March 29, 2024

అరుంధతి… అటుకుల చంద్రహారం.

రచన: గిరిజారాణి కలవల

 

మామూలుగా తెలుగు సినిమాల్లో వచ్చే డైలాగే ఇది… “ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ సంగతీ చెప్పలేము…” అన్నాడు మెళ్ళో స్టెత్ సవరించుకుంటూ.. ఆ కుర్ర డాక్టర్.

డ్యూటీలోకి కొత్తగా వచ్చినా,  ఆ వాక్యం బానే కంఠోపాఠం పట్టినట్టున్నాడు.. అందుకే అప్పచెప్పేసాడు… అంతటితో ఆగకుండా అతని స్క్రిప్ట్ లో రాసిన మరో డైలాగ్ గుర్తు వచ్చి…” ఎందుకైనా మంచిది… బంధువులందరికీ కబురు పెట్టండి.. ఆవిడ ఎవరినైనా చూడాలని అనుకుంటే కనుక వెంటనే పిలిపించండి… ఆవిడకి ఆఖరికోరిక ఏదెనా వుంటే తీర్చేయండి..” అంటూ… పూర్తిగా చెప్పేసానా… ఇంకేమైనా చెప్పాలా.. అన్నట్టుగా.. నర్సు సిస్టర్ వేపు  చూసాడు…

ఆ నర్సమ్మ.. అంతేగా . అంతేగా.. అన్నట్టు బుర్ర పైకీ కిందకీ ఊపింది. ఈ మాటలు చెప్పేసి.. వాళ్ళిద్దరూ.. ఇంకేమైనా.. ఈ డైలాగులు చెప్పవలసిన పేషెంట్స్ వున్నారేమో వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

ఆ మాటలకి అక్కడున్నవారందరూ మొహామొహాలు చూసుకున్నారు. అందరూ.. ఒకరి భుజాలమీద మరొకరు చేతులు వేసి… క్రికెట్ ఆటలో లాగా  గుండ్రంగా.. వచ్చి.. తలలు వంచి.. ” ఇప్పుడు.. ఏంటి కిం కర్తవ్యం?  ఏదో ఈ పూట మంచం  నుంచి దించెయ్యొచ్చు  అనుకుంటూంటే డాక్టర్ ఇంకా ఇరవైనాలుగు గంటలు అంటూ డౌట్ పెట్టాడు.. పైగా ఆఖరి కోరిక అంటున్నాడు… కొంపతీసి అది తీరకపోతే.. కానీ ఈవిడ పోదేమో.. ఆవిడ ఆఖరి కోరికేంటో మనకి తెలుసు కదా… అది ఇప్పుడు ఎక్కడ తీర్చగలమూ… అయినా గాడిదగుడ్డు కాదూ… నిజంగా ఆఖరి కోరిక కోసం ప్రాణం పోకుండా వుంటుందా ఏంటి? పోయే కాలం వస్తే అదే పోతుంది.. ఆ ప్రాణం ఎలాగూ పోతుంది.. దానికోసం ఇప్పుడు ఆ ఆఖరికోరిక తీర్చక్కర్లేదు.. ” అని తీర్మానం చేసుకున్నారు… ఆ పోడానికి సిద్ధంగా వున్న.. ముసలావిడ అరుంధతిగారి కొడుకు, కోడలు,  కూతురు, అల్లుడూ.. ఇంకా చెరి ఇద్దరి చొప్పున.. మొత్తం  నలుగురు మనవలూ.. వాళ్ళ పెళ్ళాలూ  అదీ సంగతి..

ఐ. సి. యు లో వున్న అరుంధతిగారిని ఒకరితర్వాత ఒకరు చూసి వచ్చేసి… ఇరవైనాలుగు గంటల్లో హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేస్తారెటూ.. అప్పుడు వద్దాము.. ఇక్కడుండి చేసేది లేదు పోదాం… అనుకుంటూ రెండు కుటుంబాలవారూ ఇళ్ళకి వెళ్లి పోయారు.

అదేమీ తెలియని అరుంధతి… తన ఆఖరి కోరిక తీరేదాకా.. తన గుండెని కొట్టుకోమనే చెప్పినట్టుంది..

డాక్టర్లు చెప్పిన ఇరవైనాలుగు గంటల గడువు నలభైఎనిమిదికి పెరిగింది..

మళ్లీ రెండు కుటుంబాలూ రౌండప్ చేసుకున్నారు.

అరుంధతి కూతురు… ఉమ.. ” వదినా! పోనీ డాక్టర్ చెప్పినట్లు అమ్మ ఆఖరి కోరిక తీరిస్తేనో.. పాపం ఆ ప్రాణం కొట్టుకుంటోంది.. దాని కోసమే కాబోలు..” అంది..

దానికి అరుంధతి కోడలు.. భారతి.. ” నీకేం.. నువ్వు బానే చెపుతావు.. సలహాలు… ఇప్పుడు హాస్పిటల్ ఖర్చే.. రెండు లక్షలు అయింది… ఇక ఆ కోరిక  కూడా తీర్చాలంటే కనీసం.. మరో రెండు లక్షలు అయినా పెట్టాలి. మా వల్ల కాదమ్మా!   ఏంటండీ బెల్లం కొట్టిన రాయల్లే మాట్లాడరు.. మీ చెల్లికి సమాధానం చెప్పండీ” అంది.   హమ్మా !!    ఆ తర్వాత.. అమ్మది నాకేగా అని కొట్టేద్దామనే ప్లాన్ కాబోలు.. అనుకుంది మనసులో..

అరుంధతి కొడుకు.. బ్రహ్మానందం..  భార్య భారతి మాటలకి తలూపుతూ..” అంతేగా.. అంతేగా.. ” అన్నాడు.

అన్న, వదిన మాటలకి చర్రున కోపం వచ్చింది  ఉమకి.. ఆ కోపం తన భర్త  శివరావు మీద చూపిస్తూ..”ఏంటండీ.. తుమ్మ మొద్దులా నిలబడ్డారూ.. చెప్పండీ.. అమ్మ గురించి రాత్రి మనం ఏమనుకున్నామో.. ” అంటూ.. కసిరింది.

” అది కాదు.. బామ్మర్దీ… ఇలాంటి స్టేజీ లో వున్నవారి ఆఖరి కోరిక తీర్చకపోతే.. ఆ ప్రాణం అలా కొట్టుకుంటూనే వుంటుందట..ఆ తర్వాత ఆత్మ కూడా ఇక్కడిక్కడే తిరుగుతూఉంటుందట. దయ్యమై మనల్ని పట్టుకోనూ వచ్చట.. అందుకని  చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలము.. ఇప్పటికే హాస్పిటల్ ఖర్చు రెండులక్షలయిందని మీ ఆవిడ బాధ పడుతోంది.. ఇంకా ఇలాగే.. ఐ. సి. యు. లో.. వెంటిలేటర్ మీద ఎన్నాళ్ళుంచుతాము?  మరో రెండు మూడు లక్షలు పైగా అయేట్టుంది ఖర్చు .. ఏతావాతా ఆ తర్వాత కర్మకాండల ఖర్చు ఎలాగూ తప్పదు.. అందుకే.. అదేదో కొనేసి ఆవిడకి ఓసారి చూపించామనుకో.. తృప్తిగా కళ్ళు మూస్తుంది మీ అమ్మ గారు.. ” అన్నాడు శివరావు.

” అదేంటన్నయ్యా… మీరూ అలాగే అంటారు? ఇప్పుడు అంత పెట్టుబడి మేము ఎలా పెట్టగలము? కాస్త ఆలోచించండి.. ” అంది భారతి.

” ఔనమ్మా… అదికూడా ఆలోచించాను.. అందుకే నేను సగం పెడతాను.. మీరు సగం పెట్టండి. ఆవిడకీ సంతృప్తిగా అనిపిస్తుంది.. పైగా ఇప్పటి కోరికా అది ? మనవెవరం రాక ముందుది.. ఆవిడ కాపురానికి వచ్చినప్పటినుండీ.. కాదు కాదు.. ఆవిడ చిన్నప్పటి నుంచీ దాని మీదే వుంది ఆవిడ మనసు.. అదేదో మనం కొంటే..  ఓసారి కళ్ళారా చూసుకుని.. కళ్ళు మూసేస్తుందిక. ఆ తర్వాత కార్యక్రమాలు అయ్యాక.. మళ్లీ మనిద్దరం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుందాం.. ఇంతకిమించి మరో మార్గం లేదు ఇప్పుడు..  ” అన్నాడు శివరావు.

” ఆ సగం పెట్టాలన్నా… ఇబ్బందే అన్నయ్యగారూ.. ” అంది భారతి.. మనసులో మాత్రం ఇదేదో బావుందే.. ఇలాగైనా నా కోరికా తీరవచ్చు.. అనుకుంటూ..

వెంటనే అందుకుంది ఉమ…” మాకు మాత్రం ఇబ్బంది లేదేంటి వదినా.. అప్పో సప్పో చేయాల్సిందే మేమైనా.. ఏదో అమ్మ ఆఖరి కోరిక తీర్చగలిగితే చాలు.. ” అంది..

ఈ రూపంలో అయినా తన కోడళ్ళ కిద్దరికీ.. ఏదో అమర్చినట్లవుతుంది.. అనుకుంది తనూ లోలోపల.

” అయితే.. మరి పదండి… వెళ్లి తీసుకువద్దాము.. సాయంత్రానికి మనం తీసుకువచ్చి ఆవిడకి చూపిస్తే.. .. రాత్రికి ఏ సంగతీ తేలిపోతుంది.. ” అంటూ శివరావు అందరినీ  బయలు దేరమన్నాడు.

పొలో మని రెండు కార్లలో అందరూ బయలుదేరారు.

వాళ్ళందరూ ఎక్కడకి బయలుదేరారో.. ఏం తేబోతున్నారో..

అసలు..  ఇంతకీ ఆ అరుంధతి గారి ఆఖరి కోరిక ఏంటో తెలుసుకోవాలంటే… చాలా వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి అంటే.. అరుంధతి బాల్యం లో దాకా వెళ్లి పోవాలి…

టయ్ టయ్ టయ్.. రింగులు రింగులు తిప్పుతున్నా.. ఫ్లాష్ బ్యాక్ లోకి..

అప్పుడు.. అరుంధతికి ఆరేళ్ల వయసు.  తండ్రి, తల్లి, బామ్మ, అన్నయ్య..వీళ్లు  తన కుటుంబ సభ్యులు.  అప్పుడప్పుడు.. పండగలకీ, పబ్బాలకీ.. మేనత్త సుభధ్ర అత్తగారి ఊరు అమలాపురం నుంచి పుట్టింటికి వస్తూ వుండేది. ఓ వారం పది రోజులుండి వెళ్ళేది. మేనత్త వస్తోందంటే అరుంధతికి చాలా సంతోషంగా వుండేది. ఆవిడ వున్ననాళ్ళూ.. వెనకాలే  తిరిగేది. ఆవిడ తీసుకువచ్చే.. సున్నుండల కోసమో.. వెళ్ళేటపుడు చేతిలో పెట్టే ఐదురూపాయల కోసమో కాదు ఆ సంతోషం. మేనత్త మెడలో మెరిసిపోయే అటుకుల చంద్రహారం కోసం.. అదంటే అరుంధతికి ఎంత ఇష్టమో. పచ్చగా మెరిసి పోయే మేనత్త మెడలో ఆ  నాలుగుపేటలు… అరచేయంత బిళ్ళతో వుండే ఆ అటుకుల చంద్రహారం. ఆవిడ నడుస్తున్నపుడు.. ఊగుతూ.. తళుక్కున మెరుస్తూ.. అరుంధతిని ఆకట్టుకునేది.  ” అత్తా! ఓసారి నీ గొలుసు ఇయ్యవా..” అనడిగితే.. అబ్బే.. అస్సలు ఇచ్చేది కాదు మేనత్త. మిగిలినప్పుడు ఎంత ముద్దు చేసినా… చంద్రహారం దగ్గరకి వచ్చేసరికి మాత్రం ఒప్పుకునేది కాదు. ” ఇంకా నయమే.. ఇది పిల్లలు వేసుకోకూడదే.. నాలుగు పేటలూ నలభై తులాలు.. ఎక్కడెనా పారేసావనుకో.. మా అత్తారు గుమ్మం కూడా తొక్కనీయరు.. చిన్నపిల్లవి నీకెందుకూ ఇంత గొలుసు..” అనేది కానీ.. ముచ్చటపడుతోంది కదా.. ఓసారి కూడా అరుందతి మెళ్ళో వేసేదికాదు.

” అమ్మా! అత్తకి ఉన్న గొలుసు లాంటిది నాకూ చేయించవే.. ” అని అమ్మ దగ్గర గారాలు పోయేది అరుంధతి.

” మనకంత తాహతు లేదే తల్లీ. ఆ కరణం గారు తన దగ్గర. ఆ జమాబందీ లెక్కలు రాసేటప్పుడు  మీ నాన్నకి   ఇచ్చిన ఏదో.. రూపాయీ, అర్ధా.. డబ్బులు  మిగిల్చి.. నీకూ, నాకూ.. చెరో ముక్కుపుడకా… కాళ్ల కి వెండిపట్టీలు.. కొనగలిగారు… అంతే.. ఇక ముందుకు మాత్రం ఇక పోలేరే.. నాలుగు వేళ్ళూ వేళకి లోపలకి వెడితే చాలు… నాలుగుపేటల గొలుసంత సంబరమే మన బతుకులకి… ” అనేది అమ్మ.. ఆ నిష్టూరాలేంటో అర్ధమయేవి కావు అప్పట్లో అరుంధతికి.

రాత్రి పూట బామ్మ పక్కలో పడుకుని.. కధలు వినేటప్పుడు.. ..” బామ్మా.. అటుకుల చంద్రహారం కొనాలంటే ఎంత డబ్బులు కావాలీ? ” అనేది.

” ఓసి, పిచ్చి మొహమా.. నీకెప్పూడూ అదే ధ్యాస.. అది కొనాలంటే డబ్బులు అక్కర్లేదే.. పెళ్లి చేసుకుంటే చాలు.. అత్తారే కొనిపెడతారు.. మీ సుభధ్ర అత్తకి దాని పెళ్ళి లో.. వాళ్ళ అత్తగారు పెట్టారు ఆ చంద్రహారం.. నీకూ అలాగే మీ అత్తగారు పెడతారులే. ” అనేది ఆవిడ.

వెంటనే నాన్న దగ్గరకి పరుగెత్తుకుని వెళ్లి..” నాన్నా! నాకు తొందరగా పెళ్ళి చేసెయ్యి నాన్నా ! మా అత్తారు అటుకుల చంద్రహారం పెడతారు.. ” అంది.

” అలాగే.. బంగారు తల్లీ… ఇంకొక్క పదేళ్ళు ఆగు.. అలాగే చేసేస్తాను.. ” అనేవాడు తండ్రి.

ఓసారి.. అరుంధతికి మల్లెపూలతో జడ కుట్టింది బామ్మ.. కూతురితో.. ” సుభధ్రా! ఓసారి నీ చంద్రహారం.. అరుంధతి మెళ్ళో వెయ్యవే.. ముచ్చటపడుతోంది… ఈ జడ, ఆ హారంతో.. ఫోటో తీయిద్దాము.. దాని మోజు తీరుతుంది.. ” అని.. ఆ  హారం వేయించి స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించింది. ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి.. మంచం పక్కనే పెట్టుకునేది అరుంధతి.. హారం కేసి చూస్తూ పడుకునేది.

చూస్తూండగా పెళ్ళీడుకి ఎదిగింది.  వచ్చిన రెండు సంబంధాలలో ఇది బాగా నచ్చింది అరుంధతి తండ్రికి..  పెళ్లి కొడుకు  శేఖరానికి గవర్నమెంట్  ఉద్యోగం… సొంత ఇల్లు.. రెండెకరాల మాగాణి వుంది  కరెంటు ఆఫీసులో గుమాస్తా గిరీ  వుంది..  తండ్రికి రెండకరాల పొలం వుంది.. ఆయన వ్యవసాయం చేస్తాడు.. ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద పిల్లకి పెళ్ళి అయింది.. ఇంకా ఇద్దరు పెళ్ళికి వున్నారు. తల్లి లేదు.. వాళ్ళకి అరుంధతి నచ్చింది.. జాతకాలూ కుదిరాయి.

తమ తాహతుకి ఇంతకి మించి సంబంధం రాదని అనుకుని అరుంధతి తండ్రి.. మంచిరోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందామనుకున్నాడు. మళ్లీ గుర్తు చేసింది అరుంధతి.. అటుకుల చంద్రహారం గురించి తండ్రికి.

ఆయన.. తాంబూలాలు మార్చుకునే రోజున వియ్యంకుడితో అన్నాడు…  “పెళ్లి కి మేము మా పిల్లకి బాలతొడుగు కింద..  జత గాజులు, పుస్తెల గొలుసు పెడతాము… మీరు మీ కోడలికి ఎలాగూ ఏదో ఒకటి చేయించాలి కదా… అటుకుల చంద్రహారం చేయించండి.. మా పిల్లకి ఎప్పటినుండో దాని మీద మనసుగా వుంది..” అంటూ మొహమాటం లేకుండా చెప్పేసాడు.

“అయ్యో.. మీరింతగా చెప్పాలా! మా ఇంటికి వచ్చే మహాలక్ష్మికి.. చంద్రహారం చేయించమంటే కాదంటామా… అయితే.. పంట చేతికి వచ్ఛాక చేయిస్తాను.. ఇప్పుడు పెళ్లిలో నల్లపూసల దండ, ఉంగరం పెడతాం  లెండి.. ” అంటూ తప్పించుకున్నాడు అరుంధతి కాబోయే మావగారు..

“పంట చేతికి    రాక పోతుందా.. తన  కలల పంట పండకపోతుందా.. ” అనుకుని… తల వంచి మెళ్ళో తాళి కట్టించేసుకుంది అరుంధతి.. కానీ… కాలక్రమంలో పుట్టింటివారు పెట్టిన బంగారం పుస్తెల గొలుసు  స్థానంలో.. పసుపుతాడు వచ్చింది కానీ… అటుకుల చంద్రహారం పెడతామన్న మాట హుళిక్కే అయింది. పంట చేతికి రావడం మాట అటుంచి.. మిగిలిన ఇద్దరాడబడుచుల పెళ్ళి కోసం.. వున్న రెండెకరాలు అమ్మేసారు మామగారు. ఆ తర్వాత.. ఆడబడుచుల రాకపోకలు.. పురుళ్ళు, పుణ్యాలూ.. ఆ తర్వాత మామగారు మంచాన పడితే ఖర్చులూ.. ఇలా ఒకదానితర్వాత మరోటి వచ్చిపడి అటుకుల చంద్రహారాన్ని వెనక్కి నెట్టేసాయి. మధ్య మధ్యలో.. తన చిన్నప్పటి ఫోటో.. మేనత్త తన మెడలో వేసినప్పుడు తీయించుకున్న ఫోటో కేసి ఆశగా చూసుకుంటూ వుండిపోయేది పాపం.

తర్వాత.. తన పిల్లలు బ్రహ్మానందం, ఉమ పుట్టడం.. వాళ్ళ చదువులు, ఖర్చులకి సొంత ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి  వచ్చింది. పేరుకి గవర్నమెంట్ ఉద్యోగమే అయినా జీతం అంతంతమాత్రమే..ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు రెడీగా కూర్చునేది. పాపం.. శేఖరానికి. భార్య అరుంధతి నోరు తెరిచి అడక్కపోయినా.. ఆవిడ కోరిక తెలుసు.. ఎప్పటికైనా  ఎలాగైనా తీర్చాలనే అనుకుంటూ వుంటాడు.

” అరుంధతీ… ఉన్న ఆస్తులను అమ్మేసుకోవలసి వచ్చింది.. నా చెల్లెళ్ళు.. ఇప్పుడు మన పిల్లల కోసం. ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా తీరిపోయింది.. అబ్బాయి సెటిల్ అయిపోయాడు.. అమ్మాయికి పెళ్లి చేసేసాం.. ఇక కొత్తగా ఖర్చులు లేవు.. మరో మూడు నెలలో రిటైర్ అయిపోతాను.. అప్పుడు వచ్చే డబ్బులతో నీకు అటుకుల చంద్రహారం చేయిస్తాను.. ఒట్టు.. ” అన్నాడు శేఖరం.

ఆ మాటలతో అణిగిపోయిన అటుకుల చంద్రహారం ఆశ మళ్లీ మొలకెత్తింది అరుంధతికి. భర్త ఎప్పుడు రిటైర్ అవుతాడా.. ఎప్పుడు చంద్రహారం కొంటాడా అని ఆ మూడు నెలలూ మూడు యుగాలుగా గడిపింది. రిటైర్ అయ్యాక… ఓ నెలరోజుల్లో.. శేఖరం చేతికి ఓ పెద్ద మొత్తమే అమిరింది. ఆ  సాయంత్రమే భార్యాభర్తలిద్దరూ .. బంగారం కొట్టుకి వెళ్ళారు. అయితే.. అరుంధతి కోరుకున్న నాలుగుపేటలకీ.. ఈ డబ్బుతో రెండు పేటలు కూడా రావని తెలిసింది.  పోనీ ఒక పేట తీసుకోమని భర్త చెప్పినా.. రాజీ పడలేదు అరుంధతి.. నాలుగుపేటలూ.. అరచెయ్యంత బిళ్ళ వుండాల్సిందే.. వేరేలా వద్దు కాక వద్దనేసింది. చేసేదేం లేక  ఇంటి మొహం పట్టారు.

ఇంతలో శేఖరం స్నేహితుడు.. మోహనరావు.. ఇల్లు కట్టుకుంటూ.. అవసరానికి నీ దగ్గర వున్నవి సర్దు… పదిహేను రోజుల్లో చీటీపాట డబ్బులు వస్తాయి.. అప్పుడు ఇచ్చేస్తానంటే.. కాదనలేక తనకి వచ్చిన డబ్బును.. మోహనరావుకి  ఇచ్చాడు. పదిహేను రోజులే కదా.. అని రాతకోతలేవీ లేకుండా  చేబదులుగా  ఇచ్చాడు. తానొకటి తలిస్తే దేముడొకటి తలుస్తాడు కదా.. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న  మోహనరావు యాక్సిడెంట్ అయి అక్కడక్కడే పోయాడు.. ఆ తర్వాత… ఈ డబ్బు సంగతి శేఖరం.. మోహనరావు కొడుకులని అడిగితే.. తమకేం తెలీదు.. తండ్రేం తమకి చెప్పలేదు కాబట్టి మాకు సంబంధం లేదని నిక్కచ్చి గా చెప్పేసారు. తమకి అంటూ మిగిలింది మొత్తం ఇలా పోగొట్టుకొనేసరికి శేఖరం దిగులతో మంచమెక్కాడు. భార్య కోరిక తీర్చలేకపోయాననే  బాధతో నెలలోపునే కన్ను మూసాడు.

అరుంధతి కొడుకు పంచన చేరక తప్పలేదు. ఏదో ఫర్వాలేదు.. రోజులు వెళ్ళదీస్తోంది.. అప్పుడప్పుడు ఆశగా తన చిన్నప్పటి ఫోటో కేసి చూసుకుంటూ. ఆవిడ కోరిక తీర్చలేని స్థితిలో అయితే మాత్రం లేడు కొడుకు. ఓ సారి భార్యతో..  “పోనీ పాపం.. అమ్మకి ఆ హారం కొంటేనో.” . అని పొరపాటున అన్నాడు.. అంతే.. .”ఇంత వయసులో కూడా ఆవిడకి అటుకుల చంద్రహారమేంటీ.. నవ్వుతారు అందరూ.. ఊరుకోండి..  ఆవిడకి మనం మూడుపూటలా తిండి పెడుతున్నాం చాలు.. ఇక ఆ కోరికలెక్కడ తీరుస్తాం.” . అంటూ కోడలు భారతి.. బ్రహ్మానందాన్ని..  మళ్లీ నోరెత్తనీయలేదు.

ఓపిక ఉన్ననాళ్ళూ కొడుకు, కోడలికి  చేయగలిగినంత చేసిన.. అరుంధతి.. ఇక ఎనభైలో పడిన వయసూ.. శరీరం మూలన పడి.. చివర ఇదిగో ఇలా ఐ. సి. యూ వరకూ లాక్కొచ్చాయి..

అన్ని షాపులూ తిరిగి.. చివరకు లలితా జ్యూయలరీలో నాలుగు పేటల అటుకుల చంద్రహారం.. మొత్తానికి తీసుకున్నారు బ్రహ్మానందం, ఉమ.. చెరిసగం డబ్బులేసుకుని..

తిన్నగా  హాస్పిటల్ కి వచ్చి.. అరుంధతి దగ్గరకి వెళ్ళారు.  కూతురు, కోడలు.. కొడుకు, అల్లుడు ఆవిడ బెడ్ కి అటూఇటూ చేరి.. ఆవిడ రెండు చెవుల్లోనూ…

” అటుకుల చంద్రహారం.. అటుకుల చంద్రహారం.. ఇదిగో.. ఒకసారి కళ్ళు తెరవండి..” అంటూ పదే పదే అనేసరికి.. అప్పటిదాకా అచేతనంగా వున్న అరుంధతి శరీరంలో చిరుకదలిక కనపడింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా.. అటుకుల చంద్రహారం కనపడేసరికి.. ఆ గాజుకళ్ళలో మెరుపు మెరిసింది. నెమ్మదిగా ఆవిడ తల పైకెత్తి.. మెడలో ఆ హారం వేసారు.. ఆ హారం స్పర్శ లోపల  గుండెకి తెలిసింది కాబోలు.. చిన్నగా కొట్టుకోవడం మొదలెట్టింది.. అక్కడే వున్న డ్యూటీ డాక్టర్..  మానిటర్ కేసి చూస్తూ ..

” వండర్.. ఆవిడ పల్స్ కరెక్టుగానే కొట్టుకుంటోంది…” అంటూ.. గబగబా మిగిలిన టెస్టులు అన్నీ చేసి.. ” చాలా ఆశ్చర్యంగా వుంది.. ఆవిడకి ఇప్పుడు ఏ ప్రోబ్లమ్ లేదు.. ఇంత సడన్ గా ఈ మార్పుకి మాకే వింతగా వుంది.. రెండు రోజుల్లో ఆవిడని ఇంటికి తీసుకెళ్ళపోవచ్చు మీరు”.. అనేసరికి.. వినగానే  ఢాం అని పడిపోయిన భారతిని, ఉమని.. అదే హాస్పిటల్ లో చేర్చారు..

క్షేమంగా ఇంటికి చేరిన అరుంధతి.. అటుకుల చంద్రహారం మోజు తీర్చుకుని .. సెంచరీ కొట్టాక.. ఓరోజు నిద్రలోనే.. ఎవరికీ చెప్పకుండానే.. శాశ్వత నిద్రలోకి వెళ్లి పోయింది తృప్తిగా..

 

 

*****

1 thought on “అరుంధతి… అటుకుల చంద్రహారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *