April 19, 2024

అమ్మమ్మ -3

రచన: గిరిజ పీసపాటి

అన్నపూర్ణ శాస్త్రులు గారు చెప్పిన విధంగా సింహాచలం వరాహ నృసింహస్వామి సన్నిధిలో నలభై రోజుల పాటు సుందరకాండ ఒకరు పారాయణ చేస్తుండగా, ఇంటి దగ్గర పాలు ఇస్తున్న ఆవుకి, దాని దూడకి అమ్మమ్మ సేవ చెయ్యసాగారు. నలభై రోజుల పారాయణ, గో సేవ పూర్తయాక ఆ పుణ్యఫలాన్ని అన్నయ్యకి ధార పోసారు అమ్మమ్మ. తరువాత కొన్ని రోజులకే గవర్నమెంట్ రద్దు చేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి, తిరిగి ఇవ్వడమే కాకుండా ఆయనకి హెల్త్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కూడా ఇవ్వడంతో తన శ్రమ ఫలించి అన్నయ్య జీవితం బాగుపడినందుకు ఎంతో సంతోషించారు అమ్మమ్మ. తరువాతి కాలంలో ఆయన ఆంధ్రప్రభలో వారఫలాల శీర్షికను నిర్వహించేవారు. జాతకాలు బాగా చెప్తారనే పేరు గడించారు.

తాతయ్య ఉద్యోగం చేస్తూ స్వయంగా ఇంగ్లీష్ నాటకాలు రచించి వాటిని, వాటితో పాటు షేక్‌స్పియర్ నాటకాలను కూడా తమ విద్యార్ధులతో స్కూల్ యొక్క ‘ప్లే డే’ నాడు వేయించేవారు. స్కూల్ నుండి తిన్నగా టౌన్ హాల్ కి వెళ్ళి పేకాట ఆడేవారు. ఇంటికి రావడానికి ఒక సమయమంటూ ఉండేది కాదు. ఇంటి అవసరాలను పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు. ఈ విషయం అమ్మమ్మని చాలా బాధపెట్టేది. ఎంత చెప్పినా వినేవారు కాదు.

తనకి సాహిత్యం, నాటక రంగం మీద ఉన్న అభిలాషతో గౌతమ బుద్ధ, పృథ్వీ పుత్రి, రాజ్య కాంక్ష మొదలైన నాటకాలను రచించారు. ఈ సమయంలోనే ఆయనకి హెడ్ మాస్టరుగా పదోన్నతి కూడా లభించడం జరిగింది. తాతయ్య ఇల్లు పట్టకుండా తిరిగినా లోలోపల బాధ పడిందే తప్ప అమ్మమ్మ ఏనాడూ తాతగారిని ఎదిరించలేదు. ఆయన ఏ సమయానికి ఇంటికొచ్చినా అప్పటికప్పుడు స్నానానికి వేడినీళ్ళు సిధ్ధం చేసి, ఆయనకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టేది. అమ్మమ్మ వంట చాలా బాగా చేస్తుంది. ఆవిడ వండే రకరకాల వంటలు చాలా మందికి రావు కూడా.

ఆఖరికి తాతయ్య వ్యవహారంతో విసిగిపోయిన అమ్మమ్మ ‘నేను చస్తే గానీ ఈయనకి బుధ్ధి రాదు. అయినా నా పిచ్చి గానీ… నేను కూడా పోతే ఏ బంధాలు, బాధ్యతలు లేవని ఇంకా స్వేఛ్ఛగా, అదుపు లేకుండా తిరుగుతారు. ఒక బిడ్డ పుట్టిన తరువాత నేను చచ్చిపోతే, ఆ బిడ్డను సాకడం, పెంచడం చేస్తే అప్పుడు తెలిసొస్తుంది ఈయనకి నా బాధ. అవును. ఇదే సరైన మార్గం. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన ఫలాలన్నిటినీ తిరిగి తీసుకుపోయాడు. నిర్దయుడు. అనుకుంటూ…

దేవుడి గదిలోకి వెళ్ళి తన ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి నమస్కరిస్తూ… స్వామీ! నన్ను కరుణించి నాకో బిడ్డను ప్రసాదించు. బిడ్డ పుట్టాక నీకు కంఠానికి కాటు ఇచ్చి, నా ప్రాణాలను నీకు ఇచ్చేస్తాను. నా ఈ ఒక్క కోరిక తీర్చు’ అంటూ కన్నీళ్ళతో వేడుకున్నారు. ఈ సంఘటన జరిగాక అమ్మమ్మకి నెలసరి రాలేదు. అప్పుడు అమ్మమ్మ వయసు నలభై మూడు సంవత్సరాలు. మెనోపాజ్ అనుకుని ఊరుకున్నారు అమ్మమ్మ.

నాలుగు నెలలు గడిచాక ఆమెను చూసినవాళ్ళందరూ పొట్ట ఎత్తుగా కనిపిస్తోంది, ఏమైనా విశేషమా!? అని అడగడం, అందుకు అమ్మమ్మ అలాటిదేమీ లేదని చెప్పడం జరిగేది. కానీ, దగ్గర వాళ్ళు, తోడికోడళ్ళు మాకెందుకో అనుమానంగా ఉంది. ఒకసారి డాక్టర్ ని కలువు అంటూ మందలించేసరికి, అమ్మమ్మకి బాగా పరిచయస్తురాలు అయిన లేడీ డాక్టర్ రాజేశ్వరమ్మగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. ఆవిడ అమ్మమ్మను పరీక్ష చేసి, తల్లివి కాబోతున్నావు అనే శుభవార్త చెప్పారు.

ఆ వార్త విన్న అమ్మమ్మకి సంతోషించాలో, బాధపడాలో అర్ధం కాలేదు. ఈ వయసులో నెల తప్పి నలుగురిలోకి ఎలా వెళ్ళడం, ముఖ్యంగా బావగార్లకి ముఖం చూపించలేని సిగ్గు, చిన్నతనం ఒక పక్క, ఈ బిడ్డ కూడా దక్కకపోతే ఈ వయసులో ఆ శోకాన్ని భరించగలనా అనే బాధ, ఇప్పటికైనా మళ్ళీ తన కడుపు పండిందనే ఆనందం. ఇలా అన్ని భావాలు ఒకేసారి చుట్టుముట్టి ఆవిడని ఉక్కిరిబిక్కిరి చేసేసాయి.

నెలలు నిండాక రాజేశ్వరమ్మగారు పురుడు పోయగా, మహాలక్ష్మిలాంటి ఆడపిల్లకు (మా అమ్మగారికి) జన్మనిచ్చింది అమ్మమ్మ. ఆ పిల్లకు ఇది వరకు పిల్లలకు చేసిన ఏ వేడుకా చెయ్యలేదు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నపూర్ణ శాస్త్రులగారి సూచన మేరకు ‘నాగ’ అనే పేరుని కలిపి, లక్ష్మీ నాగకుమారి అని నామకరణం చేసారు. బారసాలనాడు కూడా పాపకి కొత్త బట్టలు కొనలేదు. కారణం తాము ఏ ముచ్చట, వేడుక చేసినా ఈ పాప కూడా దక్కదేమోననే భయమే. ఆఖరికి అన్నప్రాశన కూడా జరిపించలేదు. అసలు తన పిల్ల కానట్లే ఉండేది. తన చెయ్యి మంచిది కాదు. తను ఆ పాపకి ఏం చేసినా తనకు దక్కదు. ఇదే భయంతో కొట్టుమిట్టాడేది. కడుపు తీపి ఒక పక్క, భయం మరో పక్క. ఎంత ఆవేదన అనుభవించిందో పిచ్చితల్లి.

నాగ ఆలనా, పాలనా పక్క వాటాలోని వారే చూసుకోసాగారు. నాగ బంగరడం మొదలు పెట్టాక ఒకరోజు బంగురుకుంటూ వెళ్ళి పక్కింటి వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళ విస్తరిలోని ఎంగిలి మెతుకులు తన చేతితో తీసుకుని తింది. ఇదే నాగ అన్నప్రాశన వేడుక. ఆరోజు నుండి వాళ్ళే నాగకు అన్నం తినిపించేవారు. కూతురు పుట్టాక తాతయ్యలో కొద్దిగా మార్పు వచ్చింది.

సహజంగానే నటనా రంగంపై ఆసక్తి ఉన్న తాతయ్య తెనాలిలో ఏ నాటకం ఉన్నా అమ్మమ్మతో కలిసి వెళ్ళేవారు. ఈ విధంగానే స్వర్గీయ శ్రీ పీసపాటి నరసింహమూర్తి (మా నాన్నగారి నాన్నగారు, నాకు తాతగారు) గారి నాటకాలకు కూడా వెళ్ళేవారు. కానీ ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు. నాగ పుట్టాక కూడా పాపను తీసుకుని తరచూ నాటకాలకు వెళ్ళేవారు.

ఈ సమయంలోనే పీసపాటి నరసింహమూర్తిగారి సహ నటుడు ఆయనతో ఎంతో నమ్మకంగా ఉంటూ, ఇన్కమ్ టాక్స్ చెల్లించే విషయంలో తప్పుడు లెక్కలు చూపించడం, డిపార్ట్మెంట్ వాళ్ళు పీసపాటి తాతగారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సరైన లెక్కలు చూపించేవరకూ తన ఆస్తులలోని పైసా కూడా వాడరాదనే ఉత్తర్వులను జారీ చేసింది.

************** సశేషం **************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *