June 24, 2024

నవరసాలు..నవకథలు.. కరుణ 3

రచన: జి.సుబ్బలక్ష్మి

ఫోటో

“ప్రయాగ వెడుతున్నార్ట కదా సావిత్రీ.. “ రెండిళ్ళ అవతలున్న జానకి సందు చివరనున్న కొట్టు దగ్గర కూరలు కొంటున్న సావిత్రిని అడిగింది.
“అవును జానకీ. ఒక్కసారి ఆ త్రివేణీసంగమంలో మునగాలనుందిరా, కుంభమేళాకి తీసికెళ్ళరా అనడిగితే ఆ రష్ లో మనం వెళ్లలేవమ్మా అన్నాడు ముందు. కానీ తర్వాత మా గిరిజ వాడికి నచ్చచెప్పింది. ఎంత బాగా చెప్పిందనుకున్నావ్! మనం కాకపోతే అత్తయ్యగారిని ఎవరు తీసికెడతారండీ అంటూ మొత్తానికి వాణ్ణి ఒప్పించింది.” సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో అంది సావిత్రి.
కూరలు తీసుకుని సావిత్రి పక్కనే నడుస్తూ వస్తున్న జానకి నెమ్మదిగా అంది. “ఏంటో సావిత్రీ, కొన్ని కబుర్లు వింటుంటే భయం లాంటిది వేస్తోంది. నిన్న టీవీలో చెప్పేరు, ఎవరో ఒకతను ముసలి తల్లిని తీసుకుని ప్రయాగ వెళ్ళి, అక్కడ వదిలేసి వచ్చాడుట. రోడ్డు పక్కన కొడుకింకా వచ్చి తనని తీసికెడతాడని ఎదురుచూస్తున్న ఆవిడని టీవీలో చూపిస్తుంటే ఎంత బాధేసిందో.”
“అయ్యయ్యో. అలాంటి కొడుకులు కూడా ఉంటారా!” ఒక్కసారిగా నిలబడిపోయి ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
“ఎందుకుండరూ! ఎన్నిరకాల మనుషులో. నువ్వు జాగ్రత్త సావిత్రీ.” అన్న జానకి మాటలకి నవ్వుకుంది సావిత్రి. తన కొడుకు రవి బంగారం. తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. కోడలు గిరిజ మటుకు తననెంత గౌరవిస్తుందీ! ఇంక మనవడు తననసలు వదలనే వదలడు.
అనుకున్నట్టే కొడుకు రవీ, కోడలు గిరిజ, మనవడు అజిత్ తో ప్రయాగలో రైలు దిగిన సావిత్రి, ప్లాటుఫారం మీద నిలబడి “ఈ జన్మకిది చాలు భగవంతుడా.” అనుకుంటూ గుండెలనిండా గాలి పీల్చుకుంది.
రైల్వే ప్లాట్ఫామ్ మీదే కాదు, స్టేషన్ దాటి బైట కొచ్చాక కూడా ప్రవాహంలాగా జనాలు. రవి బయల్దేరినదగ్గర్నుంచీ పాఠం అప్పచెప్పించుకున్నట్టు తన పేరు, అడ్రసూ అజిత్ చేత అప్పచెప్పించుకుంటూనే ఉన్నాడు. తల్లికీ, భార్యకీ కూడా జాగ్రత్తలు చెప్పాడు. ఒకరిని వదిలి ఇంకొకరు వెళ్ళకూడదనీ, స్నానానికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా కనీసం ఇద్దరైనా ఒక జట్టుగా ఉండాలనీ చెప్పాడు.
కుంభమేళా. కోట్లకొద్దీ ప్రజలు భక్తిప్రపత్తులతో వచ్చి త్రివేణీసంగమంలో పాపప్రక్షాళన చేసుకుని తరించిపొయే ప్రయాగ నగరం. ఎక్కడికక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది ప్రభుత్వం.
వచ్చినరోజే త్రివేణీసంగమంలో పవిత్రంగా స్నానం చేసి, గుడికి వెళ్ళొచ్చారు. స్నానం చేసి గుడికొస్తున్నదారిలోనూ, గుడినుంచి బసకు వస్తున్న దారిలోనూ రోడ్డు మీద అక్కడక్కడా ఉన్న ముసలివారిని చూసి సావిత్రి కెందుకో దుఃఖంలాంటిది వచ్చింది. దారంతా అక్కడక్కడా పోలీసులు ఆ ముసలివాళ్లతో మాట్లాడి వాళ్లని చెయ్యి పట్టుకుని తీసికెడుతున్నారు. ఇంక బస దగ్గరయితే కొన్ని ఫొటోలతో ఒక బోర్డ్ కూడా కనపడింది. అది హిందీలో ఉంది. హిందీ సావిత్రికి అర్ధంకాదు. అందుకని కొడుకుని ఆ బోర్డు మీద ఏంరాసుందోనని అడిగింది. రవి వరసగా ఉన్న ఆ ఫొటోలన్నీ చూపిస్తూ, వాళ్లంతా మతిమరుపు(అల్జీమర్స్) వ్యాథితో బాధపడుతున్న పెద్దవారనీ, వారు వారి పిల్లలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారనీ, అందుకని పిల్లలే వచ్చి వారిని గుర్తుపట్టి తమవెంట తీసికెళ్లవలసిందనీ ఆ బోర్డు మీద రాసుందని చెప్పాడు. ఆ ఫొటోలు చూస్తూ “అయ్యోపాపం.. ఆ పిల్లలెవరో ఇక్కడికొచ్చి చూస్తారంటావా..” అడిగింది సావిత్రి రవిని.
“ఏమో..వెతుక్కుంటూ వచ్చే పిల్లలకి కనీసం వాళ్ళిక్కడ ఉన్నారని తెలుస్తుంది కదా!” అన్నాడు రవి.
వీళ్ళతో పాటుగా ఆ ఫొటోలని చూస్తున్న మరో ఆయన “అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే కావాలని వదిలేసి వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారండీ!” అన్నాడు కల్పించుకుంటూ.
సావిత్రికి ఒక్కసారి ఊళ్ళో జానకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భయంతో వెన్ను జలదరించింది. మళ్ళీ కాసేపట్లోనే తనను తాను సముదాయించుకుంది. అయినా అలాంటివాళ్లతో తనకేం పోలిక? తన కొడుకు బంగారం. ఒకవేళ ఈ జనం వత్తిడిలో ఎక్కడైనా తప్పిపోయినా తనకి నోట్లో మాటుంది. ఆ మాత్రం ఊరూ, అడ్రసూచెప్పగలదు.
“నానమ్మా, నానమ్మా అక్కడ బొమ్మలున్నాయి చూద్దాంరా నాన్నమ్మా.” చెయ్యిపట్టి లాగుతున్న అజయ్ ని ఆపింది గిరిజ.
“నాన్నమ్మ అలిసిపోయేరు కానీ నువ్వూ, డాడీ వెళ్ళి కొని తెచ్చుకోండి. మేం రూమ్ కి వెడతాం.” అంటూ గబగబా రూమ్ వైపు నడిచింది.
“రా రా..” అంటూ అజయ్ చెయ్యి పట్టుకుని రవి ఆ బొమ్మల వైపు వెళ్ళాడు. సావిత్రి రూమ్ నంబర్లు చూసుకుంటూ తమ రూమ్ దగ్గర ఆగి అవునా కదా అన్నట్టు ఒక్క క్షణం నిలబడింది. ఎదురుగా గదిలో గిరిజ అటువైపు తిరిగి మొబైల్ లో మాట్లాడుతోంది.
“అవునే, ఇప్పుడే చూసేను బైట ఫొటోలు. మతిమరుపు జబ్బున్న ముసలాళ్ళవి. హూ.. నాకా అదృష్టం లేదులే. మా అత్తగారికి ఎప్పటెప్పటివో కూడా నిక్షేపంలా గుర్తుంటాయి.”
గిరిజ మాటలు విన్న సావిత్రి ఒక్కసారిగా స్థాణువైపోయి గదిలోకి వెయ్యబోయిన అడుగుని ఆపేసింది.
“ఇన్నేళ్ళూ బానే ఉందే. మా అందరికీ కూడా బానే చేసిపెట్టేది. ఈ మధ్య యేడాదినించే ఏవో రోగాలంటుంది. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టటం లేదు. అయినా మా ఆయనకి మరీ అపురూపం వాళ్లమ్మంటే. ఏం చెప్పమంటావులే.. ఈ యేడాదిలో టెస్ట్ లకే బోల్డయింది తెల్సా!”
వద్దన్నా చెవులో పడుతున్న ఆ మాటలు వింటుంటే సావిత్రి మనసు మూగపోయినట్లైపోయింది.
అవతలివాళ్ళేం చెప్పారో మరీ ఇట్నించి గిరిజ “అబ్బే, అలా చేస్తే మా ఆయన దగ్గర చెడ్డదాన్నయిపోనూ! ఆయన దగ్గర నాకు మా అత్తంటే ఎంతో గౌరవం, భక్తీ ఉన్నట్టుండాలి. ఈవిడంతట ఈవిడే మళ్ళీ మాతో వెనక్కి రాకూడదు. ఏదో ఆలోచిస్తాలే.. ఎన్నాళ్ళు చేస్తాను ఈ రోగిష్టిదానికి చాకిరీ..” అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగింది.
పాలిపోయిన మొహంతో నిలబడ్ద సావిత్రిని అప్పుడే చూసినట్టు చూస్తూ తడబడింది. “మీరు వెళ్ళలేదా అత్తయ్యా వాళ్లతో..” అంటూ మొహం చాటు చేసుకుందుకన్నట్టు బైట వరండా లోకి వెళ్ళిపోతూ అనుకుంది. “హమ్మయ్య, తను అనుకున్నట్టే ఈవిడ వింది. చాలా అభిమానంగల మనిషి. ఈ మాటలు వింది కనక ఇంక మాతో వెనక్కి రాదు. ఇంక వాళ్ళిద్దర్నీ ఎలాగోలాగు మానేజ్ చేసానా, ఈవిడ పీడ వదిలినట్టే..”
తను వినాలనే గిరిజ ఆ మాటలన్నట్లనిపించింది సావిత్రికి. వాటిని అర్ధం చేసుకోవడానికి చాలా సమయమే పట్టిందావిడకి. కొడుకు పెళ్ళైన పదేళ్ళనుంచీ కోడలుని కాలు కింద పెట్టనివ్వకుండా గారంగానే చూసుకుంది సావిత్రి. ఈ మధ్యనే వయసు మీద పడడం వల్లో యేమో ఆయాసంగా అనిపిస్తుంటే సాయంత్రాలు వంట కోడలు చేస్తోంది. కొడుకు భయపడి ఏవో నాలుగైదు పరీక్షలు చేయించాడు. పెద్దవయసు తప్పితే వేరే సమస్యలేమీ లేవు, విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. అప్పట్నించీ కొడుకు కోడలినే వంట చెయ్యమన్నాడు. కానీ అలవాటైన పనులు మానుకుని ఉట్టిగా కూర్చోలేక పొద్దుటి వంట తనే చేస్తోంది. అంతమాత్రానికే తను రోగిష్టురాలైపోయిందా! తనను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తోందా గిరిజ? విన్నది స్పష్టంగా అర్ధమౌతున్న కొద్దీ సావిత్రికి కళ్ళు తిరిగినట్లయి కూలబడిపోయింది. ఎంతో ప్రేమగా “అత్తయ్యా..” అంటూ పిలిచే కోడలి మనసులో ఇంత కల్మషం దాగుందని తెలీని సావిత్రికి ఒక్కసారి షాక్ తగిలినట్లయిపోయింది.
మర్నాడు సాయంత్రం మళ్ళీ వెనక్కి ప్రయాణమే. అందుకని పొద్దున్నే బయల్దేరి నలుగురూ అలహాబాదులో ఉన్న దేవాలయాలు కూడా దర్శించుకుంటూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళారు. అక్కడ సన్న ద్వారంలోంచి లోపలికి వెడితే మధ్యలో ఆంజనేయస్వామి దర్శనమిస్తుంటాడు. లోపలంతా ఎక్కువ వెలుతురుండదు.
దర్శనం చేసుకుని ముందు బయట కొచ్చిన గిరిజ గబగబా బసకి, అట్నించి ఏకంగా స్టేషన్ కి ఒక ఆటోని మాట్లాడి రెడీగా పెట్టింది. కాస్త ఆలస్యంగా వెనకాల వస్తున్న రవి, అజయ్ లను చూసి, “తొందరగా రండి. సామాన్లు తీసుకుని స్టేషన్ కి వెళ్ళాలి. టైమ్ లేదు..” అంటూ ఆటో ముందు నిలుచుని గట్టిగా పిలిచింది.
అప్పటికే సావిత్రి ఆటోలో ఉందనుకుని ఎక్కబోయిన రవి హఠాత్తుగా ఆగి, “అమ్మేది!” అన్నాడు.
“అత్తయ్యగారికి ఆవిడ చుట్టాలావిడ కనిపించారుట. ఆవిడతో కలిసి వాళ్ల వాళ్ళని కలిసి ఏకంగా అట్నించటే స్టేషన్ కి వచ్చేస్తానన్నారు. మీరెక్కండి.” అంది.
“నాకు తెలీని అమ్మ చుట్టాలెవరూ!” అన్న రవికి సమాధానంగా,
“ఎప్పుడో మీ చిన్నప్పుడు కలిసేర్ట. మీకు తెలీదులెండి.” అన్న గిరిజతో,
“మరి అమ్మ దగ్గర డబ్బులు లేవుగా!” అంటూ ఇంకా ఏదో అడగబోతున్న రవిని “అబ్బబ్బా, నేనిచ్చేనులెండీ. మళ్ళీ మనకి ట్రైన్ తప్పిపోతుంది. ఎక్కండీ.” అంటూ రవినీ, అజయ్ నీ ఆటో ఎక్కించేసింది. బసకి వెళ్ళి వాళ్ల సామానులన్నీ తీసుకుని, ఆఫీసులో డబ్బు కట్టేసి మళ్ళీ ఆలస్యమైపోతుందని తొందరగా ఆటో ఎక్కేసారు ముగ్గురూ. ఆఖరున బేగులు తీసుకుని వస్తున్న గిరిజ అత్తగారి బేగ్ కావాలనే రూమ్ గుమ్మం ముందు వదిలేసి వచ్చింది.
ఆటో దిగి స్టేషన్ లో అడుగుపెట్టిందగ్గర్నించీ రవీ, అజయ్ సావిత్రికోసం ప్లాట్ ఫామ్ అంతా గాలిస్తున్నారు. “అమ్మా, అమ్మా” అంటూ, రవీ, “నాన్నమ్మా, నాన్నమ్మా” అంటూ అజయ్ గొంతెత్తి పిలుస్తున్నారు. చుట్టూ వింటున్నవాళ్ళు వీళ్ళవంక సానుభూతిగా చూసి వెడుతున్నారు. ఇంతలో వీళ్ళెక్కాల్సిన రైలు వచ్చింది. “ఎక్కండి. ఎక్కండీ..” అంటూ గిరిజ తొందరపెట్టింది. “ఆవిడ ఏదో పెట్టెలో ఎక్కేసే ఉంటారు. ఈ రైలని తెల్సుగా. మళ్ళీ మనం తప్పిపోతాం.” అంటూ ఇద్దర్నీ ఎక్కించేసింది గిరిజ. రైలు కదిలాక కూడా గుమ్మంలోంచి బైటకి సావిత్రి కనపడుతుందేమోనని తొంగిచూస్తూనే ఉన్నాడు రవి.
“అయ్యో, అక్కడలా నిలబడకండీ. అత్తయ్యగారు వెళ్ళిన చుట్టాలావిడ కూడా ఎక్కేది ఇదే రైలుట. తప్పకుండా వాళ్లతో ఎక్కేసుంటారు..” అన్న గిరిజ మాటలకి లోపలికొచ్చి తన సీటులో కూర్చుంటూ “అమ్మ ట్రైన్ ఎక్కుంటుంది కదా!” అనడిగేడు. “అయ్యో, తప్పకుండా ఎక్కే వుంటారండీ. నాతో చెప్పేరుగా. లేకపోతే నేనెందుకు చెప్తానూ!” అంది గిరిజ ధీమాగా.
అక్కడ ఆంజనేయస్వామి గుడిలో కొడుకు, కోడలు, మనవళ్ళ వెనకాల వరసలో లోపలికెళ్ళిన సావిత్రి జనాలని తప్పించుకుంటూ దేవుని దర్శనం చేసుకుని బయట కొచ్చేటప్పటికి అక్కడ తనవాళ్ళెవరూ కనపడలేదు. కాసేపు అక్కడే నిలబడి వాళ్ళింకా లోపలే ఉన్నారేమో బయట కొస్తారని చూస్తూ నిలబడింది. కానీ పావుగంట గడిచినా లోపల్నించి వాళ్ళు రాలేదు. దాంతో ఖంగారుపడుతూ తను మళ్ళీ లోపలికెళ్ళి, ఆ రైలింగ్ పట్టుకుని, చుట్టూ తిరిగి బయటకొచ్చింది. అక్కడా లేరు. లోపలా బయటా కూడా కొడుకు కనపడకపోవడంతో సావిత్రి ఖంగారుపడింది. ఏ పక్కకో వెళ్ళుంటారు అని మనసుని సమాధానపరచుకుంటున్నా నిన్న గిరిజ ధోరణి తెలిసినప్పట్నించీ ఒక రకమైన భయంలాంటిది సావిత్రిలో మొదలైంది. తననొదిలేసి వాళ్లంతా బసకి వెళ్ళిపోయారా! తను లేకుండా కొడుకు ఎలా వెళ్ళేడు!
ఇంకాసేపట్లో హైద్రాబాదు వెళ్ళడానికి రైలెక్కాలి. ఇంకా ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే బసనుంచి వాళ్ళు స్టేషన్ కి వెళ్ళిపోతారేమో! ఇప్పుడు తనేం చెయ్యాలి అనుకుంటూ గుండె దిటవు చేసుకుని తాము బస చేసిన హోటల్ కి వెడామనుకుంది. ఆ హోటల్ పేరు సదరన్ హౌస్. ఆ పేరు సావిత్రికి గుర్తే.. బయటకొచ్చి ఆటో ఎక్కుదామంటే భాషా రాదు, చేతిలో డబ్బులూ లేవు. నెమ్మదిగా తనని తాను స్వాధీనంలోకి తెచ్చుకుని చుట్టూ పరికించింది. ఎక్కడా తన వారి జాడ కనపడలేదు. కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ ఆటోల దగ్గరే నిలబడి అక్కడికి వచ్చే భక్తులని పరిశీలించడం మొదలెట్టింది.
ఒక ఆటో మాట్లాడుతున్న మగాయనతో వాళ్లావిడ “ఇంకివాల్టికి హోటల్ కి వెళ్ళిపోదామండీ. నడవలేను. మిగిలినవి రేపు చూసుకుందాం. “ అంటూన్న తెలుగుమాట వినిపించింది. గబుక్కున ఆవిడ దగ్గరకెళ్ళి “అమ్మా, మావాళ్ళు తప్పిపోయేరు. బహుశా మేం బసచేసిన చోటుకి వెళ్ళుంటారు. కాస్త మీవారితో చెప్పి నన్నక్కడ దించగలరా! అక్కడికి వెళ్ళగానే మా అబ్బాయి మీకు డబ్బులిచ్చేస్తాడు.” అనడిగింది మొహమాటం చంపుకుని గబగబా.
ఆయన సావిత్రిని తేరిపార చూసాడు. అయినింటావిడలాగే ఉంది. కట్టూబొట్టూ చూస్తే మర్యాదస్తురాలిలాగే కనపడుతోంది. పాపం తెలుగు తప్ప హిందీ రానట్టుంది. తనవాళ్ళు చూసుకోకుండా ముందు వెళ్ళిపోయుంటారు అనుకుంటూ భార్యని చూసి, “బస ఎక్కడో తెలుసేమో అడుగు..” అన్నాడు.
సావిత్రి సంతోషపడిపోయి, “సదరన్ హౌసండీ..” అని చెప్పింది. ఆటోవాణ్ణి ఆ అడ్రస్ గురించి వాకబు చేసి, వాళ్లతోపాటు సావిత్రిని కూడా ఎక్కించుకుని సదరన్ హౌస్ దగ్గరకి తీసుకొచ్చారాయన. “ఇదేనా..” అనడుగుతున్న ఆయనకి నమస్కారం పెడుతూ, దూరంగా కనిపిస్తున్న కొడుకూ, కోడలూ, మనవడినీ చూపిస్తూ, “అరుగో వాళ్ళేనండీ.. ఉండండి, మా అబ్బాయినడిగి మీ డబ్బులు తెచ్చిస్తాను..” అంటున్న సావిత్రిని ఆపి, “పరవాలేదండీ. ఇది మేం వెళ్ళే దారే. మీరు తొందరగా వెళ్లండి.” అంటూ ఆటోలో వెళ్ళిపోయారు ఆ దంపతులు.
హమ్మయ్య అనుకుంటూ ఇటు తిరిగిన సావిత్రికి రవీ వాళ్ళూ కనిపించలేదు. తాము దిగిన రూమ్ నంబర్ తెలుసు కనక ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే అందులో ఇంకెవరో దిగిపోయారు. సంగతి తెలుసుకుందుకు ఆఫీసురూమ్ కెళ్ళి కొడుకు గురించి అడిగింది.
“వాళ్ళిప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా!” అన్న మాటలు విన్నావిడ మ్రాన్పడిపోయింది. ఇంకా ఆశ చావక మళ్ళీ తాము దిగిన రూమ్ కి వెళ్ళింది. ఆ రూమ్ గుమ్మం పక్కన తన బేగ్ కనపడింది. అంతే.. అంతా అర్ధమైపోయిందావిడకి. కోడలు తనని వదిలేసి వెళ్ళిపోయింది. మరి కొడుకూ! కొడుకుతో ఏం చెప్పిందో. పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి తనను వదిలేసి వెళ్ళిపోయేడా రవి! సావిత్రి మనసు దానికి అంగీకరించలేదు. లేదు. తన కొడుకు అలాంటివాడు కాదు. ఎక్కడికెళ్ళినా తనని వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వస్తాడు అనుకుంటూ రవి రాగానే కనపడేలాగా ఆఫీసుముందున్న బెంచీమీద కూర్చుంది. ఎక్కడ రవి వస్తే తను మిస్సయిపోతుందేమో ననుకుంటూ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. తెల్లారింది. కొడుకు రాలేదు. సావిత్రి గుండె బద్దలైంది.
ఆఫీసులో పొద్దున్నే డ్యూటీ మారినతను బెంచీమీద కూర్చున్న సావిత్రిని చూసి అడిగాడు. “మీదే ఊరండీ? మీ పేరేమిటీ!” అంటూ.
అర్ధంకానట్టు చూస్తున్న ఆవిడని చూసి “పాపం, మతిపరుపు జబ్బేమో.” అనుకున్నాడు. ఎవరేమడిగినా నోరువిప్పని సావిత్రిని అక్కడందరూ జాలిగా చూసారు.
మరో నాలుగురోజులకి ఆ బసముందున్న ఫొటోల్లో సావిత్రి ఫొటో కూడా చేరింది.

1 thought on “నవరసాలు..నవకథలు.. కరుణ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *