April 19, 2024

నాకు నచ్చిన కధ -కేతు విశ్వనాధ రెడ్డిగారి కథ- రెక్కలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

రాయలసీమ నేపధ్యముగా కధలు వ్రాయటంలో పేరు పొందిన మార్క్సిస్టు కధకుడు విశ్వనాధరెడ్డిగారు తాను పుట్టి పెరిగిన ప్రాంతమును ప్రాతినిధ్యము వహిస్తూ, అక్కడి ప్రజల జీవితాలను చిత్రీకరిస్తూ, కధలు వ్రాయటము అయన ప్రత్యేకత. ఈయన 1939 జులై 10న కడప జిల్లా రంగరాయపురములో రైతు కుటుంబములో జన్మించాడు. కడప జిల్లాలోనే విద్యాభ్యాసము చేసి కడప జిల్లాలోని గ్రామాల నామాలను పరిశోధనాంశముగాతీసుకొని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయము నుండి డాక్టరేట్ పొందాడు. 1958లో ఆమె అనే కథతో సాహిత్య రంగ ప్రవేశము చేశాడు కధకు కమిట్ మెంట్ నేర్పిన ఈయన కధలు పలు భారతీయ, ఆంగ్ల జర్మన్ భాషలోకి అనువదింపబడ్డాయి.

33 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో వుండి 1993లో ఉత్తమ అధ్యాపకుడిగా రాష్త్ర ప్రభుత్వము చేత సత్కారాన్ని పొందాడు అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పలు ఇతర పురస్కారాలను పొందిన రచయిత విశ్వనాధరెడ్డిగారు. అనేక విద్యా సాహిత్య సంస్థలతో సాన్నిహిత్యము ఉన్న రెడ్డిగారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా భారతీయ భాషల వికాస అభివృద్ధి ప్రచార మండలిలో తెలుగు భాష ప్రతినిధిగా వ్యవహరించారు.
అయన రచనలను పూర్తిగా ప్రాంతీయధోరణిలో చూడరాదు. ఎందుకంటే అవి ప్రాంతీయత మాత్రమే కాకుండా విస్తృతమైన అంశాలను కలిగి ఉంటాయి. ఈయన ఆధునిక కధకుడు ఈయన కధలలో ఆధునికతను నింపినది మార్క్సిజము. ఈయన కధలన్నీ ఆయనకు మార్క్సిజము పట్లగల అవగాహనను తెలియజేస్తాయి. ఈయన రచనల ఆశయము, స్త్రీలపట్ల, దళితులపట్ల, రైతుల పట్ల, శ్రామికులపట్ల, కార్మికులపట్ల గల గౌరవాన్ని సంస్కార దృష్టిని కలిగించటమే. ఈయన కధల్లో స్త్రీ పాత్రలు ధైర్యముగా పరిస్తుతులను ఎదుర్కొని పురుషాధిక్యాన్ని వ్యతిరేకిస్తాయి. కులమతాల పట్ల ధనస్వామ్యము పట్ల వ్యతిరేకత అసహనం ఈయన రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్త్రీలను గౌరవించే సమాజము కావాలని కోరుకొనే రచయిత విశ్వనాధ రెడ్డిగారు.ఈయన కధలు కాలక్షేపానికి చదివే కధలు కాదు. ప్రతి కథా ఒక లక్ష్యముతో నడుస్తుంది. ప్రస్తుతము అయన కధలలో ఒకటైన,”రెక్కలు” గురించి ముచ్చటించుకుందాము.
ఈ కద నేపధ్యము చిన్నదైనా, పెద్దదైనా ఉద్యోగము చేసే ఆడవాళ్లు మగవాళ్ళనుంచి ఎదుర్కొనే సమస్యలను అంటే లైంగిక వేధింపులను ఒక మహిళా హోమ్ గార్డ్ పంకజము దృఢమైన మనస్తత్వముతో మగపురుగులను లెక్కచేయకుండా తన్ను తాను రక్షించుకునే సమర్ధత చూపించటం, చివరలో ఇచ్చే సందేశములో ఆడపిల్లలను సాకి రక్షిస్తున్నామనుకొనే తండ్రుల రెక్కల కంటే తమ్ము తాము కాపాడుకొనే ఆడపిల్లల రెక్కలే బలమైనవి చెపుతాడు. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆడపిల్లలు ముఖ్యముగా ఉద్యోగాలు చేసే ఆడవారు మగవారి నుండి ఎదురయే లైంగిక హింసలో ఎటువంటి మార్పు లేదు. ఈ కధలో పంకజము మాట తీరు, ఇతర అడ హోమ్ గార్డ్ ల పట్ల చూపే శ్రద్ద, ఎలక్షన్ ఆఫీసర్ ను సున్నితముగా దెబ్బతీసే విధానము, పాఠకులకు పంకజము పట్ల ఆరాధన భావాన్ని పెంచుతుంది
ఈ కధ 90 కి ముందు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ మెటీరియల్ తీసుకున్నాక, మట్టికొట్టుకు పోయిన ఎక్కడానికి కష్టముగా వుండే లారీలలో పోలింగ్ స్టేషన్లకు తరలించటము, ఒక పోలింగ్ స్టాఫ్ బృందంలో ఉండే మహిళా హోమ్ గార్డ్ పంకజము పట్ల అసభ్యముగా ప్రవర్తించాలని ప్రయత్నించే ప్రిసైడింగ్ అధికారి నాగేశ్వరరావును పంకజము ఎదుర్కొని బుద్ది చెప్పటంతో కధ ముగుస్తుంది. రచయిత పోలింగ్ బృందంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రవర్తన గమనిస్తూ పంకజనానికి మోరల్ సపోర్టుగా ఉంటూ ఉంటాడు. రచయిత ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నికల నిర్వహణలో అనుభవంతో వ్రాసిన కద ఇది.
పోలింగ్ సిబ్బందితో బయలుదేరిన లారీ పోలీస్ స్టేషన్ ముందు ఆగినప్పుడుఎలక్షన్ బందోబస్త్ కోసము నియమింపబడ్డ ముగ్గురు మహిళా హోమ్ గార్డ్ లు బ్యాగులు పుచ్చుకొని లారీ ఎక్కడానికి వెనక వైపుకు వస్తారు ముగ్గురు ఇంచుమించుగా పాతిక ఏళ్ల లోపు పెళ్లికాని ఆడపిల్లలే వీళ్ళను గమనించిన అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆడపిల్లల తండ్రిగా అలవాటుగా కీడెంచటము శంకించటం భయపడటం చేసాడు లారీ ఎక్కటానికి ఇబ్బంది పడుతుంటే ముసలి కానిస్టేబుల్ చిన్నప్పుడు చెట్లు లెక్కలేదా ఆలోచిస్తారు ఎక్కండి అంటే ఆ ముగ్గురిలో వెనక ఉన్న అమ్మాయి ముందుకొచ్చింది “నీకు తొందర ఎక్కువ కాలుజారి పడతావు స్టూలు తెచ్చుకొని ఎక్కచ్చుగా” అని కానిస్టేబుల్ సలహాయిస్తాడు. దానికి తొందరపాటు అమ్మాయి, “ఇదేమన్నా బాత్రూమా జారీ పడటానికి లారీ ఎక్కి మిగిలిన ఇద్దరు ఆడవాళ్ళ బ్యాగులు అందుకొని ఒకరి తరువాత ఒకరిని చెయ్యి పుచ్చుకొని ఎక్కించింది. అంతవరకూ నింపాదిగా కూర్చున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆడవాళ్ళ రాకతో వాళ్ళ దగ్గరకు జరిగాడు.
ఎక్కిన ముగ్గురిలో ఒక అనుమానల అమ్మాయికి ఇది తిమ్మ సముద్రము రూట్ యేన అన్న అనుమానము వచ్చింది. వెంటనే తొందరపాటు అమ్మాయి ,”నీ కెప్పుడు అనుమానాలే తీరా అక్కడికి వెళ్ళాక ఈ మాట అడిగితే నీ టోపీ లాక్కుంటారు జాగ్రత్త” అని సమాధానము ఇచ్చింది. తొందరపాటు అమ్మాయి కలుపుగోలుతనము చొరవ రచయితకు నచ్చింది ఆ అమ్మాయిది తొందరపాటుతనము అనిపించినా దృఢ మనస్తత్వములా అనిపించింది. ఆ అమ్మాయి ముఖము తీరులో ఆకర్షణ, కళ్ళలో తెలివి ధీమా కనిపించాయి ఆ అమ్మాయి,”మీరే పోలింగ్ స్టేషన్ సార్ ” అని అడిగింది అవకాశము కోసము ఎదురు చూస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు ,” మా ఇద్దరిది ఏరువ పాళెము నేను పిఓ ను ఈయన ఎపిఓ” అని జవాబిచ్చిన నాగేశ్వరరావును ఆ అమ్మాయి ఎగాదిగా చూసి ,”ఏరువ పాళెము హరిజనవాడేనా ?” అని అడిగి ముగ్గురిదీ ఒకే పోలింగ్ స్టేషన్ అని తెలుసుకొని మిగతా విషయాలు పోలింగ్ కు సంబంధించినవి పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.
మొదటి పోలింగ్ స్టేషన్ కు చేరటానికి గంట పట్టింది అక్కడ పోలింగ్ సిబ్బందితో పాటు అనుమానాల ఆడపిల్ల దిగింది సందడి అమ్మాయి,”రూట్ ఆఫీసర్ గారు ఆ పిల్ల నోరులేంది మిగతా వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి” అని చెప్పింది. ఆ అమ్మాయి మిత్ర రక్షణ పద్దతి చూసి రచయిత ముచ్చట పడ్డాడు ఇంకా లారీలో మిగిలింది చివరి పోలింగ్ బూత్ కు చెందిన ముగ్గురే నెమ్మదిగా పిఓ నాగేశ్వరరావు ఆ అమ్మాయితో కబుర్లు మొదలుపెట్టాడు వినకూడదు అనుకుంటూనే రచయిత ఆమాటలన్నీ వింటున్నాడు ముందు తన చదువు ఉద్యోగమూ అష్టి పలుకుబడి అన్ని అడక్కుండా నే ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి కర్తవ్య దీక్షను పొగిడాడు ఆ అమ్మాయి కూడా చురకలు ఏమి వేయకుండా విన్నది. హరిజనవాడ పోలింగ్ బూత్ చేరేసరికి చీకట్లు ముసురు కుంటున్నాయి.
పోలింగ్ బూత్ చేరినాక పిఓ నాగేశ్వరరావు తన బ్యాగ్ తీసుకొని దిగితే ఎపిఓ మహిళా హోమ్ గార్డ్ సాయముతో ఎన్నికల సామాగ్రి దింపుకున్నాడు ఆ సందర్భములోనే మహిళాహోమ్ గార్డ్ తన పేరు పంకజము గా చెప్పింది పోలింగ్ బూత్ గా ఉన్న స్కూలు టీచరు ఇద్దరు పిల్లలతో రెండు లాంతర్లు తెచ్చి ఇచ్చి ఎన్నికల సామాగ్ర్రీ సర్ధించాడు సిబ్బంది సామగ్రి ఉన్న గదికి తలుపులున్నాయి. కిటికీల తలుపులు విరిగి ఉన్నాయి. వీళ్లంతా పనిచేస్తుంటే పిఓ నాగేశ్వరరావు తన పడకకు పిల్లలతో ఏర్పాట్లు చేయించుకుంటున్నాడు. స్కూలు గోడలమీద వ్రాసిన నీతి వాక్యాలలో స్త్రీలను గౌరవింపుము అన్న వాక్యాన్ని పంకజము చదివి అక్కడే నిలబడి ఉన్న టీచర్ ను మెచ్చుకుంది. ఆ టీచర్ ను పెట్రోమాక్స్ లైట్ అన్నా దొరకవా అని అడిగి లేదు అనిపించుకున్నారు. మిగతా ఏర్పాట్ల గురించి ఆ టీచర్ వీళ్ళకు చెప్పాడు రాత్రి భోజనాలకు కోడి కోయించానని ఆ టీచర్ చెపుతాడు. పిఓ నాగేశ్వరారావు తానూ వెజిటేరియన్ అని అంటాడు. మిగిలినవాళ్లు పట్టింపులు ఏమి లేవని చెపుతారు. పంకజము నాగేశ్వర రావును,”మీరు బ్రాహ్మలా ?”అని అడుగుతుంది. “కాదు మా ఇంట్లో అందరికి వెజిటేరియన్ అలవాటు” అని సమాధానము ఇస్తాడు.
ముఖము కడుక్కుని ఫ్రెష్ అయి చీరలోకి మారిన పంకజాన్ని పిఓ నాగేశ్వరరావు కళ్ళార్పకుండా తమకముతో చూడటాన్ని ఎపిఓ గమనిస్తాడు భోజనాల సందర్భముగా పంకజము కోడి ముక్క కొరుకుతు నాగేశ్వరరావును కదిలించింది,”కూటికి పనికిరాని బ్రాహ్మణ్యము వదిలించుకోవాలని మేము చూస్తుంటే అందులోకి కమ్మ బ్రామ్మలని, రెడ్డి బ్రామ్మలని మీరందరు జొరబడితే ఎట్లా సార్ ?”అని అంటుంది. ఆశ్చర్యపోయిన నాగేశ్వరరావు “”నువ్వు బ్రాహ్మిన్ వా ” అని ప్రశ్నిస్తాడు “. ఆ అక్షరాలా బ్రాహ్మణులమే అందులో వైఖానసులము, భారద్వాజస గోత్రము, ఇంటి పేరు సేనాధిపత్య చేసేడేమో రోజుకు పదిహేను రూపాయల కూలి వచ్చే హోమ్ గార్డ్”అని పడిపడి నవ్వుతు జవాబు చెప్పింది. ఈ రకమైన సంతోషకర వాతావరణములో పంకజము కబుర్లతో భోజనాలు ముగించారు. ఆ టీచర్ పంకజాన్ని రాత్రి అయన ఇంట్లో పడుకొని ఉదయానే రావచ్చు కదా అని అంటాడు. కానీ పంకజము ,”నాకేమి ఇబ్బంది ఉండదు లెండి ఇద్దరు సార్లు ఉన్నారు “అని మర్యాదగా అయన ప్రతిపాదనకు నో చెప్పింది పంకజము. ఈ విషయాన్ని అంత మాములుగా తీసుకోవటం రచయితను అంటే ఎపిఓ ను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది పంకజాన్ని పిఓ నాగేశ్వరరావు మర్మముగా చూస్తున్నట్లుగా ఎపిఓ కు అనిపిస్తుంది.
రెండు బెంచీలను కలుపుకొని పిఓ నాగేశ్వరరావు పడుకున్నాడు ఆ తరువాత ఎపిఓ ఒక చివరగా పంకజము పడుకున్నారు కొంచము సేపటికి నాగేశ్వరరావు వెలుతురుంటే నాకు నిద్రపట్టదు అంటే అయన లాంతరును ఆర్పి వేసాడు. రెండవ లాంతరును బాగా తగ్గించి పంకజము వైపు ఒక మూల పెట్టాడు ఎపిఓ కు నిద్ర రావటము లేదు. బయట వినిపిస్తున్న తత్వాలను వింటు తన బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటూ నిద్రలోకి జారాడు. ఇంతలో పంకజము గొంతు వినిపించింది “ఏం పిఓ సార్ నిద్ర రావటము లేదా? కొంపదీసి నన్ను మీ భార్యగా అనుకుంటున్నారా ? అని గదమాయించేసరికి “ప్లీజ్ పంకజము నెమ్మది “అని బ్రతిమాలే ధోరణిలోకి వచ్చాడు. ఎపిఓ లేచి టార్చ్ లైట్ వేస్తే నాగేశ్వరరావు పంకజం కాళ్ళ దగ్గర నిలబడి ఉన్నాడు “ఏం సార్ బయటకు ఏమైనా వెళ్లాలా ? అని అడిగితే ,”కొత్త చోటు కదా సరిగా నిద్రపట్టటము లేదు బయటకు వెళ్లి సిగరెట్టు తాగి వద్దామనుకున్నా. చీకట్లో తలుపు కనబడలేదు”అని అయోమయముగా నాగేశ్వర రావు సమాధానము ఇచ్చాడు. అది అబద్దమని తెలుస్తూనే వుంది. పంకజము అటు తిరిగి నిశ్చింతగా పడుకుంది. నాగేశ్వరరావు తన పడక దగ్గరకు వెళ్లి లాంతరు వెలిగించి బయటకు వెళ్లి ఐదు నిముషాలు బయట ఉండి లోపలికి వచ్చి పడుకున్నాడు. అంతా ప్రశాంతముగా నిద్రపోతున్నారని నిర్ణయించుకొని ఎపిఓ కూడా నిద్రలోకి జారుకున్నాడు.
తెల్లవారు ఝామున బోరింగ్ పంపు శబ్దముతో మెలకువ వచ్చి చూస్తే తలుపులు తెరచి ఉన్నాయి. పంకజము పిఓ ఇద్దరు లేరు. పంకజము గొంతు వినిపిస్తుంది ,”పిఓ సార్ ఇట్లా రావద్దు నేను స్నానము చేస్తున్నా. మీకు మర్యాద కాదు ఇటు రాకండి,”అని సీరియస్ గా చెప్పింది. ఎపిఓ ను చూసిన పిఓ ,”మీరు లేచారా? కడుపులో బాగాలేదు” అని బొంకాడు ఇద్దరు లాంతరు పుచ్చుకొని ఆరుబయలు మల విసర్జనకు వెళ్లి వచ్చేటప్పటికి పంకజము రెడీ అయి, ఏమి జరగనట్టు “మీరు కూడా తయారు అవ్వండి”అని చెప్పింది. మిగిలిన పోలింగ్ సిబ్బంది ఇద్దరు వచ్చారు. ఎనిమిది గంటలకు పోలింగ్ ను ప్రారంభించారు. ఓటర్లను చాకచక్యంగా పంపటంలో పంకజము విసుగు లేకుండా నవ్వుతు పనిచేసింది. పిఓ మొదట్లో బెట్టుచేసి దర్పము ప్రదర్శించినా ఎపిఓ మిగిలిన వాళ్ళ సహాయముతో పనులన్నింటిని చక్కగా నిర్వహించాడు. పది నిముషాల ముందే పోలింగ్ అపి ఫారాల పని పూర్తి చేద్దామని పిఓ అంటాడు. కానీ పంకజము లోపలికి వచ్చి కూలికి వెళ్లి వచ్చేవాళ్ళు ఉంటారు. అవసరమైతే వాళ్లకు స్లిప్పులు ఇచ్చి పోలింగ్ జరపాలి అని చెపితే మొదట్లో సణిగినా మెజారిటీ అభిప్రాయానికి తలఒగ్గక తప్పలేదు పిఓకు.
ఆరుగంటలకు పోలింగ్ ముగించి ఏడింటికల్లా అన్ని క్లోజ్ చేసి లారి కోసము ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆలస్యము అవుతుందని ఆ టీచర్ భోజనాలు ఏర్పాటు చేస్తానని అన్నము, చట్నీ మజ్జిగా తెప్పించాడు పిఓ నాగేశ్వర రావు,”పోలీస్ స్టేషన్లో మానభంగాలు ఉంటాయని వ్రాస్తున్నారు, ఆడపోలీసులు చాలకన ?” అని మాటల్తో పంకజముపై మెరుపుదాడి చేస్తాడు. ఈ ప్రశ్నకు ఎపిఓ బాధపడతాడు పంకజము భోజనము మధ్యలో లేస్తూ,”తెలుగు సినిమాల్లో అయితే మీ డైలాగు బాగుంటుంది సార్. నాకు అన్నము సహించటము లేదు. ఆ మాట అనే నోటితో మీరెట్లా అన్నము తినగల్గుతున్నారో రోజు “అని గంభీరంగా అంటుంది ఒక మహిళా పోలీస్ కాబట్టి ఆ మాట అనగలిగాడు. ఇంకా ఎవరితోనైనా ఆ మాట అనగలిగేవాడు కాదు. చావు దెబ్బ తిన్న పిఓ సైలెంట్ అయినాడు
రాత్రి పదకొండు గంటలకు రిసీవింగ్ కేంద్రానికి చేరినాక మెటీరియల్ అప్పజెప్పినాక పిఓ మాటవరసకు కూడా ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయాడు. పంకజము వీడ్కోలు చెప్పటానికి ఎపిఓ దగ్గరకు వచ్చింది. రచయితకు కళ్ళలో నీళ్లు తిరిగాయి,”ఈ ఉద్యోగమూ ఎందుకు చేస్తున్నావమ్మా “అని భాదతో అడుగుతాడు. “పదో తరగతి తప్పిన దానికి ఏ ఉద్యోగమూ వస్తుంది సార్. ఇంట్లో నామీద ఆధారపడి నలుగురు బ్రతుకుతున్నారు. నాన్న లేడు. ఎక్కడైనా ఎదో ఒకటి చెయ్యాలి కద సార్ ఎక్కడైనా ఆడవాళ్ళంటే అలుసే సార్”అని పంకజము జవాబిస్తుంది రచయిత “ఆ పిఓ వెధవ “అని పూర్తి చేయలేకపోతాడు “అదొక రకము ఊర కుక్క సార్. అదిలిస్తే పారిపోయే రకము. పిచ్చి కుక్కలు వెంట బడితే ఏమి చేస్తానని ఆలోచిస్తున్నారా?” అని నవ్వుతు అడుగుతుంది. దీనికి పంకజమే జవాబు చెపుతుంది. ఈ సమాధానము సమాజానికి కనువిప్పు కలిగించేది రచయితను ఆలోచనల్లో పడేసింది. “శరీరము వంపు సొంపులు తప్ప ఏది చూడని సంస్కారము మగవాళ్లలో ఉన్నంతకాలము బాధలైన ఇంతే. ఇంతకన్నా ఘోరమా కదా సార్ మీరైతే ఏమి చేస్తారో చెప్పండి ?'” అన్న ప్రశ్నకు రచయిత వణికిపోతాడు. ఎందుకంటే తన కూతుళ్లను ఇన్నాళ్లు కాపాడుతున్నాను అనుకుంటున్న రచయితకు తన రెక్కలు ఎంత బలహీనమో ఆ క్షణములో తెలిసింది. పంకజము నవ్వుతూ సెలవు తీసుకుంటుంది .
రామబాణము చెట్లు రాల్చిన పూల మధ్య చీకటిని చీల్చలేని కాంతి రేఖల మధ్య పంకజము టకటకా సాగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *