March 29, 2024

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్

 

ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు

“ఆనందం ఆర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం. ”

గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది?
హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా?
హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ.
గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో కూడా అలంకారాలు వుంటాయంటావా?
హరి-అయ్యో! ఉన్నదీ అతని కవిత్వంలో. శబ్దాలంకారాలనివుంటాయి. ఇక దాని పేరు వృత్యనుప్రాసము. ఈ వృత్యనుప్రాసము యొక్క ప్రాబల్యమే శ్రీశ్రీ కవిత్వంలోని మొదటి సొగసు. అంత్య ప్రాస కూడా ఒక శబ్దాలంకారం. అది లేకపోతే వీళ్ళ నడక లేదుగా. శ్రీశ్రీ చంద్రవంకను చూచి కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగ ఉందన్నాడు. ఇది ఉపమాలంకారం. ఎట్లాంటిది?’మృఛ్చకటికం’లో నీటిలో మునిగి ఏనుగు ఎత్తిన రెండు దంతములవలె చంద్రవంక ఉన్నదన్నాడే అంత గొప్ప ఉపమానం.
గిరి-అయితే శ్రీశ్రీ మహారధి, అతిరధుడు అన్నమాట. అతనిననుసరించిన వాళ్లెవరైనా వున్నారా?
హరి-అందరూ అతనిననుసరించిన వాళ్ళే.
గిరి-ఇంతకూ ఈ యుగ పురుషుడెవరంటావు?
హరి-ఎవరేమిటోయి పిచ్చివాడా! ఈ గీతం ఎవడు వ్రాశాడో వాడు.
గిరి-ఎవడు వ్రాశాడు?
హరి-నేను చెప్పను, గీతం విను–
“మరో ప్రపంచం, మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి! ”
(‘హేతువాద యుగం’-భారతి, జూన్ 1962 )

*************

 

 

సంస్మరణ-డా. సి. నారాయణరెడ్డి

ఆధునిక విప్లవ కవితోద్యమాలకు సారధ్యం వహించిన శ్రీశ్రీ భావాల కవితా పంక్తులు తెలుగు పత్రికలలోని వార్తల్లో, సంపాదకీయాల్లో, రాజకీయ వ్యాఖ్యల్లో అసంఖ్యాకంగా కనిపిస్తుంటాయి. శ్రీశ్రీని విమర్శించాలన్నా, దుమ్మెత్తిపోయాలన్నాఆయన మాటలే శరణ్యం అయ్యేటంతగా ఆయన భావాలు పరివ్యాప్తమయ్యాయి. ప్రజాకవులను సృష్టించిన ప్రజాకవి శ్రీశ్రీ (‘ఈనాడు, 18-06-1983)
శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి ముట్టాతవంటి వారు. మూడుతరాలకు ఆయన ప్రతినిధి. తరతరాలకు తరగని సాహిత్యానిది శ్రీశ్రీ. శ్రీశ్రీ సూర్యునివంటివాడు. సూర్యుడు మరుగవుతాడు కానీ మాయం కాడు. సూర్యుడు మరల మరల ఉదయిస్తాడు. అతనే శ్రీశ్రీ. శ్రీశ్రీ తిరిగిన లెనిన్ గ్రాడ్ యెంత శాశ్వతమైనదో, శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతే శాశ్వతమైనది. (ఆంధ్రప్రభ, 17 -06 -1983 )
మరోప్రపంచం పిలుపును తెలుగు జాతి కందించిన మహాకవి శ్రీశ్రీ మరోప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ మరోప్రపంచం స్వరూపం మనకు తెలియదు. కానీ, అయన తెలుగు కవితాజగత్తులో ప్రతిష్టించిన మరోప్రపంచం మాత్రం అభ్యుదయ శక్తులకూ, విప్లవదీప్తులకూ అక్షర నిలయంగా మిగిలిపోయింది. ఆలోచనలకు అసిధారలనూ,
ఆవేశాలకు అగ్నికీలలనూ అంటించిన క్రాంతిమూర్తి శ్రీశ్రీ. గత 35 ఏళ్ళుగా ఆధునిక తెలుగు కవిత్వాన్ని నడిపిస్తున్న నిత్య చైతన్యస్ఫూర్తి శ్రీశ్రీ. రెండు సరికొత్త కవితోద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత కూడా శ్రీశ్రీకే దక్కింది. ఆ మహాకవి ఈనాడు మనలో లేడు. ‘నింగివైపు పొంగి దూకే ఆ కళ్ళు, నేలపై అంగుళం పైకి నడిచే ఆ కాళ్ళు మళ్ళీ కనిపించవు. ఆ పాటలు ప్రభంజన స్వరంతో పలుకుతాయి. తెలుగుజాతి సమైక్యకంఠాన్ని వినూత్న విప్లవఘోషతో పలికిస్తాయి. (ఆంధ్రభూమి, 18 -06 -1983 )

 

 

 

ఈ శతాబ్దానికి ఒకే ఒక్క శ్రీశ్రీ–శ్రీవడ్డెర చండీదాస్

ఎవరి నీడలో ఈ శతాబ్దపు ‘ఆధునిక’ తెలుగు కవిత్వం(సాహిత్య ప్రక్రియలన్నీ కాదు) తన ఉనికిని ప్రోది చేసుకుందో, ఎవరి’మహాప్రస్థానం’ తెలుగులో’ఆధునిక’ కవులను ఉద్భవింపజేసిందో, ఎవరి’మహాప్రస్థానం’ చాలా పదాలికి అర్ధాలు తెలియకపోయినా బలంగా కదిలించిందో, ప్రగాఢ అనుభూతి కంపించిందో, ఎవరి’మహాప్రస్థానం’ తన జాతిజనులు పాడుకునే ‘మంత్రంగా’ నిలిచిందో ఆ వ్యక్తి-శ్రీశ్రీ. తన ఆవేదనలనూ, ఆక్రోశాలనూ, అన్వేషనలనూ, ప్రాకులాటలనూ, వివాదాలనూ, ప్రబోధాలనూ, మహాత్మ్యాలనూ, అల్పత్వాలనూ, అనితర సాధ్యాలనూ వదిలేసి కుబుసం విడిచి వెళ్ళిపోయాడు. ఆ మొన్నచారిత్రక అమరత్వంలోకి. ఒక వీరుడు మరణిస్తే వెయ్యిమంది వీరులు పుట్టుకు రావచ్చునేమోగానీ, ఒక శ్రీశ్రీ పొతే వెయ్యిమంది శ్రీశ్రీల మాట అలావుంచి, కనీసం మరొక్క శ్రీశ్రీ అయినా పుట్టుకు రాడు. (ఆంధ్రజ్యోతి, 08 -07 -1983)

 

 

 

 

 

శ్రీశ్రీ పుట్టిన రోజు–శ్రీ డీ. వీ. నరసరాజుగారు

శ్రీశ్రీకి మరణమా?అబద్ధం!
ఎవరో అజ్ఞానులు పుట్టించిన పుకారు
శ్రీశ్రీ దరిదాపులకు రావడానికి
మృత్యువుకు ఎన్ని గుండెలు
వస్తే మృత్యువే చస్తుంది!
బ్రద్దలైన శ్రీశ్రీ అగ్నిపర్వతపు లావాలో
మృత్యువు కాలి మసి అయిపోతుంది
శ్రీశ్రీ చిరంజీవి! చిరంజీవికి చావేమిటి?
శ్రీశ్రీ యిక మనకి కనబడంటారా?
అవును కనబడడు
కనబడనిది ఆయన భౌతిక కాయం
కానీ, ఆయన కీర్తి కాయం అది అజరామరం
ఇప్పుడు అసలు జరిగిందిది
కనబడే కాయం విడిచి కనబడని కాయంతో
ఆయన మరో జీవితం ప్రారంభించాడు.
ఆ’మరోజీవితం’అనటం.
ఆ అనంత జీవితానికి ఇది ఆరంభ దినం
అందుకే నిజానికి ఈ వేళ
మరో శ్రీశ్రీ పుట్టిన రోజు(ఆంధ్రజ్యోతి, 08 -07 -1983)

 

 

 

శ్రీశ్రీకి చావేమిటి?–శ్రీ జయధీర్ తిరుమలరావు గారు

శ్రామికస్వేదంతో
కవితకి కిరీటం తొడిగిన వాడికి
కొత్త రక్త మాంసాలతో
కొండంత భరోసాతో
కొత్త వూపిరి పోసిన వాడికి
చావేమిటి?!
దారిపొడవునా జనపోరాటాలకు
అక్షరాల మైలురాళ్ళని నిలప
ఎంతో మంది శ్రీశ్రీలు నడిచే బాతకి
సోపానం వేసిన వాడికి
కనుమరుగేమిటి?
చావు–
వ్యవహారదూరమైన భాషకుంటుంది
చావు–
వాడుకలో లేని అక్షరానికుంటుంది.
చావు–వాటినే నమ్ముకునే పండితునికుతుంది
చావు–
ఎవరికీ పట్టని భావాలు
సృష్టించే వాడికుంటుంది.
చావు–
నాగలికి లేదు, /యంత్రాలకి లేదు
వాటిని నడిపే చేతులకి లేదు
వాటి శ్రమదోచే మనుషులకు తప్ప!
శ్రీశ్రీ భాష జనం ఘోష!
శ్రీశ్రీ అక్షరాలూ జనం విడిచే ఊపిర్లు!
శ్రీశ్రీ భావాలు జనం ఆశయాలు
శ్రీశ్రీ కవిత మరయన్త్రాల పిడికిళ్ళు
శ్రీశ్రీ కవిత నాగేటి చాళ్ళు!
శ్రీశ్రీకి చావేమిటి?(యువ, అక్టోబర్, 1983 )

 

 

అదృష్టదీపక్ కోకిలమ్మ పదాలు

మార్క్సిస్టు విజిగీష
మార్పుకై రానఘోష
గెలుపు శ్రీశ్రీ భాష
ఓ కోకిలమ్మా!
శబ్దార్ధముల మేటి
శర పరంపర ధాటి
లేరు శ్రీశ్రీ సాటి
ఓ కోకిలమ్మా! (నవ్య, 03 -03 -2010)

(మహాకవి శ్రీశ్రీకి నివాళిగా కొందరు ప్రముఖులు కొన్ని పత్రికలలో వెలిబుచ్చిన భావాల ‘సంకలనం’–సేకరణ)

14 thoughts on “మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

  1. మంచిపని చేశారు…
    ప్రముఖుల మాటలు ఒకచోట చేర్చారు.
    వారి భావాలను పంచారు.
    సంతోషము…

  2. విశ్వనాధ వారి వివరణ బాగుందండీ!

  3. Sri Sri…yentha cheppinaa,yevaru cheppinaa…
    Inkaayentho…migilipoyedi….Sri Sri. Gurinche…

  4. శ్రీరంగం శ్రీనివాసరావు .. ఈ పేరు వింటేనే ఎదలో ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. ఉద్యమకవిత్వాలు పొంగిపొర్లుతాయి. శ్రీశ్రీని కేవలం ఉద్యమకవిగా పేర్కొనడం మన అజ్ఞానమే అవుంతుంది. శ్రీశ్రీ సినీగేయాలు కొన్ని వింటే – ఈయన వ్రాయలేని భావం, పలికించలేని రసం అంటూ ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన కలం నుండి జాలువారిన నవరసాలు ఎప్పటికీ మర్చిపోలేని రసతరంగాలు. మహామహులనిపించుకున్నవారంతా శ్రీశ్రీ ప్రతిభకి అప్రతిభులైన వారే. మహాకవి శ్రీశ్రీ గురించి మీరందజేసిన వ్యాసం బావుంది. మీ కృషి సదా ప్రసంసనీయం.

Leave a Reply to VIJAYALAKSHMI PRASAD Cancel reply

Your email address will not be published. Required fields are marked *