March 29, 2024

తేనెలొలుకు తెలుగు. .

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

గాయనం కొందరికి సహజ లక్షణం. అనాదిగా మాట పాటగా మారి పలువురిని ఆకట్టుకుంది. జన సామాన్యంలో వారికి తెలిసిన విషయాలను పాటలుగట్టే నేర్పు కూడా కొందరికి సహజ లక్షణమే. అలా వెనుకటినుంచీ అలా జానపదుల జీవితాలలో పాట ఒక
భాగమయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా పలు వేడుకలకు పాట ఒక తోడుగా నిలువటం మనకు తెలిసిందే. అలాంటి పాటలు మౌఖికంగా వెలువడి ఆ తరువాత ఆ నోటా ఈ నోటా పాడబడి వాడుకలోకి రావడం కద్దు. మనకున్న బతుకమ్మ పాటల వంటి జానపద సాహిత్యానికి కర్తలెవరో తెలియకుండానే జనుల నాలుకలపై నిలచి పోయి చిర స్థాయిని పొందుతాయి.
పండుగలు, వేడుకల సందర్భాలే గాక పురాణ గాథలు కూడా జానపదుల నోళ్లలో పాటలుగా మారిపోయాయి. పాటలు పాడుకుంటూ పని చేసుకోవడం పల్లె జీవన సరళిలో ఒకటి. వరికోతలప్పుడూ, నాట్లప్పుడూ, అప్పటి కాలంలో గిర్నీలు లేవు గనుక వడ్లు దంచే టప్పుడు పని భారం మరిపించే పాటలు ఎన్నో జానపదులు సృష్టించుకున్నారు. అందునా స్త్రీలు ఇంకా ఎక్కువగా
పాటలు కట్టారు. పడుచు వాళ్లైతే పనులు చేసుకుంటూ, ముసలి వాళ్లైతే కాలక్షేపంగా పాడుకోవటం జరిగేది కొంత కాలం క్రితం అనేకంటే ఈ రేడియోలు, సినిమాలు, టీవీలు లేని కాలంలో. అలాంటి వాటిలో ఎందరో పరిశోధకులు సేకరించిన జాన పదసాహిత్యం మనకు కావలసినంత ఉన్నది. అందులో స్త్రీలకు సంబంధించిన కుశలకుచ్చల చరిత్ర, ఊర్మిళ నిద్ర,
సీతమ్మ పాటలు వంటివి చాలనే ఉన్నాయి. సులభమైన బాణీలో ఉండి తేలికైన వాడుక భాషలో అల్లబడిన పాటలు వింటే నిజంగా ఎంతో ఆనందం కలుగుతుంది.
ఈసారి స్త్రీల పాటల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఊర్మిళ నిద్ర ఈ మాసానికి తెలుసుకుందాం. ’కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా’ ధాటిలో సాగే ఈ పాటలో కొన్ని అసందర్భాలున్నా వింటుంటే మాత్రం హాయిగాను, ఆనందంగానూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే చాలావరకు స్త్రీల పాటలు ద్విపద ఛందస్సులో ఉన్నాయి. మంజరీ ద్విపద అత్యంత గానయోగ్యమైన ప్రక్రియ.

ఊర్మిళ నిద్ర
~~~~~~~
శ్రీరామ భూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరతశతృఘ్నలపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజుడప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా
తుంబురు నారదులునూ యేతెంచి నిలచి గానము సేయగా
రంభాదులా సభలలో ఇంతి శుభ రమ్యమున నాట్యమాడా
సనకాది మౌనీంద్రులూ కొలువులో శాస్త్రములు తర్కించగా
సకలదేవతలు గొలువ ఉదయాన పుష్పవర్షము గురిసెను
సభయంత కలయజూచి యేతెంచె సంతోషమున జానకీ
పతిముఖము జూచి నిలచి వినయమున పట్టి అంజలి గ్రక్కున
దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపేను చిత్తగింపు
ధరణీశుడవధరించ ఒకచిన్న మనవి కద్దని పలికెను
ముందు మనమడవులకును పోగాను ముద్దు మరది వెంటనూ
పయనమై రాగజూచి తనచెలియ పయనమాయెను ఊర్మిళా
వద్దు నీవుండుమనుచూ సౌమిత్రి మనల సేవింప వచ్చే
నాడు మొదలూ శయ్యపై కనుమూసి నాతి పవళించుచుండె
ఇకనైన యానతిచ్చీ తమ్మునీ ఇందముఖి కడకంపుడీ
ప్రాణసఖి యీలాగునా కూర్మితో పలుకంగ విని రాముడూ
తలపోసితూడ నెంతే తనమదికి తగువిచారము బుట్టెను
ఆశ్చర్యపడి రాముడూ గ్రక్కున అన్న లక్షమణ రమ్మనే
రమ్మి లక్ష్మణ యిట్టులా యుచితమా రమణి యెడబాసియుణట
తడవాయె యికనైననూ ప్రియురాలి దగ్గరకు నీవుబోయి
సరస సల్లాపములచే దుఃఖోపశమనమ్ము జేయుమయ్యా
అన్న మాటలకు రామానుజుడూ మహా ప్రసాదమ్మనుచునూ
అనిపించుకొని గ్రక్కునా సభవిడచి చనుదెంచె తనగృహముకు( సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *