April 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “మనసును విను”

రచన: విజయలక్ష్మి పండిట్

రమ ఆదివారం ఉదయం టిఫిన్ కు ఇడ్లీలు చట్నీ వేసిన ప్లేటును డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న భర్త రాజశేఖర్ ముందు పెడుతూ..,
“ఏమండీ… మన మనసును విని మనసు కోరినట్టే నడుచుకోడానికి మనకు అన్ని సమయాలలో వీలవుతుందంటారా” అడిగింది భర్తను. అప్పుడప్పుడు శేఖర్ అని పిలుస్తుంది భర్తను.
“ఇవాళేంటి నీకు ఉదయాన్నే ధర్మసందేహం కలిగింది” అంటూ ఇడ్లి తుంచి చట్నీలో అద్ది తింటూ … “బలేగుంది ఇడ్లీ సాఫ్టుగా..,”అన్నాడు శేఖర్.
రమకు రాజశేఖర్ కు పెండ్లయి మూడు సంవత్సరాలయింది . మూడో సంవత్సరానికి పాప దివ్య పుట్టింది వారి అనురాగ బంధంగా. దివ్యకు ఆరునెలలు నిండాయి. శేఖర్ చిన్న వయసులోనే మంచి కంపెనీలో సి.ఇ.ఒ.
“ఇంతకీ ఎందుకొచ్చింది నీకీ ప్రశ్న “ అని అన్నాడు రాజశేఖర్.
“మన మనసు చెప్పినట్టు, కోరినట్టు నడుచుకోవడం అన్ని సమయాలలో ఎలా వీలవుతుంది రమా..? ఎన్నో కట్టుబాట్లు, నిబంధనలు, ఆచారవ్యవహారాలు ,ఆర్థిక సమస్యలు, పెద్దవాళ్ళ మనస్తత్వాలు, పరిస్థితులు ఇవన్ని కాదని అన్ని సమయాలలో  మన మనసు ఇష్టానుసారం నడుచుకోలేము.“కాని ..అని ఆగి రాజశేఖర్ మంచినీళ్ళు కొంచెం తాగి మరలా అన్నాడు..,
“ కొన్ని ముఖ్యమయిన విషయాలలో అంటే మన చదువు, ఉద్యోగం, వివాహం విషయాలలో మన నిర్ణయాలు మన మనసు కోరినట్టు జరుపుకోడానికి ప్రయత్నం చేయాలి.., ఒకవేళ జరుగకపోయినా ఆ సమయ సంధరర్భాన్ని బట్టి
నిర్ణయాలను కొంచెమార్చు కోవచ్చుకదా..” అన్నాడు.
“మీకు మగవాళ్ళకయితే అవన్ని చెల్లుతాయేమో కాని మాకు ఆడపిల్లలకు చదువు, ఉద్యోగం , పెండ్లి విషయాలలో మా మనసు కోరినట్టు జరగడం లేదు కదా” అంది రమ.
శేఖర్ రమ మనసు ఎందుకు బాధపడుతుందో గ్రహించాడు.
రమ స్నేహితురాలు గీతిక వారం రోజుల క్రితం అమెరిక నుండి ఫేస్ టైమ్ చేసి “నేను ఇండియా వస్తున్నాను రమ వీకెండ్ లో కలుద్దాం “అని చెప్పిందని రమ శేఖర్ తో అన్న విషయం గుర్తుకొచ్చింది శేఖర్ కు.
“మీ ఫ్రెండ్ గీతిక అమెరికా నుండి వచ్చిందా రమా” అంటూ మాట మార్చాడు.
గీతిక కోరినట్టు బి.టెక్. తరువాత యు.ఎస్. లో ఎమ్. ఎస్. చదవడానికి వాళ్ళ ఫ్రెంఢ్సుతో పాటు అప్లై చేసుకోడానికి రమ వాళ్ళ అమ్మనాన్నలు ఒప్పుకోక పోవడం .. రమ తండ్రి తన స్నేహితుని కొడుకు రాజశేఖర్ తో రమ వివాహానికి ఇరువైపుల తల్లి తండ్రులు ఒప్పుకోవడంతో రమ రాజశేఖర్ ల పెండ్లి జరిగిపోయింది.
రమ తన మనసును విన్నా తన మనసు కోరిక నెరవేరలేదు. పరిస్థితులతో రాజీ పడాల్సి వచ్చింది. అందరు తన అదృష్టాన్ని పొగిడారు.
అందం ,మంచి ఉద్యోగం ఉన్న రాజశేఖర్ భార్య కావడం. అందులో రమ వాళ్ళ అమ్మమ్మ , నాన్నమ్మలు ఒకే మనుమరాలు రమ పెండ్లి చూడాలనే కోరికను తీర్చామన్న రమ తల్లి తండ్రుల తృప్తి . బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న రమ తండ్రి ఆనందరావుకు రిటైర్మెంట్ దగ్గర పడడంతో రమవాళ్ళ అమ్మ భారతి భర్తను తొందరపెట్టింది కూతురి పెండ్లి గురించి.
అందరి ఆనందం కోసం రమ తన మనసు కోరికను త్యాగం చేసింది. రాజశేఖర్ ప్రేమానురాగాలు రమను మరిపించాయి.
కాని …, అప్పుడప్పుడు ,తన స్నేహితులు పైచదువులు చదివి అమెరికా ,జర్మనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని విన్నప్పుడు రమ మనసు రమను నిలదీస్తుంది.
రాజశేఖర్ భార్య రమ మనసును చదివి, అర్థంచేసుకోవడంతో ఇట్టే గ్రహించాడు రమ ప్రశ్నల అంతరార్థాన్ని .
రమకు అమెరికాలో ఎమ్ . ఎస్ . చేసి ఉద్యోగం చేయలేదన్న మనసు కోరిక అప్పుడప్పుడు బయటపడుతుందని గ్రహించాడు.
“గీతిక నిన్న వస్తుందన్నావు వచ్చిందా? ఏంటి గీతిక అమెరికా కబుర్లు,విశేషాలు” అని అడిగాడు శేఖర్ రమను.

***

శేఖర్ ప్రశ్నలతో రమ ఆలోచనలు నిన్నటి రోజు గీతికతో గడిపిన సమయంలో జరిగిన సభాషణ సినిమా రీలు లాగ మనసులో తిరుగుతుంటే భర్తతో అంది..,
“దానికేమి లేండి అద్రుష్టవంతురాలు . తను కోరుకున్నట్టు అమెరకాలో ఎమ్. ఎస్ చేసి ఇప్పుడు కాంటాక్ట్ జాబ్ చేస్తూందట. త్వరలో మంచి కంపెనిలో జాబ్ వస్తుందని ఎక్సపెక్ట్ చేస్తున్నానని గీతిక చెప్పిందని అంది రమ.
గీతికతో తన మాటలను గుర్తు చేసుకుంటూ..,
“గీతికా ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్నలు” అడిగింది రమ.
“అలాగే ..బాగానే ఉన్నారు…,ఈ మధ్య మా అమ్మనాన్నలకు నా పెండ్లి బెంగ పట్టుకుంది. అప్పుడయితే నా అమెరికా చదువు గురించి వాళ్ళను ఒప్పించాను గాని ఇపుడు వెంటనే నా పెండ్లి అంటే ఎలా కుదురుతుంది. నాకు జాబ్ రావాలి వీలయితే అక్కడే ఉద్యోగం చేసే వాడినే పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా రాసి పెట్టుందో మరి నాకు “ అంది.
“మనం ఎంత చదువులు చదివి ఉద్యోగాలు చేసినా ఆడపిల్లల పెండ్లి అయితేనే పెద్ద బాధ్యత తీరినట్టు ఫీలవుతారు మన అమ్మ నాన్నలు.
నీకేం రమా… మంచి ఉద్యోగంలో ఉన్న అందమయిన భర్త , ముద్దుగా పాప . చక్కని సంసారం.” అంది గీతిక . ఆ మాటలు రమలో ఆనందాన్ని నింపాయి.
“నా మనసు కోరినట్టు అమెరకాలో చదువు ఉద్యోగం వచ్చింది . మరి అక్కడ స్థిరపడిన అమెరికా సిటిజన్ దొరికితే చేసుకోవాలనుంది. అది అంత సులభంగా నెరవేరేనా…, మన చేతిలో పని కాదుకదా రమా.మా పేరెంట్సుకు నేనక్కడ స్థిరపడడం ఇష్టంలేదు. ఏ అమెరకన్ నో, నల్లవాడినో పెండ్లి చేసేసుకుంటానో అని వారి బెంగ. అయినా నా భవిష్యత్ కదా నా మనసు చెప్పి నడుచుకోవడం నా కలవాటు ఎవరేమనుకున్నా..,” అంది గీతిక పాపనెత్తుకుని.
తను అమెరికా నుండి తెచ్చిన పింక్ కలర్ ఫ్రాక్ దివ్యకు వేసి బలే సరిపోయింది రమా పాపకు అంటూ ముద్దాడింది.
“ రమా…నీకు యు.స్.లో ఎమ్.ఎస్. చేయాలనే కోరిక తీరలేదు కదా బాధనిపించదా రమా..”అని అన్నది గీతిక.
ఆ ప్రశ్నకు రమకు కొంత నిరాశ కలిగినా “అప్పటి మా కుటుంబలో మంచి సంబంధం దొరికిందని నా  పెండ్లి వైపే మొగ్గు చూపారు అంతా . అమెరికాకు వెళ్ళడం అవసరం లేదు పెండ్లయినాక ఏదయినా జాబ్ వస్తే ఇక్కడే చేద్దువుగాని అని నచ్చచెప్పారు . శేఖర్ కు నేను నచ్చడంతో నేను ఒప్పుకోక తప్ప లేదు..,ఆ పరిస్థితులు  అలాంటివి “అంది రమ తన
మనసులోని వెలితిని బయటపడనీయకుండా.
“అయినా… ఐ యామ్ ఓకె … గీతిక. శేఖర్ చాల అండస్టాండింగ్. మంచి మనషి. ఆ విషయంలో నేను అద్రుష్టవంతురాలనే. నాకు వెంటనే జాబ్ చేయాలని లేదు. పాప కొంచెం పెరిగి స్కూలుకు వెళ్ళాక తరువాత ఆలోచిస్తాను. మనీ విషయంలో కొరత లేకుండా నాకిచ్చి మానేజ్ చేయమంటాడు” అన్నది రమ.
గీతిక ఆ రోజు రమ వాళ్ళింటిలో లంచ్ చేసి వాళ్ళ ఊరికి ట్రైనుకు టయిమవుతూందని నాలుగు గంటలకు వెళ్ళింది.
***
వాళ్ళిద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణను రమ రాజశేఖర్ తో చెప్పింది.
శేఖర్ విని కొద్ది సేపాగి అన్నాడు…
“రమా … మన మనసు కోరికలు పరిస్థితులతో రాజి పడక తప్పదు. అయినా …మనం మన జీవితాన్ని ఆనందంగా మలచుకుంటూ రావడం మన చేతుల్లోనే వుంటుంది రమా.! అదే విజ్ఞుల పని. గడిచిపోయిన జీవితాన్ని కోరికలను పట్టుకుని వ్రేలాడుతూ ముందున్న క్షణాలను ఆనందంగా అనుభవించక ఎప్పుడు ఏదో కొరతతో జీవించడం అజ్ఞానం కదా.. చెప్పు” అన్నాడు. రమ ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ…మరలా..,
“నాకు నా టీనేజ్ లో MBBS చదివి డాక్టరునవాలని కోరికుండేది. కాని మా ఆర్థిక కారణాలవల్ల, నా ఇద్దరు అక్కల పెళ్లిళ్ల భాద్యతల వల్ల, అకస్మాత్తుగా మా అమ్మ జబ్బుతో మరణించడంవల్ల నేను మెడిసిన్ లో ఫ్రీ సీటు తెచ్చకోలేకపోయాను. మా నాన్న నాకు డొనేషన్ కట్టే పరిస్థితిలో లేని కారణంగా ఆ కోరిక తీరలేదు నాకు. మా నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకుని బయోటెక్నాలజిలో ఎమ్. ఎస్సి. చేసి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో Ph.D. చేసి డాక్టరేట్ పొందాను. వెంటనే మంచి ఉద్యోగం కూడా.”
“నేనెప్పుడు MBBS చదివి డాక్టర్ని కానందుకు విచారించలేదు. జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలనే వైపు నా మనసును మళ్ళించి నా మనసుకు ట్రైనింగ్ ఇస్తుంటాను రమా…,మన మనసే మన ఆలోచనలు’ అనే బుద్ధుని ప్రభోదతో ఏకీభవిస్తాను నేను “అని ఆగాడు శేఖర్.మరలా…,
“ఆ సత్యాన్ని గ్రహించి నడుచుకుంటూ మన జీవితంలోని ప్రతి క్షణాన్ని గమనిస్తూ ఆ ఆనందాలను అనుభవిస్తూ జీవించడంలో ఆనందాన్ని పొందుతాను రమా..! ఆ క్షణంలో .. అంటే..వర్తమానంలో జీవించడం లోనే ఆనందముంది. క్రమంగా జీవితం పట్ల  ఒక ఆశావహ దృక్పథం మనలో చోటుచేసుకుని మనలను నడిపిస్తుంది. లేకపోతే మన తరంలో ఈ మారుతున్న సాంకేతిక,వస్తుప్రపంచానికి..  తీరని కోరికలకు బానిసలయిపోతాం.”
“మన మనసును వినాలి. కాదనను కాని..జీవితం పట్ల మన అవగాహన మన మనసునునడిపించాలి.  మనసు కోరుతున్న కోరికలను మనం మారుతున్న పరిస్థితులతో బేరీజు వేసుకుంటూ మన మనసుకు మనం బానిస కాకుండా మన మనసును మన కంట్రోల్ లో పెట్టుకుంటే మనం జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు అవునా..కాదా..? చెప్పు” అంటూ లేచి వెళ్ళి రమ దగ్గర కూర్చున రమ బుజాలపై చేతులేసి తన వైపుకు తప్పుకున్నాడు.
శేఖర్ మాటలు వింటున్న రమ తనకు భర్త నిజాయితీతో కూడిన మాటలతో ఎంతో స్వాంతన దొరుకుతూండడం గ్రహించింది. నిజమేనేమో …నేను నా మనసు మాటలు వింటూ మదనపడుతుండి పోతున్నాను తప్ప నా మనసును అవగాహనతో అనునయంగా సమాధాన పరుచుకోలేకపోయాను . అందుకే నా మనసు నన్ను నియంత్రిస్తూంది అనే సత్యాన్ని గ్రహించింది.
శేఖర్ లాగ నేను సరయిన జీవితావగాహనతో నా మనసును ట్రైన్ చేయడం లేదు అందుకే ఆ కొరత నా జీవితంలో తీరని కోరికగా నిలిచి పోయిందని గ్రహించింది రమ. మనసు మర్మాన్ని గ్రహించేట్టు చేశాడు శేఖర్ అని అనుకోసాగింది.
శేఖర్ అన్నాడు రమతో .. “అయినా ఈ కాలంలో చదువుకోవాలంటే జీవితాంతం చదువుకొనే.. అదే ..’లైఫ్ లాంగ్ లర్నింగ్ ‘కు ఆన్ లైన్ కోర్సులకు అవకాశాలు ఎన్నిలేవు చెప్పు..?! పాప కొంచెం పెద్దదయినాక నీ కిష్టమయిన కోర్సులు చేసుకో రమా. మనసుండాలే గాని మార్గాలనేకం మనకు ఈ అంతర్జాల యుగంలో.. అవునా “ అన్నాడు శేఖర్ రమను ఎంకరేజ్ చేస్తూ రమ మనసును స్వాంతన పరిచే ప్రయత్నంతో.
రాజశేఖర్ తన మనసును గ్రహించి సున్నితంగా సమాధాన పరిచే ప్రయత్నాన్ని గ్రహించిన రమలో భర్త పట్ల ఆరాధన భావం చోటుచేకుంది. మెల్లగా తన తలను శేఖర్ భుజానికానించి కళ్ళుమూసుకుంది తేలికయిన మనసు ఆ ఆనంద ఘడియలను మనసారా అనుభవిస్తూ. రమలోని మార్పును గ్రహించిన శేఖర్ భార్యను మరింత దగ్గరగా తనకు అదుముకుంటూ రమ బుగ్గపై తన పెదవులాన్చాడు.
వారి ఆనందానికి వంత పాడుతున్నట్టు ఇంటిముందున్న వేప చెట్టు పూతనారగిస్తున్న కోయిల కమ్మగా రాగాలు తీస్తూంది.

4 thoughts on “విశ్వపుత్రిక వీక్షణం – “మనసును విను”

Leave a Reply to Satyagowri Cancel reply

Your email address will not be published. Required fields are marked *