April 20, 2024

మనసుకు చికిత్స, మనిషికి గెలుపు

సమీక్ష: సి. ఉమాదేవి

ఆరోగ్యాన్ని మించిన వరంలేదు. అనారోగ్యం కబళించినపుడు మనిషిలో భయం, నిరాసక్తత, జీవించాలనే తలపు సన్నగిలడం పొడసూపుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్ సోకిందని తెలియగానే మనిషికన్నా ముందు మనసు వణుకుతుంది. వైరాగ్యంతో జీవితేచ్ఛను వారే బలవంతంగా తుంచివేయాలని చూస్తారు. మన సమాజంలో ఎవరినైనా క్యాన్సర్ కాటువేసిందని తెలియగానే ఎన్నాళ్లు బ్రతుకుతారో ఏమో అనే సందేహం ప్రశ్నగా బాధిస్తూనే ఉంటుంది. క్యాన్సర్ కు గురైన వ్యక్తికి మీరందివ్వాల్సింది ఓదార్పు కాదు. వాళ్లల్లో జీవనస్ఫూర్తి నింపి క్యాన్సర్ పై పోరాడే దిశగా ధైర్యాన్ని నింపాలి. క్యాన్సరును జయించి జీవిస్తున్నవారి గురించి వారికి తెలియచేయాలి. వారికందవలసిన వైద్యంలో ఏమాత్రం అలసత్వానికి చోటివ్వకూడదు. మందులను క్రమం తప్పకుండా అందించాలి. కీమోథెరపీ, రేడియోథెరపీకి వారిలోని భయాందోళనలను తగ్గించి వైద్యానికి సహకరించేటట్లు చేయడంలో కుటుంబసభ్యులకే కాదు డాక్టర్ల పాత్రకూడా ఎంతో ఉంది. ఒక డాక్టరుగా డా. సునీత మూలింటి వైద్యానికి మందులు, థెరపీలతో పాటు క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులకు మనోధైర్యాన్ని నింపి వారి సమస్యలకు కుటుంబంలోని వ్యక్తివలె వారి మనసులకు చికిత్స చేసి, వారిలోని భయాలను పారద్రోలి వారిని వైద్యానికి సుముఖులను చేస్తారు. క్యాన్సర్ సోకిన ఎందరో వ్యక్తులకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందించిన వ్యక్తి. కాంటినెంటల్ హాస్పిటల్ లో డాక్టరుగా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా విధులు నిర్వహిస్తూ ఎందరో క్యాన్సర్ కు గురైనవారిని ఆరోగ్యవంతులుగా నిలబెట్టడంలో వారి ఆత్మీయతాస్పర్శ అవగతమవుతుంది. డాక్టరుగా చికిత్స అందించడమే కాదు అనారోగ్యంతో బాధపడుతున్నవారిపట్ల ఆర్ద్రత, సహానుభూతితో వారి మనసులకు సాంత్వన కలిగిస్తారు.
క్యాన్సర్ కు గురైన ఎందరినో పరీక్షించి, వారి మనసును తొలిచే భయాందోళనలను పారద్రోలి వారి ఆరోగ్య విజయాన్ని, వారు వైద్యానికి స్పందించే తీరును గెలుపుకిరణాలపేరిట నిజ జీవిత గాథలను మన ముందుకు తెచ్చి ఎందరికో స్ఫూర్తి నింపిన ప్రతి అక్షరం వెనుక తన వృత్తిధర్మానికి అంకితమైన తీరు ఆచరణీయం, అభినందనీయం.
‘ క్యాన్సర్ ఓడింది, ప్రేమ గెలిచింది’ మనసుకు ఊరటనిచ్చిన నిజజీవిత కథనం. నిశ్చితార్థం జరిగిన తరువాత అమ్మాయిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడుతాయి. అబ్బాయి తల్లి పెండ్లిని రద్దు చేసుకోమని కొడుకును పోరుతుంది. కాని జీవితాంతం పెండ్లయినా మానేస్తాను అని తల్లికి తన అభిప్రాయాన్ని ధృడంగా చెప్పడమేకాక తన కాబోయే భార్యకు వెన్నంటి సహాయ సహకారాలందించి ఆమెను డాక్టరు సునీత పర్యవేక్షణలో ఆరోగ్యవంతురాలవడానికి తోడ్పాటు నందివ్వడం మానవత్వానికి పరాకాష్ఠ. సునీతగారు కేవలం ఒక డాక్టరుగానే కాక అబ్బాయి తల్లి మనసును మార్చి వారిరువురి పెళ్లికి మార్గం సుగమం చేస్తారు. మరో జీవిత కథా చిత్రణ ‘ఈ అమ్మ గెలిచింది. ’అమ్మప్రేమకు హద్దుల్లేవని, పిల్లలకోసం తానెలాగైనా బ్రతకాలని క్యాన్సర్ ను జయించిన ఓ అమ్మ కథనం మాతృప్రేమకు నిరూపణగా నిలిచింది. బతకాలన్న సంకల్పమే క్యాన్సరును తరిమికొట్టే మొదటి సూత్రం.
ఎమ్సెట్ పరీక్షలు దగ్గరపడిన తరుణంలో సోకిన క్యాన్సర్ జీవితానికే పరీక్షవడం ఆ విద్యార్థి చదువుకోవాలనే తపనను ఏమాత్రం సడలించలేకపోయింది. నొప్పి తెలియని మందులు తీసుకుంటే నిద్ర వస్తుందని చదివే అవకాశాన్ని హరిస్తుందని మథనపడటం వెనుక అతని దీక్షా సమరం వెల్లడవుతుంది. అంతిమ విజయం ఆ విద్యార్థిదే అవుతుంది. క్యాన్సరును జయించి జీవితంలో ఇంజనీరుగా స్థిరపడటం వెనుక ఉన్నది కూడా మనోబలమేనన్నది నిర్వివాదాంశం.
హమ్మయ్య! మీరు నవ్వినారంటే నేను బాగున్నట్టే అని డాక్టరుపైనున్న నమ్మకాన్ని వినిపించిన వ్యక్తి డాక్టరు చెప్పినట్లు విని తన క్యాన్సర్ జబ్బును జయించడం ‘నువ్వే కావాలి’ అని చెప్పిన వాస్తవ జీవనంలో పేషంట్ డాక్టరు మధ్యనున్న ఆప్యాయతను పారదర్శకం చేసింది. ఇదే కోవలో క్యాన్సరుకు గురైన వ్యక్తి జీవితంపై ఏమాత్రం ఆసక్తి కనబరచక బ్రతికి ఏమి చేయాలనే నిస్పృహనుండి తన చల్లని చిరునవ్వుతో, చక్కని మాటలతో మానసిక ధైర్యాన్ని నింపి వైద్యానికి సహకరించే విధంగా తోడ్పాటునందించడం డా. సునీతగారి లోని మానవతకు పరాకాష్ఠ.
‘ఈ పాపం ఎవరిది’ నిజంగా మనసును వ్యధాభరితం కావిస్తుంది. డాక్టరు ప్రాణాన్ని కాపాడాలనుకుంటారు. దీనికి క్యాన్సరుకు గురైన వ్యక్తి సంసిద్ధత అవసరం. అయితే కుటుంబసభ్యుల ఆత్మీయత, వారిచ్చే సహకారం జబ్బుపడ్డ వ్యక్తికి కొండంత బలాన్నందిస్తుంది. అయితే అదే లోపమై భర్తే సాడిస్టుగా మారితే ఆ ఇల్లాలి వేదనకు పరిష్కారమెవరివ్వగలరు?చివరకు మరణమే ఆమెకు విముక్తిగా మారిన వైనం తలచుకున్నపుడు డాక్టరుగారికే కాదు మన కళ్లు తడుస్తాయి. ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ అని భార్యకు వైద్యం చేయించి కాపాడిన భర్తే చివరకు అదే క్యాన్సరుతో మరణించడం అతడి భార్యను ఆవేదనకు గురిచేయడమే కాదు అటు డాక్టరునే కాక ఇటు పాఠకులను ఆవేదనకు గురిచేస్తుంది. ఏదియేమైనా మనిషి క్యాన్సర్ వ్యాధికి గురైనపుడు కావలసినది వైద్యులందించే ధైర్యము, కుటుంబసభ్యుల సహకారము, అన్నిటినీమించి తమ మనసుకు అందిన చికిత్సకు అనుకూల దృక్పథంతో ఒప్పుకుని శరీరాన్ని వైద్యానికి సిద్ధపరిస్తే క్యాన్సరును జయించవచ్చు. ఈ నేపథ్యమే గెలుపు కిరణాలు రూపొంద డానికి కారణమై, క్యాన్సరుకు గురైన మనిషిని గెలుపు దిశగా నడిపిస్తాయని ఆశిద్దాం. డా. సునీత మూలింటిగారికి మనసా నమామి.

1 thought on “మనసుకు చికిత్స, మనిషికి గెలుపు

  1. సునీత గారికి అభినందనలు, ఈ రోజుల్లో విస్తరిస్తున్న మహమ్మరిని జయించేందుకు ఎందరో సునీత లు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *