May 19, 2024

కంభంపాటి కథలు – పని మనిషి

రచన: రవీంద్ర కంభంపాటి

 

‘హరిణీ .. ఇంకా ఎంత సేపు?.. మీ ఆఫీసుకి టైమవుతూంది .. మొదటి రోజే లేటుగా వెళ్తే బావుండదు ‘ అని కవిత గట్టిగా అరిస్తే , ఏ బదులూ రాలేదు హరిణి గదిలోంచి

‘లేచినట్టే లేచి ..మళ్ళీ నిద్రపోయిందేమో ?’ డైనింగ్ టేబుల్ దగ్గిర  పేపర్ చదువుకుంటూ అన్నాడు మూర్తి

‘ఏమో .. ఎప్పుడు చూసినా ఆ తలుపేసుకునే ఉంటుంది .. ఇంట్లో మనిషి లాగ కాక , ఏదో గెస్టు లా పోజులొకటి .. ఇదంతా మీ గారాబం ఎఫెక్టు ‘ అంది కవిత

‘అవున్లే .. మనింట్లో నీకు ఏం నచ్చకపోయినా నేనే కారణం ‘ అని మళ్ళీ పేపర్లో తల దూర్చేడు మూర్తి

తలుపు తీసుకుని బయటికొచ్చిన హరిణి ‘ఏమిటి మమ్మీ .. ఊరకనే ఆ అరుపులూ నువ్వూనూ ?.. తలుపులేసుకుని బట్టలు  మార్చుకోడం కూడా తప్పేనా ?’ అంటూ కసురుకుంది

‘తలుపులేసుకుని బట్టలు మార్చుకోవడం తప్పు కాదు .. పిలిచినా పలకకపోవడం , విడిచేసిన బట్టలు అలా నేల మీద వదిలెయ్యడం , తడి తువ్వాలు మంచం మీద విసిరేయడం  తప్పు .. ‘ అని కవిత అనబోతూంటే , ‘మనకి ఓ పనిమనిషి ఉంది కదా .. దానికి కొంచెం పనివ్వాలి కదా ..ఊరికనే దానికి డబ్బులు పొయ్యడమెందుకు ?’ అంది హరిణి గడుసుగా.

‘పనిమనిషి ఉన్నది మనం ఏదైనా పని చేసుకోలేనప్పుడు సాయం చెయ్యడానికి ..  అంతే గానీ .. మన పనంతా తన మీద రుద్దెయ్యడానికి కాదు ‘ అని కవిత కోపంగా మాట్లాడుతూంటే , మూర్తి లేచొచ్చి ‘ఇవ్వాళ .. దానికి ఉద్యోగానికి మొదటి రోజు ..బంగారు తల్లి ..  పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకుంది .. దాన్ని ఆశీర్వదించి పంపక , ఉదయాన్నే పనిమనిషి గురించి డిబేటెందుకూ ?.. ‘ అని కవిత ని వారించేడు .

‘సరే .. మీ ఆశీర్వాదాలూ అవీ తర్వాత .. నేను వెళ్ళాలి .. బ్రేక్ఫాస్ట్ మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్ లో చేసేస్తాను .. అక్కడ బావుంటుందని మా ఫ్రెండ్ అఖిల చెప్పింది ‘ అని బయల్దేరబోతూ , తలుపు తీసి మళ్ళీ వెనక్కొచ్చి కవిత తో ‘ఇదిగో మమ్మీ .. ఫస్ట్ డే ఆఫీస్ కి బయల్దేరుతూంటే , మన పనిమనిషి ఎదురొచ్చింది .. శకునం మంచిదేనంటావా ?’ అని అడిగితే , ‘ఏమో .. ఎందుకైనా మంచిది .. ఆ సోఫా లో రెండు నిమిషాలు కూచుని, కొంచెం మంచి నీళ్లు తాగి వెళ్ళు ‘ అన్నాడు మూర్తి .

లోపలికొస్తూ తన చేతి సంచీ ఓ వారగా పెడుతూ  ‘అన్నట్టు ఈవేళ మీ ఆఫీసు మొదటి రోజు కదా .. మంచి పేరు తెచ్చుకోవాలమ్మా ‘ అని నవ్వుతూ లక్ష్మి అంటే , ‘నాకాల్రెడీ హరిణి అనే మంచి పేరు ఉంది ..మళ్ళీ కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు.. ఇంక లోపలికెళ్ళి పని చూసుకో ‘ అంటూ విసురుగా బయల్దేరింది హరిణి

‘దీనికి ఉద్యోగమొకటొచ్చిందేమో ఒళ్ళు ఇంకా కొవ్వెక్కింది ‘ అని కవిత విసుక్కుంటూంటే , ‘పోనీలెండమ్మా .. చిన్న పిల్ల ‘ అంటూ లోపలికెళ్ళి ఇల్లు శుభ్రం చెయ్యడం మొదలెట్టింది లక్ష్మి .

మూర్తి తో కవిత అంది  ‘ .. అలాగే అని చెబితే పోయేదానికి ఆ పొగరుబోతు జవాబేమిటి చెప్పండి ?.. ఈ కాలం పిల్లలు ఏం చూసుకునో ఆ మిడిసిపాటు’

‘ఏం చూసుకుని అంటే ? చేరుతూనే పాతిక వేలు జీతం .. ఇంట్లో ఏ బాధ్యతా లేకుండా పెంచేం .. మరింకెలాగ ఉంటుందీ ?’ బదులిచ్చేడు మూర్తి

‘ఏమే లక్ష్మీ .. మీ అమ్మాయి కూడా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూందన్నావు కదా .. తనూ మా హరిణిలాగే ఒళ్ళు పొగరుగా ఉంటుందా ?’ అంది కవిత

‘ఊరుకోండమ్మా .. ఏదో చిన్న పిల్ల .. బంగారు తల్లి మా హరిణమ్మ .. ప్రతీదానికీ ఎక్కువ ఆలోచించీకండి ‘ అంటూ గిన్నెలు కడగడం మొదలెట్టింది లక్ష్మి

ఉదయాన్నే ఎక్కణ్ణుంచో బస్సెక్కి మరీ ఆ అపర్ణా ఫ్లాట్స్ లో పనిచేయడానికొస్తుంది లక్ష్మి . ఓ చిన్న వైరు బుట్టలో పెట్టుకున్న చిన్న బాక్సులో కొంచెం భోజనం తెచ్చుకుంటుంది . ఎవరేం పెట్టినా తినదు, తీసుకోదు .. ఎవరేం పని చెప్పినా  చేసిపెడుతుంది . ఎవరికీ ఆవిణ్ణి వదులుకోవాలనిపించదు, దీనికి తోడు ఎప్పుడూ డబ్బు విషయం మీద పెద్దగా బెట్టు చెయ్యదు.   సరిగ్గా నాలుగు ఇళ్లలో పని చేస్తుందంతే , మా ఇంట్లో ఒక్క గంట సేపు పంజెయ్యి , ఎంత కావాలన్నా ఇస్తాం అన్నాకూడా ఒప్పుకోదు , ‘చూద్దాంలెండమ్మా’ అనేసెళ్లిపోతుంది !

సాయంత్రం హుషారుగా ఇంటికొచ్చిన  హరిణి చెప్పింది ‘ఇవాళ ఫస్ట్ డే ఆఫీస్ లో చాలా బావుంది .. లక్కీగా మా టీం లీడ్ కూడా అమ్మాయే ..చాలా మంచిది .. వర్క్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ..  లేకపోతే ఏ వెధవ కింద పనిచెయ్యాలా అని టెన్షన్ పడ్డాను ‘

‘పోన్లే .. పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ముందు ముందు ఇంకా మంచి జరుగుతుంది ‘ అంది కవిత

‘ఇంటికొచ్చేనో లేదో మళ్ళీ .. ఆ పనిమనిషి గొడవ మొదలెట్టేవా ?’ విసుక్కుంటూ అడిగింది హరిణి

‘పని మనిషైతే తక్కువేమిటి? నువ్వు మీ ఆఫీస్ లో పనిమనిషైతే తను మనింట్లో పనిమనిషి … కాకపొతే  నీ చదువు మూలంగా  జీతం ఎక్కువ , తనకి జీతం తక్కువ .. ఆ మాటకొస్తే తనే ఇంకా ఎక్కువ కష్టపడుతూంది’

‘నీకేమైనా పిచ్చా ? నా వర్క్ కీ తన పనికీ పోలికేంటి ? అసలు నువ్వు నన్ను దానితో పోల్చడమే దారుణం .. ఇంతకన్నా ఇన్సల్ట్ ఇంకోటి లేదు ..ఛ ‘ అనేసి తన గదిలోకెళ్ళి భళ్ళున తలుపేసుకున్న హరిణి వేపు అలా చూస్తూండిపోయింది కవిత .

************

ఆ రోజు ఉదయం ఆఫీసుకెళ్తూ, ‘అమ్మా .. నేను ఇవాళ  లేటుగా వస్తాను .. సాయంత్రం మా టీం లీడ్ పార్టీ ఇస్తున్నారు’ అని హరిణి అంటే , ‘సరేలే    .. ఇవాళ మన లక్ష్మి వాళ్ళమ్మాయి పుట్టినరోజట .. ఇదిగో స్వీట్ తెచ్చింది ‘  అని కవిత అంది

‘అవన్నీ నేను తిననని తెలుసుగా .. మన సెక్యూరిటీ వాళ్లకి ఇచ్చెయ్యి ‘ అనేసి ఆఫీసుకెళ్ళిపోతున్న హరిణి వేపు కవిత కోపంగానూ , లక్ష్మి నవ్వుతూనూ చూసేరు !

సాయంత్రం ఆరున్నరకి ఇంటికొచ్చేసిన హరిణి ని చూసి , ‘లేట్ గా వస్తానన్నావు .. అప్పుడే వచ్చేసేవేం ?’ అని కవిత అడిగితే , మాట్లాడకుండా తన గదిలోకెళ్ళిపోయింది

‘కొంచెం టీ తాగుతావా ?’ అని అడగడానికెళ్లిన కవిత కి హరిణి గది తలుపు తీసుండడం ఆశ్చర్యంగా అనిపించి ‘ఇవ్వాళ తలుపు వేసుకోలేదు ? ఏమిటో స్పెషల్ ? ‘ అని నవ్వుతూ లోపలికెళ్ళేసరికి నేల మీద కూచుని మోకాళ్ళలో తల పెట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న హరిణి కనిపించింది !

‘ఏమయ్యిందే ? ఎవరైనా ఏమన్నా అన్నారా ?’ అంటూ గాభరాగా అడిగిన కవితతో ‘ అమ్మా లక్ష్మి .. ‘ అంటూ వెక్కుతూంది హరిణి

‘ఏమయ్యిందే లక్ష్మికి ? ‘ కంగారుగా అంది కవిత

‘లక్ష్మి కాదమ్మా .. లక్ష్మిగారు .. మా టీం లీడ్  వాళ్ళమ్మ ఆవిడ .. పనిమనిషిగా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చిందావిడ .. పిల్లలు సెటిలైనా , వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిన తన పని మనిషి పనిని గౌరవించుకోవాలని, ఆ పని వదల్లేదట .. అలాంటి గ్రేట్ ఉమన్ ని నేను ఇష్టం వచ్చినట్టు మాటాడేను ‘ అంటూ ఏడుస్తున్న హరిణి వేపు మురిపెంగా చూసింది కవిత !

 

ఉపసంహారం : చెన్నై లో ఉన్నప్పుడు మా ఇంట్లో పని చేసిన కీ.శే . మైథిలి అనే ఆమెకి ఈ కథ నివాళి . తన సొంత తమ్ముడు పెద్ద సినిమా డైరెక్టరయినా , కూతుళ్లు చెన్నై సెక్రటరియేట్ లో పెద్ద ఆఫీసర్లయినా , ఇళ్లలో పని చెయ్యడం మానుకోలేదావిడ .. ఈ పనితోనే వాళ్ళని ఇంతవాళ్లని చేసేను , అలాంటిది వాళ్ళు గొప్పవాళ్లయితే ఈ పని వదిలేసుకోవాలా అనేది !

 

 

 

4 thoughts on “కంభంపాటి కథలు – పని మనిషి

  1. ఇలాంటి స్పూర్తి ప్రదాతలు మనకు తారస పడుతూనే వుంటారు,వారి వ్యక్తిత్వం తో మనకు దారి చూపుతూనే వుంటారు. కధ వస్తువు బాగుంది.మీ కధల గురించి ,శైలి గురించి చెప్పేదేముంది. ఎప్పుడు అద్భుతః .కధా ఉపసంహారం చాల రోజుల తరువాత చూస్తున్నాను. చిన్నప్పుడు యండమూరి గారి రచనలలో కనపడేది.

  2. చాలా బాగుంది రవీంద్రగారు. ‘Work is Worship’ అన్నారు. మనం ఏం పనిచేసినా ఆపనిని చాలా శ్రద్ధగా గౌరవంగా చేయాలి. చాలా మంచి కధ.అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *