April 23, 2024

అమ్మమ్మ -2

రచన: గిరిజ పీసపాటి

కన్నాంబ, కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారి, అమ్మమ్మ కలిసి తరచూ బీచ్ కి వెళ్తూ ఉండేవారు. ఒక్కోసారి ఎవరి కారులో వారు వెళ్ళి బీచ్ దగ్గర కలుసుకుంటే, మరోసారి అందరూ కలిసి ఒకే కారులో వెళ్ళేవారు. ఇక బీచ్ కి వెళ్ళాక వీళ్ళ సందడి అంతా ఇంతా కాదు. టంగుటూరి సూర్యకుమారి, అమ్మమ్మ పాటలు పాడితే, కన్నాంబ, కాంచన మాల సినిమా డైలాగ్స్ చెప్పేవారు. సరదాగా సినిమాలకి వెళ్ళేవారు. ఒకరి ఇంటి వంటలు మరొకరి ఇంటికి బట్వాడా అయ్యేవి.

కాంచనమాల గారి జుత్తు చాలా పొడగు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ… షూటింగ్ లో ఫ్లడ్ లైట్ల వేడి, సరైన సమయానికి తిండి, నిద్ర లేక జుత్తు విపరీతంగా ఊడిపోసాగింది. అప్పుడు ఆవిడ అమ్మమ్మ జుత్తును చూసి మీరు జుత్తుకి ఎలాంటి సంరక్షణ తీసుకుంటారో చెప్పమని‌ అడగితే షీకాయని ఉడకబెట్టి, రుబ్బగా వచ్చిన పేస్ట్ తో మాత్రమే తల స్నానం చెయ్యమని, షాంపూ వాడొద్దని చెప్పి, వెన్న, ఆముదం, కొబ్బరి నూనె, పెరుగు, నిమ్మరసం, కలిపిన మిశ్రమాన్ని తలంటి పోసుకునే ముందు తలకి పట్టించి బాగా మర్దన చేసి మూడు గంటల తరువాత గోరు వెచ్చని నీటితో, షీకాయ పేస్ట్ తో స్నానం చెయ్యమని చెప్పారు. ఈ మిశ్రమం నేచురల్ హెయిర్ కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు అమ్మమ్మ. కాంచనమాల గారు అమ్మమ్మ చెప్పిన విధానాలు పాటించాక జుత్తు ఊడడం తగ్గిపోయింది. అమ్మమ్మకి ఇలాటి చిట్కాలు చాలా బాగా తెలుసు.

ఇలా కొన్నాళ్ళు కొనసాగిన వారి స్నేహం అమ్మమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ఇక ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని వైద్యులు చెప్పాక అమ్మమ్మ, తాతయ్యలు తెనాలి తిరిగి వచ్చెయ్యడంతో బ్రేక్ పడింది. వీరు తెనాలి వచ్చేసరికి తాతయ్య గారి అన్నయ్యలు వేరు కుంపట్లు పెట్టుకోవడం వల్ల వీళ్ళు కూడా ఒక ఇల్లు కొనుక్కొని, వేరు కాపురం పెట్టుకున్నారు. తాతయ్య యధావిధిగా తన టీచర్ ఉద్యోగం చేసుకోసాగారు. కానీ… పిల్లలు లేని లోటు మాత్రం వారిని బాగా కలతకు గురి చేసేది. తన అన్నయ్యల పిల్లలను తమ పిల్లలుగా భావించి వారికి కావలసినవి అన్నీ కొనేవారు తాతయ్య. వాళ్ళు కూడా ఏం కావాలన్నా చనువుగా తాతయ్యనే అడిగేవారు.

రోజులు గడుస్తున్నాయి. ఇంతలో అమ్మమ్మ అన్నగారైన సుబ్బారావు గారు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అది కూడా మానసిక అనారోగ్యం కావడంతో సుభ్రంగా మిలటరీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని మానసిక స్థితిలో ఉద్యోగం నుండి పారిపోయి వచ్చేసాడు. అలా రావడం నేరం కనుక ఆయన మీద సెర్చ్ వారెంట్ జారీ అవడం, అప్పటికే మతి భ్రమించినందున పోలీసులు ఆయన ప్రస్తుతం పిచ్చివాడు అయిపోయాడు అని రిపోర్టు పంపడంతో, వేరే ఎక్కడా ఉద్యోగం చెయ్యకూడదంటూ ఆయన మీద నిషేధాజ్ఞలు జారీ‌చేయడంతో పాటు అతని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా కేన్సిల్ చేయడంతో కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది. అప్పుడే ఆయనకి న్యుమోనియా కూడా వచ్చి రెండు లంగ్స్ కి పూర్తిగా ఇన్ఫెక్షన్ వచ్చింది.

విషయం తెలుసుకున్న అమ్మమ్మ, తాతయ్యలు ఆయనని చూడడానికి నరసరావుపేట వెళ్ళారు. ఆయన అమ్మమ్మ పెళ్ళయాక ఏనాడూ చెల్లెల్ని పలకరించిన పాపాన పోలేదు. కలరా, టైఫాయిడ్ వచ్చి చావుకి సిధ్ధమయిననాడు కూడా వచ్చి పలకరించలేదు. అయినా తోడబుట్టినవాడు కష్టంలో ఉంటే అమ్మమ్మ కూడా అన్నగారి లాగే తనకేం పట్టనట్లు, తనని చూడడానికి రానివాడిని నేనెందుకు చూడాలని పంతం పట్టి ఉండలేపోయింది. వీళ్ళు వెళ్ళేసరికి సుబ్బారావు గారు ఇంట్లో లేరు. ఎక్కడికి పోయాడో తెలియక మగవారు తలో దిక్కూ వెతకడానికి వెళ్ళారు. దానితో తాతయ్య కూడా వెతకడానికి వెళ్ళారు.

రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్న మనిషిని చూసిన తాతయ్య పరుగున వెళ్ళి ఆయనని లేవనెత్తే ప్రయత్నం చేస్తూ, “అదృష్టవశాత్తు నా కంట పడ్డావు కనుక సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా!?” అని మందలించి “ఇంట్లోని మగాళ్ళు అందరూ ఇప్పటికే నిన్ను వెతకడానికి తలోదిక్కూ ఊరు మీద పడ్డారు. ఆడవాళ్ళు ఆందోళనతో తిండి, నీరు లేక ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని భయపడుతున్నారు. ఇంటికి పోదాం పద” అంటే నేను రానని‌ మొండికేసి, ఈండ్రబడుతున్న మనిషికి‌ నాలుగు తగిలించి ఇంటికి తీసుకుని వచ్చారు.

వైద్యం చేయించినా ఆయన వ్యాధి తగ్గకపోవడంతో తెలిసిన వారు తెనాలిలోనే ఉంటున్న భాగవతుల అన్నపూర్ణ శాస్త్రులు గారికి చూపించమని, ఆయన ఇటువంటి జాడ్యాలు‌ ఎందుకు వచ్చాయో, పరిహారం ఏమిటో చెప్తారని, ఇది వరకు చాలా మంది వారి దయ వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని చెప్పగా అన్నగారిని వారి దగ్గరకు తాతయ్య తోడు రాగా తీసుకెళ్ళింది అమ్మమ్మ.

భాగవతుల అన్నపూర్ణ శాస్త్రులు గారు ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులు. తెనాలిలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్న పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని నిర్మించినది అన్నపూర్ణ శాస్త్రుల గారి తండ్రి గారే. గొప్ప ఉపాసకులు. కనుకనే వారి మీద ఉన్న విశ్వాసంతో అన్నగారిని తీసుకుని వారి ఇంటికి వెళ్ళారు అమ్మమ్మ, తాతయ్యలు. కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళి, ఇంట్లోని దేవుడి దర్శనం చేసుకుని, ముందుగా దైవానికి మన సమస్యను చెప్పుకున్నాకే అన్నపూర్ణ శాస్త్రుల గారికి చెప్పాలి. అప్పుడు వారు ఆ సమస్యకి తగిన నివారణ మార్గం సూచిస్తారు. ఇది అక్కడి నియమం.

వీళ్ళు దైవ దర్శనం చేసుకుని శాస్త్రుల గారి దగ్గరకు వెళ్ళగానే వారు సుబ్బారావు గారినే చూస్తూ “ఇతడు మహా స్వార్ధపరుడు. ఆ స్వార్ధ బుధ్ధితోనే కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న ఇల్లాలిని, ఆఖరికి కన్న బిడ్డలను కూడా బాధ పెట్టాడు. దాని ఫలితమే ఇప్పటి ఈ దైన్య స్థితికి‌ కారణం” అని చెప్పారు.
అమ్మమ్మ వారికి నమస్కరించి “మీరు తప్ప వేరే దిక్కు లేదు మాకు. ఇతనికి ఏమైనా అయితే భార్యాబిడ్డలు అన్యాయం అయిపోతారు. కనుక మీరే ఏదో ఒక దారి చూపించాలి” అని వేడుకుంది‌.

ఆయన ప్రశాంత వదనంతో అమ్మమ్మని చూసి ప్రాయశ్చిత్తం ఉంది. అదేమిటంటే “40 (మండలం) రోజుల పాటు సింహాచలం కొండ మీద సుందరకాండ పారాయణ చెయ్యాలి. అది కాక పాలు ఇస్తున్న ఆవును, దాని దూడను కొని ఇంటి వద్ద వాటికి సేవ చెయ్యాలి. ఈ రెండు పనులూ ఒకేసారి జరగాలి. ఒకదాని తరువాత మరొకటి చేస్తే ఫలితం ఉండదు. ఇవి నిరాటంకంగా పూర్తి చేస్తే ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. కానీ ఆయన చేసే పరిస్థితిలో లేడు. కనుక మరెవరైనా చేసి, ఆ పుణ్య ఫలాన్ని ఆయనకి ధార పోసినా సరిపోతుంది.” అని చెప్పారు. తన అన్నయ్య ఆరోగ్యవంతుడు కావడానికి ఎంత కష్టమైనా పడతానని శాస్త్రులు గారికి చెప్పి, వారికి పాదాభివందనం చేసి, తిరిగి ఇంటికి వచ్చేసారు అమ్మమ్మ, తాతయ్య.

******* సశేషం *******

3 thoughts on “అమ్మమ్మ -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *