March 28, 2024

ఇల్లాలు

రచన – డా. లక్ష్మి రాఘవ

“ఉద్యోగం మానేస్తున్నావా? పిచ్చా ఏమైనా ?” తీవ్రంగా స్పందించింది రేఖ కొలీగ్ సంధ్య.
రేఖ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ “పిచ్చేమిటే? అవసరం…”
“అవసరమా?ఒకసారి ప్రపంచాన్ని చూడు. ఇలాటి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో జనం.”
“నిజమే నేను కూడా చదువు అవగానే మంచి ఉద్యోగం కోసం ఎన్ని ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యాను..”
“కదా…అందుకే ఆలోచింపమంటున్నాను. ఒక MNC లో మంచి పొజిషన్ లో ఉంటూ…పెళ్లి అయి కొన్నేళ్ళకే మానేస్తా అంటే ఏమనుకోవాలి? మీ ఆయన ఫోర్స్ చేస్తున్నాడా? తనతో సమానంగా ఉద్యోగం సహించలేక పోతున్నాడా???”
“ఏయ్…సంతోష్ ను ఏమీ అనకు. ఇది అతని డెసిషన్ కాదు. నేనే ఆలోచించి నిర్ణయానికి వచ్చా..”
“మీ ఆయనకు చెప్పావా?”
“చెప్పాను… డెసిషన్ నీదే…అన్నాడు కూడా.ఈ రోజు రాత్రికి డిస్కస్ చేస్తా”
“ఇంకోసారి ఆలోచించు రేఖా, ప్రెగ్నెన్సీ వచ్చిన వారూ, పిల్లలని కన్నా ఉద్యోగాలు చేస్తూనే వున్నారు. అంతెందుకు మీ అమ్మ కూడా పని చేసింది కదా??”
“అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నేను చిన్నప్పుడు అమ్మను చాలా విషయాలలో మిస్ అయ్యేదాన్ని. నా పిల్లలకి అలా వుండకూడదు అనుకుంటున్నా”
“ఈ కాలం లో పిల్లలను సక్రమంగా పెంచడానికీ, వారికి అన్ని సదుపాయాలూ ఇవ్వడానికి డబ్బు అవసరం. అందుకే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే కంటున్నారు. పిల్లల ఆలనా పాలనా చూసు కోవడానికి మేయిడ్స్ ని పెట్టుకుంటున్నారు లేక పోతే బేబీ కేర్ సెంటర్ లు బోలెడన్ని వున్నాయి. ఇవన్నీ నీకు తెలుసు. అయినా ఉద్యోగం మాని వేస్తాను అంటున్నావంటే పిచ్చి కాక ఏమంటారు?”
రేఖ మాట్లాడ లేదు. సంధ్యతో వాదించడం అనవసరమని పించింది.
ఇంటికి వెళ్లేముందు సంధ్య వచ్చి” నేను ఒకసారి సంతోష్ తో మాట్లాడనా??” అంది.
“వద్దు సంధ్యా…తనకు అబ్జక్షన్ వుండదు…”అని మరి పొడిగించకుండా తన బ్యాగ్ సర్దుకుంది రేఖ.
తొమ్మిది నెలలు నిండాయని రేఖను కారు డ్రైవ్ చెయ్యడం మానిపించాడు సంతోష్. రేఖను పొద్దున్న డ్రాప్ చేసి సాయంత్రం పిక్ అప్ చేసుకుంటాడు. తన ఆఫీసులో వర్క్ఎక్కువ వున్నా బ్రేక్ తీసుకుని మరీ వస్తాడు.
ఆఫీసు నుండీ ఇంటికి వచ్చాక తనే భార్యకు కాఫీ కలిపి ఇస్తాడు. ఇద్దరూ కూర్చుని కాస్సేపు కబుర్లు చెప్పుకుంటారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని రేఖ కిచన్ లోకి వెళ్లి డిన్నర్ తయారు చేస్తుంది. డిన్నర్ తరువాత తోటలో చిన్న వాక్. మళ్ళీ నిద్ర.
పడుకునే టప్పుడు సంధ్య అన్న మాటలు చెప్పింది రేఖ.
“ఎవరి అభిప్రాయాలు వారివి. మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునేది మనం రేఖా…ఎక్కువ ఆలోచించకు. ప్రశాంతంగా వుండు.”అన్నాడు సంతోష్ పొడిగించకుండా.
పడుకున్నాక ఎత్తుగావున్న కడుపుమీద చెయ్యివేసుకుని నిమురుకుంది రేఖ. ఎడమవైపున తన్నింది లోపల వున్న బేబీ..గట్టిగా అయిన ఆ పార్ట్ ను మెత్తగా స్పృశించింది రేఖ. ఈ రోజు కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది? ఆలోచించసాగింది.
పెళ్లి అయిన రెండేళ్ళలో రెండుసార్లు అబార్షన్ అయింది రేఖకు. మూడవ నెలదాకా గడిచేదే కాదు. రకరకాల టెస్టులతో విసిగిపోయింది రేఖ. ప్రెగ్నెన్సీ రాగానే నిలుస్తుందా అన్న టెన్షన్ ఎక్కువగా వుండేది..ఈ సారి చాలా కేర్ తీసుకున్నారు డాక్టర్లూ, సంతోష్ కూడా…రేఖా తల్లిదండ్రులు మూడు నెలలు నిండే దాకా కూతురి దగ్గరే వున్నారు. ఇప్పుడంతా బాగుంది. రెగ్యులర్ గా స్కాన్లు జరిగాయి. బేబీ గ్రోత్ బాగుందన్నారు. రేఖ కు ముప్పై ఏళ్ళు నిండాయని నార్మల్ డెలివరీ కాకుంటే వెంటనే సిజేరియన్ చెయ్యాలన్న నిర్ణయం కూడా జరిగిపోయింది.
ఈ వారం తరువాత రేఖ అమ్మ వస్తుంది కూడా…
డెలివరీ రోజు! ఎంతగానో ఎదురు చూసిన క్షణం ఎదురైన వేళ మురిసిపోయారు రేఖ, సంతోష్ లు. ముద్దబంతి లాటి అమ్మాయి చేతిలో ఒదిగినప్పుడు…అపురూప దృశ్యం! ఆ చిన్నారి కోసం ఎంత తపించిపోయారో వారిద్దరికే తెలుసు.
పాప తో ప్రతిక్షణం ఆస్వాదించాలనే తపన ఉవ్వెత్తున లేచింది రేఖకు.
పాప వెలుగు ముందు ఉద్యోగం వెల వెల బోయింది..

ఆరోజు ….
పార్టీ మంచి ఊపులో వుంది..
పిల్లలకు సెపరేట్ ఎంటర్తైన్మెంట్. యువతకు డాన్స్ కు ఒక ప్లేస్..
మగవాళ్ళకి డ్రింక్స్ ఒక చోట !
అమ్మలూ, చిన్నపిల్లలా తల్లులూ కబుర్లతో బిజీ.
ఇదీ అక్కడి వాతావరణం.
రేఖ ఉద్యోగం మాని రెండేళ్ళయింది. పిల్ల తల్లి అయి హాపీ గా వుంది.
సంధ్య కూడా వచ్చింది పార్టీకి. రెండు నెలల క్రితం సంధ్య కంపెనీకి మేనేజర్ అయ్యింది కూడా.
చాలా రోజుల తరువాత కలవడమేమో స్నేహితుల మధ్య మాటలు సముద్రమైనాయి.
రేఖ కోసం లోపలకు వచ్చిన సంతోష్ కు రేఖ ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక నిముషం నిలబడినాడు.
“రేఖా నీవు ఉద్యోగం మానేసి, ఇంట్లోనే ఉన్నావంటే చాలా బాధేసింది. ఈ కాలంలో ఎవరైనా ఉద్యోగం మానుకుంటారా? ఏదైనా ప్రాబ్లెం వచ్చిందా ఆఫీసులో ??” ఆవిడ ప్రశ్నిస్తూ వుంటే రేఖ ఏమి చెప్పాలా అనుకునేంతలో సంతోష్
“రేఖ ఉద్యోగ౦ మానేసిందని ఎవరన్నారండీ? రేఖ పొద్దున్న మాకు అందరికీ అమ్మ ఉద్యోగం చేస్తుంది. ఆప్యాయంగా వండి పెడుతుంది. ఇంట్లో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అని పర్యవేక్షణ చేస్తుంది. ఆమె అప్పుడు హోం మానేజర్. మెయిడ్ రాకపోతే సర్వీస్ చేసి మానేజ్ జేస్తుంది.
పాపకు అన్నీ చూసుకుంటుంది ఒక బేబీ కేర్ టేకర్ లా… పాపకు మంచి మాటలూ నేర్పుతుంది అప్పుడు ఆమె ఒక టీచర్. రాత్రి పూట మళ్ళీ అమ్మ పోస్ట్ తో అందరికీ ప్రేమనిస్తుంది.
మా జీవితాలలో ఆమె ఒక నిరంతర ఉద్యోగి.
మా ప్రేమే ఆమెకు జీతం. పోద్దున నుండీ కష్టపడే ఆమెకు మేమిచ్చే ఆప్యాయతే ఆమె ఉద్యోగానికి భరోసా!
ఇక ఏమి కావాలి చెప్పండి? మళ్ళీ ఉద్యోగం చేసే టైం, అవకాశమూ ఉందా? ఇంత మంచి ఉద్యోగాన్ని ఆవిడ వదులు కుంటు౦దా? చెప్పండి మీరే“ అంటూన్న సంతోష్ చుట్టూ చేరిన ఆడవాళ్ళు చప్పట్లతో వారి సంతోషాన్ని వ్యక్త పరిస్తే …మౌన౦గా, ప్రేమగా ఆరాధనగా సంతోష్ నే చూస్తూ మైమరచి పోయింది రేఖ!!!

4 thoughts on “ఇల్లాలు

  1. తరుణుల్లో 99% ఇంటి పనిని చాకిరీగా భావిస్తున్న ఈ తరుణంలో …….ఎంత మంచి మంచిగా చెప్పినా మార్పు రావడం చాలా కష్టం….ఈ తరానికి…

  2. ఎన్ని సార్లు చదివినా చాలా బాగుంది. .నిజానికి చాలా హాయిగా ఉంది..ఇలాంటి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేకనే ఎంతోమంది ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోతున్నారేమో..బతికేస్తున్నారు అంతే…జీవితాన్ని అందంగా సాగించటంలేదు.. డబ్బే ప్రధానం కాదు,.. కుటుంబ సంక్షేమం, అనుబంధాలు, పిల్లల పెంపకం ప్రధానమని చక్కగా వివరించారు..రాబోయే తరానికి మానసిక ఆరోగ్యం ముఖ్యం మరి..

  3. రచనా శైలి బాగుంది. కానీ ఎన్నుకున్న ఇతివృత్తం చాల పాతది ఈ సబ్జెక్ట్ మీద ఇప్పటికే చాల కథలు వచ్చాయి అయితే సబ్జెక్టు evergreen కాబట్టి ఎన్నిసార్లు చదివిన మల్లి చదవొచ్చు

Leave a Reply to రత్నాకర్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *