April 20, 2024

హృదయ బాంధవ్యం

రచన: డా.కె.మీరాబాయి

“నేను జయంత్ నండి. నేను మీతో మాట్లాడాలి. ఈవాళ భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకోవచ్చునా?”
ఫోనులో అతని గొంతు వినగానే వారిజ గుండె ఝల్లుమంది.
” అలాగే మీ ఇష్టం ” అంది కంగారు ఆణుచుకుంటూ. ఫోను పెట్టేయగానే రుమాలుతో ముఖం తుడుచుకుంది.
మొదటిసారి అబ్బాయిలతో మాట్లాడబోతున్న పదహారేళ్ళ పిల్లలాగా ఈ బెదురేంటీ? అని తనను తాను కుదుట పరచుకుంది.
ఈ రోజు ఆఫీసుకు చీర గానీ , చుడీదారుగానీ వేసుకుని వుంటే బాగుండేది అనుకుంది తను వేసుకున్న నీలం రంగు జీన్స్ పాంట్, తెల్లని టీ షర్ట్ చూసుకుంటూ.
తనేమన్నా కలగనిందా ఇవాళ అకస్మాత్తుగా అతను వచ్చి కలుసుకుంటాడని? నిన్ననే బెంగుళూరు వెళ్ళిపోయి వుంటాడనుకుంది. ఇంకోసారి నాతో మాట్లాడాలి అనిపించిందేమో ! ఆనుకుంటే వారిజ బుగ్గలు వెచ్చబడ్డాయి.
తన క్యుబికల్ నుండి బయటకు వచ్చి విశ్రాంతి గదిలోకి వెళ్ళింది ముఖం కడుక్కుని, పౌడర్ రాసుకుని, తేలికగా లిప్ స్టిక్ అద్దుకుంది.
తల మరోసారి దువ్వుకుని క్లిప్ పెట్టుకుంది. ఇవన్నీ చేస్తున్నా ఆమె మనసు మాత్రం ఆలోచిస్తూనే వుంది. వారిజకు సడెన్ గా ఆ రోజు వాలెంటైన్స్ డే అని గుర్తుకు వచ్చింది ” కాబోయే జీవన సహచరికి పువ్వులు కానుక ఇచ్చి ఆశ్చర్య పరచాలని అనుకున్నాడేమో ” ఆన్న ఆలోచన వచ్చి ఆమె పెదవుల మీద ఆహ్లాదకరమైన చిరునవ్వు తొంగి చూసింది.
తనకు ఇరవై అయిదేళ్ళు నిండిపోతున్నాయని అమ్మా, నాన్నా తొందర పెడుతుంటే అయిష్టం గానే పెళ్ళికి ఒప్పుకుంది. ఎవరిద్వారానో జయంత్ గురించి తెలిసి వారిజ జాతకము, ఫోటో ఈమైల్ చేసారు.
అన్నీ సరిపోయాయి అనుకున్నాక స్కైప్ లో చూసి మాట్లాడుకున్నారు. ప్రత్యక్షంగా కలుసుకోవడానికి వాళ్ళు నిన్న రావడం , జయంత్ , వారిజ అరగంట విడిగా మాట్లాడుకుని అంగీకారం తెలపడం జరిగింది.
మంచి రంగులో ఒడ్డు పొడవు వుండి , ముప్పై ఏళ్ళ వయసులోనే ప్రోజక్ట్ మానేజర్ గా చేస్తున్న జయంత్ ని చూడగానే నచ్చాడు వారిజకు. ఆలాగే అందంగా , చలాకీగా సుకుమారంగా వున్న వారిజ మొదటి చూపులోనే అతనికి నచ్చింది.
జయంత్ తలిదండ్రులకు ఒక్కడే కొడుకు. తండ్రి బాంక్ ఆఫీసరు గా రెటైర్ అయ్యారు. తల్లి గ్రుహిణి. వాళ్ళిద్దరూ వారిజతో కలుపుగోలుగా మాట్లాడారు.
“మాకు పెళ్ళైన పదేళ్ళకు పుట్టాడు వీడు. బి. టెక్ చదవడానికి దూరంగా పంపించాలంటే దిగులు పడిపోయాము. మాకు వున్నది వాడొక్కడే కదా ! ఆంటూ ప్రేమ నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసాడు ఆయన.
“వీడికి ఉద్యోగం బెంగుళూరులో వచ్చింది. వంట రాదు. రోజూ హొటల్ లో ఎంత కాలమని తింటాడు? వాడి ఆరోగ్యం కన్న మాకు స్వంత ఇల్లు , మా వూరు ముఖ్యం కాదు కదా ! ఆందుకే ” అమ్మా నువ్వు వచ్చి వండి పెడితే తప్ప ఈ ఉద్యోగం చేయలేను”అంటూ మావాడు అడిగితే ఇల్లు అద్దెకు ఇచ్చేసి వాడిదగ్గరకు వచ్చేసాము. ఎప్పటికైనా మేము వాడి దగ్గర వుండాల్సిందే కదా ! మాకున్నది వాడొక్కడే కదా!” తల్లి అందుకుని చెప్పింది.
వారిద్దరూ అలా చెప్తుంటే జయంత్ అసహనంగా కదలడం గమనించి మనసులో నవ్వు కుంది వారిజ
పెళ్ళవగానే బెంగుళూరుకి బదిలీ పెట్టుకుంటుంది లెండి వారిజ ” అంది వారిజ తల్లి.
” మా అమ్మాయికి వంట బాగా వచ్చులెండి. ” అంది మళ్ళీ.
“వారిజ ఇక్కడ ఒక్క పడకగది ఫ్లాట్ మా ఇంటికి దగ్గరలోనే తీసుకుంది. ఆద్దెకు ఇచ్చేసాము. ఆలాగే కారు కూడా కొనుక్కుంది. రెండింటికీ వాయిదాలు కడుతోంది.” కూతురు జీతం తాము వాడుకోవడం లేదు అని స్పష్టం చేసాడు వారిజ నాన్న.
ఈ మాటలు విన్న జయంత్ ముఖం వికసించడం గమనించింది వారిజ.
వచ్చే నెలలోనే పెళ్ళి ముహూర్తం పెట్టుకుందామని అనుకున్నారు.
పెళ్ళి దగ్గరలోనే వుంది గనుక నిశ్చితార్థం ఆడంబరంగా పెట్టుకోవద్దని , మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందామని చెప్పి వెళ్ళారు వాళ్ళు.
ఆఫీసు పనిమీదవెళ్ళినప్పుడు సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం మామూలే. ఆయినా ఈ రోజు ఇలా తన కాబోయే జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళడం అంటే కొత్తగా వుంది ఆమెకు.
సరిగ్గా ఒంటి గంటకు వారిజ బయటకు వచ్చి నిలబడింది. ఆయిదు నిముషాలలో అతను వచ్చాడు. అతని చేతిలో పూలగుత్తి గానీ, గిఫ్ట్ పాకెట్ గానీ లేకపోవడం గమనించింది వారిజ.
ఇద్దరూ వారిజ కారులోనే దగ్గరే వున్న రెస్టారెంట్ కి వెళ్లారు.
“నేను ఇలా రావడం మీకు ఇబ్బందిగా లేదు కదా? కాళీగా వున్న ఫామిలీ రూములో కిటికీ దగ్గరగా ఉన్న బల్ల ముందు కూర్చుంటూ అడిగాడు జయంత్.
“అదేమీ లేదు. డబ్బాలో తెచ్చుకున్న చల్లారిపోయిన తిండి బదులు హాయిగా ఏదన్నా వేడిగా తినవచ్చు.” ఆంది నవ్వుతూ.
“అంటే వేడి భోజనం తప్ప నా రాక మీకు ఆనందమని చెప్పరా? ” నవ్వాడు జయంత్.
మెను కార్డ్ చూసి , మీకేది ఇష్టం అని వారిజను అడగకుండానే తనకు నచ్చింది చెప్పి తెమ్మన్నాడు. ఆశ్చర్య మనిపించినా మౌనంగా వూరుకుంది.
సర్వర్ వెళ్ళిపోగానే గొంతు సవరించుకున్నాడు జయంత్.
” నిన్న మీ అమ్మగారు మీరు బెంగుళూరుకు బదిలీ చేయించుకునే విషయం మాట్లాడారు. మీరు తొందరపడి బదిలీ గురించి అడిగేస్తారేమో అని ఈ రోజు ప్రయాణం మానుకుని మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను.” అని ఆగాడు.
ఆశ్చర్యంగా చూసింది వారిజ.
” అదే బెంగుళూరులో మేము అద్దె ఇంట్లో వుంటున్నాము. అదీ ఒక్క పడకగది ఇల్లు. ఆ గది నేనే వాడుకుంటున్నాను లెండి. అమ్మా నాన్నా హాల్లో పడుకుంటారు.” సందేహంగా ఆగాడు.
“నాకు మీ అమ్మ నాన్నలతో కలిసి వుండడం ఇష్టమే. కావాలంటే మరొక పెద్ద ఇల్లు చూసుకోవచ్చును. ” నెమ్మదిగా చెప్పింది వారిజ.
” అదికాదు. మాకు అనంతపురంలో స్వంత ఇల్లు వుంది. అమ్మ చెప్పింది కదా నాకు భోజనం ఇబ్బంది కాకూడదని వాళ్ళను రప్పించుకున్నాను. ఇక్కడ మీకు స్వంత ఫ్లాట్ వుండగా అక్కడ అంత అద్దె పోసి మరో ఇంటికి మారడం దండగ కదా? వాళ్ళు ఇదివరకటి లాగానే అనంతపురం వెళ్ళి మా స్వంత ఇంట్లో వుంటారు. నాకు మీ వూరికి పోస్టింగ్ కావాలని మా బాస్ ని అడుగుతాను. ” గబ గబ చెప్పాడు.
ఒక నిముషం ఆలోచిస్తూ వుండిపోయింది వారిజ
“కానీ నేను కొన్నది కూడా ఒకే పడకగది ఇల్లు. మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వుండాలనుకుంటే వారికి అనుకూలంగా వుండదేమో ” అంది.
“వాళ్ళు ఇక్కడికి రావలసిన అవసరమేముంది? నేనే అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాను. ” జయంత్ మాట్లాడుతూనే ఫోన్ లో మెసేజ్ లు చూసుకుంటూ ఇంకా రాని బట్లర్ కోసం అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు.
వారిజ అతను వైపు పరిశీలనగా చూసింది.
జయంత్ చిన్నగా నవ్వాడు. “అంతే కాదు. ఇక్కడ మీ అమ్మా వాళ్ళకు దగ్గరగా వుండడం వలన అద్దె మిగలడమే కాక ఇంకో లాభం కూడా వుంది.
అని ఆమె వైపు చూసి నవ్వాడు.
వారిజ కళ్ళలో ప్రశ్న చదివినట్టు తిరిగి అతనే చెప్పాడు ” రేపు భవిష్యత్తులో మన పిల్లలను క్రెష్ లో వదలడమో, బోలెడు డబ్బు పోసి ఆయాను పెట్టుకోవడం అవసరం వుండదు. మీ అమ్మా నాన్నగారు ఆరోగ్యంగా వున్నారు గనుక వాళ్ళే చూసుకుంటారు. మీ చెల్లెలు ప్రస్థుతం ఖాళీగానే వుంది గనుక తన సహాయమూ వాళ్ళకు వుంటుంది.. రెండుమూడేళ్ళు గడిచాక వాళ్ళూ చూడలేకపోయినా మనకు సమస్య వుండదు.” వెయిటర్ భోజనం తీసుకుంది వచ్చి పెడుతుంటే అటు చూస్తూ అన్నాడు.
వారిజకు ఊపిరి ఆడనట్టు అనిపించింది.
అప్రయత్నంగా తన ఒళ్ళొని హాండ్ బాగ్ ని భుజానికి తగిలించుకుంది.
” అదేమిటి అప్పుడే లేస్తున్నారు?” ఆశ్చర్యం గా అడిగాడు.
” ఒక్క నిముషం. చేతులు కడుక్కుని వస్తాను. “అని లేచి, వాష్ రూముకు వెళ్ళింది.
చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే తెరిపిగా అనిపించింది ఆమెకు.
” మనుషుల నడుమ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాటకు నిర్వచనంలా వున్నాడు ఇతను. నిన్న తాము మాట్లాడుకున్న అరగంటలో అతని ఉద్యోగ బాధ్యతల గురించీ, జీవితంలో పైకి రావాలన్న అతని తపన గురించీ చెప్పాడు. , ఇంకా స్నేహితులు, సినిమాలు గురించీ ముచ్చటించుకున్నారు. అతనేమిటో ఈ రోజు అర్థం అవుతున్నట్టుగా వుంది వారిజకు. నెమ్మదిగా నడుస్తూ తాము కూర్చున్న చోటుకి వచ్చింది.

ఆ సరికి జయంత్ అతని ప్లేట్ లోకి కావలసినవి వడ్డించుకున్నాడు. అప్పుడే తినడం మొదలు పెట్టేసాడు..వారిజ ముందు వున్న ప్లేట్ కాళీగా వుంది. మర్యాద కోసమైనా ఆమె పళ్ళెంలో వడ్డించలేదు అతను.
” అన్నట్టు చెప్పడం మరచిపోయాను. నాకు ఆమెరికా వెళ్ళే అవకాశం రావొచ్చు. బెంగుళూరులో కట్టే అద్దె మిగులుతుంది కదా అది నేను కొన్న స్థలానికి కట్టేస్తాను. అమెరికాలోనే స్థిర పడాలని నా ఆశయం. ఆ స్థలాన్నిఅమ్మి అక్కడ ఇంటికి డౌన్ పేమెంట్ కట్టవచ్చు ఇక్కడి ఖర్చులు మనం చెరి సగం పెట్టుకుందాము. మరి కాస్త బిరియానీ వడ్డించుకుంటూ చెప్పాడు.
అప్పుడు గుర్తు వచ్చినట్టు ” అరే మీరు తినడం మొదలు పెట్టనే లేదు. ” అన్నాడు.
” ఫరవాలేదు. నాకు ఆకలిగా లేదు. ఆంటూ కొంచం ప్లేట్లో వేసుకుంది.
జయంత్ తనకు ఆమెరికా రావడం ఇష్టమా కాదా అని అడగ లేదన్నమాట పక్కన పెట్టి ” మీ అమ్మా నాన్నలకు మీరు ఒక్కడే కొడుకు కదా వారి మాట ఏమిటి. ” అని అడిగింది.
” అయితే. వాళ్ళ కోసం నా భవిష్యత్తు వదలుకుంటానా? శక్తి వున్నన్నాళ్ళు చేసుకుంటారు. చేత కానప్పుడు చూద్దాం. ”
“అప్పుడు అమెరికా తీసుకు వెళ్తారా ? అడిగింది వారిజ.
“ఇంకా నయం. అక్కడి ఆరోగ్య భీమాలు, ఖర్చులకు ఆరిపోతాము. ఇక్కడే ఎవరో బంధువుల సహాయం తీసుకోవడమో, , తప్పదు అంటే వౄద్ధాశ్రమంలో చేర్పించడమో చేయాలి. ” ఎటువంటి భావోద్వేగమూ లెకుండా చెప్పాడు.
ఆమె తింటున్నదీ లేనిదీ పట్టించుకోకండా మరో పదార్థం వేసుకున్నాడు.
“మీరేమి తింటారని అడగలేదు. మీకు ఆమెరికా రావడానికి అభ్యంతరం లేదు కదా అని కనుక్కోలేదు. కనీసం తను వచ్చేదాకా ఆగకుండా తినడం మొదలు పెట్టేసాడు. కాబోయే అత్తామామలను మరదలిని ,తన బిడ్డలకు బేబీ సిట్టర్స్ గా వాడుకోడానికి సిద్ధమైపోయాడు. ‘తనతో సమంగా చదువుకుని, సంపాదించే భార్యకు, ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అతను ప్రాముఖ్యమివ్వడని స్ఫష్టంగా అర్థం అయ్యింది.
ప్రాణంగా పెంచుకున్న కన్నవారినీ కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నాడు అంటే చాలా స్వార్థపరుడే నన్నమాట.
తినడం ముగించి కాగితం రుమాలుతో మూతి, చేతులు తుడుచుకుని వుండ చుట్టి పారేసాడు.
“వాడుకుని పారేసే కల్చర్ బాగానే ఒంటబట్టింది. ” అనుకుని లేచి నిలబడింది.
అతని ముఖంలోకి సూటిగా చూస్తూ నిదానంగా మాట్లాడడం మొదలు పెట్టింది.
” ప్రస్థుతం ఈ వస్తు వినిమయ ప్రపంచంలో కుటుంబం ఆవల నిజమైన ప్రేమ, ఆత్మీయత దొరకడం అరుదై పోయింది. ఎంత సంపాదించినా ప్రేమించే మనుషులను కొనగలమా? మా అమ్మా నాన్నా మా కోసమే తమ జీవితం అన్నట్టు బ్రతికారు. నాకు ఉద్యోగం వస్తే వాళ్ళు గర్వపడ్డారు. నాకు దెబ్బ తగిలితే వాళ్ళు నొప్పి అనుభవించారు. ” వారిజ క్షణం ఆగి ఊపిరి తీసుకుంది.
జయంత్ కాస్త అసహనంగా చూసాడు. “ఎవ్వరి తల్లితండ్రులు అయినా అంతే కదా. ” అన్నాడు తనూ లేచి నిలబడుతూ.
“మన కోసం ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా వాళ్ళు క్షణకాలం తటపటాయించలేదు. అటువంటి ఆత్మీయులను అవసరానికి వాడుకుని వాళ్ళకు మన చేయూత అవసరమైనప్పుడు వృద్ధాశ్రమాలపాలు చేసే డబ్బు, అమెరికాలో ఉద్యోగం , ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకు జీవితంలోభర్త, పిల్లలు ఎంత ముఖ్యమో నా తలిదండ్రులు, చెల్లి కూడా అంతే ముఖ్యం.పుట్టింటి లో అయినా మెట్టినింటిలోనైనా నేను కోరుకునేది మనసులను కలిపే మమతానుబంధం. “కుటుంబంలో అమ్మానాన్నల , అత్తా మామల , భర్త , పిల్లల ప్రేమ , వాత్సల్యం అందుకుంటూ ఆనందంగా బ్రతకాలి అన్నదే నా కోరిక. ముఖ్యంగా నా జీవిత సహచరుడితో నాకు కావలసింది వ్యాపార బాంధవ్యం కానే కాదు. మనసులు కలిసిన, ఒకరికొకరుగా జీవించగలిగే హృదయ బాంధవ్యం. మీ అభిప్రాయాలు నిన్ననే నాకు చెప్పి వుంటే ఈ రోజు సెలవు దండగ చేసుకుని నన్ను కలుసుకోవలసిన అవసరం వుండేది కాదు మీకు.” ఆని చిన్నగా నిట్టూర్చింది.
హాండ్ బాగ్ తెరిచి అయిదువందల నోటు తీసి వెయిటర్ తెచ్చిన బిల్ మీద పెట్టి “ఈ రోజు లంచ్ బిల్ లో నా వాటా. గుడ్ బయ్ ” అని బయటకు వెళ్ళే తలుపు వైపు నడిచింది వారిజ.
జయంత్ ఫోనులో “కన్నా అన్నం తిన్నావా ? అని మెసేజ్ కనబడింది. ప్రేమగా అమ్మ పంపిన సందేశం మనసును తడుముతూ కొత్త అనుభూతిని కలిగిస్తుంటే , స్థిరంగా అడుగులు వేస్తూ నడిచి పోతున్న వారిజ వైపు చూస్తూ నిలబడిపోయాడు జయంత్.

———— ———— ———–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *