March 28, 2024

కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం

రచన: రమేశ్ కలవల

 

ఓరేయ్ ఇలారా.. “ అని పిలుస్తూ” పంతులు గారు వీడికి కూడా శఠగోపురం పెట్టండి” అని అడిగింది శాంతమ్మ గారు.

“తల మీద ఇలా ఎందుకు పెడతారు నానమ్మ” అని అడిగాడు.

“అదిగో ఆ దేవుడున్నాడు చూసావు.. అదో పెద్ద శక్తి అనమాట. ఏదో ఒక రోజు ఈ పెద్ద శక్తికి తలవంచక తప్పదు నాయనా..అందుకే భక్తిగా బుర్ర వంచి దణ్ణం పెట్టుకో” అంది. వాడు నమస్కారం చేసి నానమ్మతో గుడి బయటకు నడిచాడు, ఇద్దరూ ఆలయం ఆవరణలో కూర్చున్నారు.

“ఇందా కొబ్బరి ముక్క” అంటూ చంటోడి చేతిలో పెట్టబోతుంటే, అటు వైపు మిగతా సన్యాసులతో కలిసివెడుతూ వారిలో ఒకాయన ఆగి పలకరించడంతో, శాంతమ్మ ఆయనను కుశల ప్రశ్నలు వేసింది.

ఆయన వెళ్ళిపోగానే “వాళ్ళంతా ఎవరు నానమ్మ” అని అడిగాడు.

“తెలియడంలా సన్యాసులు రా సన్నాసి” అంది

“సన్యాసం తీసుకుంటే ఇంచక్కా ఏ బంధాలు లేకుండా అలా వాళ్ళలా తిరగేచ్చు” అంది.

ఆ చంటోడితో ఇంకా జీవిత పాఠాలు గురించి చెప్పబోతుంటే “పోనీ నువ్వు కూడా సన్నాసితనం తీసుకోకూడదు” అన్నాడు.

ఒక్క సారిగా ఆ చంటోడి అన్న మాటకు తేరుకొని “సన్నాసితనం కాదురా సన్యాసం తీసుకోవడం .. అది అందరూ తీసుకోనేది కాదురా సన్నాసి… దానికి కొన్ని నియమాలు, నిష్ఠలు ఉంటాయి. నిగ్రహంగా ఉండాలి, నిరాడంబరంగా బ్రతకాలి.. తిండి వ్యామోహం ఉండకూడదు.. ఇవన్నీ నీకు ఈ వయసులో నే చెప్పినా అర్థం కావులే” అంది.

 

“పదా.. ఆకలిగా ఉంది ఇంటికి వెడదాం” అంటూ లేచి బయటకు నడిచి ఎదురుగా వస్తున్న రిక్షాని పిలిచి ఇద్దరూ ఎక్కారు.

రిక్షాలో ఆ చంటోడు తల దించుకు కూర్చోడంతో  “నీ పేరు శఠగోపురం కదా అని నువ్వు తలదించుకొని ఉండనక్కర్లేదు…ఆ ఒక్క దేముడి ముందు తప్ప నీ తల ఎప్పుడూ ఎత్తే ఉండాలిరా” అంటూ తను వాడికి ఆ పేరు ఎందుకు పెట్టిందో కూడా చెప్పింది.

“తల ఎత్తే ఉండాలన్న” చివరి వాక్యం ఈ శఠగోపురానికి మనసులో బాగా నాటుకుపోయింది.

“మ్యాచెస్ ఆర్ మేడిన్ శివకాశి” కాబట్టి ఇలాటి వారి కోసం ఓ అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుందంటారా?

——

శఠగోపురం కి కామాక్షితో పెళ్ళై మూడేళ్ళయింది. “పెళ్ళైన తరువాత ఒక్క పండక్కి కూడా మా అమ్మా నాన్నని పిలవలేదండి” అంటూ ఓ సారి వాపోయింది పైగా తను ఏడు నెలల గర్భిణి, సహజంగా పెద్దవారు తోడు ఉంటే బావుండునని తన ఉద్దేశం.

దానికి వేరే ఎవరైనా అయితే జాలి చూపించి కనీసం ఈ ఏడాదైనా తప్పక పిలిపించి, వారితో సరదాగా గడిపి అంత దూరం నుండి సహాయానికి వచ్చినందుకు ఏ బట్టలో పెట్టించి పంపేవారు.

శఠగోపురం వేరే కోవకు చెందిన వాడు కాబట్టి కనీసం  పశ్చాత్తాపం కూడా చూపించలేదు కదా పైగా కామాక్షితో “మూడేళ్ళు నుండి పిలవ లేదు సరే.. ఇంకో మూడేళ్ళైనా పిలవనోయ్…” అంటూ దురుసుగా నోరు జారాడు. కామాక్షి ఎప్పుడూ అంతగా నొచ్చుకోలేదు.

అలాగే ఓ రోజు ఆఫీసులో బయటనుండి ఇన్పెక్షన్ కు వచ్చిన ఆఫీసర్ తో  లేనిపోని రాద్దాంతం చేసి తన బాసు తలదించేలా చేయడంతో శఠగోపురం ఉద్యోగం ఊడినంత పనయ్యింది.

 

ఇంతా జరిగినా తరువాత రోజు నుండి మళ్ళీ తన చేష్టలు షరా మామూలే, పైగా ఓ పెళ్ళికి అర్జెంటుగా వెళ్ళాలంటూ వారం రోజులు సెలవు గోల పెట్టి మరీ తీసుకున్నాడు. “ఈయనకు ఏదోరోజు మూడటం ఖాయం అని” అనుకున్న వారు చాలామంది ఉన్నారు ఆ ఆఫీసులో.

ఇక ముచ్చటగా మూడో సంఘటన కూడా చూస్తే, అర్జెంటుగా అటెండు అయిన కామాక్షి వాళ్ళ చుట్టాల పెళ్ళిలో ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా గొప్పలకు పోయి ముందుగా ఐదు వేలు చదివింపులు చదివించాడు శఠగోపురం.

పెళ్ళితంతు కాగానే భోజనాలలో తన పక్కన ఒక విసిగించే మనిషి తగలడంతో ఆయనపై చిర్రెత్తి, ఆ భోజనం ఏదో సరిగా చేయక, సగం ఆకలి కడుపుతో ఆ వధూవరుల దగ్గరి తిరిగివెళ్ళి “ఇందాకా పొరపాటున ఎక్కువ చదివించానని, అసలు తను ఈ పెళ్ళికి వచ్చి పెద్ద ఓ తప్పుచేసాడని, ఆ చదివింపులలో ఓ నాలుగు వేలు తిరిగి ఇచ్చేయమని” అందరి ముందు అడిగటమేకాకుండా, వాటిని ఇచ్చేదాకా తన చుట్టాల ముందు నానా రభసా చేయడంతో కామాక్షి సిగ్గుతో చితికిపోయింది. ఇక లాభం లేదని మరుసటి రోజే పుట్టింటికి ప్రయాణమయ్యింది, ఛస్తే తిరిగి రానని భీష్మించుకు కూర్చుంది.

నెలలు గడిచాయి. కామాక్షి లేని లోటు తెలుస్తోంది కానీ తన నైజానికి ఎన్నడూ పరిస్థితులకు తల వొగ్గడుకదా?

సమయం కలిసి రాకపోతే అన్నీ ఇబ్బందులు కలిసి వచ్చినట్లు ఆఫీసులో కూడా పరిస్తితుల ప్రభావం వల్ల ఉన్న ఉద్యోగం కాస్తా దాదాపు ఊడే పరిస్థితికి వచ్చింది. ఆ సంగతి కామాక్షి చెవిన పడింది.

ఇక లాభం లేదని తనే ఏదోకటి ఆలోచించ శఠగోపురాన్ని మార్చే ప్రయత్నం చేద్దామని తలచింది. ఎంతైనా పరాయివారు కాదు కదా!

———

“ఎవరూ” అంటూ ఎవరో తలుపు కొట్టడం వినిపించగానే లోపలనుండి గడియ తీసింది వయసు పడిన శఠగోపురం వాళ్ళ నానమ్మ శాంతమ్మ.

తలుపు తీయగానే ఎదురుగా పండంటి ముని మనవడితో వచ్చిన కామాక్షి చూసి సంతోషంతో కౌగలించుకొని లోపలకు తీసుకెళ్ళింది నానమ్మ.

కామాక్షి జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినట్లు వివరంగా చెప్పింది. అన్నీ విన్న ఆవిడ తను శఠగోపురానివి చిన్నప్పుడు విషయాలు అన్ని చెప్పింది. కాళికతో మాట్లాడి ఓ ఉపాయం పన్నింది నానమ్మ.

నానమ్మ ఓ కార్డు ఉత్తరం తీసి రాయడం మొదలు పెట్టింది

ప్రియమైన శఠగోపురానికి,

మీ నానమ్మ ఆశీర్వదించ వ్రాయునది. నీవు క్షేమమని తలుస్తాను. నా ఆరోగ్యం అంతంత మాత్రమే. వయసు మళ్ళుతోంది కదా. ఈ మధ్య సుస్తిచేసిన తరువాత కోలుకున్నాను. నీ విషయాలు తెలిసాయి, నువు చేస్తున్న పనులు ఏమి బాలేవు. ఇవన్నీ చూసి, విన్న తరువాత నేను ఓ అభిప్రాయానికి వచ్చాను. నీకు తెలిసి తెలియని వయసులో నన్ను ఓ సారి ‘సన్నాసితనం’ తీసుకోమన్నావు. నీ కోరిక మీరకు చివరి సారిగా కామాక్షిని కలిసి అదే చేయబోతున్నాను.

ఇట్లు

నానమ్మ

కార్డు పోస్టులో పడేసింది. ఓ రెండు రోజులలో ఆ కార్డు చేరగానే నానమ్మ దగ్గర నుండి రావడంతో ఆత్రుతతో తీసి చదివాడు.  ఎలాగైనా నానమ్మను కలవాలి అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళింది తెలిసేదెలా? మళ్ళీ చదివాడు. కామాక్షిను కలుస్తానంది కదూ అంటూ మళ్ళీ తన అభిమానం అడ్డు వచ్చింది.

ఒకటి రెండు రోజులు గడిచాయి, నానమ్మ విషయం పదే పదే గుర్తుకు రావడంతో ఇక తప్పదే లేక కామాక్షి దగ్గర తల దించడానికి సిద్దపడ్డాడు. వెంటనే ప్రయాణం అయ్యాడు.

——

అత్త మావగారి ఇల్లు చేరుకొని తలుపు కొట్టాడు. తలుపు తీయగానే పశ్చాత్తాపంతో కామాక్షి గురించి అడిగాడు. బయటకు వెళ్ళిందనడంతో మొహం చెల్లక దిగులుతో బయటకు నడిచాడు. ఏం చేయాలో తోచక నానమ్మతో ఎప్పుడూ వెళ్ళే గుడికి బయలుదేరాడు. అక్కడి చేరికోగానే నానమ్మ “జీవితంలో ఏదో ఓ రోజు ఆ అతీత శక్తికి తల వంచాలి నాయనా” అన్న మాటలు గుర్తుకువచ్చి ఆ స్వామికి క్షమించమని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండగా ప్రక్కనే పరిచయం ఉన్న గొంతుతో “శాస్త్రులు గారు, వీడికి శఠగోపురం పెట్టండి” అంటూ ఓ చంటోడిని ముందుకు చేతులతో చూపించండంతో కళ్ళు తెరిచి సంతోషంతో నానమ్మను హద్దుకున్నాడు. చేతిలో ఆ పిల్లవాడిని తీసికోబోతుంటే కామాక్షి వైపు చూపించి క్షమాపణ అడగమంది. చెవులు పట్టుకొని క్షమాపణ అడిగి ఇద్దరూ మనస్పూర్తిగా స్వామికి మ్రొక్కారు. ఆ చంటోడిని తీసుకోని ముద్దాడాడు శఠగోపురం.

శుభం భూయాత్!

 

 

3 thoughts on “కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం

Leave a Reply to రమేష్ కలవల Cancel reply

Your email address will not be published. Required fields are marked *