April 20, 2024

సుఖాంతం!

రచన: పద్మజ యలమంచిలి

 

ఎప్పటిలానే.. టిఫిన్ లు తినిపించి,  లంచ్ బాక్సులు కట్టేసి, పిల్లలని తయారుచేసి స్కూల్ కి పంపి,  భర్తకు కావాల్సినవన్నీ అమర్చి ఆదరా బాదరా రెండు ముద్దలు కుక్కుకుని . తొమ్మిదినెలల గర్భిణిలా నిండుగా ఉన్న బస్సులోకి ఎలాగోలా జొరబడి చెమటలు కక్కుకుంటూ ఆఫీస్ కి చేరింది నీరజ…

హమ్మయ్య సెక్షన్ హెడ్ ఇంకా రాలేదు అనుకుంటూ తన టేబుల్ మీద పెండింగ్ వర్క్ పూర్తిచేసే పనిలో పడింది.

ఇంట్లో దివాకర్ చిర్రుబుర్రులాడి పోతున్నాడు..

ఏమన్నా పట్టించుకోకుండా తనదారిన తాను ఎంచక్కా పోతుంది..

అసలు ఉద్యోగం అంటే నాకంటే ఎక్కువ ఇష్టం కావడానికి కారణం ఆ భాస్కర్ గాడే .. మాటలతో ఆడాళ్ళను బుట్టలో పడేస్తుంటాడు.. అనవసరమైన కసేదో పళ్ళు పటపట లాడేలా చేసింది..

అసలు ఇంజినీరింగ్ చేసి దీనిని కట్టుకోవడమే నా ఖర్మ…జాబ్ చేసే అమ్మాయిలకి పొగరు అని అందరు చెప్పినా.. మనకేం పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు.. ఇద్దరూ ఉద్యోగం చేసుకుని సంపాదించుకుంటే మీ భవిష్యత్తు బావుంటుంది అని అమ్మా నాన్నా ఒప్పించబట్టి ..ఖర్మకొద్దీ దీనిని పెళ్ళి చేసుకున్నాను కానీ లేకుంటే తనంటే ఎంతమంది పడి చచ్చేవారు.. ఇలా అహంకారపూరితంగా సాగిపోతుంటాయి అతని ఆలోచనలు!

చేస్తున్న సాఫ్ట్‌ వేర్ కంపెనీ మూతబడి ఇంట్లో ఉంటున్న దివాకర్ కి రకరకాల అనుమానాలు, భయాలు..

ఏదో తెలియని అభద్రతా భావంతో నీరజను సూటిపోటీ మాటలనడం..

తనేమీ మాట్లాడకుండా ముభావంగా ఉంటే మరింత రెచ్చిపోవడం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది!

దివాకర్ గట్టిగా ప్రయత్నిస్తే మరో కంపెనీలో జాబ్ రావడం పెద్ద కష్టమేమీ కాదు..

తనకు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదనీ ఏదైనా వ్యాపారం చెయ్యాలనీ పెట్టుబడిదారులకోసం వెతుకుతున్నాడు..

ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తనకే సరైన క్లారిటీ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చెయ్యలేకపోతున్నాడు..

ఇవన్నీ గమనిస్తున్న నీరజ మరికొద్ది కాలం ఏదైనా ఉద్యోగం చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఏ వ్యాపారం ఎలా చేయాలో అనుభవం సంపాదించి అప్పుడు ప్రయత్నిద్దాం అని ప్రేమతో చెప్పి చూసింది..

ఎన్నో రకాలుగా బ్రతిమిలాడింది..

తనకు కోపరేట్ చెయ్యకుండా వెనక్కు లాగుతున్నావని, తన టాలెంట్ మీద నమ్మకం ఉంటే పుట్టింటినుంచి ఏమైనా పెట్టుబడి పెట్టించమని లేకపోతే నోర్మూసుకుని పడుండమని దెబ్బలాడేవాడు!

తండ్రి లేని తనను తమ్ముడినీ ఎంతో కష్టపడి చదివించింది అమ్మ..

ఇద్దరికీ ఉద్యోగాలు రాగానే గంతకు తగ్గ బొంత అనుకుంటూ పెళ్ళిళ్ళు చేసి  బాధ్యతలు తీర్చుకుంది..

దివాకర్ వ్యాపారానికి పెట్టుబడి పెట్టేంత స్థోమత లేదు తన పుట్టింటి వారికి అని నిట్టూర్చింది

********************

 

అలకలు, కులుకులు..వేటితోనూ సంబంధం లేకుండా కాలం పరిగెడుతూనే ఉంటుంది..

తన ఉద్యోగంతోనే పిల్లల చదువులు,  ఇంటి అద్దెతో పాటు దివాకర్ ను కూడా తానే పోషిస్తూ, నిందలూ, నిష్టురాలతో సంసారాన్ని కష్టంగానే లాక్కొస్తోంది నీరజ!

తనకంటూ ఇష్టా ఇష్టాలు ఏవీ లేవు.. పిల్లల భధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే ధ్యేయంగా పెట్టుకుంది.నిర్లిప్తంగా, యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది అంతే!

******************

ఆదివారం..బయట ఆడుకుంటున్న పిల్లలు అమ్మా అని పెద్దగా అరుస్తూ పిలిచేసరికి పెరిగెత్తుకుని వాకిట్లోకి వచ్చింది.

ఒంటినిండా బాండేజ్ లతో ఉన్న దివాకర్ ను తీసుకువచ్చిన భాస్కర్ ను చూస్తూ నిలుచుండిపోయింది. నిర్ఘాంతపోయి!

వెనకాలే వచ్చిన భాస్కర్ భార్య కోమలి నీరజను పొదివి పట్టుకుని లోపలికి పదoడి అనగానే అందరూ అప్పుడే స్పృహలోకి వచ్చిన వారిలా ఇంట్లోకి నడిచారు..

చాలా రోజులుగా దివాకర్ తమ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి అనుమానాలతో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని,  ఎంతో సంయమనంతో భాస్కర్ ఓపిగ్గా నచ్చచెప్పి పంపిస్తున్నాడని.. ఈరోజు ఇక కోపం పట్టలేక  దివాకర్ లాంటిటి చదువుకున్న మూర్ఖులు చస్తేనే నీరజలాంటి చెల్లెళ్ళు ప్రశాంతంగా బ్రతకగలరని అరుస్తూ రెచ్చిపోయి కొట్టాడనీ కోమలి చెపుతుంటే నీరజ ఒక్క ఉదుటున దివాకర్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ… భాస్కర్ ను తిట్టడం మొదలెట్టింది..ఆయనేదో డిప్రెషన్ లో ఒక మాటంటే ఇలా పట్టుకు కొట్టేస్తావా అంటూ…

దివాకర్ నీరజ నోరుమూస్తూ…తోబుట్టువులు లేని నేను తల్లితండ్రులకు దూరంగా ఒంటరిగా చదువుకోవడం వలన బంధాల విలువ సరిగ్గా తెలియదు…ఏవో విన్నవీ..ఉహించుకున్నవీ మనసుకు పట్టించుకుని నిన్ను ఎన్ని రకాలుగా పీడించానో.. నీ హృదయాన్ని ఎంతగా గాయపరచేనో…నవ్వుతూ తుళ్లుతూ ఉండే నీ బ్రతుకు నావల్ల ఎంత నిర్లిప్తంగా మారిపోయిందో….అన్నీ నాలుగు తన్ని చెప్పే భాస్కర్ లాంటి అన్నలు అందరికీ ఉండాల్సిందేలే నీరజా.. మీ అన్న తన్నాడు..కట్లు కట్టించి నీ దగ్గరకు తెచ్చాడు అని అంటూ….భాస్కర్ చేయి పట్టుకున్నాడు క్షమించమని..

*********************

కోమలి దివాకర్ దగ్గరగా వస్తూ…

అందరికీ ఇలా నచ్చచెప్పో, కొట్టో మార్చేవారు ఉండకపోవచ్చు అన్నా.. ఏదైనా ఆలోచనలు తప్పు దోవ పడుతున్నాయి అనుకున్నప్పుడు పెద్ద వారితోనో,  మానసిక వైద్యులతోనో విషయాన్ని చర్చిస్తే సరైన మార్గాన్ని వారు సూచించగలరు.. కాపురాలు కూలిపోకుండా కాపాడుకొనే అవకాశం ఉంటుంది !

అందని స్వర్గానికి నిచ్చెనలు వేయడం కన్నా..అందుబాటులో స్వర్గాన్ని సృష్టించుకోవడం మేలు ..రేపటినుండి ఏదో ఉద్యోగంలో జాయిన్ అవండి అని సూచిస్తూ..భాస్కర్ ని లేవండి ఇక మనం వెళదాం అంటూ బయల్దేరదీసింది..

నీరజ కళ్ళల్లో కొత్త మెరుపులేవో వారి దృష్టిని దాటిపోలేదు! .

 

————-సుఖాంతం————

 

2 thoughts on “సుఖాంతం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *