March 29, 2024

చీకటి మూసిన ఏకాంతం – 1

రచన: మన్నెం శారద

 

డిసెంబరు నెల చివరి రోజులు

ఆరు గంటలకే చీకటి అన్ని దిక్కుల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

డిస్పెన్సరీలో కూర్చుని పేషెంట్స్‌ ని చూస్తోంది డాక్టర్ నిషాంత.

పేషెంట్సు కూడా చాల తక్కువగా వున్నారు.

వింటర్ డాక్టర్స్‌ కి చాల డల్ సీసన్.

వర్షాకాలంలో నీటి కాలుష్యంతో వచ్చే జబ్బుల్నుండి బయటపడి కొంచెం హాయిగా జీవిస్తుంటారు ప్రజలు. కారణం కొంత చల్లని వాతావరణం, వరదల వలన వచ్చిన నీరు నిలకడగా నిలిచి కొంత సెడిమెంట్ కావడం. ఈ రెండే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు విరివిగా అందరికీ అందుబాటులో లభించడం.

ఒక పది పర్సెంట్ క్రానిక్ పేషెంట్సు తప్ప ఇతర పేషెంట్లు లేకపోవడం, వచ్చిన కేసుల్ని చూసి ప్రిస్క్రిప్షన్స్ రాసి మెడికల్ జర్నలొకటి తిరగేస్తూ కూర్చుంది నిశాంత.

ఇల్లూ, హాస్పిటలూ ఒకటే అయినా.. పేషెంట్సు లేరని ఇంట్లోకి వెళ్ళిపోయే అలవాటామెకి లేదు. పేషెంట్సు లేకపోయినా రాత్రి తొమ్మిది గంటలవరకూ ఆమె ఆ సీటు నంటిపెట్టుకునే వుంటుంది.

అక్కడున్నంతవరకూ ఆమె ఒక డాక్టరు.

తొమ్మిది దాటేక ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడే ఇంటి వ్యవహారాలు గానీ, తన గురించి గాని ఆలోచిస్తుంది.

చాలా మంది లేడీ డాక్టర్లు, లాయర్లు పేషెంట్సు, క్లయింట్సుని బెంచీల మీద పడిగాపులు పడేట్లుగా చేసి  టీ.వి. చూడటం. భర్తా బిడ్డలతో కబుర్లు చెప్పడం లాంటివి చేస్తుంటారు. నిశాంతకు ఆ తరహా వ్యక్తుల్ని చూస్తే పరమసహ్యం. తమకి ఫీజులు చెల్లించి తమ జబ్బుల్ని నయం చేస్తారనే  కొండంత ఆశతో వచ్చే వ్యక్తులు పనికిమాలినవాళ్ళేం కారు. నిజం చెప్పాలంటే వాళ్ళే తమని బతికించి లంకంత కొంపలు, పడవంత కార్లూ కొనుక్కునేటట్లుగా చేసేవారని ఆమె భావన.

ఆమె వాదనతో చాలామంది డాక్టర్లు ఏకీభవించరు. పైగా ఆమెని చూసి గేలిచేసి నవ్వడానికి ప్రయత్నిస్తారు. ఏకీభవించినంత మాత్రాన, నవ్వినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారవు. అందుకే అలాంటివారి మాటల్ని పరిగణలోకి తీసుకోదామె.

నర్సు రాజ్యలక్ష్మి ఆ గదిలోకొచ్చి చలిగాలొస్తుందని కిటికీ రెక్కలు దగ్గరకేసింది.

నిశాంత అదేం గమనించనట్లుగా జర్నల్‌ని దీక్షగా చదువుతోంది.

మరో పదినిముషాలు గడిచేయి. రాజ్యలక్ష్మికి సినిమాల పిచ్చి. తొందరగా వెళ్తే సెకండ్ షో కి అందుకోవచ్చన్న ఆశ.

“పేషెంట్సెవరూ లేకపోయినా వెళ్లిపొమ్మనదు. టైమంటే టైమే!” చిరాకు పడుతూ బయట బెంచి మీద కూర్చుంది.

అయినా ఒకటే టెన్షన్‌గా వుంది. పక్కింటివాళ్ళు తన కోసమే రెండు రోజుల్నుండి సినిమాకెళ్ళడం వాయిదా వేసుకుంటూవస్తున్నారు. ఈ రోజిక తనెళ్లకపోయినా ఆగరు. వెళ్ళిపోతారు. అందులో కృష్ణ సినిమా. రాకరాక వచ్చింది. మద్రాసులో తెలుగు సినిమాల రాకరాక వస్తాయి.

రాజ్యలక్ష్మి మరో ప్రయత్నం చేసే నెపంతో లోనికెళ్లి దోమల్ని వెళ్లగొట్టడానికి ఆలవుట్ పెట్టి చిన్నగా సకిలించింది ధైర్యం చేసి.

నిశాంత తలెత్తి చూసింది.

రాజ్యలక్స్మి భయంగా ఆవిడ వైపు చూసి “పేషెంట్సెవరూ లేరమ్మా” అంది సణిగినట్లుగా.

నిశాంత చేతి వాచీ కేసి చూసుకొని “ఇంకా అరగంట టైముంది. ఈలోపు ఎవరైనా రావొచ్చుగా!” అంది

రాజ్యలక్స్మికి పచ్చి వెలక్కాయ గొంతులో చిక్కుకునంట్లయింది.

“అద్ కాదు.. ఈ రోజు యింట్లో కాస్త అర్జెంటు పని వుంది. మా ఆయన తొందరగా రమ్మన్నాడు” అంది.

నిశాంత చిన్నగా నవ్వి “మీ ఆయన వారానికోసారేగా వచ్చేది. మధ్యలో ఎందుకొచ్చేడు?” అంది.

రాజ్యలక్ష్మి భర్త నెల్లూరులో ఆర్.టి.సి.లో పని చేస్తాడు. శనివారం రాత్రి బయల్దేరొచ్చి ఆదివారం రాత్రి వెళ్ళిపోతాడు . ఆ రోజు బుధవారం పైగా శెలవురోజు కూడా కాదు.

తను అబద్ధమాడిన సంగతి మేడం కనిపెట్టేసిందేమోనని భయపడిపోయింది రాజ్యలక్స్మి.

“లేదమ్మా. ఒంట్లో బాగోక రెండ్రోజులు శెలవు పెట్టి వచ్చేడు” అంది.

“సర్లే వెళ్ళు” అంది నిశాంత.

రాజ్యలక్ష్మి ఎగిరి గంతేసినంత పంజేసింది. మొహంలో సంతోషం తన్నుకొస్తుంటే “వస్తానమ్మా!” అంటూ గడప దాటింది.

“ఇంతకీ ఏ సినిమాకి?”

నిశాంత ప్రశ్నకి రాజ్యలక్ష్మి ఖంగు తిన్నట్టుగా నిలబడిపోయింది.

“నీకు చాలాసార్లు చెప్పేను. సెకండ్ షోలకి వెళ్లొద్దని. రోజూ పేపరులో జరుగుతున్న అరాచకాలు చదువుతున్నా ‘అది మనకి జరగొచ్చిందా?’ అనుకుంటారు అందరూ. ఊళ్ళో మీ ఆయన ఉండడు. ఏమైనా జరిగితే.. ?”

“మీరు లేరేంటమ్మా. మగాడికి మగాడంత మనిషి. ఈ మొగుళ్ళు చేసి చచ్చేదేంటి తిట్టిపొయ్యడం కాని!” అంది రాజ్యలక్ష్మి పళ్ళికిలించి నవ్వుతూ.

“నీకెలా చెప్పాలో నాకర్ధం కాదు. సర్లే వెళ్ళు” అంది నిశాంత.

అంతే!

రాజ్యలక్ష్మి రివ్వున రెక్కలొచ్చినట్లెగిరిపోయింది. కొద్దిగా ఆలస్యం చేస్తే ఆవిడెక్కడుండమంటుందేమోనని.

నర్స్ వెళ్లినా వెళ్తూ  అన్నమాట నిశాంత మనసులో గుచ్చుకుంది.

‘మగాడికి మగాడంత మనిషి!’

అంటే తనలో స్త్రీత్వం .. స్త్రీకుండే ఆశలూ, కోరికలూ, సౌకుమార్యం లేవనా?

వేసవి కాలం మల్లెపూలు ముడుచుకోవాలని, చలికాలం గులాబీలు తురుముకోవాలని, చల్లని సాయంకాలం భర్తతో కలిసి ఎటైనా వెళ్ళి ఏకాంతంగా గడపాలని… వీళ్ళంతా తనని ఏ అనుభూతులూ లేని మ్రోడుగా భావిస్తున్నారు కాబోలు.

డబ్బు కోసం అహర్నిశలూ కష్టపడే యంత్రమనుకుంటున్నారు కాబోలు.

రాత్రిబగళ్ళూ వృత్తినే ధర్మంగా భావించే పనిరాక్షసి ననుకుంటున్నారు కాబోలు.

“నిశాంతా!”

ఎవరొ పిలిచినట్లయి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిందామె.

ఎదురుగా గుమ్మం దగ్గర క్రీనీడలో ఎవరో నిలబడినట్లనిపించి ‘కమిన్’ అంది.

కాని ఆ వ్యక్తి లోనికి రాలేదు.

సందేహిస్తూ గుమ్మంలోనే నిలబడ్డాడు.

“మిమ్మల్నే! రండి!” అంది నిశాంత స్టెతస్కోపు సర్దుకుంటూ.

అతనీసారి లోపలికడుగు పెట్టేడు.

నిశాంత అతనివైపు చూసింది.

చూసిన వెంటనే ఉలిక్కిపడింది.

అతను హితేంద్ర.

ఏడు సంవత్సరాల క్రితం తను ప్రేమించి, పెద్దవాళ్లని కాదని కట్టుకున్న భర్త.

అతన్ని చూడగానే ఆమె వంట్లోని రక్తమంతా విపరీతమైన వేగాన్ని పెంచుకొని ప్రవహించసాగింది.

అతి బలవంతం మీద బి.పి.ని కంట్రోల్ చేస్కుంటూ “చెప్పండి. వాటీజ్ ద ప్రాబ్లం?” అంది డాక్టరుగా.

హితేంద్ర వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

అతనిని గమనించనట్లే క్రీగంట గమనించింది నిశాంత.

అతను బాగా శుష్కించిపొయేడు. బాగా నల్లబడ్డాడు కూడా. గడ్డం బాగా పెరిగి నిజంగా పేషెంటులానే వున్నాడు. దానికి తోడు ముక్కుపొడుం రంగు షాల్ కపుకున్నాడు. అతని ఆకారం చూసి ఆమె మనసు క్షణకాలం బాధకి లోనయింది.

కాని వెంటనే ఆమె అలర్టయింది.

అతను తనకేం కాడిప్పుడు.

ఇప్పుడతనొక పేషెంటుగా మాత్రమే తన దగ్గరకొచ్చి ఉండొచ్చు. ఒకవేళ వేరే ఉద్ధేశ్యంతో వచ్చినా అతనికెక్కువగా మాట్లాడే అవకాశం తనెంత మాత్రం ఇవ్వకూడదు.

“చెప్పండి. వాటీజ్ ద ట్రబుల్. నేను డిస్పెన్సరీ క్లోజ్ చేసే టైమవుతున్నది!” అంది గంభీరంగా.

హితేంద్ర అదోలా నవ్వి “నువ్వు చాలా మారిపోయావు నిశాంతా. నా మీద ప్రేమంతా చచ్చిపోయింది నీలో!” అన్నాడు జాలిగా.

అలాంటి మాటలు వినడానికి నిశాంత హృదయం సిద్ధంగా లేదు.

తెలిసే కావాలని తప్పులు చేసి చేతిలో డబ్బు, వంట్లో బలం వున్నప్పుడు ఎదుటి మనిషిని. అదీ తన ప్రగతికి దోహదం చేసిన మనిషిని తోటకూరలో పురుగు కన్నా హీనంగా విదిలించి కొట్టి, ఇప్పుడు చేతులు కాలేక వచ్చి క్షమాపణలు చెబితే కరిగిపోయేంత బేల మనస్తత్వం కాదు ఆమెది.

నిజం చెప్పాలంటే భర్త తెలిసి చేసిన తప్పుల్ని ప్రోత్సహిస్తూ, తిరిగొచ్చేక భర్త మంచివాడే, అవతలి వాళ్ళే మంచివాళ్ళు కాదని భ్రమసి భర్తల్ని వెనకేసుకొచ్చే సగటు స్థాయికి కూడా అందని ఆడవాళ్లని నిశాంత ఎన్నటికీ క్షమించలేదు.

అయిదు సంవత్సరాలుగా తన గురించి పట్టించుకోని మనిషి ఇప్పుడెందుకు అకస్మాత్తుగా ఊడిపడినట్లు.

“నాకు తెలుసు.నువ్వు నన్ను క్షమించలేదని. అలా అడిగే ధైర్యం కూడా నాకు లేదు కాని.. నేను నిన్ను పోగొట్టుకుని చాలా నష్టపోయేను నిశాంతా. అయ్ హావ్ లాస్ట్ సో మచ్.”అన్నాడతను.

అలా అంటున్నప్పుడతని గొంతు దుఃఖభారంతో జీరబోయింది.

నిశాంతకా పరిస్థితి ఎంతో ఇరకాటంగా వుంది.

నిజానికలాంటి సంఘటన ఎదుర్కోడానికి ఆమె సంసిద్ధంగా లేదు కూడా.

“హితేంద్రగారూ!” అంది కొంత కర్కశంగా.

హితేంద్ర బెదరినట్లుగా చూసాడామె వైపు.

“ఇంకో అయిదు నిముషాలు టైమిస్తున్నాను మీకు. మీరు పేషెంటుగా అయిగే ఎంతసేపైనా మాట్లాడండి. వింటాను. మీకు సహకరించడానికి ప్రయత్నిస్తాను. కాని గతాన్ని గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను వినను” అంది స్థిరమైన కంఠస్వరంతో.

“సారీ!” అన్నాడు హితేంద్ర.

“ఇట్సాల్ రైట్! డాక్టరుగా నాతో మీకేమైనా పని వుందా?”

“ఉంది”

ఆమె చిత్రంగా చూసిందతని వైపు.

“నాకు నాలుగేళ్ళ కూతురుంది”

ఆ మాట విని అదిరిపడింది నిశాంత.

“నీకు .. సారీ.. మీకు చాలా ఆశ్చర్యంగా వుంది కదూ ఈ సంగతి?” అతని ప్రశ్న విని మామూలుగా మారింది నిశాంత.

“మీకొక కూతురుండటం చిత్రమైన సంగతేం కాదే?” అంది తనని తాను తమాయించుకుంటూ.

ఒకప్పుడు నేనూ అదే అనుకున్నాను. నీతో కాపురం చేసిన అయిదేళ్ళూ మనకి పిల్లలు కల్గకపోతే ఆ తప్పు నీదేననుకున్నాను. నువ్వు చాలాసార్లు నన్ను డాక్టరు దగ్గరకెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నా నేను పురుషాహంకారంతో నీ మాట వినలేదు. మనం విడిపోవడం.. నేను వీణని పెళ్ళి చేసుకోవడం.

“అదే వద్దన్నాను. మీ ప్రాబ్లం టూకీగా చెప్పండి.” అంది నిశాంత విసుగ్గా.

“వస్తున్నాను. మిమ్మల్నాట్టే విసిగించను. నా కూతురు పెద్దదయ్యే కొలది నా పోలికలసలు కనిపించడం లేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే.. ఆమెలో నా కో సింగర్ శేఖర్ పోలికలు స్పష్టంగా కంపిస్తున్నాయి. చివరికి మానరిజమ్స్ కూడా!”

“షటప్!” అంది నిశాంత ఒక రకమైన ఉద్రేకానికి లోనవుతూ.

“ఎందుకు మీరంత సీరియస్సవుతున్నారు. ఒక డాక్టరుగానే వినండి నా కథ.” అన్నాడు హితేంద్ర.

నిశాంత తన తప్పునర్ధం చేసుకుంది. మామూలుగా కావడానికి ప్రయత్నిస్తూ “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అని చిరాకు నణచుకుంటూ.

“అప్పట్లో నాలో లోపముందని ఒప్పుకోవడానికిష్టపడలేదు నేను. అలా  తెలుసుకోవాలని ప్రయత్నించలేదు కూడా. కాని.. ఇప్పుడు నిర్ధారణ  చేసుకోవాలన్న కోరిక రోజు రోజుకీ బలంగా పెరిగిపోతున్నది. ప్రియ ‘డేడీ’ అని దగ్గరకొస్తుంటే చాలా కంపరంగా అనిపిస్తోంది. ముద్దు చేయలేకపోతున్నాను. ఈ బాధ భరించలేక తాగుతున్నాను. దాంతో గొంతు పాడయి టైముకి రికార్డింగ్ థియేటర్‌కి వెళ్ళలేకపోవడంతో నా స్థానాన్ని శేఖర్ ఆక్రమించుకున్నాడు.

“మీరు మళ్లీ పక్కదారి పడుతున్నారు. డాక్టరుగా నేను ఏం చేయాలో చెప్పండి” అంటూ అతని మాటలకడ్డం పడింది నిశాంత.

“మీరు  నన్ను పరీక్షించి నిజం చెప్పాలి. నాకసలు బిడ్డల్ని కనే శక్తుందో లేదో!”

“అది నా వల్ల కాదు. నా దగ్గర మేల్ స్టాఫ్ లేరు” అంది నిశాంత మనసులోనే చీధరింపు నణచుకొంటూ.

“ప్లీజ్! మీరు తప్ప నాకీ సహాయం చేసే వ్యక్తులు లేరు”

“ఎందుకని? సిటీ అంతా డాక్టర్సున్నారు. ఈ చిన్న విషయానికి మీరు నన్ను ఎప్రోచ్ కావాల్సిన అవసరమెంత మాత్రమూ లేదు. ఇంకెవరి దగ్గరకయినా వెళ్ళండి” అంది.

హితేంద్ర ఆమె వైపు జాలిగా చూసాడు.

“నేనెందుకు మీ దగ్గరకే వచ్చేనో మీరర్ధం చేసుకోలేదా?”

నిశాంత అర్ధం కానట్లుగా చూసింది.

“నేను సౌత్‌లో ఒక గొప్ప స్థానంలో వున్న పాపులర్ సింగర్‌ని. ఎవరి దగ్గరకెళ్ళినా నన్నిట్టే గుర్తు పట్టేస్తారు. నేను తండ్రిని కాలేనన్న నిజం తెలిస్తే, ప్రస్తుతం నా కూతురుగా పెరుగుతున్న ప్రియ గురించి, నా గురించి అవహేళనగా అనుకుంటారు. ఏ మాత్రం లీకయినా పత్రికలు ఏకి పెడ్తాయి. నేను తలెత్తుకు తిరగలేను. అందుకే మీ దగ్గరకొచ్చేను. మీరయితే ఈ విషయాన్ని బయట పెట్టరనే గట్టి నమ్మకంతో వచ్చేను” అన్నాడతను ప్రాధేయపడుతున్న ధోరణిలో.

“ఎందుకని అంత గట్టి నమ్మకం. నాకు మీ మీద కోపముండదని ఎందుకు భావిస్తున్నారు?” అనడిగింది నిశాంత రెట్టిస్తున్నట్టుగా.

“మీ సంస్కారం గురించి కొన్నాళ్ళు కాపురం చేసిన భర్తగా తెలుసు కాబట్టి. ఎంత ఇల్‌ట్రీట్ చేసి వదిలేసినా మీరు నన్నల్లరి చెయ్యకుండా విడిపోయి ఎళ్ళిపోయారు. మనోవర్తడగలేదు. పత్రికలకి చెప్పలేదు. నేను మీరు గొడ్రాలని – అందుకే మరో పెళ్ళి చేసుకున్నానని చెప్పినా మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. మీకు విద్యాసాగర్‌కి పెళ్ళికి ముందే..”

“ప్లీజ్ ఇంకాపండి. నాకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం  చెయ్యొద్దు.” అంది ఆవేశంగా అరిచినట్టు నిశాంత.

“సారీ!”

నిశాంత లేచి నిలబడింది ఎర్రబడిన మొహంతో.

హితేంద్ర కూడా లేచేడు నిరాశ నిండిన మనసుతో.

“రేప్రొద్దున్న తొమ్మిది గంట్లాకి రండి. నేను మీ స్పెర్మ్ కౌంట్ టెస్త్ చేస్తాను” రివ్వున లోనికెళ్తుంటే అతను మొదట అర్ధం కానట్లు తెల్లబోయి చూసేడు.

అర్ధమైన వెంటనే “థాంక్యూ నిశాంతా. థాంక్యూ వెరీమచ్.” అన్నాడు ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతూ.

కాని అప్పటికే నిశాంత తన గదిలోకెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోయిందని, తన మాటలు వినిపించుకోలేదని అతనెంత మాత్రం గ్రహించలేదు.

కారు స్టార్టయి వెళ్లిపోవడం కళ్ళు మూసూకునే వింది నిశాంత.

నిశ్చలమైన నీటిలో ఎవరో రాయి విసిరినట్లుగా గత జ్ఞాపకాలు చెదరి గుండె అంచుల్ని తాకుతున్నాయి.

ఎంతగా అణచుకున్నా మనసులో నిక్షిప్తం చేసిన బాధ జివ్వున జలలా పైకెగతన్నుతోంది.

అయిదు సంవత్సరాలుగా ఒంటరితనాన్ని, బాధని, అవమానాన్ని గుండెలోపల నిలువు లోతున పాతిపెట్టి ఏం జరగనట్లుగా, తనకేం బాధ లేనట్లుగా అనుభూతులెరుగని ఒక రాయిలా యాంత్రికంగా బ్రతుకుతోంది తను.

తను కావాలంటే మళ్లీ పెళ్ళి చేసుకోగలదు.

పిల్లల్ని కనగలదు.

అతని ముందునుండే కారులో హాయిగా నవ్వుతూ తిరగ్గలదు.

కాని.. ప్రేమన్నా… పెళ్ళన్నా, పూర్తి విముఖత కల్గేట్లుగా ప్రవర్తించేడు తన పట్ల హితేంద్ర.

మళ్ళీ ఇన్నాళ్లకి అతనీవిధంగా తన దగ్గరకొస్తాడని తనేనాడూ అనుకోలేదు నిశాంత.

ఇన్ని సంవత్సరాల ఎడబాటులో ఏ కాస్తన్నా తన మనసులో జాలిలాంటిది ఏర్పడినా ఈ రోజు అతను కోరిన కోరికతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

ఆమె ఆలోచనల్ని ఫోను రింగ్ పుటుక్కున తెంపేసింది.

నిశాంత రిసీవర్ని లిఫ్ట్ చేసింది మెల్లిగా.

“నేను విద్యాసాగర్‌ని. భోంచేసేవా?”

నిశాంత కళ్లలో నీళ్ళూరేయి.

“లేదు” అంది.

“ఎందుకని. ఇప్పుడు టైమెంతయిందో తెలుసా?”

“ఆకలిగా లేదు.”

“ఏం జరిగింది?” అతని గొంతులో ఆత్రుత గమనించింది నిశాంత.

“ఇంత రాత్రప్పుడు ఫోను చేస్తున్నావు. లత లేదా ఇంట్లో?” అనడిగింది.”ఏం. నేనేం తప్పు చేస్తున్నానని లతకి భయపడాలి. ఒక స్నేహితురాలి క్షేమ సమాచరం కనుక్కోవడం అపచారమా. తోటి మనిషి బాగోగులు తెలుసుకోవడం నేరమా?” అన్నాడు విదయసాగర్ కొంత ఆవేశపడుతూ.

నిశాంత మెత్తగా నవ్వింది.

“చాలా హాయిగా వుంది. నీ నవ్వు వింటుంటే”

“కాని నా నవ్వులో హాయి లేదు విద్యా”

“ఏం జరిగింది ?”

“కొత్తగా జరిగిందంటూ ఏమీ లేదు. కాని హితేంద్ర వచ్చేడు. పాత జ్ఞాపకాలు కెలుకుతూ!”

“ఎందుకు? చేసిన తప్పుని క్షమించమనా?”

“ఆ అవకాశం నేనివ్వలేదు. ఒక పేషెంటుగా ఎప్రోచయ్యేడు!”

“ఏవిటి మాయరోగం? ఊళ్ళో డాక్టర్లు లేరనా? నువ్వు జాలి చూపించకు. ఎలాగోలా తిరిగి నీ దగ్గరకి చేరాలని ప్రయత్నిస్తున్నాడేంటి డర్టీరోగ్” అన్నాడు విద్యాసాగర్ కోపంగా.

“నా మనస్తత్వం నీకు తెలెదా? హితేంద్రనే నీచ నికృష్టుడికి నా హృదయంలో స్థానం లేనే లేదు.” అంది నిశాంత  ఆవేశంగా.

“దట్స్ గుడ్. మరెందుకు భోంచేయలేదు. నువ్వు భోంచేయకపోతే నీ కోసం బాధపడే ముగ్గురు వ్యక్తులున్నారు. అది మరచిపోకు.

నిశాంత పకపకా నవ్వింది.

“ముగ్గురా. ఎవరు వాళ్ళు?”

“తెలీనట్లు. మరీ అమాయకత్వం  నటించకు. మీ డేడి ఇప్పుడె నాకు ఫోను చేసారు నీ సంగతి కనుక్కోమని. బేబీకంత పట్టుదలేంటి.. నా దగ్గర కొచ్చేయమని చెప్పమని రోజూ చెబుతున్నారు. మీ మమ్మీ కూడా చాలా బెంగ పడుతోందట నీ గురించి. ముసలి వయసులో వాళ్లనెందుకుకంత బాధపెడ్తావు నిశా. వెళ్ళి వాళ్లతో ఉండరాదు. ముసలి వయసులో వాళ్లనెందుకంత బాధపెడ్తావ్ నిశా. వెళ్ళి వాళ్లతో ఉండరాదు.”

“నేను వాళ్లని బధపెడుతున్నానా? అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావా?” అంది నిశాంత బాధగా.

“సారీ! కాని వాళ్లు పెద్దవాళ్ళయిపోయేరు. వయసునన్నా గౌరవించాలి కదా.”

“గౌరవించక ఇప్పుడు నేనేం చేసేను. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను.”

“అదే కదా వాళ్ల బాధ. ఇంత ఆస్తి పెట్టుకుని అలా దిక్కులేని దానిలా బతుకుతున్నావనే వాళ్లు కుమిలిపోతున్నారు”

“కొన్ని దిక్కులకన్నా దిక్కులేకపోవడంలోనే హాయుంది విద్యా. తీరా వెళ్లాక అమ్మ ఎలా సూటిపోటి మాటలు మాట్లాడగలదో  ప్రతి క్షణం నాకు జరిగిన అన్యాయాన్ని ఏదుస్తూ ఎలా భూతద్ధంలో చూపించగలదో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు కూడా నన్ను అక్కడికెళ్ళి ఈ సుఖాన్నికూడా పోగొట్టుకోమని దయచేసి చెప్పకు.”

“సరే!”

“ఇంకా ఎంతసేపా వెధవ కబుర్లు. అంత దాన్నొదిలి వుండలేకపోతే  ఏకంగా నా పీక పిసికి దాని దగ్గరకే వెళ్లండి. “లత అరుస్తూ అతని చేతిలోని రిసీవర్ని లాక్కుని క్రెడిల్ చేయడం స్పష్టంగా వినిపించింది నిశాంతకి.

నిశాంత నిస్పృహగా రిసీవర్ని హుక్ చేసి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది.

చీకటి మంచు కలిసి స్ట్రీట్‌లైట్ కాంతిని తీవ్రంగా మింగుతున్నాయి. పది గంటలకే ఊరంతా మాటు మణిగినట్లు నిశ్సబ్దంగా మారిపోయింది.

లత!… పెళ్ళికి ముందు ఎంతో వినయవిధేయతల్ని, భయభక్తుల్ని ప్రకటించే లత ఎంత కఠినంగా మాట్లాడగల్గుతోంది.

ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించగల్గుతోంది.

విద్యాసాగర్ని ప్రేమించేనని, అతను లేకపోతే బ్రతకలేనని అతనికి నచ్చచెప్పమని మేడమీద నుండి దూకి రెండు కాళ్ళూ చచ్చుపడిన నల్లని, బక్కపల్చని, ఏ మాత్రం ఆకర్షణ లేని లత, ఈ రోజున తననెంత తృణీకరించి మాట్లాడగల్గుతోంది.

విద్యాసాగర్ మీద తనకలాంటి అభిప్రాయం, సంబంధం వుంటే ఈ లత తననసలాపగలదా?

ఇతర స్త్రీలు కేవలం తమ భర్తల్ని వలలో వేసుకోడానికే వస్తారని, కేవలం కుక్కలా కాపలా కాసుకొనే స్త్రీల బ్రతుకులెంత దైన్యమైనవి.

భర్తని ప్రేమించి ఆకట్టుకుని అతని మనసులో స్థానం సంపాదించుకోవాలని మరచిపోయి, తమ వడ్డాణం, కాసూలపేరు లాంటి వస్తువుల్లో అతనొకడని, అతన్ని భద్రంగా ఇనప్పెట్టెలో పెట్టి తాళం వెసి ఆ తాళాల్ని  బొడ్లో దోపుకు తిరగా లనుకునే స్త్రీలు ఎంత వ్యక్తిత్వం లేనివాళ్ళో కదా.

జీవితంలో ఓడిపోయిన స్త్రీలని, భర్త నుండి విడిపోయి స్త్రీలని సాటి స్త్రీలే క్షణక్షణం కించపరచాలని చూస్తారు.

ఎంత చదువుకున్నా స్త్రీల బుర్రల్లో ఇంకా బూజే ఉంది.

నిశాంత భారంగా నిట్టూరుస్తూ మంచమ్మీదొచ్చి పడుకుంది. ఆమె ఆలోచనలు వద్దనుకున్నా గతంలోకే పరిగెత్తుతున్నాయి. వాటిని  మరచిపోవడం తన వలన కాదు.

ట్రాంక్విలైజర్ల్స్ వాడినా తనకిక ఈ రోజు నిద్ర పట్టదు. గతాన్ని రీవైండ్ చేసి చూడటానికే ఆమె సిద్ధపడింది.

 

ఇంకా వుంది…

6 thoughts on “చీకటి మూసిన ఏకాంతం – 1

  1. ప్రారంభమే ఆసక్తి కరంగా ఉంది మీ సీరియల్. చక్కని సబజెక్ట్… వైవిద్యభరితంగా ఆకట్టుకుంది మీ కధ. నిశాంత ఒక విశిష్టకరమైన వ్యక్తి గా తోస్తోంది. ప్రస్తుత డాక్టర్లకు ఒక inspiration నిశాంత ! తరువాత భాగాలకోసం ఎదురుచూస్తున్నా ! మీ సీరియల్స్ అంటే నాకు విపరీతమైన క్రేజ్ శారదాజీ ! ఆల్ ది బెస్ట్ !

  2. ప్రారంభమే చాలా ఆకట్టుకుంది అమ్మా. నిశాంత జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంది. హితేంద్ర పేరు చాలా బాగుంది కానీ వివేకం లేని మనిషి. వచ్చే నెల రాబోయే తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

  3. చక్కగా ప్రారంభించారు .చాలా బాగుంది శారద గారూ

Leave a Reply to Girija peesapati Cancel reply

Your email address will not be published. Required fields are marked *