April 20, 2024

నవరసాలు..నవకథలు.. శాంతం 6

రచన: ఉమాదేవి కల్వకోట

ఇక అబద్ధాలు చెప్పకండి నాన్నా.

సాయంత్రం ఆరుగంటలు దాటింది. పార్కులో చిన్నపిల్లల ఆటలూ, కేరింతలు,పెద్దవాళ్ళ కబుర్లు, ప్రేమికుల ఊసుల బాసల సందడులన్నింటికీ దూరంగా ఒక బెంచిమీద ఒంటరిగా కూర్చొని తన కొడుకు కార్తీక్ రాసిన ఉత్తరం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు రామారావుగారు. ఇప్పటికే రెండుసార్లు చదివిన ఆ ఉత్తరాన్ని అప్రయత్నంగానే జేబులో నుండి తీసి మరోసారి చదవసాగారు..

నాన్నా !
ఒకే ఇంట్లో ఉంటూ మీకీ ఉత్తరం రాయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ ఏంచేయను? కొన్ని విషయాలు మీతో డైరెక్టుగా మాట్లాడలేక ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది.
నాన్నా!సాధారణంగా అందరి తల్లిదండ్రులు మీలాగానే తమ పిల్లలకు అబద్ధాలు చెప్పడం చాలా తప్పని చెప్తుంటారు. మరి మీరెందుకు నాన్నా పదేపదే అబద్ధాలు చెప్తున్నారీమధ్య. కాదని మళ్ళీ అబద్ధం చెప్పకండి. నాకన్నీ తెలుసు. మొన్నటికి మొన్న బామ్మ ఇద్దరు అత్తయ్యలనీ, మామయ్యలనీ సంక్రాంతి పండగకి పిలవమనీ, వాళ్ళకి మంచి బట్టలూ అవీ పెట్టి మర్యాదలు చెయ్యాలని చెప్పింది కదా. మీరూ సరేనన్నారు. కానీ అమ్మ రెండునెలల క్రితమే బామ్మని హాస్ఫిటల్లో చేర్పించినప్పుడు చాలా ఖర్చయింది. మళ్ళీ ఇప్పుడు వీటికి డబ్బులెలాగాని బాధపడుతుంటే మీరేం చెప్పారూ.. మీ ఆఫీసులో ఈసారి ఫెస్టవల్ ఎడ్వాన్సు ఇస్తున్నారని, కంగారుపడొద్దని చెప్పారు. కానీ మీరు మీ ఆఫీసులో పనిచేసే సుబ్బరాజు అంకుల్ దగ్గర అప్పుచేసారని, మొన్న అంకుల్ మనింటికి వచ్చినప్పుడు మీరు వడ్డీ డబ్బులివ్వడం చూసినప్పుడే నాకు తెలిసింది.. ఎందుకు నాన్నా అమ్మకు అబద్ధం చెప్పారు.
మీకున్న నాలుగు జతల డ్రెస్సులు బాగా పాతబడిపోయాయని, కనీసం మీ పుట్టినరోజుకైనా రెండు జతల బట్టలు కుట్టించుకొమ్మని అమ్మ పోరితే, మన చుట్టాలెవరో ఏవో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మీకు పెట్టిన ప్యాంటు షర్టు గుడ్డలేవో తీసుకెళ్ళి మనప్రక్క వీధిలో ఉన్న హరి టేలర్ షాపులో కుట్టడానికి ఇచ్చారు కదా. అవిచూసి ఆయన అవి అంత మంచి గుడ్డలు కావని, కుట్టుకూలీ వేస్టని చెప్పారు. మీ పుట్టినరోజున కొత్తబట్టలు వేసుకోలేదేంటని ఆమ్మ ఆడిగితే, ఆ టేలర్ షాపతను ఏదో అర్జెంట్ పనిమీద షాపు మూసేసి, ఊరెళ్ళాడని చెప్పారు. కానీ ఆ హరి ఆంకుల్ మీ నాన్న వేరే గుడ్డలు తెచ్చిస్తానని తేలేదేంటని నన్ను అడిగితే అసలు విషయం నాకు అర్ధమయింది. చూసారా నాన్నా, మీరు మళ్ళీ అబద్ధం చెప్పారు.
మీరీమధ్య మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. కుంటుతూ నడుస్తున్నారు కూడా. రాత్రుళ్ళు కూడా చాలా బాధ పడుతున్నారని, సరిగా నిద్రపోవడంలేదని అమ్మ చెప్పింది. అమ్మా, బామ్మ పోరుతూంటే పదిహేనురోజులక్రితం పక్కింటి రామనాథం అంకుల్ తో హాస్ఫిటల్ కి వెళ్ళారు. ఏవో టెస్టులూ, ఎక్స్ రే లు చేసారన్నారు. డాక్టర్ ఏమన్నారని అడిగితే వయస్సుతో వచ్చే చిన్న సమస్యేనని, మందులు రాసిచ్చారని చెప్పారు. మీ కొలీగ్ సుబ్రహ్మణ్యంగారితో మీరు ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను. మీ రెండుకాళ్ళకీ ఆపరేషన్ అవసరమన్నారనీ, దానికి నాలుగైదులక్షల రూపాయలు కావాలన్నారని చెప్పారు. ఇటీవల ఉద్యోగులకిచ్ఛే హెల్త్ కార్డు సౌకర్యం కూడా ప్రస్తుతం రిటైరైనవాళ్ళకే ఇస్తున్నారని, అందుకని రిటైరయ్యాకే కుదురుతుందని చెప్పారు. మళ్ళీ మా అందరితో అబద్ధం.. ఇలా ఎన్ని అబద్ధాలు, ఎంతకాలం చెప్తారు నాన్నా.
ఇప్పుడే కాదు ఇదివరకు కూడా మీరు అబద్ధాలు చెప్పారు నాన్నా. నేను టెన్త్ క్లాసు పాసయిన తర్వాత నన్ను మంచి కాలేజీ లో చేర్పించాలని, ఎంసెట్ లో మంచి ర్యాంకు వస్తే, నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి, విదేశాల్లో ఎమ్మెస్ చేయాలని మీరు ఆశపడ్డారు. నన్ను చేర్పించిన కాలేజ్ లో ఫీజులు చాలాఎక్కువ. అవి కట్టడానికి మీరు ఆఫీసు అయిపోయిన తర్వాత కూడా మీరు వేరే చోట పనిచేసేవారు. ఇంటికొచ్చేప్పటికి రాత్రి తొమ్మిది దాటేది. ఆలస్యం ఎందుకవుతుందని ఆమ్మ అడిగితే కొత్త ఆఫీసర్ వచ్చారని, పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయని దానికి చాలా రోజులు పడుతుందని చెప్పారు గుర్తుందా.
అది అబద్ధమేకదా. నా చదువుకోసం అంతలా కష్టపడ్డారు మీరు. నాకు మంచి కాలేజ్లో సీటు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ రాంబాబుగారు నన్ను అభినందిస్తూ మీ నాన్న కష్టానికి ఫలితం దక్కిందని ఈ విషయం చెప్పేవరకు మాకెవరికీ అసలు సంగతి తెలీదు.
ఆలాగే అక్క పెళ్ళప్పుడు బావగారి సంబంధం వచ్చినప్పుడు అక్క కట్నం తీసుకునే వాళ్ళని చేసుకోనంది. బావగారు కూడా సరేనన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం బావగారి అమెరికాలో చదువుకి చాలా ఖర్చయిందని, కనీసం పెళ్ళి ఖర్చులకయినా మూడు లక్షల రూపాయలు కావాలన్నారు. మంచి సంబంధం వదులుకోవద్దని, పల్లెటూళ్ళో మనకున్న ఒకే ఒక్క ఆస్థి తాతగారు కట్టిన పాత ఇంటిని అమ్మేసారు. ఆ ఇల్లు కూలిపోయేలా ఉందని , పక్కవాళ్ళెవరో కొంటా నన్నారని, అబద్ధం చెప్పారు. నిజానికి ఆ ఇల్లు చక్కగా ఉంది. రిజిస్ట్రేషన్ కి మీతో నేను కూడావచ్చాను కదా.అక్కకి, కట్నం విషయం చెప్పకుండా పెళ్ళిచేసారు. తనిప్పుడు అమెరికాలో సంతోషంగా ఉందనుకొండీ. కానీ ఆ ఇల్లు అమ్మినప్పుడు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు నాన్నా..
ఇలాఎన్నోఅబద్ధాలు చెప్పి, మీరు కష్టపడుతూ మమ్మల్ని సుఖంగా ఉంచారు. ఎప్పటికప్పుడు మీ కష్టాలను మాకు తెలీకుండా దాచిపెట్టారు.
మీరు మాకు చాలా విలువైనవారు నాన్నా. మీకంటే మాకేదీ ఎక్కువ కాదు. మీరు బాగుంటేనే మేము బాగుంటాము. ఇన్నాళ్ళు మీరు ప్రతిక్షణం మా అందరి గురించే ఆలోచించారు. ఇకనుండైనా మీ గురించి ఆలోచించుకోండి నాన్నా. మాకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ, మీ అవసరాలూ, కోరికలు అన్నీ త్యాగం చేస్తూనే ఉన్నారు. మా అందర్నీ మభ్య పెట్టడానికి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానెయ్యండి నాన్నా.
నాన్నా! నేను ఉద్యోగంలో చేరి ఆరునెలలయింది. ప్రొబెషనరీ పీరియడ్ ఈ నెలతో అయిపోతుంది. ఇక నాకు మా కంపెనీలో మెడికల్ లోను, హౌసింగ్ లోనులాంటివి ఇస్తారట. నేను లోన్ తీసుకొని మీ ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తాను. నాకు కష్టమవుతుందని మళ్ళీ ఏదో అబద్ధం చెప్పి ఆపరేషన్ వద్దనకండి ప్లీజ్. నాకు మంచి సాలరీ వస్తుంది. నా జీతంలో సగం లోన్ కట్టినా ఏడాదిన్నరలో అప్పు తీరిపోతుంది. నేను మీ కొడుకుని. మీకున్న ఓర్పు, సహనం, శాంతం నాకూ ఉన్నాయి. ఇకపై మీ బాధ్యతలు నన్నూ పంచుకోనివ్వండి. ఇక అబద్ధాలు చెప్పే అవసరం మీకుండకూడదు. నన్ను ఓ కొడుకులానే కాకుండా, ఓ మంచి స్నేహితునిలా కూడా భావించండి నాన్నా. ప్లీజ్.

మీ కార్తీక్

మూడోసారి ఆ ఉత్తరం చదివినప్పటికీ, మళ్ళీ మొదటిసారిలాగానే ప్రతీ పదం, ప్రతీ లైన్ పట్టి పట్టి చదువుతూ రామారావుగారు చెమర్చిన తన కళ్ళని జేబురుమాలుతో తుడుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *