June 24, 2024

హాలోవీన్

రచన: సోమ సుధేష్ణ

రజని, వెంకట్ హాలోవీన్ రోజున “పార్టీ అండ్ పంచుకోవడం” థీమ్ తో పది మంది ఫెమిలీలను స్లీప్ ఓవర్ కు వాళ్ళింటికి పిలిచారు. పంచుకోవడం అంటే డబ్బు, దస్కం ఒకరిది ఒకరు పంచు కోవడం కాదు. హాలోవీన్ పండుగ రోజున ఈ పెద్దలు ఆ వేషాలేసుకుని రోడ్డుమీద పడి ఇంటింటికి వెళ్లి “ట్రిక్ ఆర్ ట్రీట్” అంటూ జోలె చాపి చాక్లెట్లు వగైరాలు అడిగి పుచ్చుకునే వయస్సు దాటిపోయారు గాబట్టి, ఇలాంటి గెట్ టు గెదర్లు పెట్టుకొని ఎంజాయ్ చేద్దామను కున్నారు. రజని, వెంకట్ లు పార్టి ఇన్విటేషన్ లోనే “షేర్ యువర్ మిస్తరీ స్టొరీ నైట్” అని చెప్పారు గాబట్టి అందరూ తమ మిస్టరీ కథను అందరితో పంచుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. స్లంబర్ పార్టి (ఆ రాత్రంతా అక్కడే గడిపేయడం) ఉంది గాబట్టి హోస్టెస్ ఇంట్లో ఉన్న పడక సదుపాయాలు, తాము తెచ్చిన స్లీపింగ్ బేగ్ లు అన్ని ఓ పక్కన పడేసి లైట్ హస్కింగ్ తో స్కూపింగ్, ఈటింగు కానిచ్చారు. ఆ తర్వాత ఫెమిలీ రూమ్ లో ఉన్న సోఫాలు, కుర్చీలు వీలైనంత దూరంగా జరిపేసి అందరూ అలా కాళ్ళు బారజాపుకుని కొందరు, గోడకు ఒరిగి దిండ్లు వేసుకుని కొందరు పొందికగా కూర్చున్నారు. మరి కొందరు నేలమీద మావల్ల కాదు బాబోయ్ అని సోఫాలోనే స్థిర పడ్డారు. మరి రాత్రంతా కూర్చోవాలి, మోడరన్ లైఫ్ లో నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు రాకుండ చూసుకోవాలి కదా!
“కాస్త టీ తాగుదామా? చక్కటి భోజనం తర్వాత కునుకు పట్టే ప్రాణం నాది.” అన్నాడు వినయ్.
డిజర్ట్ తినడం కూడా అయిపొయింది కాబట్టి కొందరికి టీ తాగాలనిపించింది.
“ముందు కథ ఎవరు చెప్తారో నిర్ణయించాక సెకెండ్ రౌండ్ తినడానికి ఏది కావాలన్నాఅన్ని టేబుల్ మీద కోచ్చేస్తాయి. టీ కూడా చేసిస్తాను.” సరిత అంది. ఎవరింట్లో పార్టి అయినా టీ చేయడం సరిత వంతు. ఇండియన్ టీ చాల బాగా చేస్తుంది.
“బెస్టు కథ చెప్పిన వాళ్ళకు ఏదైనా గిఫ్టు వగైరాలిస్తారా లేక ఊరికే చెప్పడమేనా?” రవి తన భార్య సరిత వైపు చూస్తూ అన్నాడు.
“ఎవరి కథ బావుంటుందో వాళ్ళకు సర్ ప్రైజ్ గిఫ్టు ఉంటుంది. దానికి అందరం ఓట్లు వేద్దాంలే”. నరేష్ హామీ ఇచ్చాడు.
“నువ్వు ముందు కథ చెప్పు నరేష్. అందరికి ఐడియా వస్తుంది.” అన్నాడు వినోద్.
“మధ్యలో కొంపలకు నిప్పంటుకుంటే తప్ప మాటల్లోకి దిగొద్దు. ఎంత బోర్ కొట్ట్టిన బాత్రూం లోకెళ్ళి పోవద్దు. ఓకే అంటారా? నొకే అంటారా?” సునిల్ మూలగా ఉన్న ఖాళి స్థలంలో కూర్చుంటూ అన్నాడు.
“ఓకే” అందరూ గుడగుడగా అన్నారు.
“ఎనిబడి హేవ్ ఏ స్టోరి టు టెల్?” వసుధ ఉత్సాహంగా అంది.
“అమ్మావసుధా దేవి! నో ఇంగిలీసు తల్లీ. అందరికి నప్పిందా!!” అందరూ తెలుగొట్టారు. (జై కొట్టినట్టుగా)
“ఇంగులీసు దేశంలో బ్రతుక్కు అలవాటు పడ్డాము కదా కాస్త అటు ఇటు పదాలు దొర్లితే తల గోడకేసి కొట్టుకోవద్దు.” జనార్దన్ అనగానే అందరూ సమ్మతంగా చూసారు.
నరేష్ ఒక్క నిమిషం ఆలోచించి “ఒకే కథ చెప్తాను.” మొదలు పెట్టాడు.
“ఇండియాలో ఉండగా నేను రచయితనై పోవాలని ఆరాటంగా ఉండేది..”
“నువ్వు డిటెక్టివ్ కావాలని కోరుకునే వాడివేమో కదా!” నాకు పోటియా! అని ఆరాట పడి పోయాడు బుడి బుడి రచయిత శరత్చంద్ర. (రీబార్న్ రైటర్ కాదు. వాళ్ళ అమ్మకు శరత్ అంటే మహా ప్రియం. అందుకే కొడుక్కు ఆ పేరిచ్చింది. పేరులోనే ఉందో ప్రేరణలోనే ఉందో గాని చిన్ని రచయితగా పేరు తెచ్చుకున్నాడు.)
“మధ్యలో ప్రశ్నలు వేయోద్దన్నారనేది మరిచి పోకండి.” అతని భార్య తరుణ భర్తను హెచ్చరించింది.
నరేష్ మళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు.
“నేను హైదరాబాదులో ఉన్న రోజులు. అమెరికాకు వెళ్ళాలనే ఆరాటం ఉన్న కొత్త ఇంజనీరుకు ఈ వసుధ వైఫయి పోయింది. అలాంటి రోజుల్లో ఒక రోజు కథ వ్రాయాలనే కోరికలో కొట్టుకు పోతున్నాను. నా బుర్రకంటే ఖాళీగా ఉన్న పేపర్ల కట్ట, పెన్ను, సరంజామా అంతా రేసులో ఉన్న ఆట గాళ్ళలా రడీగా ఉన్నాయి. అక్షరాలు రావడం లేదు. వసుధ పుట్టింటి కెళ్ళింది ఒక్క రోజు కోసం. వాళ్ళక్కకు బాబు పుట్టాడు ఒక రోజు ఉండి వస్తాను అంటూ వెళ్ళింది. మర్నాడు సాయంత్రం గాని రాదు. శూన్యంగా ఎన్ని గంటలను మింగేసినా అడిగే వారు లేరు. కుర్చీలో కూర్చున్న నా బుర్రంతా ఖాళి. నా దృష్టి ఎదురుగుండా ఉన్న బుక్ షెల్ప్ ను దూసుకుని పోతున్నాయి… అక్షరాల వేటలో.
ఏదైనా వ్రాసి పేపరు జీవితం ధన్యం చేయాలి. పెళ్ళి చేసుకుంటే ఆడదాని జీవితం ధన్యం అవుతుందని కొందరంటారు.” నరేష్ ఒక వైపు కూర్చున్న ఆడవాళ్ళని చూస్తూ తమాషాగా రెండు అర చేతులు అడ్డం పెట్టుకుని చెప్పడం మొదలు పెట్టాడు.
“నేనా కోవకు చెందిన వాడిని కాదు. సరే కథ కానిద్దాం ..ముందు పేరు కుదిరితే కథంతా అదే దూసుకొస్తుంది- అంటారు కొందరు రచయితలు. సరే అలాగే నని ఆలోచించి, అతి వేగంగా –
‘మాగాయలో మర్మం’ అని పేపరుపై టైటిల్ వ్రాసాను. ఎదురుగుండా టేబుల్ పై మాగాయ పచ్చడి బాటిల్ ఉంది. ఆలోచనను ప్రేరేపించేది కనుక ఫర్వాలేదు అనుకున్నాను. మాగాయ అంటే మామిడికయతో చేసే ఒక రకమైన నిలవ పచ్చడి. అందులో మర్మమేమిటి? నోరూరుతుంది. మనసు ఉరకలు వేస్తుంది. అసలు కథ ఏమిటీ అని ఆసక్తిగా చదువుతారు. మాములు ఒక మామిడికాయను ఎన్నుకుని దాని చట్టూ వల కట్టి చదివేవాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయెట్టు సస్పెన్సుతో కథ నడుస్తుంది. అంత వరకు బాగానే ఉంది. ‘ఇల్లు అలకగానే పండగ అయిపోయిందా’ అన్నట్టు పేరు పెట్టగానే కథ అయిపోదుగా .. పేరుతొ కథ ఉరకలు వేస్తుందేమో నని ఆశ పడ్డాను కానీ పేరు దగ్గరే ఆగి పోయింది. దీర్ఘంగా ఆలోచించాను. కథా నాయిక పేరు రమ్య- నాజూకుగా, తెల్లగా ఉంటుంది. నాయకుడి పేరు మహేష్- చక్కటి తెలుగు పేరు ఉండి పిలవడానికి సులభంగా ఉండాలి. నాజూకు నాయికా పచ్చళ్ళు పెట్టదు అందుకే ఒక బామ్మ కూడా ఉంటుంది. మాగాయ కథలో బామ్మ ఉంటేనే సస్పెన్స్ లింక్ తెలుస్తుంది. నాయికా నాయకుల్లో కదలిక లేదు, చిత్తరువుల్లా ఉన్నారు. కథ పేరు మొదటి పేజిలోనే మొరాయించింది.
నేను మళ్ళీ ఒకసారి కిందకు, పక్కలకు టేబుల్ పై నున్న లాంప్ వేపు దానిపై ఉన్న పూల వైపు ఆపేక్షగా చూసాను గాని ఏమి లాభం లేక పోయింది. ఎప్పుడు వినని పేరు ఉంటె బావుంతుందేమోనని పించింది. మాగాయకు బదులుగా జామకాయ లేదా మరోటి ఉంటె కథ నడుస్తుందేమో.. ఆలోచనల్లోకి దూరాలని ఎంత ప్రయత్నించినా ఆలోచనలు కోట తలుపులు వేసుకున్నాయి. అక్కడే ఉన్న ఆంద్రజ్యోతి మేగజీన్ తీసుకొని కళ్ళు మూసుకొని మధ్యకు తెరిచి చూపుడు వేలి చివర ఒక చోట ఆనించి కళ్ళు తెరిచి చూసాను. చూపుడు వేలు కింద ఉన్న పదం ‘పల్లెటూరు’. నా మనసులో పూర్తి కథ ఉడుతలా పరుగులు తీసింది. ఓ పల్లెటూరులో ఓ పడుచు.. అందం, తెలివి ఉన్న ఆ పడుచు పిల్ల మనసిచ్చిన యువకుడు సిటి వెళ్లి చదువుకుని తిరిగి వచ్చి పెళ్ళి చేసుకుంటా నని మాటిస్తాడు. ఓ రోజు కాలేజి నుండి వస్తూ ఏక్సిడెంట్ లో దెబ్బలు తగిలి ప్రాణాలు వదిలాడు. పల్లెటూరిలో యువతి విచారంగా ఆ ఊరి కొండల్లో, కోనల్లో తిరుగుతూ చెట్టుకు, పుట్టకు తన కథ చెప్పుకుంటుంది. నీదను ఎండను తోడు రమ్మంటుంది. వెన్నెలను పలకరించ వద్దని హెచ్చరిస్తుంది. ఒక రోజు వెన్నెల్లో ఆమె శవం- ఆ పక్కనే ఓ పెద్ద సైజు చెప్పు కాస్త దూరంలో పడి ఉంటుంది.

ఒకసారి తల విదిలించాను. ఏ పత్రిక ఎడిటర్ కూ ఈ కథ నచ్చదు.
అందమైన యువతి గుండెల్లో బాకు దిగి ఉంది, ఓ యువకుణ్ణి పోలీసులు అరెస్టు చేసారు. అదెలా జరిగింది! ఆ నేరం నుండి యువకుణ్ణి తప్పించాలి. ఎక్కడో చక్కగా హీరోలా మంచి పేరుతొ చలామణి అవుతూ ఏ సంబంధము లేని ఆతన్ని హంతకుడని నిరూపిస్తే .. మిస్టరీ బావుంద నిపించింది. ‘మర్మం’ అని పేరు పెడితే..పత్రిక వాళ్ళు బాగా లేదంటే.. ఆ ఆలోచన భరించలేక గబగబా వంట గదిలోకెళ్ళి టీ చేసుకుని ఒక సిప్ తీసుకున్నాను. ఈ రోజు కథ రాసి తీరాల్సిందే.. పట్టుదల వదలకుండా డెస్కు దగ్గరకు నడిచాను.
“ నాకు నిజంగా ఇప్పుడు టీ కావాల్సిందే” శరత్ అన్నాడు. అందరూ మాక్కూడా అంటూ లేచారు.
నరేష్ “అంతలో ఫోన్ మోగింది.” అనేసి “ఓకే టీ తెచ్చుకున్నాక చెప్తాను.” తాను లేచాడు.
అందరిలో క్యూరియాసిటి మొదలయింది. “కథ సాగనీ” అన్నారు. సరిత టీ చేసేస్తోంది. అందరూ లేచి కాసిన్ని క్రంచీస్ గబగబా నోట్లో వేసుకుని టీ సిప్ చేస్తూ కూర్చున్నారు.
“ఫోన్ ఎవరు చేసారు?” టీ సిప్ తీసుకోకుండానే సుజాత ఆత్రుతగా అడిగింది.
“ఫోన్ మోగిందని చెప్పాగా, నేను ఫోన్ ఎత్తాను “హల్లో” అవతలి వైపు ఆడగొంతు.
“నీలమ్! నువ్వేనా!!” ప్రేమగా, తీయగా పలికింది. బరువైన యాసలో ఉన్న తెలుగు.
“మీరెవరు?” తడబడుతూ అన్నాను.
“నేను ప్రీతిని. జాగ్రత్తగా విను. నేను చాల అపాయకర పరిస్థితిలో ఉన్నాను. నువ్వు త్వరగా
రావాలి. చాలా ప్రమాదంలో ఉన్నాను.”
“మీరేం చెప్తున్నారో కానీ మీరు రాంగ్ నంబర్ డయల్ చేసారు.”
“నీ కిప్పుడే హాస్యమా! వాళ్ళు వస్తున్నారు. నేనేం చేస్తున్నానో తెలిస్తే నన్నుచంపేస్తారు. వెంటనే బయల్దేరి వేగిరా. నువ్వు రాకపోతే నేను చావడం ఖాయం. తెలుసుగా 102 ఏ. మినర్వా స్ట్రీట్, బడిచౌడి. కోడ్ ‘పల్లెటూరు’ హుష్ రిపీట్ చేయకు.”
ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను. ఇలాంటాప్పుడే సిగరెట్ తాగాలనిపిస్తుంది. వసుధకు సిగరెట్ వాసన గిట్టదు. ఈ జన్మలో జ్ఞానం ఉన్నంత వరకు సిగరెట్ ముట్టనని ప్రామిస్ చెసాను. నానా
ఇక్కట్లు పడి సిగరెట్ మానేసాను. గమ్మత్తుగా ఉన్నఆ ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాను.”
ఫేమిలీ రూమ్ లో అందరూ టీ సంగతి మరిచి పోయి – ఆ ఫోన్ చేసింది ఎవరు? ఆవిడెం చేసింది? ఎవరు ఆవిడను చంపాలను కుంటున్నారు?- ఆలోచనలతో చెవులు నిక్క బోడుచుకుని కూర్చున్నారు. మధ్యలో ప్రశ్నలు వేయోద్దన్నరుగా!
నరేష్ అందరి మొహాల వేపు ఒకసారి చూసి చెప్పడం మొదలు పెట్టాడు.
“మీలాగే నేను కూడా ఆనాడు ఆలోచిచాను- ఈ నీలమ్ ఎవరు? దేని గురించి ఆవిడ మాట్లాడింది?ఆ వచ్చే వాళ్ళెవరు? ఏం పని చేసిందని భయపడ్తోంది? చంపేసే వాళ్ళెవరు? నేను నీలమ్ ను అవునా కాదా అని తెలుసుకోకుండా సీక్రెట్ కోడ్ కూడా చెప్పేసింది ! నాకథకు నేను పిక్ చేసిన పేరు పల్లెటూరు అందుకే ‘పల్లెటూరు’ అని నాకు వినిపించి ఉంటుంది. లేక ఆవిడ నిజంగా ఆ పదమే చెప్పిందా! తప్పకుండా ఇది రాంగ్ ఫోన్ కాలే అనుకుని నా పేపర్ల ముందు కూచున్నాను. లాభం లేదు. జరిగే సంఘటనల నుండి నా కథకు నాంది మొదలవుతుందేమో-
కాళ్ళకు చెప్పులు తగిలించుకుని ఇంటికి తాళం వేసి బయల్దేరాను. ప్రీతి చెప్పిన మినర్వా స్ట్రీట్ ఇక్కడికి సుమారుగా ఒక మైయిలు ఉంటుందేమే. బడిచౌడి దగ్గర బట్టల కోట్లు, స్టీల్ గిన్నెల కొట్టు రోడ్డుకు రెండు వైపులా వరుసగా ఉన్నాయి. జనం వాటినుండి బయటికి, బయటి నుండి లోపలికి కదులు తున్నారు. హనుమాన్ టెంపుల్ దాటి ఆ దుకాణాల పక్కనే ఉన్న మినర్వా
స్ట్రీట్ లోకి వెళ్ళాను. ఓ వంద గజాలు దాటగానే కొన్ని ఇళ్ళున్నాయి. అక్కడ ఇంటి నంబరు
చూస్తూ వెళ్ళాను. ఆ రోడ్డు కాస్త మెలిక తిరిగి కుడి వైపు మళ్ళింది. అలా ఆ రోడ్డు మీద నడుస్తూ అప్పుడప్పుడు వచ్చే సైకిలును, ఆటోరిక్షాలను తప్పించుకుంటూ చివరికి ఒక చోట ఆగాను. ఎదురుగ వన్ జీరోటు ఏ అని ఒక షట్టర్ డోర్ మీద ఉంది. వెళ్లి తలుపు తట్టాను. మధ్య వయస్సావిడ తలుపు కొద్దిగా తెరిచింది. లోపల అన్ని చెక్కా బొమ్మలున్నాయి.
“ఈయాల నాకు పెయ్యి బాగలేదు, జోరంగ ఉంది. కోట్టు తెర్లేదు. లోనికి రా.” అంటూ శటరు పూర్తిగా పైకి లాగి అతని వైపు చూసింది. నేను ఆవిడ వైపు చూసి వచ్చిన పని దాచి జాగ్రత్తగా ,
“ఈ నాట్య భంగిమలో ఉన్న బొమ్మ ధర ఎంత?”
“నూట డెబ్బై అయిదు రూపాయలు. అవి చాల ఫిరంది.”
“అవునా! ఈ జంట బొమ్మలు ఎంత?”
“అవి డెబ్బై, నీకు పసందైతే అరవై కిస్త తీస్కో..”
కాసేపలాగే ఉంటె కొనాల్సి వస్తుందేమే నని భయం వేసింది. వచ్చిన పని కాకుండా వెళ్లి పోవాలని లేదు. ఆవిడ మాటల తీరు ప్రీతి మాటల్లగా లేవు. ఫోన్ చేసింది ఆవిడ కాదు. ఏదైనా నేను ముందు బయట పడి అడగ దల్చుకో లేదు. మరో బొమ్మను చూపించి ధర అడిగాను.
“అది ఎండు వందల యాబై.”
“బాగా ఫిరంది.”
“నీకేం గావాల్నో చెప్పు.” అంతకు ముందు చూసిన జంట బొమ్మలు తీసి చూపిస్తూ
“ఇవ్వి తీస్కో. యాబై కిస్ట. ఈ రోజులల్ల ఎమోస్తున్నయి. ఊ అంటే నూరు రాల్తయ్.”
ఒక విగ్రహం చేతిలో అగరువత్తులు వెలిగించేట్లుగా ఉంది.
“అది ఎంత?”
నరేష్ పక్కనే కూర్చున్న సుధాకర్ “బొమ్మల ధరలు అడగటమేనా లేక కథ ఏమైనా ముందుకు కదుల్తుందా, సాగదీయకురా దోస్త్, సస్పెన్స్ లో పెట్టావు!” సస్పెన్స్ తట్టుకో లేని శరత్ అన్నాడు.
“మధ్యలో బ్రేకులు వేయొద్దు. కానియ్ రమేష్.” వినయ్ అనగానే రమేష్ అందుకున్నాడు.
“అది గూడ యాభై. ఓ అయిదు తక్కువియ్యి.”
“సరే” ఆవిడ పేపర్లో బొమ్మను చుట్ట బెడ్తోంది. నేను చిన్నగా -పల్లెటూరు- అన్నాను.
పేపరు చుట్టడం ఆపేసి, “ఏమన్నవు?” అంది.
“ఏమనలేదు.”
“పల్లె అని ఏదో అన్నట్టు ఇనబడ్డది.”
“అవును” తప్పించుకోవాలని లేదు.
“అంత దానికి నీ టైం, నా టైం ఖరాబు చేస్తున్నవు. ఆ కుడి పక్క మెట్లున్నవి, మీదికి వొ . నీ కోసం ఎదురు సూస్తున్నది.” పేపరులోంచి బొమ్మను యధా స్థానంలో పెట్టింది.
హమ్మయ్య కొనాల్సిన పనిలేదు అనుకుని మెట్లెక్కి పైకెళ్ళాను.
ఇరకాటంగా ఉన్న మెట్లు, సన్నగా ఉన్న కారిడార్ లో ముందుకు వెళ్ళాను. కుడివైపు తలుపు మీద 102 ఏ అని ఉంది. తలుపు తట్టబోయేలోగా అదే తెరుచుకుంది. కాస్త తెరుచుకున్న తలుపును మరికాస్త లోపలికి తోసాను. అది చిన్న గది. ఒక కుర్చీలో కూర్చుని ఆత్రంగా తలుపు వేపే చూస్తున్న యువతి. ఆ యువతి ప్రీతియా! ? పసిమి ఛాయలో పెద్ద కళ్ళతో నన్నే చూస్తోంది. చుడీదార్ వేసుకుంది. తెలుగమ్మాయిలా లేదు. అక్కడే ఒక క్షణం నిలుచున్నాను. అసలు నేనెవరో చెప్పాలి. నీలం ఎవరో! ఆపద ఏమిటో!! కనుక్కోవాలి. మరుక్షణంలో ఆ యువతి ఒక్క అంగలో వచ్చి రెండు చేతులు నా మెడ చుట్టు వేసి చిన్న కేక వేసింది. ఆమె తీరు చూస్తె సంతోషంతో వేసిన కేక అనిపించింది.
“వచ్చావా నీలం! ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకున్నానో!” నేను మాత్రం కదలకుండా జరిగినది
జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రీతి అప్పుడే స్పృహలోకి వచ్చిన దానిలా సిగ్గుతో
వెనక్కి జరిగింది.
“నువ్వు రాకపోతే నీగురించి తెలిసేదే కాదు. నీతో మాట్లాడ్డమే తప్ప నీ ఫోటో కూడా చూడలేదు. అందుకే ఎలా ఉంటావో తెలీదు.”
“నేనెల ఉంటానో తెలీదా!” చిన్నగా అన్నాను.
“నేను ఊహించినదానికంటే హేండ్సమ్ గా ఉన్నావు.”
“అవునా!!” నెమ్మది..నెమ్మది.. అదుపులో ఉండు, అని నన్ను నేనే హేచ్చారించుకున్నాను. మనసు గంతులు వేయకుండా ఉండాలని ఊరడించు కున్నాను.
“మీరేమి అనుకోక పోతె…”
“ఏమే అనుకోను” తెలీకుండానే అనేసాను.
గబుక్కున నా చెంప మీద ముద్దు పెట్టి ,”థాంక్స్ వచ్చినందుకు.” అంది.
హాయిగా ఉంది నాకు. అసలు రావాల్సిన మనిషి రాకుండ ఉంటె చాలు. పేరులాగే మనిషి ఎంత అందమయినది! ఎంత ప్రేమమయి!! ప్రీతి కలిగించేలా ఉంది.
“నిన్ను ఎవరైనా ఫాలో అయ్యారా?”
“నేను గమనించలేదు, నా వెనక ఎవరు వచ్చినట్లు అనిపించలేదు.”
“వాళ్ళు చాలా క్రూరులు. పంకజ్ మరీ రాక్షసుడు.”
“ఆ రాక్షసుడి పని నేను తెలుస్తాగా.” అనాలోచితంగా అనేసాను.
“నువ్వు వీరుడివని విన్నాను. వాళ్ళు రక్తం చవి చూసిన రాక్షసులు. నీకు తెలుసా! అది నా దగ్గరున్నదని తెలిస్తే నన్ను చంపేస్తారు. నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావు. ష్…ఎమిటా చప్పుడు?” గుసగుసగా అంది.
కింద షాపులోంచి ఏదో చప్పుడు వస్తోంది. కదలకు అని చేతితో సైగ చేసి తాను మునివేళ్ళ మీద
నడుస్తూ మెట్ల వరకు వెళ్ళింది. పాలిపోయిన మొహంతో నా ఎదురుగ వచ్చి,
“ఆ వచ్చింది పోలీసులు. పైకి వస్తున్నారు. నీ దగ్గర రివాల్వర్ ఉండే ఉంటుంది. ఏది?”
“ఏమంటున్నావు! నేను వాటితో పోలీసులను ఎదుర్కోవాల!” నాకు చమటలు పడ్తున్నాయి.
“నీకిలాంటివి కొత్తెమీ కాదుగా, వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడ్తారు, నిన్ను చంపేవరకు శిక్షిస్తూనే ఉంటారు.”
“వాళ్ళు… ఏమిటీ!..ఏం చెస్తారూ!!..?” నా వెన్నెముకలో భయం పైకి, కిందకు కదుల్తోంది. మెట్లపై అడుగుల చప్పుడు దగ్గరగా వినిపిస్తోంది.
“వాళ్ళు వచ్చేసారు.” గుసగుసలాడింది. మరి దగ్గరగా వచ్చి, “వాళ్ళేమి అడిగినా ఏమి తెలీదు అను. ఒప్పుకోక పోవడమే ఆపద నుండి తప్పించేస్తుందని ఆశిద్దాం.” అంతలోనే తలుపులు
దభాలున తెరుచుకుని రెండు మానవాకారాలు- అందులో ఒకతను ఆరడుగుల ఎత్తులో వున్నాడు. చామనచాయ గుబురు మీసాలతో కుడి చేతిలో మూడడుగుల కట్టెతో ముందుకు వచ్చి నన్ను ప్రీతిని పరీక్షగా చూసాక గదంతా కలయ జూసాడు. రెండో ఆతను నల్లగా ఐదడుగుల పైన ఓ పిడికెడు వుంటాడు. గబగబా వచ్చి నన్ను పరీక్షగా చూస్తూ మరింత నా దగ్గరగా వచ్చి, “యూ ఆర్ అండర్ అరెస్ట్. మేము నళ్ని జనార్దన్ హత్య కేసు పరిశోదనలో పని చేస్తున్నాం. నీ అరెస్ట్ వారెంట్ ఇదిగో. మా వెంట పోలీస్ స్టేషన్ కు నడువ్.” అన్నాడు గట్టిగా.
“నీలం” ప్రీతి అరిచింది. నేను ఒకడుగు ముందుకు వేసి బలవంతంగా నవ్వుతూ,
“నువ్వు పొరపడుతున్నావు. నేను నీలం ను కాదు. నాపేరు నరేష్.”
ఆ వచ్చిన ఇద్దరు నమ్మలేనట్టుగా చూసారు.
“నేను నీలంను కాదు అని పోలీసులకు నచ్చ చెప్పు ప్రీతి.” ప్రీతి వైపు ప్రాదేయపుర్వకంగా చూసాను. ప్రీతి వణుకుతూ ఓ పక్కగా ముడుచుకుని నిలబడింది. వాళ్ళిద్దరూ కిటికీ పక్కగా వెళ్లి దేనికోసమో చూస్తున్నారు. నేను వణుకుతూ నిలుచున్న ప్రీతి దగ్గరగా వెళ్లి ,
“నా మాట విను నేను నిజంగా నీలంను కాదు. నా పేరు నరేష్. నీ కెవరో తప్పు ఫోను నంబరు ఇచ్చారు. నువ్వు ప్రమాదంలో ఉన్నావంటే వచ్చాను.”
ప్రీతి నమ్మలేనట్టుగా నన్ను చూస్తూ,
“మీరు నీలం కదా! మీ గొంతు అలాగే ఉంది!!”
“ఉహూ.. నా పేరు నరేష్.”
అవమానం, సిగ్గు మిళితమైన మొహం. “నేను మీ దగ్గరగా వచ్చి…”
“ఫర్వాలేదు, భయంలో ఉన్న నీవు నన్ను చూడగానే కలిగిన భావంతో… ఫర్వాలేదు నేనేం అనుకోను. నా పేరు ఋజూవు చేసే ఐడీ వీళ్ళకు చూపించాలి. నీ ఫ్రెండ్ నీలం ను జాగ్రత్త అని హేచ్చరించు. ఆ తర్వాత ..”
“ఆ తర్వాత ఏమిటి?”
“ఈ సారి ఎవరేనా తప్పు ఫోను నంబరు ఇస్తే జాగ్రత్తగా చెక్ చేసుకో.”
థాంక్స్ అన్నట్టుగా నావైపు చూసి,
“గుర్తుంచుకుంటాను. మీరు చెప్పింది గుర్తుంచు కుంటాను. మీరు నన్ను గుర్తుంచుకుంటారు కదూ!” అంది.
“గుడ్ బై.” ఇటు తిరిగి “నేను మీతో రావడానికి రడీ.” అన్నాను. ఖూనీ కోరులను పట్టుకోవాలని రాత్రింబవళ్ళు కష్టించే డిటెక్టివ్ పోలీసులంటే నాకు గౌరవమే. వాళ్ళ వెనకే నెమ్మదిగా నడిచాను.
“మీరు ఇన్స్పెక్టర్ కదూ!” పొడుగ్గా ఉన్నతన్ని చూస్తూ అన్నాను.
“పొలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీర్రాజు, నేను అతని అసిస్టెంట్ గంగారాంని” ముందు నడుస్తున్నతను చెప్పాడు.
“వీర్రజుగారు నేను సీరియస్ గా సిన్సియర్ గా చెప్తున్నాను, నా పేరు నరేష్. నేను ఇంజనీర్ ను. బీజాజీ కంపెనీలొ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. ఇవన్ని మీకు ఋజూవు చూపించగలను.” డిటెక్టివ్ తలతిప్పి నా వేపు చూసాడు. నమ్ముతున్నట్టు అనిపించింది. అయినా ఆడిగాడు,
“ఆవిడ నిన్ను నీలమ్ అని పిలిచిందిగా !”
“అది మరో కథ. ఆవిడ నన్ను ఆ పేరుతొ పిలవడం పొరపాటు. మీరు నన్ను అరెస్టు చేయడం మరొక పొరపాటు.”
కింద గదిలో బొమ్మలమ్మే ఆవిడ కనిపించలేదు. ముగ్గురం ఆ చిన్న రోడ్డును దాటి మెయిన్ రోడ్డు మీదకు వచ్చి అక్కడే ఉన్న జీపులొ కూచున్నాం.
“మీరు ఏ పొలీస్ స్టేషన్ కు పోతున్నారు?”
“నారాయణగూడ.”
“మధ్య దారిలో నా ఇల్లు ఉంది. ఒక ఐదు నిముషాలు ఆగితే మీకు నా పేరుతొ ఋజువులు చూపించగలను.”
వీర్రాజు నరేష్ వైపు చూసి .. గంగారాంకు సరేనన్నట్టు తలూపాడు.
“బసంత్ టాకిస్ లేనులో టైపు ఇన్ స్టిట్యుట్ ఎదురుగుండా ఉంది.” డ్రైవరు చెవిలో గట్టిగా అరిచాను. జీపు స్పీడులో వినిపించుకోకుండా పొలీస్ స్టేషనుకు తీసుకేల్తాడేమో ననే భయంతో. ఇంటి దగ్గర జీపు ఆగింది.
“ఏ పకడ బన్దీలు అవసరంలేదు. ఇద్దరం నెమ్మదిగా అతనితో వెళ్దాం.” వీర్రాజు చెప్తున్నాడు గంగారం తలూపాడు. నాకూ ఆ పధ్ధతి నచ్చింది. అందరిముందు పరువు పోకుండా ఉంటుంది.
ఇంటిముందు కూరగాయలు బండిపై అమ్ముతున్న ముసలాడు ,”ఎయన్న కావాల్నసర్? అమ్మగారు లేరని కొత్తిమీర, కర్వేపాకు ఇయ్యలేదు.” అన్నాడు.
“ఇవ్వాల్లోద్దు, రేపు తీసుకుంటాను.”
“నరేష్ సర్, అమ్మగారు మంచి నెయ్యి గావల నన్నరు. డబ్బా ఇప్పుతున్న ,తాజా నెయ్యి గిన్నె పంపన్రి.”
“నెయ్యి సంగతి తర్వాత రాములు.. నేను ఇక్కడ ఎన్నాళ్లనుండి ఉంటున్నానో చెప్పు వీళ్ళకు.”
వాడికి అర్థం కాలేదు. వింతగా చూసి నవ్వి, “ఏం సర్, తమాషా జేస్తున్నరు. ఏండ్ల కింద ఈ మడిగేల బోని బెట్టింది మీరే గద సర్.”
నేను వాళ్ళిద్దరివైపు చూస్తూ నవ్వాను. వీర్రాజు బదులు నవ్వుతూ,
“బానే ఉంది కానీ ఇంకా ప్రూఫ్ లు చూడాలి పద పద..ఇంట్లోకి.” అంటూ నాకంటే ముందుగానే
మెట్లేక్కసాగాడు. పైకొచ్చి తాళం తీసి తలుపు తెరిఛి, “రండి” అంటూ నేను లోపలికి నడిచాను. ముందు గదిలో నాలుగు కుర్చిలు, రూములో ఓ పక్క డెస్కు, కుర్చీ ఉన్నాయి. లోపలికేలితే ఒక వైపు చిన్నతలుపు లేని గది, ఆ పక్క వంటగది, ఈ పక్క ఒక గది తలుపు మూసి ఉంది. అక్కడ డేస్కును గమనిస్తున్న వీర్రాజుతో, “అది నేను వ్రాయాలనుకున్న కథకు నాంది.” అన్నాను.
“మాగాయలో మర్మం, పల్లెటూరు (పడతి మరణం).” అంటూ పేపరుపై వ్రాసినవి పైకే చదివాడు గంగారాం.
“ఏ పల్లెటూరు, ఎవరా పడతి? ఆ కథ దేని గురించి?” వీర్రాజు ప్రశ్న.
“ఆ పల్లెటూరే ఈ ప్రమాదంలోకి దించింది.” అన్నాను దీనంగా.
గంగారాం నుదుటి మీద వేళ్ళతో కొట్టుకుంటూ,”ఖర్మ.. కథల పిచ్చివాడులాగున్నాడు.” సన్నగా సనిగాడు.
“అసలు విషయాని కొద్దాం. ఇవిగో నా ఉత్తరాలు, ఇవి నా కథలు, ఇది నా బేంక్ బుక్.”
వీర్రాజు తలాడిస్తూ, “ఇవన్నీ బానే నమ్మిస్తున్నాయి. కానీ నరేష్, నీలం ఒకరే కావచ్చుగా! అందుకే నువ్వు స్టేషన్ కు వస్తే నీ వేలి ముద్రలు తీసుకుంటాం.”
“కావాలంటే ఇల్లంత వెదకండి. ఏదైనా అనుమానం కలిగిస్తే నన్ను తీసుకెళ్ళండి.”
గంగారాం మోహంలో మందహాసం వెలిసింది. నా వైపు చూస్తూ,
“ఆ పక్క రూములో కెళ్ళు. డిటెక్టివ్ సాబును గూడ తీసుకుపొయ్యి కాస్త కాఫీ, టిఫిన్ చూడు. నేను ఈ లోగా నాలుగు వైపులా చూస్తాను.”
“అదా..సంగతి. సరి సరిలే. వీర్రజుగారు అలా ఆ రూములో టేబుల్ దగ్గర కూర్చుందాం. మీ అసిస్తెంటు అంతా చెక్ చేసేలోగా మనం కాస్త విస్కీ.. ఏమంటారు?”అన్నాను. పుట్టగానే పేరు కంటే ముందుగా లంచం లేనిదే ఏ పని కాదని చెవిలో ఊదుతారు.
“మీరలా అంటే కాదంటనా. ఎవరినీ చిన్నబుచ్చడం నాకు అలవాటు లేదు. సరే పదండి.”
వెనుక రూములో గంగారాం స్టేషన్ కు గాబోలు ఫోనులో మాట్లాడడం అస్పష్టంగా వినిపిస్తూనే ఉంది. ఒక గ్లాసులో విస్కీ పోసి సోడా బాటిల్ ఎత్తాను వీర్రాజు వద్దని చేయితో వారించాడు. ఆపళంగానే పట్టించేస్తాడు గాబోలు అనుకుని నేను ఉత్తి సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాను.
“మీకు అనుమానంగా ఉంటె ఒక సిప్ తీసుకోమంటే తీసుకుంటాను. మీకు ప్రతీది అనుమానంగా ఆలోచించడం అలవాటై పోయుంటుంది కదూ!”
వీర్రాజు నవ్వి, “ఎప్పుడు ఇలా డ్యూటీలో ఉన్నపుడు తాగలేదు. ఇదే మొదటి సారి. జాగ్రత్తగా ఇల్లంత చెక్ చేయాలి. ఎంత క్విక్ గా చేసినా పేపరు పని అంటూ ఉండనే ఉంటుంది.”
“మీ అసిస్టెంట్ మనతో కలిసేలా లేడు.”
“చాల మంచి వాడు. అతని మీద ఒక్క నింద కూడా లేదు.” ఖాళి అయిన గ్లాసులోకి మరి కొంచెం విస్కీ వంపుకుంటూ అన్నాడు.
అదే సమయమని నేను, “ఇప్పుడు చెప్పండి అసలు కథ. ఆ చంప బడిన నలిని జనార్దన్ ఎవరు? ఎందుకు చంపారు?”
“రేపు పేపర్లో అంతా వస్తుంది చదువుకో.”
“ఇంత వరకు నా ఆత్రుతను ఆపుకున్నాను. జరిగింది చెప్పడంలో తప్పెమీ లేదుగా.”
“నేను నీకు వివరాలు చెప్పగూడదు. అది రూలు.”
“రూల్సు సంగతి వదిలెయ్యండి, మన తీరు చూస్తుంటే స్నేహితుల్లా డ్రింకు తీసు కుంటున్నాము.”
“నీకు చెప్పడంలో నష్టం లేదులే. నళిని హైదరాబాదు నుండి నిజమాబాదుకు మకాం మార్చిన
తర్వాత లక్షాధికారి అయ్యింది. వచ్చేఆదాయం ఏమీ కనిపించడం లేదు. దినదినానికి లక్షలు పెరిగి పోయాయి.”
“నేను రోజంతా జాబు చేస్తూ, రాత్రుళ్ళు రచయితగా కాఫీ డబ్బులు సంపాదిస్తూ దినదినానికి
బీదవాన్నిఅవుతున్నాను. నేను కూడా నిజమాబాదు వెళితే ధనవంతున్నవుతానేమో!” నేను
ఉత్సాహంగా అన్నాను. నా మాట వినిపించుకోనట్లే చెప్పుకు పోసాగాడు.
“కొంత కాలం క్రితం నలినీ జనార్దన్ ఖరీదైన చీరలు రాయల్ ఫెమిలీస్ దగ్గర తీసుకొని ధనవంతులకు, అలాంటివి కలెక్ట్ చేసే వాళ్ళకు అమ్మేది.”
“పాత బట్టలు ఇచ్చి స్టీలు గిన్నెలు కొండం విన్నాను గాని ధనవంతులు వాడిన బట్టలు అమ్మి లక్షాధికారి కావడం నేనెప్పుడు వినలేదు.”
“వనపర్తి మహారాణి ఒకసారి కట్టిన పట్టు చీర మళ్ళి కట్టదట. ఆమె తన చీరలన్నీ చేలి కత్తేలకు, ఇతర స్త్రీలకూ ఇచ్చేదట. కొంత మంది అవి అమ్ముకొని డబ్బు గదించేవారట. నళినీ జనార్దన్ చాల మంది ధనవంతుల కుటుంబాలలో వెలిగిన మనిషి. ఇలా రాయల్ ఫెమిలీస్ నుండి చీరలు తెచ్చి అమ్ముతుందని కొన్న వాళ్ళకే తెలీదు. నళినీ జనార్దన్ ఒకసారి వనపర్తి మహారాణి దగ్గరకు వెళ్లిందట. మహారాణి చాలాకాలం నుండి అడుగున ఉన్న ఒక చీరను నళినీ జనార్దన్ కు ఇచ్చిందట. ఆ చీర మహారాణికి తన అత్తగారు ప్రత్యేకంగా ఇచ్చిందిట. ఆ తర్వాత నళినీ జనార్దన్ ఇంట్లో నాలుగైదు సార్లు దొంగలు పడ్డారు. విలువైన వస్తువలు ఏమీ తాకలేదు కానీ చీరల్ని ఎత్తుకు పోయారు. ఆ తర్వాతే ఆవిడ మకాం మార్చేసింది.”
వీర్రాజు ఊపిరి తీసుకుని ఆత్రంగా చూస్తున్న నన్ను చూస్తూ మళ్ళీ చెప్పా సాగాడు.
“రెండు వారాల క్రితం మహారాణి కూతురు సుహాసిని ఇండియాకు వచ్చిందట. లండన్ లో చదువుకుని అక్కడే ఒక బిజినెస్ మెన్ ని పెళ్ళి చేసుకుంది. సుహాసిని ఇండియా రాగానే నలినీ జనార్దన్ ఇంట్లో కలిసిందని ఇద్దరికీ పెద్దగ వాగ్వివాదాలు జరిగాయని తోటమాలి, పనిమనిషి ఇద్దరూ ఒకే తీరుగ చెప్పారు. ‘అది నీ దగ్గరే ఉంది’ అని సుహాసిని అరిచిందట. ‘నా దగ్గర లేదు’
అని నలిని అందిట. ‘దాంతో నువ్వు ధనవంతురాలి వయ్యావు. దాని అసలు కథ నీకు తెలీదు. అది మా కుటుంబానికే శుభం కలిగిస్తుంది. నీకు హాని జరుగుతుంది. దాని లోని వేయి వజ్రాల సంగతి నీకు తెలీదు. నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది.’ అని అరిచి వెళ్లి పోయిందిట.
రెండు రోజుల తర్వాత హోటలు నుండి సుహాసిని మాయమయ్యింది. రూమ్ లో ఒక కాగితం పై నీలం పేరు అడ్రస్ ఉంది. ఆ కాగితంలో ..’ఆ చీరకు ధర కట్టాలనుకుంటే నాకు ఫోన్ చెయ్యి’ అని ఉంది. ఆ అడ్రస్ కోసం అంతా వెతికాం కానీ ఎక్కడా దొరక లేదు.
ఈ మిస్టరీ అంతా ఆ చీరలో ఉంది. నిన్న నీలం నళినికి ఫోన్ చేసాడట. నళిని ఇంట్లో ఒక గంటపైగా ఉంది వెళ్లి పోయాడట.మాకు వచ్చిన ఇన్ ఫర్ మేషన్ తీసుకుని వెంటనే మేము వెళ్ళే సరికి నళిని భయంతో వణుకుతోంది. నీలం తప్ప ఎవ్వరు వచ్చినా లోపలి రానివ్వ వద్దని చెప్పిందిట. అంటే నీలం కాక మరెవరో కూడా వస్తారని భయంతో ఉందన్నమాట. అదే రాత్రి నీలం దగ్గరకు వెళ్తున్నానని వెళ్ళిన నళిని తిరిగి రాలేదు. నీలం రూములో నళిని శవం ఉంది. కత్తితో గుండెలో పొడిచాడు హంతకుడు. ఆమె పక్కనే నెల మీద ఏముందో ఉహించాగలవా!”
నా వైపు గమనికగా చూస్తూ అడిగాడు వీర్రాజు.
“చీర! వేయి వజ్రాల చీర” నా మెదడు ప్రమేయం లేకుండా నోరు అనేసింది.
“ఈ మిస్టరీ అంతా చుస్తే ఆ వస్తువ విలువ ఏమిటంటే… ఆ ఫోను స్టేషన్ నుండా!” ఫోను రింగవుతోంది. వీర్రాజు లేచి వెళ్ళాడు.
నాకు ఆసక్తి ఎక్కువైంది. వీర్రాజు వచ్చేవరకు ఓపిక పట్టాలి. ఇదంతా చేసింది నేను కాదని నా చేతి వేలి ముద్రలు తీసుకుంటే వెంటనే తెలిసి పోతుంది. నీలం ఫోన్ చేసదేమో! ఆ వస్తువ ఏమిటి! వావ్! వేయి వజ్రాల చీర! ఎత విచిత్ర మయిన కథ. అందమయిన అమ్మాయి, ఆంగ్ల నాగరికతలో పెరిగిన సుహాసినికి అతికిన కథ. ఆ ఆలోచనలను వదిలేసి లేచి వొళ్ళు విరుచుకుని వరండాలోకి వచ్చాను. నిశ్శబ్దం … గదంతా ఖాళీగా ఉంది. ఆ పక్కనే ఉన్న గ్లాసు అల్మారు తలుపులు తెరిచి ఉన్నాయి. అది మొత్తం ఖాళీగా ఉంది. డేస్కుపై పెట్టిన నా షికో రిస్ట్ వాచ్ లేదు. రూమంతా ఖాళీగ, బోసిగా ఉంది. అక్కడ టి.వి., వీసిఆర్ లేవు. గాబరాగా బయటకు పరుగెట్టాను. పోయిన నెలలో వసుధ బలవంతంగా ఆ గ్లాసు అల్మైర కొనిపించింది. దానిలో వెండి గిన్నెలు, క్రిస్టల్ గ్లాసులు, వాళ్ళ నాన్నజపాను నుండి తెచ్చిన ఖరీదైన బొమ్మలు అన్నీ పెట్టింది. మొన్నే అమెరికా నుండి వచ్చిన ఫ్రెండ్స్ ను భోజనానికి పిలిచింది. షో చేయాలని కోరిక పుట్టింది. అ షో ఇప్పుడు… అమెరికాలో లాగ షో చేస్తే దక్కవు అని చెప్పాను, ఇప్పుడదంతా ఖాళీ అయింది. నాకూ అందంగానే అనిపించాయప్పుడు. కుర్చీలో కూర్చుని తల పట్టుకున్నాను. డోర్ బెల్ వినిపించి నేను నీరసంగా తలెత్తి చూసాను, ఎదురుగ రాములు.
“సర్! మీకేమైనా అవసర ఉందేమోనని మీ దోస్తులు అడుగమన్నరు. కూల్ డ్రింక్ ఏమైనా కావాల్న సర్?”
“నా దోస్తులా! ఎవరు?” గాబరాగా అడిగాను.
“మీరు ఒక దోస్తుతో మాట్లాడుతున్నపుడు డబ్బల సామాన్ పెట్టేటందుకు నేను ఎల్ప్ జేసిన సర్.”
“ఏంటీ! నువ్వు హెల్ప్ చేసావా!!” గట్టిగా అరిచాను.
“మీరు గంగారాం సాబ్ తో చెప్పిన్రట గద సర్ నన్ను పిలిచి పని చేపిచ్చు కోమని. అందుకే జేసిన. ఇల్లు మారుతున్నవా సర్?”
“వాళ్ళు చాల దూరమ్ వెళ్లి పోయుంటారు, అవునా!” ఫ్లాట్ టైరులా నిర్జీవమై పోయాను.
“ఆ డబ్బాలు జీపుల పెట్టి చాలాసేపయింది సర్. పెద్ద సాబ్ రాంగానే స్పీడుగా ఎల్లి పోయిన్రు.”
అయోమయంగా నన్ను చూస్తూ అన్నాడు.
“గొప్ప పని చేసావు. వెళ్ళు.” వాణ్ణి కసిరాను. వాడు భయంతో ఒక్క పరుగున కిందకు పరుగెత్తాడు. ఏం చేయాలో తోచక మెటికలు విరుచుకున్నాను. తోచిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసాను. అరగంట తర్వాత వచ్చిన ఇన్స్పెక్టర్ రఘురాంకు అంతా పూస గుచ్చినట్లు చెప్పాను.
నేను చెప్పడం పూర్తవగానే,
“తెలుస్తూనే ఉంది. ఇది “జాలీ గుడ్ గేంగ్” చేసిన పని. ఇలాంటివి చాల చేసారు. ఒక పొడుగాటివాడు, మరోడు పొట్టివాడు, ఒక అమ్మాయి.”
“ఓ.. అమ్మాయి కూడానా!”
“అవును. రకరకాల వేషాలు, భాష మార్చగలదు. హైదరాబాదు లోనే పెరిగింది .”
“ఎంత నమ్మాను.” చిన్నగా అన్నాను.
“నీకు పోన్ చేయడం, అచూకి ఇవ్వడం ముందే వేసిన ప్లాన్. ఆ బొమ్మలమ్మే లేడి కూడా వాళ్ళ గ్యాంగ్ లోదే అయ్యుంటుంది.” ఇన్స్పెక్టర్ నోట్ చేసుకుంటూ అన్నాడు.
“వాళ్ళ ప్లాన్ ప్రకారమే నేను బుట్టలో పడ్డాను. నా ఇంటికి తీకుసు రావడంతో వాళ్ళ పని మరింత సులభమయింది. నా వస్తువులన్ని దొరుకుతాయ?” అవమానంతో నా మొహం
ఎర్రబడింది.
‘పయత్నిస్తాం. మీ వెహికిల్ ఉందా చూసుకోండి.” అంటూ వెళ్లి పోయాడు.
అంతలో డోరు దగ్గర రాముడు చిన్న డబ్బాతో నుంచుని ఉండటం చూసాను.ఎవరిచ్చారబ్బా! అనుకుంటూ డబ్బా చూసాను.
“డామిట్ …” ఆ డబ్బాను డెస్క్ పై పెట్టాను.
***** ***** *****
“డబ్బాలో ఏముందో గెస్ చేయండి!” పూర్తిగా కథలో లీనమై పోయి వింటున్న అందరి వేపు చూస్తూ అడిగాడు నరేష్.
“వేయి వజ్రాల చీర” మెరిసే కళ్ళతో అంది తరుణ.
“ఇంకా ఏం చీర.. చీరా లేదు, సారే లేదు.” అంది రమ.
“డబ్బాలో ఏముందో చెప్పు, సస్పెన్స్ చాలిక.” రవి లేచి ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు.
“ఆ డబ్బాలో నేను బేరం చేసిన చెక్క జంట బొమ్మలు. వాటితో పాటు ఒక నోటు.”
“ఎవరు వ్రాసారా నోటు? అందులో ఏముంది?” నవీన్ ఆత్రుతగా అడిగాడు.
“ఆ నోటు ప్రీతి రాసింది. ‘నువ్వంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. నీతో అబద్ధం చెప్పినందుకు సారీ. నన్ను మరిచి పోవు కదూ!” ఇంచుమించుగా ఆమె ఆఖరిసారి అన్న మాటలే అందులో వ్రాసింది. దిమ్మెక్కిన తలతో తలుపేసి డెస్కు దగ్గర కూచున్నాను. ఆ శవం పక్కన నెల మీద ఉన్న వస్తువు ఏమిటి? ఆ మిస్టరీ వస్తువ గురించి డిటెక్టివ్ చెప్పలేదు. భట్టి విక్రమార్కుని కథలాగా అసలైన పాయింటు రాగానే కథ ఆగిపోయింది.
ఈ కథ నిజంగా జరిగిందా! అది మీకే వదిలేస్తున్నాను. వెంటనే వేగం పుంజుకుని నేను కథ వ్రాసేసాను. మరునాడు నా కథ చదివిన వసుధ ఏమందో అడగండి.
అందరి తలలు వసుధ వేపు తిరిగాయి. “కథ అయిపోయిందిగా నేను లేవోచ్చు”అంటూ వసుధ వంటింట్లోకి నడిచింది. అందరూ లేచి వళ్ళు విరుచుకోవడం, కాళ్ళు చాపుకోవడం చేసారు.
“నువ్వే చెప్పు వసుధ ఏమందో!”
“నేను అమెరికాకు వెళ్ళడానికి రడీ. నాకు పెద్ద పేకింగ్ ఏమి లేదు.” అందరూ గొల్లు మన్నారు.
“వినయ్, ఇప్పుడు నువ్వు కథ చెప్పు.”
“ఓ.కే. నాలిక్కి కాస్ట తీపి తగిలితే, అ గులాబ్ జామూన్ ఇలా పట్రండి.” అన్నాడు వినయ్.

———– సమాప్తం ———-

1 thought on “హాలోవీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *