March 29, 2024

అష్టావక్రుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

పూర్వము ఏకపాదుడనే నిరంతర తపోనిరతుడైన బ్రాహ్మణుడు భార్య సుజాతతో శిష్యకోటికీ వేదములు బోధిస్తూ హాయిగా గురుకులములో కాలక్షేపము చేయసాగారు. వేద విద్య బోధించే ఏకపాదుడు విద్య బోధించే విషయములో శిష్యుల పట్ల చాలా కఠినముగా వ్యవహరించేవాడు. చాలా కాలానికి ఎన్నో నోముల ఫలితముగా భర్త అనుగ్రహము చేత సుజాత గర్భవతి అయినది. గర్భములో నున్న శిశువు తండ్రి శిష్యులకు భోధించుచున్న వేదములను వల్లె వేయసాగాడు. ఒకనాడు తండ్రి వల్లె వేస్తున్నప్పుడు గర్భములో నున్న బాలకుడు వింటూ స్వరము తప్పినదని పలికాడు. అంతేకాకుండా శిష్యులకు విశ్రాంతి లేకుండా నిద్రాహారాలు లేకుండా అధ్యయనము చేయించడము మంచిది కాదని గర్భములో నున్న బాలుడు తండ్రికి హితవు పలికాడు. తనకు పుట్టబోయే కుమారుడు అమోఘమైన శక్తివంతుడు, మేధావిగా గ్రహించిన ఏకపాదుడు తనను తప్పు పట్టినందుకు,వక్రముగా పలికినందుకు ఎనిమిది వంకరాలతో పుట్టమని శపించాడు.గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందముగా స్వీకరించాడు.

నెలలు నిండి ప్రసవ సమయము దగ్గరపడింది అని గ్రహించిన ఏకపాదుడు ప్రసవ సమయానికి అవసరమైన తిలలు ఘృతము ,ఇతర నిత్యవసర వస్తువుల నిమిత్తము జనక చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు ఆ సమయములో అక్కడ ఒక పందెము జరుగుతుంది. అది ఏమిటి అంటే వరుణుని కుమారుడైన వందితో వాదము చేసి గెలిచినవారికి తన సర్వస్వము ఇస్తానని ఓడినవారు జలమధ్యములో జీవితాంతము బందీగా ఉండాలి అని షరతు విధించాడు. ఏకపాదుడు వందితో వాదనకు దిగి ఓడిపోవటం వలన నియమానుసారం జలమధ్యములో బందీగా ఉండిపోయాడు. ఇక్కడ ఒక రహస్యము ఉన్నది అది ఏమంటే వంది వాదంలో ఒడినవారిని జలమధ్యములో బంధించి భాధించలేదు. తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు.
ఇక్కడ తన అన్నగారైన ఉద్దాలకుని ఇంట సుజాత మగశిశువును ప్రసవించింది. తండ్రి శాపానుసారము ఎనిమిది వంకరాలతో జన్మించాడు కాబట్టి “అష్టావక్రుడు” అని పేరు పెట్టారు. మనము ఇక్కడ అష్టావక్రుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకోవాలి. పూర్వజన్మలో అష్టావక్రుడు దేవలుడు అనే ఒక ఋషి . దేవలుడు మాయావతి అనే కన్యను వివాహమాడి సంతానాన్ని పొంది విరాగి అయి తపస్సు చేయ నారంభించెను.ఇతని తపస్సు నుండి వెలువడే జ్వాలలు ముల్లోకాలను భాదించసాగాయి. దేవాలకుని తపస్సును భంగము చేయటానికి ఇంద్రుడు రంభను పంపగా దేవలుడు ఏమాంతరము చలించలేదు. అప్పుడు కోపించిన రంభ మరుజన్మలో అష్టావక్రుడివై జన్మించమని శపించింది. ఆ తరువాత పశ్చత్తాపము చెందిన రంభ శాపవిమోచన తెలియజేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.
ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతునితో పాటు అష్టావక్రునికూడా వేద విద్యను భోధించేవాడు. ఒకనాడు అష్టావక్రుడు మేనమామ ఒడిలో కూర్చుండగా చూసిన శ్వేతకేతు ఆగ్రహించి ,”నా తండ్రి ఒడిలో నేను కూర్చోవాలి నీవు ఎలా కూర్చుంటావు ? నీవు వెళ్లి నీ తండ్రి ఒడిలో కూర్చో”,అని మందలిస్తాడు. అప్పుడు అష్టావక్రుడు తల్లి దగ్గరకు వెళ్లి తన తండ్రి గురించి అడుగగా తల్లి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి, తండ్రి జనకుని కొలువులో వందితో జరిగిన వాదనలో ఓడిపోవటం వలన జలమధ్యములో బందీగా ఉన్నాడని తెలుపుతుంది. అప్పుడు అష్టావక్రుడు జనకుని కొలువుకు వెళ్లి వాదించి తన తండ్రిని ఇతరులను జలమధ్యము నుండి విడివిస్తానని చెప్పి జనకుని కొలువుకు బయలుదేరుతాడు.
అ సందర్భముగా అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేదా అష్టావక్ర గీత. ఆ విధముగా పందెములో గెలిచి తన తండ్రిని ఇతరులను జలమధ్యము నుండి విడిపించాడు. ఏకపాదుడు అష్టావక్రుని పితృ భక్తికి సంతసించి అతని పాండిత్య ప్రకర్షకు గర్వపడి నది యందు స్నానము చేయించి కుమారుని అష్ట వంకరలు పోవునట్లు చేసాడు. తండ్రిని ఇంటికి తెచ్చి తల్లికి అప్పగించి తల్లికి ఆనందము కలిగించాడు. యుక్త వయస్సు వచ్చిన అష్టావక్రుడు వివాహము చేసుకోదలచి వదాన్యుని దగ్గరకు వెళ్లి అయన కుమార్తె సుప్రద ను తనకు ఇచ్చి వివాహము చేయమని కోరాడు. వదాన్యుడు అష్టావక్రుని శక్తిని పరీక్షించ దలచి,”|నీవు ఉత్తర దిక్కుగా వెళ్లి కుబేరుని పట్టణము దాటి,కైలాస గిరి చేరి శివపార్వతులు సంచరించే ప్రదేశము దాటి ముందుకు వెళితే అక్కడ ఉన్న స్త్రీని చూసి వస్తే, నీకు నా కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తాను” అని చెపుతాడు.
అష్టావక్రుడు ఉత్తర దిశగా బయలుదేరి కుబేరుని పట్టణానికి చేరి కుబేరుని ఇంట దేవకన్యల నృత్యగానాలను ఆస్వాదిస్తూ ఒక ఏడాది పాటు అతిధిగా కాలము గడిపి ప్రయాణము కొనసాగించి హిమాలయాలలో బంగారు మయమైన దివ్యభవనాన్ని చూడగా అక్కడ కొందరు సుందరీమణులు అష్టావక్రునికి స్వాగతము పలికి మర్యాదలు చేసి లోపలి తీసుకువెళ్లారు. అక్కడ ఒక జగన్మోహిని చిరునవ్వుతో అష్టావక్రునికి దర్శన మిచ్చింది. ఆ సుందరి అష్టావక్రుని తన కోరిక తీర్చమని అర్ధించింది. అప్పుడు అష్టావక్రుడు ,”తల్లి నేను అస్కలిత బ్రహ్మచారిని పరసతిని కూడుట అధర్మము నన్ను విడిచిపెట్టు”అని అర్ధించాడు. అప్పుడు అ సుందరి ఈ రాత్రికి మా ఆతిధ్యము స్వీకరించి వెళ్ళమని కోరింది. మరునాడు అష్టావక్రుడు ప్రయాణానికి సిద్దమయినప్పుడు ఆ సుందరి ,”మహాత్మా పర స్త్రీ ని అనే కదా మీ అభ్యంతరము, నన్ను వివాహము చేసుకుంటే మీ సతిని అవుతాను కాదనవద్దు “అని బ్రతిమాలగా, అష్టావక్రుడు ,”అమ్మా, నీవు బాలవు వివాహ విషయములో నీ తండ్రి లేదా సోదరుడు నిర్ణయము తీసుకోవాలి. అది ధర్మము నిజము చెప్పు. అసలు నీవు ఎవ్వరవు?”అని ప్రశ్నిస్తాడు. “మహానుభావా నేను ఉత్తర దిక్కు కాంతను. మిమ్ములను పరీక్షించటానికి వదాన్యుడు నన్ను పంపాడు. పరీక్షలో మీరే నెగ్గారు వెళ్లి సుప్రదను వివాహము చేసుకొని సుఖముగా జీవించండి”అని పలికింది. తిరిగివచ్చిన అష్టావక్రుడు సుప్రదను వివాహమాడాడు.
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగ రంభ మొదలైన అప్సరసలు వచ్చి అష్టావక్రుని ప్రార్ధించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని అడుగగా వారందరు విష్ణుమూర్తి పొందు కోరుతారు. విన్న అష్టావక్రుడు “మీ కోరిక కృష్ణావతార కాలమున గోపికలుగా జన్మించి తీర్చుకుంటారు ” అని సెలవిచ్చాడు. ఆ తరువాత పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు పరమాత్ముని యందు మనస్సును లయము చేసి శ్రీ కృష్ణుని దర్శించి అయన పాదములపై బడి పరమపదించి గోలోకమునకు పోయి మోక్షమును పొందెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *