీరు కాల్వలు కట్టింది. ఆనందవిషాదాల సమ్మేళనమే నా అశ్రుధార.

***

నా జీవితంలో నాకు అయాచితంగా లభించిన వరాలు రెండు. ఒకటి సంగీతం, మరొకటి నర్మద.

మరి? నర్మద తనంతట తాను నన్ను ప్రేమిస్తున్నాననీ, ఇద్దరం వివాహం చేసుకుందామని ఆ రోజు నాకు ఫోన్ లో చెప్పకుండా ఉండి ఉంటే నా జీవితంలో ఇంత మాధుర్యం నిండేదా?

నా ప్రతీ అడుగునూ నర్మదతో కలిసి నడుస్తూ, జీవితంలో ఎన్నెన్నో వసంతాలను వసంతమయం చేసుకున్నాను. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, వారిని చక్కని సంగీత రత్నాలుగా తీర్చి దిద్దాము.

నా ప్రతీ అవసరాన్ని ఎంతో ప్రేమగా తీరుస్తూ, అవసరమైన విషయాలలో చక్కని సలహాలను అందిస్తూ, ఆకటివేళల ఆహారాన్ని తినిపించి, పడకగదిలో తనను తాను ప్రేమతో అర్పించుకుని, నా కోపాన్ని, ఉక్రోషాన్ని, తొందరపాటును భరిస్తూ, ఎప్పటికప్పుడు ప్రేమతో క్షమిస్తూ నా జీవితాకాశంలో ఎన్నటికీ అస్తమించని పూర్ణ చంద్రబింబమయింది నా నర్మద.

అసలు స్త్రీ అంటేనే అంతే కదా… మనల్ని ఏ వయసులోనైనా అక్కున చేర్చుకునే అద్భుతమైన అమ్మ ఆమె. అందులోనూ నా నర్మద నాకు మరింత ప్రత్యేకం.

***

ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. మా పెళ్ళి అయి అప్పుడే ముప్పై వసంతాలైపోయాయి.

మా తొలి వివాహ వార్షికోత్సవం హైదరాబాదులో కాకుండా ఎక్కడైనా జరుపుకుందామని నర్మద అన్నప్పుడు, ఎక్కడకు తీసుకువెళ్ళాలో స్థల నిర్ణయాన్ని కూడా ఆమెకే వదిలిపెట్టాను.

అప్పుడే తొలిసారిగా ఇక్కడికి వచ్చాము. టూరిజం ఆట్టే డెవలప్ అవలేదీ ప్రాంతంలో అప్పటికి.

పాపి కొండల మధ్యలోని ఒక రిసార్ట్ ఇది. చుట్టూరా నీలిరంగులో ఉన్న కొండలు. చల్లగా మెల్లగా పారే గోదావరీ నదీమతల్లి. ఒడ్డున ఉన్న కుటీరంలో మేమిద్దరం. పున్నమికి ముందు రోజు వచ్చాము. అక్కడ పూర్తిగా ప్రకృతి, మేము మాత్రమే ఉన్నాము. ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆ అందాలను ఆస్వాదిస్తూ, సంగీతాలాపన చేస్తుంటే రోజులు గంటలుగా, గంటలు క్షణాలుగా కరిగిపోతున్నాయి.

చక్కని చల్లని వెన్నెల రాత్రి, ఎదురుగా గోదారి, అందులో మెల్లగా పయనించే రాదారి పడవలు, పైనుంచి తెల్లని మంచు ధారలాగా పరిమళించే వెన్నెల… ఆ వెన్నెల కిరణాల స్పర్శతో మరింతగా మెరిసే గోదావరి… ఎంత సేపు అక్కడ ఉన్నా, ఎంత సేపు ఆ మాధురిని ఆస్వాదించినా తనివి తీరనంత అందం…

నర్మద అభిరుచిని, ఎంపికను అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ నది ఒడ్డున ఒకరితో ఒకరుగా ఎన్నెన్నో చెప్పుకుంటూ, పాడుకుంటూ, ఒకరిలో ఒకరుగా ఒదిగిపోయాము.

ఆనాటి మధురస్మృతులను మరల మరల మననం చేసుకోవటానికి పదవ వార్షికోత్సవం, ఇరవయ్యవ వార్షికోత్సవం కూడా ఇక్కడే జరుపుకున్నాము. పున్నమిరోజులలోనే వచ్చేలా ప్లాన్ చేసుకుని…

అయితే రజతోత్సవానికి నర్మద పదవీవిరమణ ఉత్సవం జరగటం వలన రావటానికి వీలు కుదరలేదు. మళ్ళీ అయిదేళ్ళ తరువాత, ఇదిగో… ఇప్పటికి కుదిరింది.

“చూడు నర్మదా… ఎంత చల్లగా ఉందో ఈ రాత్రి… ఆరోజులాగానే ఆకాశంలో మబ్బులు లేవు… చంద్రుడు మాత్రమే… సుధాకరుడు కదా, అమృతాన్ని కడుపునిండా తాగేసాడేమో దాన్ని మెల్లగా మనమీద వర్షిస్తున్నాడు… అదిగో చూడు అప్పటిలాగానే ఆ చిన్ననావలో దీపం చూడు… ఇప్పుడే వండుకుని తిన్నట్టున్నారు ఆ దంపతులు… అరె, ఆ నది మీద చూడు, వెన్నెల అలలు ఎలా కదులుతున్నాయో…” నర్మద చేయి పట్టుకుని మాట్లాడుతూనే ఉన్నాను ఆగకుండా, ఆపకుండా…

***

“పంతులు గోరూ… పంతులు గోరూ…” ఎవరో భుజమ్మీద తట్టినట్టయింది. ఉలిక్కిపడి “ఎవరదీ?” అన్నాను అప్రయత్నంగా…

“నాను అప్పలకొండనండే… కాటేజీ వోచ్ మేన్ని. ఏటిదీ, ఇంత దూరం ఒక్కరూ వొచ్చేసీ, మీలో మీరే ఏటేటో మాటాడేసుకుంతన్నారూ? అసలే మీకు కళ్ళునేవు… సూపు ఆపడదు… మీకు తెలవకుండానే నది దగ్గరసా ఎల్లిపోతన్నారు… రాండి కాటేజీకి ఎలిపోదాం. అర్దరేత్రి అవుతున్నాది. మీ అబ్బాయిగోరు తెల్లారీసరికొచ్చేత్తామని నాకు పోను సేసారు. రండి మరి…” అని లేవదీసి నడిపించసాగాడు.

“చూసావా నర్మదా… వీళ్ళంతా నువ్వు లేవని అంటున్నారు… నిజం చెప్పు నువ్వే కదా నన్నిక్కడికి తీసుకువచ్చింది? లేకపోతే నేను ఒక్కడినీ ఎలా రాగలుగుతాను? ఈ అందాలన్నీ నువ్వు లేకుండా ఎలా చూడగలనూ? ఎప్పుడూ నా పక్కనే ఉంటూ, నన్ను నడిపిస్తూ, నాకు నీ కళ్ళతో చూపించే ప్రపంచాన్ని ఇప్పుడూ చూస్తున్నానంటే నాలో నిండి ఉన్న నువ్వే కదా నన్ను నడిపిస్తున్నావు? ఈ మామూలు మనుషులకు అర్థం కాదు… మన అలౌకిక బంధపు విలువేమిటో ఎంత వివరించినా అవగతం కాదు.

నువ్వు భౌతికంగా నాకు దూరమయ్యావు కానీ నాలోనే లీనమై ఉన్నావని ఈ అమాయకులకు ఎలా చెప్పేది? నా పేరు సాగర్ కదా… నర్మద విలీనమయ్యేది ఈ సాగరుడిలోనే అని ఎప్పటికి తెలుస్తుందో ఈ ప్రపంచానికి!

అన్నట్టు… కొత్తగా నేను కనుక్కున్న రాగానికి నీ పేరు పెట్టాను కదా… ఆ రాగాలాపన సీడీ లాంచింగ్ ఎల్లుండే… అందుకనే నన్ను తీసుకువెళ్ళటానికి నీ కొడుకు తెల్లారకుండానే వచ్చేస్తున్నాడు… మరి వెళ్ళి పడుకుందామే, చాలా రాత్రి అయింది కదా… ఈసారి ఇంకా ఎక్కువ రోజులుందాం లే…”

“అయ్యో అయ్యోరూ మల్లీ మీలో మీరే మాటాడేసుకుంతన్నారూ… రాండి, కాటేజీ వొచ్చేసినాది… ఇదిగో వొరండాలోనే ఉంతాను. మీకేం కావాలన్నా ఒక కేకెయ్యండి. ఇలా పడుకోండే…” అంటూ జాగ్రత్తగా నన్ను పడుకోబెట్టాడు అప్పలకొండ.

“నర్మదా… పడుకుందాంరా… శుభరాత్రి!” అలసటగా కళ్ళు మూసుకున్నాను, నా నర్మదను తలచుకుంటూ…

అవును… నర్మద ఓ అద్భుతం… నా అద్భుత ప్రపంచమే నర్మద…

***

1 thought on “నవరసాలు..నవకథలు.. అద్భుతం 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *