March 28, 2024

గిలకమ్మ కతలు – పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా?

రచన: కన్నెగంటి అనసూయ

“సరోజ్నే…సరోజ్నే…! లోపలేంజేత్తన్నావో గానీ ఓసారిలా వత్తావా బేటికి..”
గుమ్మం ముందు నిలబడి అదే పనిగా పిలుత్తున్న గౌరమ్మ గొంతిని లోపల బోషాణం పెట్టెలో ఏదో ఎతుకుతున్న సరోజ్ని ఇంకో రెండడుగులేత్తే లంగా సిరిగిపోద్దా అన్నంత ఏగంగా వచ్చేసింది పెద్ద పెద్ద అంగలేసుకుంటా..
“ఏటి గౌరొదినే..ఇంత పొద్దున్నే..ఇలాగొచ్చేవ్..?” అంది ..
“ఏవీ లేదు ..పెసరొడేలు పెడదావని..తవ్విడు పప్పు నానబోసేను..గబ గబా పని కానిచ్చుకుని ఒకడుగు అటేత్తావేమోనని..”
“..వత్తాన్లే గానీ మొన్నేగదా పెట్టేవు..కుంచుడో, మూడడ్లో అయినాయన్నావ్..? మల్లీ ఇయ్యెంతుకు?”
“పిల్లడిగింది..దానికి పెసరొడేలే ఎక్కువ కావాలంట. ఆల్లాయనకి రాత్రుల్లుమాటు సాంబారులోకి రోజూ వడియాలుండాలంట. దాని పెళ్లైన కొత్తలో..పొయ్యి పక్కనే మూకుట్లో నూనోసి దానామట్నే ఉంచి అందులోనే ఏపేత్తా ఉంటే మా సెబ్బరి పడిపోయేది..మరిగీ మరిగీ వడేలు ఏపినప్పుడల్లా ఇల్లంతా కంపమ్మా..అని.
ఆల్లకి వడియాలు బాగానే కరుసవుతాయ్. పెట్టుకోపోయావా అదెంత పనంటే..ఆ అపార్టుమెంటుల్లో నాకెలాక్కుదురుద్ది అంతది..”
“అదీ నిజవేలే..మరి. పైనెక్కడో టెర్రస్ మీదెట్టుకోవాలి. ఎండేదాకా అక్కడే కూకోవాలి. అయ్యన్నీ అయ్యే పన్లేనా?”
“అంతుకే..పనయ్యాకా ఒకడుగెయ్..”అంటా రెండడుగులేసి..
“వత్తానే సరోజ్నీ..అల్లం, పచ్చిమిర్గాయ్ ముక్కలు కోస్కోవాలి..”
“సర్లే ..” అని లోనకడుగేసిన సరోజ్ని..గబ గబా పన్జేసేసుకుని నాలుగు సెంబుల్నీల్లు ఒంటి మీంచి గుమ్మరిచ్చుకుని గౌరమ్మ ఇంటికేసి..ఎల్లింది. అప్పటికే ఆ ఈధిలో కిట్టవేణి, గౌరమ్మా. ..మంచం పక్కమ్మటా ఎత్తు పీటల మీద కూకుని రెండోకంటోల్లకి ఇనపడకుండా గుసగుసలుగా మట్తాడుకుంట్నారేవో..సరోజ్నిన్జూసి ఆపేసి మొకం నిండా మెరిసిపోయే రంగులల్లే నవ్వు పూసుకుని లోనకి రమ్మన్నారు.
తనొత్తంతోనే ఆల్లాపేసినంతుకు కాసేపు అదోలాగున్నా అంతలోనే మాటల్లోబడి..
ఆ మాటా ఈ మాటా మాట్టాడుకుంటుంటే…పక్కింటి సేసమ్మ..”గౌరొదినే..! తవ్విడే అన్నావని రాలేదు.ఒకడుగెయ్యమంటావా..” అంటా వచ్చి అక్కడే సరోజ్ని ఉంటం సూసి గౌరమ్మ ఏంజెప్పుద్సో ఇందావని గూడా సూడాకుండా వచ్చిందొచ్చినట్తే ఎల్లిపోయింది ఎనక్కి..
ఎంత్కో సరోజ్నికి అర్ధం కాలేదు…
“వచ్చిందెలాగూ వచ్చింది..లోనకొకడుగేత్తే పోయిందేవుందో..!” లోపలనుకోబోయి పైకే అనేసింది సరోజ్ని.
అప్పటికే మొగుడికి టీ పెట్టాలని కిట్తవేణి ఎల్లిపోయిందేవో..గౌరమ్మా, సరోజ్నీ ఇద్దరే ఉన్నారు..
“అన్నట్టు..మొన్నామజ్జన పెసరొడేలెట్టినప్పుడు..సేసమ్మని పిల్వలేదా ఏటి నువ్వు..”
అంది గౌరమ్మ..పెసరొడియాల పిండి సేతిలోకి తీసుకుని..సరోజ్ని వంకే సూత్తా..
“అయ్యా..ఇది మరీ బాగుంది. సేసమ్మనెంతుకు పిల్వలేదు.మా గిలకనంపితేని.
కేకెయ్యలేదని సెప్పిందా..? దాన్నోరడిపోను..సెల్సిత్తం ముండ..”
కోపంతో..కయ్యుమంది సరోజ్ని.
“అయ్యో..ఊరుకో..! మల్లీ ఇందంటే అదొగ్గోల..ఎంతుకొచ్చిన గొడవ. “నసిగింది గౌరమ్మ..
“మా గిలకెల్లొచ్చింది. పిల్సినోల్లందరూ ఒచ్చేరు..సేసమ్మే రాలేదు. ఏమ్ములిగిందో ఏవోలే అనుకున్నాను. అంతుకేనా పిండొడియాలు పోసుకుంటా అందర్నీ పిల్సి నన్ను పిలవలేదు..”
అంది సరోజ్ని..గుడ్ద మీద పెద్ద బఠాని సైజులో పెసరొడియాలు కొస్రి కొస్రి పెడతా..
“ఏదో ..తిరగేసుకుంది..కారాలు కొట్టుకున్నా..ఆవపిండ్లో పోటేసుకున్నా.. ఆవకాయలప్పుడైనా .. వడియాలూ అప్పడాలూ పెట్టేటప్పుడైనా ఈధిలో వోళ్లం అంతా ఒకరికొకరం సాయం సేసుకుంటా రాబట్టే గందా..సులాగ్గా అయిపోతన్నయ్..మరెంతుకు పిలవలేదో..అని తిరగేసుకుందిలే. అంతే .అంతకన్నా ఏవన్లేదమ్మా..పాపం..ఏమాటకామాటే సెప్పుకోవాలి..”
“అందుకే నన్నూ పిల్వలేదు..సరిపోయింది. అయినా గిలకనడుగుతానుండు..పిల్సిందో లేదో..! దానికి గుణం కుదిరితే పిలుత్తుది. ఇట్టం లేపోతే పిలవదు..”
“అడిగి సూడు..ఇలాటియ్యే..సిలికి సిలికి ఈదురుగాల్లవుతాయనేది మాయమ్మ..”
అయ్యాల మజ్జానం బళ్లోంచి కిలక అన్నానికని ఇంటికొచ్చినప్పుడు..అడగనే అడిగింది సరోజ్ని..”ఏవే గిలక..! అయ్యాల పెసరొడియాలెట్టిన్నాడు సేసమ్మామ్మని పిలవమన్జెప్పేను. పిల్సవా? ఎల్లి..”
“ఊ..ఊ..” అంటా ఆలోసిత్తా అల్లమ్మొంకే సూత్తా నిలబడిపోయింది అయ్యాలని గుత్తు దెచ్చుకుంటా..
అయ్యాల..తెల్లారి కాసేపయ్యిందేవో..
అప్పుడే నిద్దర్లేసి కల్లు నులుముకుంటా తిన్నగా వంటింటికాడికొచ్చిన గిలకెనక్కి సూత్తా..
“.అదిగో..ఆ గెడంచీ మీద డబ్బులెట్టేను. భద్దర్రావ్ కొట్టుకాడికెల్లి పావుకేజీ అల్లమిమ్మని పట్రా .”
అన్నవారుత్తానే వారకంట్న గిలకమ్మని సూత్తా అంది సరోజ్ని.
అల్లవనగానే గిలకనోట్టో నీరూరిపోయి..కల్లింతంతజేస్కోని..
“అల్లవెంతుకే అమ్మా..! పెసరట్టేత్తన్నారా?” అంది..ఆశగా..
“ఎప్పుడూ తిండిగోలే..ఏత్తే ఏత్తాన్లే. పెసరొడియాలెడతన్నాం..నువ్వెల్లి అల్లం పట్రా..”
పన్జేసుకుంటానే అంది సరోజ్ని..
“దాన్ని కాతంత మొకంకడుక్కోనీ. పాసి ముఖంతో ఎల్లద్దా..? నీ సేదత్తం ఎక్కడికోయింది? “అని కూతురితో అని..గిలకెనక్కి తిరిగి..
“ఎల్లు. తూంకాడికెల్లి సుబ్బరంగా పళ్ళుదోంకొన్రా. తెల్లగా మెరిసిపొవ్వాలి..” అంది అక్కడే రోట్టో పెసర పిండి రుబ్బుతున్న గిలకాళ్ల అమ్మమ్మ.
ఆవిడి ఏసంకాలంలో కూతురు పిండొడియాలూ, అప్పడాలూ , పెసరొడియాలూ, పచ్చల్లు పెట్టుకుంటాదని సాయంజేత్తాకి వచ్చి నెలా, నెలాపదేన్రోజులు కూతురింటికాడే ఉండిపోద్ది.
అప్పటికొచ్చి వారంరోజులవ్వుద్దేవో..అప్పటికే పిండొడియాలెట్టేసి ఎక్కడా తడన్నది లేకుండా ఇరగెండబెట్టేసి దబ్బాల్లోకెత్తేసేరు.
ఇయ్యాల పెసరొడియాలెడదామని తెల్లారగట్ట లేసి పెసరపప్పు నానబోసేరు.
మినప్పప్పుల్లాటియ్యయితే రేత్రికాడ నానబెట్టుకున్నా పరవాలేదుగానీ పెసరపప్పు మాత్రం మూడు నాలుగ్గంటల ముందే నానబెట్టాలని సరోజ్ని ఆల్లమ్మమ్మాళ్లూ సెప్తా ఉంటం గేపకేవేనేవో..
తెల్లారగట్త నానబెట్టేరు.
“ఏసంకాలం ఎండ బేగినే వచ్చేత్తింది. పొద్దున్నే కాపీల్తాగి.. ఆరింటికల్లా రుబ్బుతుం మొదలెట్తేత్తే…ఎండెక్కే టయానికి అయిపోతయ్యి. ఏటే అమ్మా… !” అంది సరోజ్ని ఆల్లమ్మతో..
“అంత పొద్దున్నే రుబ్బేత్తే పెట్టీవోల్లో? పెట్టీవోళ్లుండద్దా? ..మనక్కోడి కూసేసిందని ఇరుగూపొరుగోల్లక్కూడా కూసేత్తాదా? సేత్రం సెప్పినట్తుంది .. ఏడింటికి మొదలెడితే రెండుమూడు వాయలయ్యాకా పిలుత్తానని ముందే కవురెట్టు. నీడపట్టున కూకుని పెట్టేసి పోతారు. ఎండెక్కే కొద్దీ సిరాకొత్తాది ఎవురికైనాను..”
“సర్లే అయితే ..! గిలక లేసేకా కవురెడతాను..అయితే ఎంత పప్పోద్దాం..? అంది సరోజ్ని..ఆల్లమ్మనెక్కే సూత్తా..
“ఉల్లిపాయలూ..పచ్చి మిర్గాయలూ సూసేవా సరిపడా ఉన్నయ్యో లేవో..?”
“సూర్రావ్ సేలోకంపి నిన్నే కేజీకాయల్దెప్పిచ్చేను…”
“సరిపోతయ్యా..?” ఆల్లమ్మ గొంతులో ఆత్రం..
“అయ్యబాబోయ్..కుంచెడు పప్పు పెసరొడియాలకి సరిపోతయ్యయ్యి. పైగా వరం కాయలు కాదు. పొట్టి కాయలే. కారం బాగానే ఉందంట. వల్లూరోరి రాఘవమ్మ సెప్పింది. రాఘవమ్మక్కడ్నించే తెప్పించ్చిందట పచ్చిమిర్గాయలు. తనే సెప్పింది. లేపోతే నాకెక్కడ తెలుత్తాది..తనెట్తేసిందిలే. కుంచెడు పప్పోసి పెట్తేసింది. అయిదార్రోజులు అదే సరిపోయింది ఈది ఈదందరికిన్నీ..”
“కుంచెడు పప్పే? వామ్మో..! అన్నెంతుకో..?” బుగ్గమీచ్చెయ్యేసుకుని తెల్లబోతా అంది..సరోజ్ని ఆళ్లమ్మ.
“కూతురు పెళ్ళికుందిలే..! కుదిరితే పెట్తాలి కదావియ్యవోల్లకి కావుళ్ళు. అంతుకే అన్నీ ఎక్కువెక్కువే పెట్టి డబ్బాల్లో పోసేసుకుంటంది..పచ్చళ్ళు కూడా పెట్తేసుంచుకుంటదంట. కారలయ్యీ కొట్టిచ్చేసి కుండల్లో అణిసణిసి వాసిని గట్టి మరీ మసిరి మీదెట్టేసింది..”
“కుదరా పోతేనో..” అని ఒక వంకర నవ్వు నవ్వి..
“అప్పుటికప్పుడు పెట్టుకుంటే అవ్వదా ఏటి? ఉట్టు పట్తేత్తన్నాయ్ పురుగులు..”
“నువ్వూ బానే సెప్తాయ్. ఏసంకాలం అయితే బాగా ఎండుతాయ్. వాన్లడ్దాకా ఎండద్దా?
ఎండ రాపోతే అయ్యలా సాగుతా ఉంటాయ్ గుడ్ద మీద. నూన్లాగేసి అస్సలు బాగోవు ఏయించేటప్పుడు. కూరకైతే తప్ప..” అని అక్కడకదాపేసి..
“సర్లేగానీ ..కారం మరీ ఎక్కువైపోతే పిల్లలు తిన్రే అమ్మా..! ఆల్లు తినాపోతే ఇంకెంతుకు ఇంత
కట్తవూను..”
“అంతేలే..కానియ్. రెండు తవ్వల పప్పోత్తావా? ఇంకా తగ్గిద్దావా?”
“పోసేద్దాం లే. ఎండేకా సూడొచ్చు సరిపోతయ్యో లేదో. సరిపోపోతే అప్పుడే సూడొచ్చు.. “ “వద్దులే పోసేద్దాం. సీకట్లో లెగుత్తుం ఎంతుక్కానీ సెప్తే…కొలిసేసి దాకలో పోసేసి..దాకా, నీళ్ళూ మంచంకాడెట్టుకుంటాను. మెలకువ రాగానే దాకలో నీళ్ళోసేత్తాను..ఇంక లెగవక్కాలేదు..’ అంది సరోజ్ని..
సర్లెమ్మని రెండు తవ్వల పప్పు కొల్సి సేట్లో పోసి..ఆ పక్కనే సీవెండి దాకలో నీళ్ళు కూడా పోసేసి పడుకునే ఏల లైట్లన్నీ ఆరిపేసాకా..సరోజ్ని మంచం కాడెట్టింది..
పెందలాడే లేసి రోజూ కంటే ముందే కాతంత ఉడకేసి అక్కడ పడేసి..పప్పుకడగటం మొదలెట్టింది పెద్దావె. ఆవిడ కూతురింటో ఉన్నన్నాల్లూ..తనే వండుద్ది పొయ్యి కాడ కూకుని..
వంటయ్యిందనుకున్నాకా పప్పురుబ్బటం మొదలెట్టిందేవో..
సరోజ్ని ఇల్లిపాయీ, పచ్చి మిర్గాయీ సన్నగా ముక్కలు కోత్తుంటే గిలక లేసొచ్చిందేవో..అల్లానికని దాన్ని కొట్టుకాడికంపి అదొచ్చేకా..ఆ ఈధిలో ఇరుగూపొరుగోల్లు సేసమ్మ, గౌరమ్మా, కిట్తవేణి, సొరాజ్జం అందరికీ సెప్పి రమ్మని పంపింది..
అయ్యన్నీ గేపకవొచ్చి..
“సెప్పలేదు..” అంది గిలక ఆల్లమ్మతో..
ఆ మాటతో తెల్లబోయింది..సరోజ్ని..
“సెప్పమని సెప్పేను గదా సిలక్కి సెప్పినట్టు. నీకేమ్ పొయ్యేకాలవొచ్చిందే పిలవాపోతాకి?
అంతుకే నన్ను పిల్లేదంట..మొన్నాల్లింటికి..సిచ్చేట్టెవ్ గందా..?” కసురుకుంది కూతుర్ని..
“అయినా పెద్దోల్లు సెప్పినట్టు సెయ్యాలిగందా..సొంత పెత్తానాలేంటో..? ”అక్కడే కగోడకానుకుని కూచ్చుని వత్తులు సేత్తన్న పెద్దావె అంది..
“కావాల్నే సెప్పలేదు..”
“అదే ఎంతుకంటన్నాను..నేను సెప్పమన్నప్పుడు సెప్తే నీ సొమ్మేం పోద్దో..”
“నాకా సేసమ్మామ్మ ఇట్టం లేదు..”
“నీ ఇట్టం ఎవడిక్కావాలి? నేన్సెప్పమన్నాను సెప్పాలి . అంతే..
“సెప్పను. ఆ సేసమ్మామ్మ..ఆల్లింట్లో తాతమ్మ ఉంటస్సూడు. ఆ తాతమ్మకి ఏవీ పెట్టదు. ఆ తాతమ్మ..కిటికీకాడ కూకుని …నువ్వు ఏదైనా పెడ్తే నేను బళ్ళోకి తింటా ఎల్తాను సూడు .. అప్పుడు నన్ను కిటికీ దగ్గరకి పిల్సి పెట్తమని అడుగుద్ది. సేసమ్మామ్మ..ఏవీ పెట్టదంట..”
“ఆసి ముండా..! అంతుకేనా ..?”
“అంతుకే మరి. ఇంకెంతుకనుకున్నా..? అయినా పెద్దోల్లైపోతే ఏం పెట్రా..”
గిలకమ్మనే సూత్తా ఉండిపోయారిద్దరూ..
ఏం సెప్పాలో తెలవక.

1 thought on “గిలకమ్మ కతలు – పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *