April 20, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 38

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఎవరికి ఎవరు దిక్కు? వచ్చేటప్పుడు భూమిపైకి ఒంటరిగా వస్తున్నాము. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తున్నాం. ఎవరికి ఎవరు? ఈ బంధాలన్నీ అశాశ్వతం. అక్కడా ఇక్కడా ఆ శ్రీనివాసుడే మనకు దిక్కుయై రక్షిస్తున్నాడన్న విషయం మరవకండి అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.

కీర్తన:
పల్లవి: ఎవ్వరు గల రెవ్వరికి
ఇవ్వల నవ్వల నితఁడే కాక ॥పల్లవి॥

చ.1. ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ
బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు
ఒద్దనెవ్వరుండిరొకరైనా
ఒద్దికైన బంధుఁడొకఁడేకాక ॥ఎవ్వ॥

చ.2 వరతఁ బోవునట్టి వడిసంసారపు
తెరలఁ దగిలి తాఁ దిరుగునాఁడు
వెరవకుమని భావించువారెవరు
తరితోడ నీతఁడె కాచుఁగాక ॥ఎవ్వ॥

చ.3 ఉడుకఁ బెట్టినట్టి వుడివోయిన నరకాల
నుడుకుచుఁ దానుండునాడు
తడవువారెవ్వరంతటఁ దన్ను
కడవేగ వేంకటపతిగాక ॥ఎవ్వ॥
(రాగం: దేశాక్షి, సం.4. సంకీ.580)

విశ్లేషణ:
పల్లవి: ఎవ్వరు గల రెవ్వరికి
ఇవ్వల నవ్వల నితఁడే కాక

ఎవరికైనా ఎవరున్నారు దిక్కు. ఏ లోకాలలో ఉన్నా ఇక్కడా – అక్కడా, ఇహ పరాలలో రక్షించే దిక్కు కేవలం శ్రీ వేంకటేశ్వరుడు మాత్రమే అంటూ ఇతడే మనకు దిక్కు అంటున్న్నాడు అన్నమయ్య.

చ.1 ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ
బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు
ఒద్దనెవ్వరుండిరొకరైనా
ఒద్దికైన బంధుఁడొకఁడేకాక
మొదట తల్లి గర్భంలో ఉన్నపుడు ముద్దగా ఒంటరిగానే ఉన్నాము. ఆ జీవి పెరిగి పెద్దదై, తల్లి ప్రసవించడానికి సిద్ధమైనపుడు ఎవరు దిక్కుగా నిలుస్తున్నారు? మావాడు అంటూ బందువర్గంలోని వారెవరైనా మనలను ఆ తల్లి గర్భంలోనుండి బయటకు దీయగలరా? పురుటినొప్పులపడే తల్లిని సంరక్షించి బిడ్డను క్షేమంగా బయటపడేసేదెవరు? అంతా ఆ శ్రీవేంకటేశ్వరుడే సుమా!

చ.2 వరతఁ బోవునట్టి వడిసంసారపు
తెరలఁ దగిలి తాఁ దిరుగునాఁడు
వెరవకుమని భావించువారెవరు
తరితోడ నీతఁడె కాచుఁగాక
పెద్ద పెద్ద అలలతో ప్రవహించే ఈ సంసారపు నదిలో పడి అలలవంటి కష్టనష్టాలకు తగిలి కొట్టుమిట్టాడుతున్నప్పుడు భయపడకు అని వెన్ను చరిచేదెవరు? మిమ్ములను ఆ అలలబారి పడకుండా ఒక నావ వలె రక్షించే దెవరు? ఆ పరంధాముడే కదా!

చ.3 ఉడుకఁ బెట్టినట్టి వుడివోయిన నరకాల
నుడుకుచుఁ దానుండునాడు
తడవువారెవ్వరంతటఁ దన్ను
కడవేగ వేంకటపతిగాక

మరణించాక నరక కూపాలలో మనలను మంటలపై ఉడకబెడుతున్నారు. ఆ మంటలలో ఉడికిపోతూ రక్షించమని ప్రార్ధించిననాడు మనలను రక్షించేది ఎవరు? మనలను తన చేతులలోకి తీసుకుని ఓదార్చేది ఎవరు? శ్రీవేంకటేశ్వరుడే కాక ఇంకెవరు? జనులారా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొనండి. ఆ శ్రీవారి పాదాల చెంత చేరి ప్రార్ధించండి? శరణు శరణు అని ప్రార్ధించండి చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు అని ప్రబోధనం చేస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు ఇవ్వల నవ్వల = ఇక్కడా – అక్కడా; ముద్ద సేసినటు = అమ్మ కడుపులోని పిండము; ఒద్దనెవ్వరు = దగ్గరగా ఉన్నదెవరు; ఒద్దికైన = మంచి మనసుగలిగిన వాడు; వరత = ఏరు, ఒక పెద్ద నీటి ఆవాసము; తెరలలో = మాయలలో; తిరుగునాడు = పడి కొట్టుకుంటున్న రోజులలో; వెరవుకుమని = భయపడవద్దు అంటూ; తరి తోడ = ఒక ఓడ, నావ, మబ్బు, పొగ వలె; ఉడుకబెట్టినట్టి = నరకంలో పాపులను మంటలతో రక్తంలో ఉడకబెట్టడం; తడవు వారు = నిన్ను చేతులలో తీసుకుని తడిమే వారు; కడ = చివరకు; వేగ = శ్రీఘ్రంగా.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *