March 29, 2024

అమ్మమ్మ – 1

రచన: గిరిజ పీసపాటి

(ఇది మా అమ్మమ్మ కధ. ఈ కధలో కొన్ని సంఘటనలు చదివినప్పుడు మీలో చాలా మందికి మీ నాన్నమ్మల, అమ్మమ్మల జీవితాలు గుర్తు రావచ్చు. అలాగే కష్టాలలో ఉన్న ఎందరో ఆడవారు ఈ కధ ద్వారా స్ఫూర్తిని పొందవచ్చు. అలా కనీసం ఒక్కరైనా ఈకధ ద్వారా జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగితే మా అమ్మమ్మ జీవితం, ఆవిడ కధను మీకందించిన నా ప్రయత్నం రెండూ సఫలమైనట్లే భావిస్తాను.) ఇక చదవండి :

అమ్మమ్మ పేరు రాజ్యలక్ష్మి. దివాకరుని వారి ఆడపడుచు. తను, అన్నయ్య ఇద్దరే తల్లిదండ్రులకు సంతానం. అన్నగారి పేరు సుబ్బారావు. అమ్మమ్మ చాలా అందగత్తె. పచ్చని పసిమి రంగు శరీరం, మంచి పొడుగు, చంపకు చారెడేసి సోగ కళ్ళు, తీర్చి దిద్దినట్లున్న అవయవ సౌష్టవం, బారెండు జడ, కమ్మని కంఠ స్వరం ఆవిడ ప్రత్యేకతలు. అప్పట్లో అందరి ఆడపిల్లల లాగే ఈవిడకు కూడా పదమూడు సంవత్సరాలకే వివాహం జరిగింది. తాతయ్య తెనాలి వాస్తవ్యులు, మల్లాది వారి నలుగురు అన్నదమ్ములలో ఆఖరి వారు. పేరు గౌరీనాధ శాస్త్రి. తెనాలి మున్సిపల్ హైస్కూల్ లో టీచర్ గా పని చేస్తుండేవారు. చామనచాయ, ఆరడుగుల పొడుగు, కంచు కంఠం ఆయన ప్రత్యేకతలు. తాతయ్యకి పుస్తక పఠనం బాగా అలవాటు. అలాగే నాటక రంగం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ అన్నదమ్ముల కుటుంబాలు నివసించిన కారణంగా తెనాలిలోని నాజర్ పేటలో మల్లాది వారి వీధి అనే పేరుతో ఒక వీధి ఉందంటే ఆ ఊరిలో వారికి గల పలుకుబడి, ప్రాముఖ్యత ఊహించుకోవచ్చు.

అత్తగారు లేకపోయినా అన్నదమ్ములు నలుగురూ కలిసి ఉన్న అందమైన ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలే అత్తగారి హోదా తీసుకోగా ఆ ఇంట ఆఖరి కోడలిగా అడుగుపెట్టిన అమ్మమ్మ అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ చక్కగా కలిసిపోయింది. సంగీత జ్ఞానంతో పాటు పఠనాసక్తి కూడా ఉండడంతో చిన్నప్పటి నుండి పాడడం, పుస్తకాలు చదవడం తీరిక సమయాలలో చేసేది. పెళ్ళయిన మూడు సంవత్సరాలకు అమ్మమ్మ రంగు, తాతయ్య శరీర తత్వంతో ముచ్చటైన కొడుకు పుట్టాడు. వారి ఆనందానికి ఎల్లలు లేవు. ఆ బాబు పెరుగుదలకి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా వదలకుండా వారు స్వయంగా అనుభవించి ఆనందిస్తూ ఒక పండుగలా వేడుకలు జరిపేవారు. బారసాల, బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, బంగరడం, కూర్చోవడం, పళ్ళు రావడం, నిబడడం, మొదటి మాట, తొలిసారిగా నడవడం, మొదటి పుట్టిన రోజు ఇలా బాబుకి సంబంధించిన ప్రతీ విషయమూ వారికి పెద్ద విశేషమే. బంధువులకే కాకుండా పేటందరకీ స్వీట్లు పంచడం, భోజనాలు పెట్టడం చేసేవారు.

తాతగారికి ఎలా అయిందో కానీ పేకాట అలవాటు అయింది. ఒక్కోసారి స్కూల్ నుండి ఇంటికి రాకుండా పేకాట జరిగే చోటుకి వెళ్ళి ఆటలో కూర్చుండిపోయేవారు. అమ్మమ్మ పని చేసుకుంటునే వీధి వాకిలి వద్దకు వచ్చి భర్త రాక కోసం ఎదురు చూసేది. అప్పుడే కొద్దిగా మాటలు, నడక వచ్చిన పున్నయ్య “నానగాలు లాలేదనామ్మా? తూత్తున్నావు” అని అమ్మమ్మని ప్రశ్నిస్తూనే “ఆతకి వెలిపోయి ఉంతాలు. నే తీతుకొత్తా.” అని పెద్దరికంగా చెప్పి మూలనున్న కర్ర తీసుకుని తండ్రి కోసం బయలుదేరి వెళ్ళేవాడు.

పేకాట జరిగే చోటుకి వెళ్ళి తండ్రిని చూస్తూనే “నానాలూ!” అని పెద్దగా కేక పెట్టి, కళ్ళు కోపంతో ఎర్రబడగా “తొందలగా ఇంతికి లండి. అమ్మ తూత్తోంది” అనేవాడు. అంతే తాతయ్య మారు మాట్లాడకుండా ఆట మధ్యలోనే ముక్కలు పడేసి కొడుకును ఎత్తుకుని ఇంటికి వచ్చేసేవారు. అంత ప్రేమ కొడుకంటే. సింహం లాంటి తన భర్త కొడుకు మీద వాత్సల్యంతో వెంటనే ఇంటికి రావడం చూసిన అమ్మమ్మ కొడుకు మీద ప్రేమ పట్టలేకపోయేది. ఇలా పున్నయ్య ఆడింది ఆట, పాడింది పాటగా గడుస్తుండగా, బాబుకి ఐదు సంవత్సరాలు నిండి ఆరవ సంవత్సరం వస్తుందనగా హఠాత్తుగా జ్వరం వచ్చి చనిపోయాడు. అప్పుడు అమ్మమ్మ ఎంత తల్లడిల్లిపోయిందో. పగవాళ్ళకు కూడా గర్భ శోకం రాకూడదు అని బాధ పడింది. తాతయ్య సరే సరి. పూర్తగా డీలా పడిపోయారు. ఆ బాబు జ్ఞాపకాలే అమ్మమ్మకి జీవితాంతం తోడుగా నిలిచాయి.

మూడేళ్ల తరువాత మరో చక్కని పాపకి జన్మనిచ్చింది అమ్మమ్మ. పాపకి అలివేలు అని పేరు పెట్టి, ఆ పాపకి సంబంధించిన ప్రతీ విశేషాన్నీ మళ్ళీ పండుగలా జరుపసాగారు. మళ్ళీ పాపకి ఐదు నిండి ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతుందనగా అలివేలు కూడా విరేచనాలు అయి చనిపోవడంతో మళ్ళీ గర్భ శోకం తప్పలేదు అమ్మమ్మకి. ఇలా మరో ముగ్గురు ఆడ పిల్లలు పుట్టడం, ఐదేళ్ళు బతికి ఆరవ ఏడు వస్తుందనగా హఠాత్తుగా చిన్న అనారోగ్యం వల్ల చనిపోవడం జరగడంతో అమ్మమ్మ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా తాతయ్య పేకాటకి‌ బానిసగా మారారు.

పరిస్థితులు ఇలా ఉన్న తరుణంలో అప్పుడే మహమ్మారిలా విజృంభించిన కలరా వ్యాధి అమ్మమ్మని సోకింది. రాత్రి, పగలు తేడా లేకుండా వాంతులు, విరేచనాలతో చాలా ఇబ్బంది పడింది అమ్మమ్మ. దానికి టైఫాయిడ్ కూడా తోడుగా రావడంతో ఇక బతకదనే నిర్ణయానికి వచ్చేసారు అందరూ. తాతయ్యకి అమ్మమ్మ అంటే పిచ్చి ప్రేమ. భార్యని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక పోయారు. నువ్వు లేకపోతే నేను బతకలేనంటూ పసి పిల్లాడిలా ఏడ్చారు. వైద్యం చేయించాక కాస్త తగ్గు ముఖం పట్టినట్లు అనిపించినా, మళ్ళీ ఎప్పుడైనా తిరగబెట్టే అవకాశం ఉంది కనుక పూర్తి విశ్రాంతి అవసరం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు వైద్యుడు. మనిషి కూడా బాగా క్షీణించిపోయి, నల్లబడిపోయి, ఎముకలు తేలిన శరీరం, ఊడిపోయిన జుట్టుతో మనిషి రూపే మారిపోయింది.

అటువంటి సమయంలో తెలిసిన వారు మద్రాసులో కేరళ వైద్యులు ప్రకృతి వైద్యం చేస్తున్నారని, అక్కడ అమ్మమ్మకి వైద్యం చేయిస్తే కలరా, టైఫాయిడ్ పూర్తిగా తగ్గిపోయి ఇక జన్నలో తిరగబెట్టవని, అదీ కాక మునుపటి రూపు కూడా తిరిగి వస్తుందని సలహా ఇవ్వగా అమ్మమ్మ కోసం ఉద్యోగానికి సెలవు పెట్టి, మద్రాసులోని ఒక బంగళాలోకి మకాం మార్చారు తాతయ్య. అమ్మమ్మ ప్రకృతి వైద్యం కోసం వెళ్ళి రావడానికి కారు కొని, డ్రైవర్ ని అపాయింట్ చేసి, వంటపని, ఇంటిపని, తోటపనికి మనుషులను పెట్టారు.

తాతగారు, వేరే అతను కలిసి మద్రాసులో ఒక సినిమా ధియేటర్ లీజుకి తీసుకుని సినిమాలు రిలీజ్ చేయసాగారు. అప్పట్లో కాంచనమాల, కన్నాంబ మొదలైన వారు నటించిన సినిమాలు అన్నీ ఆ ధియేటర్ లో ఆడేవి. ఈలోగా కేరళ వైద్యులు చేసిన ప్రకృతి వైద్యం మంచి ఫలితాన్ని ఇవ్వసాగింది. మద్రాసు వెళ్ళాక అమ్మమ్మకి మళ్ళీ జ్వరం బాగా వచ్చింది. 104 డిగ్రీల జ్వరంతో ఉన్న మనిషిని తెల్లవారుజామున నాలుగు గంటలకు స్టూల్ మీద కూర్చోబెట్టి నూటొక్క బిందెల నూతి నీళ్ళు ఒకదాని వెంట ఒకటి పోసేవారు. అలాగే ఒండ్రుమట్టి ఒళ్ళంతా పూసి అది ఎండాక స్నానం చేయించేవారు. బురదతో నిండి ఉన్న గుంటలో గంటల పాటు కూర్చోపెట్టేవారు. ఇలా ప్రకృతి వైద్యంలో భాగంగా చాలా రకాలుగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.

ఇంటికి‌ వచ్చాక వారు ఎలా చెప్తే అలా పత్యం వండించుకుని తినేవారు. పళ్ళ రసాలు, కొబ్బరి నీరు వైద్యలు చెప్పిన ప్రకారం తీసుకునేవారు. ఇలా ఒక పక్క వైద్యం జరుగుతుండగా మరోపక్క తాతగారు తెచ్చిన పుస్తకాలు చదవడం, సంగీతం సాధన చేయడం, రేడియోలో మంచి కార్యక్రమాలు వినడం చేసేవారు. ప్రకృతి వైద్యం ఫలితంగా అమ్మమ్మకి పూర్తి ఆరోగ్యం చిక్కి, తేజోవంతమైన శరీరంతో, ఒత్తుగా పెరిగిన నల్లని జుత్తుతో, కళ్ళలో కొత్త కాంతులతో, పునపటి కన్నా మరింత అందంగా తళుకులీనుతూ తయారయింది.
అమ్మమ్మని మొదటిసారిగా తమ ధియేటర్ కి‌ కొత్తగా రిలీజైన కన్నాంబ గారి సినిమాకి తీసుకెళ్ళారు తాతయ్య. ధియేటర్ లో అమ్మమ్మని కూర్చోబెట్టి మేనేజర్ ని కలిసి వస్తానని వెళ్ళారు తాతయ్య.

తాతయ్య వెళ్లిన కాసేపట్లోనే కన్నాంబ గారు, కాంచనమాల గారు, టంగుటూరి సూర్యకుమారి గారు వచ్చి అమ్మమ్మ పక్కనే ఉన్న సీట్లలో కూర్చున్నారు. వారు ముగ్గురూ అమ్మమ్మని చూసి ఏదో మాట్లాడుకోసాగారు. వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని‌ అమ్మమ్మకి అర్ధం అయి, పెద్ద పేరున్న నటీమణులు కదా! వారి పక్కన తను కూర్చోవడం వారికి ఇబ్బందిగా ఉందేమో!? పోనీ వేరే సీటులో కూర్చుందాం అనుకుంటుండగానే తాతయ్య, ఆయన పార్ట్నర్ హడావుడిగా లోపలికి వచ్చి, ముగ్గురు నటీమణులని గౌరవంగా పలకరించి, తమ వెనుకే బాయ్ తీసుకొచ్చిన కూల్ డ్రింక్స్ ని ముగ్గురికీ ఇచ్చి, అమ్మమ్మకి కూడా ఒక బాటిల్ ఇచ్చారు.

ఇంతలో కన్నాంబ గారు నవ్వుతూ “ఏంటి‌ శాస్త్రి గారూ! కొత్త హీరోయిన్ లా ఉన్నారే? ఆవిడ పేరు, ఏ భాషలో నటిస్తారో చెప్పి మమ్మల్ని పరిచయం చెయ్యొచ్చు కదా! ” అనడంతో మిగిలిన ఇద్దరూ కూడా తాతయ్య చెప్పే వివరాల కోసం కుతూహలంగా చూడసాగారు. తాతయ్య నవ్వి “ఈవిడ నా భార్య. పేరు రాజ్యలక్ష్మి. మొదటిసారి ఈ ధియేటర్ కి సినిమా చూపిద్దామని తీసుకొచ్చాను” అని అమ్మమ్మని పరిచయం చేసి ఆడవారి మధ్య ఒక్కరూ ఉండలేక మెల్లిగా బయటికి జారుకున్నారు. అమ్మమ్మతో వారు ముగ్గురూ చాలా బాగా మాట్లాడడమే కాకుండా తమ ఇంటికి కూడా రమ్మని‌ ఆహ్వానించి, అమ్మమ్మ ఇంటికి కూడా వీలున్నప్పుడు వస్తామని చెప్పారు. సినిమా పూర్తయేసరికి నలుగురూ మంచి స్నేహితురాళ్ళు అయిపోయారు. అభిరుచులు కలిస్తే స్నేహం ఇట్టే కలుస్తుంది కదూ!

****** సశేషం ******

13 thoughts on “అమ్మమ్మ – 1

  1. ఇన్ని వివరాలు ఎవరు గ్రంధస్థం చేశారు ? వారికీ , చక్కగా వ్రాసిన మీకూ ధన్యవాదాలు

    1. ఈ వివరాలన్నీ ఇది వరకు గ్రంథస్తం చేసినవి కావండీ… అమ్మమ్మ గారు (ఆవిడ బతికి ఉన్నప్పుడు) నాకు చెప్పిన విషయాలనే మీకు చెప్తున్నాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  2. అమ్మమ్మ గురించి ఆసక్తికరంగా చెపుతున్నావు గిరిజా.. అభినందనలు

  3. అమ్మమ్మ చదివాను. …..సినిమా ఐపోవడం. ..కధకూడ (సశేషంగా )పూర్తవడం తో ఇహంలోకివచ్చాను. ….ఈ…….(కథఅనాలో,కధానికఅనాలోతెలీక ఇంకా )మనసులోఇప్పటికే ఓతెలీనిత్రుప్తిగాఅనిపిస్తుంది. ….ఈ…..లో ఆనాటిజీవనపరిస్థితులు, సెలబ్రటీలుఎలాఉండేవారు,( నాకైతేసెలబ్రటీలు ఆనాటి సమాజానికిదగ్గరగాఉన్నట్టనిపించింది). ….పాతతరంఅంతరించిపోతున్న ఈకొత్తతరంలో వారికి కూడాఅమ్మమ్మ ఆకట్టుకుంటుంది అనడంలోసందేహంలేదు. …..ఎందుకంటే అమ్మమ్మ ఎప్పటికీ చిరంజీవి. ….ఆపత్రిక అడ్రస్ ఇవ్వగలరు. …సశేషం. …..తరువాత కోసంఎదురుచూస్తూ ….ఒకప్పటిమనయమ్.వి.డి.యమ్.హైస్కూల్ విద్యార్ధి. …బి.వి.రమణమూర్తి విశాఖ. …..రేపు “”””ఉగాది (ఉగఆది. ..యుగాది. …)షట్రుచులఉగాది అంతే రుచులు ఓరోజుముందుఅమ్మమ్మలోచూసా. …మీకు శుభాభినందనలు శభాకాంకషలు తెలియచేస్తూ నాఆశీసులు తెలియచేస్తున్నాను మీరు బాగుండాలి ఎప్పటికీ. ….నమస్తే

    1. మీ వ్యాఖ్యానం చాలా సంతోషంగా ఉంది సర్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సదా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తరువాయి భాగం మే నెల మాలిక పత్రికలో వస్తుంది. తప్పక చదవగలరు. మీరు అడిగిన మాలిక పత్రిక అడ్రస్ కి బదులు మెయిల్ ఐడి ఇస్తున్నాను. http://www.maalikapatrika@gmail.com

Leave a Reply to Girija Peesapati Cancel reply

Your email address will not be published. Required fields are marked *