March 28, 2024

శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు

రచన: టీవీయస్. శాస్త్రి

ఆలోచన వేరు, తెలివి వేరు-వాటి మధ్యన గల తేడాను పరిశీలించారా?
ఒక అడవి మృగాన్ని చూసినప్పుడు స్వీయరక్షణ కోసం లోపలి నుండి స్వత:సిద్ధంగానే వచ్చే ప్రతిస్పందనను తెలివి అనీ, అది భయం కాదని ఇంతకు ముందు మీకు చెప్పాను. భయాన్ని పెంచి పోషించే ఆలోచన ఇందుకు పూర్తిగా విభిన్నమైనదని కూడా అన్నాను. మిత్రుల కోరికపై కొంత వివరణ ఇస్తాను. పైన చెప్పినవి రెండూ భిన్నమైనవి కదా? భయానికి జన్మనిచ్చి, పెంచి పోషించే ఆలోచనకు, ‘జాగ్రత్తగా ఉండు’ అని చెప్పే తెలివికీ మధ్యన గల తేడాను మీరు పరిశీలించి చూడలేదా? ఆలోచన జాతీయ వాదాలను, జాతి వివక్షతను, కొన్ని కొన్ని నైతిక విలువల ఎడల ఆమోదాన్ని సృష్టించింది. అయితే అందులో ఉన్న ప్రమాదాన్ని ఆలోచన గ్రహించలేదు. ఆ ప్రమాదాన్ని కనుక ఆలోచన చూసినట్లయితే అప్పుడు ప్రతిస్పందన భయం ద్వారా ఉండదు. తెలివి స్పందిస్తుంది. ఒక సర్పాన్ని చూసినప్పటి ప్రతిస్పందనలా. పామును చూడగానే స్వీయ రక్షణ కోసం ఒక సహజమైన ప్రతిస్పందన వస్తుంది. ఆలోచన చేసిన ఉత్పాదన అయిన జాతీయవాదాన్ని, ప్రజలను విభజించేదీ , యుద్ధాలకు ఒక కారణమూ అయిన జాతీయవాదాన్ని ఎదుర్కొన్నప్పుడు అందులో ఉన్న ప్రమాదం ఆలోచనకు కనబడదు.
(‘ది ఇంపాసిబుల్ క్వెస్చన్’ నుండి)

మరణం అంటే ఏమిటి?
మరణం అంటే మీకు తెలిసినవన్నీ సమాప్తం అవటం అని నిస్సం దేహంగా చెప్పవచ్చు. మీకు తెలిసినవన్నీ కనుక సమాప్తం అవకపోతే అప్పుడది మరణం కాదు. మరణం కనుక మీకు తెలిసిపోతే ఇక ఇప్పుడు మరణం గురించి మీరు భయపడవలసినది ఏమీ ఉండదు. కానీ, మీకు మరణం తెలుసా?అంటే, ఈ అశాశ్వతమైన దానిలో ఆగిపోకుండా కొనసాగిపోయే ఒకటేదో ఉన్నదీ, అది కనిపెట్టాలీ అనే అంతులేని ప్రయత్నప్రయాసాలను మీ ఈ జీవితం గడుపుతున్నప్పుడే ఆపివేయగలరా? ప్రాణంతో ఉన్నప్పుడే మరణం అని మనం అంటున్న స్థితిని గురించి తెలుసుకోగలమా? పుస్తకాలలో మరణానంతరం జరిగేవాటిని గురించి మీరు చదివినవీ, స్వాంతన కోసం మీ లోలోపల ఉండే విధంగా చిత్రించుకున్నవీ అన్నీ పక్కకు త్రోసివేయగలరా? ఇప్పుడే ఆ స్థితిని–మహా అద్భుతంగా ఉండేటటువంటి ఆ స్థితిని రుచి చూడగలరా? అనుభూతి చెందగలరా? ఆ స్థితిని కనుక ఇప్పుడు మీరు అనుభూతి చెందగలిగితే, ఇక అప్పుడు జీవించటమూ, మరణించటమూ రెండూ ఒకటే!
(‘ఆన్ గాడ్’ నుండి)
వాస్తవాల్లో గొప్పవీ, చిన్నవీ ఉండవు. వాస్తవం–‘ఉన్నది’ని అర్ధం చేసుకోవాలి!
నమ్మకం అనేది అనవసరం. ఆదర్శాలు కూడా అంతే. నమ్మకమూ ఆదర్శాలూ రెండూ ఉన్నది ఏదో దానిని , వాస్తవాన్ని స్పష్టంగా చూడటానికి అవసరమైన శక్తిని చెదరగొట్టి వృధా చేస్తాయి. ఆదర్శాల లాగే నమ్మకం ఉండటం కూడా వాస్తవం
నుండి తప్పించుకొని పారిపోవటమే. ఇటువంటి పలాయనంలో దు:ఖం తప్పదు. వాస్తవాన్ని ప్రతి క్షణమూ అవగాహన చేసుకోవటంలోనే దు:ఖ సమాప్తి ఉన్నది. ఒక పధ్ధతి గానీ, ఒక విధానంగానీ, ఈ అవగాహనను ఇవ్వలేవు. ఒక వాస్తవం ఎడల ఇష్టాయిష్టాలు లేని ఎరుక వలన మాత్రమే అవగాహన కలుగుతుంది. మీరు ఏమిటో ఆ వాస్తవాన్ని చూడకుండా తప్పించుకొని పోవటమే ధ్యానం అని కొన్ని విధానాలు అంటాయి. దేవుడిని కనిపెట్టటం కోసం, స్వాప్నిక దర్శనాలకోసం , సంచలనాత్మకమైన ఇంద్రియానుభవాల కోసం , ఇటువంటి ఇతర వినోద కాలక్షేపాల కోసం ధ్యానం చేయటం కంటే మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవటం, మీ గురించిన వాస్తవ అంశాలు నిరంతరమూ మారిపోతూ ఉండటమూ, అర్ధం చేసుకోవటమూ చాలా ముఖ్యం.
(‘నోట్ బుక్’ నుండి)

ప్రేమ, సృష్టి, వినాశనం
ఆ అడవిలో చల్లగా ఉన్నది. కొద్ది అడుగుల కిందగా సెలయేరు రొదచేస్తూ పరుగెత్తుతున్నది. దేవదారు చెట్లు ఆకాశంలోకి దూసుకోనిపోతున్నాయి. తలవంచి నేలవైపు ఒక్కసారి కూడా తిరిగి చూడటం లేదు. ఎంతో రమణీయమైన దృశ్యం. చెట్లపైన మొలిచిన కుక్కగొడుగులు(పుట్టగొడుగులు) తింటూ నల్లని ఉడుతలు ఒక దాన్ని ఒకటి తరుముకుంటూ అక్కడే చుట్లుచుట్లుగా తిరుగుతున్నాయి. అది ఏ పిట్టోగానీ, బహుశ: మైనా ఏమో, తల బయటకూ లోపలికీ జాపుతూ దాగుడుమూతలు ఆడుతున్నది. అంతా చల్లగా ప్రశాంతంగా ఉన్నది. అయితే శీతలమైన పర్వతజలాలతో సెలయేరు ప్రవహించిపోతూ చేస్తున్న సందడి ఉన్నది. అదిగో అక్కడే ఉన్నది–ప్రేమ, సృష్టి, వినాశనం. ఏ చిహ్నరూపంలోనో కాదు, ఆలోచనగా కాదు, మనోభావంగా కాదు, నిజంగా ఉన్న యదార్ధం అది.
(‘నోట్ బుక్’ నుండి)

జీవించటం తెలిసిన వాడికి మరణాన్ని గురించిన భయం ఉండదు!

13 thoughts on “శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు

  1. శ్రీ వారాహీ దేవిని గురించి ఇదే నేను వినటం!ఆసక్తికరంగా చెబుతున్నందుకు ధన్యవాదాలు

  2. నూతన మార్గ ప్రవక్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు ఆలోచనలు చక్కగా వివరించారు

  3. నమ్మకం అనేది అనవసరం
    Faith is essential element and without faith, living is depressing

  4. జీవించడముమఋఅణము ఒకటే. పూటినప్పటీనుభూతి ఎవరికైనా గుర్థుంద్? మరణించేటపుడు అంతే అని నా భావన.మామిత్రుడు శారదాప్రసాద్ విశ్లేషణ బాగుంది.

  5. జీవించటం తెలిసిన వాడికి మరణాన్ని గురించిన భయం ఉండదు!
    Excellent quote Sarada Prasad garu.

Leave a Reply to Vijayalakshmi Prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *