February 27, 2024

నవరసాలు.. నవకథలు.. శృంగారం .. 1.

రచన: రజనీ శకుంతల

అది ఒక ఇదిలే…!!

“ప్లీజ్ బామ్మా! నా మాట విను. అందరిలో నాకు ఇలా ‘కార్యం’ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. చెప్తుంటే వినవేం.. కాలం మారింది. ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తా.. నైట్ అక్కడికి వెళ్తాం. తెల్లారి వచ్చేస్తాం. ఇలా అందరిలో నా పెళ్ళాన్ని అలంకరించి, పాల గ్లాసుతో గదిలోకి పంపడం లాంటివి ఏం వద్దు… ” రుషి బామ్మ వింటుందనే నమ్మకం లేకున్నా తన ప్రయత్నంగా మరోసారి చెప్పి చూసాడు.
“ఒరే మనవడా! నువ్వీ విషయంలో ఏం చెప్పినా నేను వినను… ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇలాంటివి మన ఇంటా వంటా లేవు. కార్యం సంగతి పెద్దలు చూసుకుంటారు. మా అచ్చటా-ముచ్చటా తీరొద్దా?” అంది బామ్మ. తన మాటకు తిరుగు లేనట్టుగా.
“బామ్మా! నువ్వు ఆర్.జి.వి లాగా మొండిదానివి . చెప్తే అర్ధం కాదు..”
“ఆర్.జి.వి. .. ఎవడ్రా?” బోసినోటితో నవ్వుతూ అడిగింది.
“ఉన్నాడులే.. నీలాంటి మొండివాడొకడు” విసుక్కుంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు.
వెనకనుండి బామ్మ గట్టిగా “ఆఈసు నుండి కాస్త త్వరగా రా.. కావాలంటే వచ్చేటప్పుడు నాలుగు కిలోల స్వీట్లు, బుట్టేడు మల్లెపూలు తేవడం మర్చిపోకు… ” అంది ఆర్డర్ వేస్తూ ..
“ఈ పెద్దోళ్ళున్నారే..” అనుకుంటూ రుసరుస వెళ్లిపోయాడు రుషి.
***
అసలు విషయానికి వస్తే….
రుషికి, అనూషితో పెళ్ళయింది.
శోభనం ముచ్చట, బంధుమిత్రుల సమక్షంలొ ఆ రోజు జరగనుంది. అక్కడే పేచీ వచ్చింది రుషికి, బామ్మకీ. అందరికీ చెప్పి, అందరూ చూస్తుండగా అమ్మాయిని గదిలోకి పంపి, తెల్లారి అందరూ తమని చూస్తుంటే సిగ్గుతో చితికిపోయి… చాలా ఎంబరాసింగ్‌గా అనిపించింది రుషికి.
ఈ హంగామా అంతా ఇష్టం లేని రుషి, సింపుల్‌గా నైట్ హోటల్‌కి వెళ్ళిపోదాం అని ప్రిపేర్ అయ్యాడు.
ఇప్పుడు బామ్మ ఒప్పుకోవడం లేదు.
అదీ సమస్య..
******
సాయంత్రం ఆరుగంటలు కావొస్తుంది.. ఇల్లంతా హడావిడిగా ఉంది.
శోభనం గది అలంకరిస్తున్నారు బామ్మ పర్యవేక్షణలో. గులాబీలూ, సన్నజాజులూ, విరజాజులు, లిల్లీ పూలతో రుషి గదిని డెకొరేట్ చేయిస్తోంది బామ్మ.
పెళ్లికూతురు అనూషని శోభనపు పెళ్ళికూతురిగా ముస్తాబు చేస్తున్నారు. తెల్లని పట్టుచీర, పొడుగాటి వాలుజడలో ఇంకా పూర్తిగా విచ్చుకోని మల్లెల మాలలు, కాళ్లకు పారణి, మెడలో తాళి, మొహంలో కదలాడుతున్న నునులేత సిగ్గుతో బంగారు బొమ్మలా వుంది అనూష.
అమ్మో! అమ్మాయికి దిష్టి తగులుతుంది అని అప్పటికి రెండుసార్లు దిష్టి తీసేసింది బామ్మ..
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. బామ్మ లిఫ్ట్ చేసింది.
రుషికి యాక్సిడెంట్ జరిగింది. స్టార్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసారు. త్వరగా రమ్మని ఎవరో చెప్పారు.
బామ్మకు టెన్షన్ పెరిగింది. రుషి తల్లి ఏడుపు మొదలెట్టింది. తండ్రి బాధలో ఉన్న కనపడనీయలేదు.
అనూష షాక్ తిన్నట్టు వుండిపోయింది.
పది నిమిషాల్లో అనూషని ఇంట్లోనే ఉంచి అందరూ హడావిడిగా హాస్పిటల్ కు పరిగెత్తారు.
***
రాత్రి తొమ్మిదవుతుండగా మెలకువ వచ్చింది రుషికి. కళ్లు తెరవగానే తనవంకే ఆందోళనగా చూస్తున్న బామ్మ, అమ్మానాన్న కనపడ్డారు
“ఏంట్రా రుషి..! ఏవిటిదంతా? ఎవరి దిష్టి తగిలిందో … ఇంకా నయం. బ్రతికి బయట పడ్డావ్. ఏడుకొండలవాడా.. నడిచి కొండెక్కి వస్తా స్వామి…. అందరూ బయటికి వెళ్లండి. రాత్రికి నేనుంటా వీడిని చూసుకుంటూ” అంది బామ్మ.
“ఒసే బామ్మ.. అనూని వుంచవే. ఆ దాక్టరుతో అదీ మాట్లాడాలంటే నీ వల్ల కాదు.” అని ప్రాధేయపడ్డాడు రుషి.
అదీ నిజమే అనిపించింది బామ్మకు. కానీ డౌటనుమానంగా.”ఎలా వుంచనురా.. ఇంకా కార్యం కూడా కాకుండా.. ఇద్దరూ ఈ హాస్పిటల్ రూంలో ఎలా ఉంటారూ…” పాయింట్ లాగింది బామ్మ.
“నీ కార్యాన్ని కాకులు ఎత్తుకుపోనూ.. ఓ పక్క నా నడుం విరిగి నేను ఏడుస్తుంటే.. ఇప్పుడా సంగతి ఎందుకే?. కాస్త బాత్రూంకి అదీ హెల్ప్ చేయాలన్నా అనూష ఉంటే బెటర్ కదా.. “అంతూ కష్టపడి ఒప్పించాడు రుషి.
బామ్మకి ఒప్పుకోక తప్పలేదు.
***
నగరంలోనే అతి ఖరీదైన హాస్పిటల్ అది. స్టార్ హోటల్ రేంజిలో వుంది. ప్రతీ గదిలో కలర్ టీవీ, ఫ్రిజ్, ఏ.సి. బాత్రూంలో టబ్.. బెల్ కొడితే వచ్చే అటెండర్సూ, వాట్ నాట్.. హాస్పిటల్ అన్నమాటేగానీ, ఫైవ్ స్టార్ హోటల్‌లాగే వుంది. రుషికి జాగ్రత్తలు చెప్పి, అనూషని పంపిస్తామని చెప్పి అందరూ ఇంటిదారి పట్టారు.
అనూష సింపుల్‌గా తయారయి హాస్పిటల్‌కి బయలుదేరింది. రుషి ఆమెకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
భర్తను అడ్మిట్ చేసిన గదిలోకి అడుగుపెట్టిన అనూష కుర్చీలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్న రుషిని చూసి ఆశ్చర్యపోయింది.
“యాక్సిడెంట్ అన్నారు” కదా అనుకుంది. బాండేజీలతో బెడ్ మీద సెలైన్ ఎక్కించుకుంటూ వుంటాడనుకుంది.
“వెల్‌కం అనూ… ఇఫ్పుడు మనం ఒక స్పెషల్ చోటికి వెళుతున్నాం.!” అన్నాడు
అప్పుడు టైం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలు.
“ఇప్పుడా… ఎక్కడికి.. ఎందుకు ?” ఆశ్చర్యంగా అడిగింది అనూష.
“ఫస్ట్ నైట్.. ఫినిషింగ్ టచ్..”అన్నాడు.
“మరి మీకు యాక్సిడెంట్?”
“అదా.. బామ్మ ఒప్పుకునే రకం కాదని ఇలా ప్లాన్ చేసా..”
“అంటే…?”
“బామ్మ మనల్ని గంగిరెద్దుల్లా తయారు చేసి , అందరినీ పిలిచి, బొట్టు పెట్టి శోభనం ఏర్పాటు చేయడం నాకిష్టం లేదు. అందరిలో ఎంత ఇబ్బందిగా ఉంటుంది. హాయిగా మనమిద్దరమే ఉండాలి. ఎవరికీ చెప్పనవసరం లేదు.. అందుకే ఈ యాక్సిడెంట్ డ్రామా ఆడాను… హాస్పిటల్ లో జాయిన్ అయి తర్వాత స్టార్ హోటల్ కి షిఫ్ట్ అవుదాం. మళ్లీ పొద్దున ఆరుగంటలకల్లా ఇక్కడికొచ్చేసి, డిస్చార్జ్ అయి ఇంటికెళ్లపోదాం. .. ఎలా ఉంది నా సెటప్..?” బుగ్గ గిల్లుతూ అడిగాడు.
“ఓ..కే… గానీ.. పాపం.. బామ్మ..!” అంది.
“పాపం లేదు.. పుణ్యం లేదు.. బామ్మా లేదు.. పద..” అంటూ రుషి అనూష చేయి పట్టుకుని బయటకొచ్చాడు. రిసెప్షన్ లో కీస్ ఇచ్చి హోటల్ కి బయలుదేరారు.
భర్త వుద్ధేశ్యం అర్ధమవ్వటంతోనే అనూష బుగ్గల్లో సిగ్గులు పూసాయి.!
మల్లెలు మురిసాయి.. జాజులు విరిసాయి. ప్రేమ వరదలైంది. ప్రాయం పరుగులు తీసింది.
కిటికీ బయట చంద్రుడు కూడా వెన్నెలని మరింతగా వికసింపచేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *