April 23, 2024

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి

పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం.
పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి , వాళ్ళు తలంటి పోసుకోవడానికి తలకు నూనె పెట్టింది నీరజ వాళ్ళ చిన్నక్క కమల. సున్నం పసుపు నీళ్ళలో కలిపి ఆ ఎర్ర నీళ్ళతో వాళ్ళకు ద్రిష్టి తీసింది నీరజ ఆడపడుచు. తోడికోడళ్ళు, బావగార్లు, భర్త పిల్లలతో బాటు వచ్చిన ఆడబడుచులు ఇంటి నిండా బంధువులు కల కలలాడుతూ తిరుగుతున్నా నీరజ మనసులో మాత్రం వెలితి గానే వుంది. ఆందుకు కారణం అమ్మ లాటి అక్క పార్వతి రాక పోవడం.
ఒకవేళ నిజంగానే ఆమె రాక పోతే అత్తవారింటి వారి ముందు చులకన కాకూడదని పార్వతి తరఫున చదివించడానికి మంచి ఖరీదైన పట్టు చీర , జరీ పంచల చాపు తెప్పించి పెట్టింది నీరజ.
బరువుగా నిట్టూర్చింది నీరజ. అమ్మ మనసులో రేగుతున్న అలజడి అర్థం చేసుకున్న పెళ్ళికూతురు రమ్య అమ్మ చేయి సున్నితంగా నొక్కింది . ‘దిగులు పడకు వస్తుందిలే అన్నట్టు. . ‘
ఆడవాళ్లు అలంకరణ ముగించేసరికి పురోహితుడు రానే వచ్చాడు. ఆయన వెనకాలే మేళగాళ్ళు వచ్చేసారు. ” శ్రీ గణపతిని సేవింపరారే “అంటూ సౌరాస్ట్ర రాగంలో కీర్తనతో పది నిముషాలలో మంగళ వాద్యాలు మొదలయ్యాయి. సన్నాయి, మృదంగం డొలు వంటి వాద్యగోష్టి హోరులో పెళ్ళి ఇంట్లో ఒకరి మాటలు మరొకరికి వినబడడం లేదు.
” కార్యక్రమం మొదలు పెట్టాలి . పెళ్ళికుమార్తె, తల్లి, తండ్రి వచ్చి పీటలమీద కుర్చోండమ్మ “అంటూ హడావిడి చేస్తున్నాడు పురోహితుడు.
“వస్తున్నాము” అన్నట్టు సైగ చేసి ఆశ వదులుకోలేక వీధి గుమ్మంలోకి వచ్చింది నీరజ. అక్క వచ్చే జాడ కనబడుతుందేమో అని చూస్తూ. నిరాశగా వెనక్కి వస్తూ ఎదో తోచినట్టు ఫోనులో పార్వతి నంబరు నొక్కింది. “రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార ” అంటూ అసావేరి రాగంలో వాయిస్తున్న భజంత్రీల ముందు వుంచింది ఫోను.
ఈ సందడి విని అయినా అక్క మనసు కరగకపోతుందా ఆన్న ఆలోచనతో నీరజ కళ్ళు చెమరించాయి.
అటువైపు ఫోనులో ఆ మంగళ నాదాలు వినగానే పార్వతి గుండె నీరయిపోయింది. ముప్ఫై ఏళ్ళ క్రిందట తన చేతులతో స్వయంగా పెళ్ళికూతురుగా అలంకరించిన నీరజ ముద్దు మొగం మనసులో మెదిలింది. ఫోను పక్కన పేట్టి అలా కూర్చుండిపోయింది. ఆడపిల్లలు లేని పార్వతి తోడబుట్టిన చెళ్లెళ్ళను కడుపున పుట్టిన కూతుళ్ళలా చూసుకుంది. ఆమ్మ పోయాక తనే వాళ్ళకు అమ్మ అయ్యింది. ఏ సమస్య వచ్చినా తండ్రికంటే ముందు ఆమెకే చెప్పుకునేవారు కమల, నీరజ .
ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం అయినట్టు పార్వతి తల మీద చేయి వేసి నిమిరాడు ఆమె భర్త సారధి.
“వాళ్ళంటే ప్రాణం పెడ్తావు. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు?” లాలనగా అన్నాడు సారథి.
“వాళ్ళు నన్ను అవమానిస్తే నేను పట్టించుకుని వుండేదాన్ని కాదండీ ! మా వాళ్ళకు ఎంత చేసారు మీరు? అదంతా మరచిపోయి ఎంతమాట అన్నారు మిమ్మల్ని? ”
తండ్రి దక్ష ప్రజాపతి ఆయన తలపెట్టిన యాగానికి తనను పిలవక పోయినా సహించిన శచీదేవి శంకరుడిని తండ్రి అవమానిస్తే తట్టుకోలేక పోయినట్టు సారథిని వాళ్ళు ఆన్న మాట పార్వతి గుండెకు చేసిన గాయం ఇంకా మానలేదు.
గణపతి పూజ అయ్యాక ముత్తైదువలతో పందిరి పూజ చేయించాడు పురోహితుడు.
కొబ్బరి ఆకులు చుట్టిన పందిరి గుంజలకు పూలు చుట్టి, పసుపు కుంకుమలు పెట్టి అన్ని శుభంగా జరగాలని మొక్కుకుంటున్న నీరజ కళ్ళు ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు మాటికి ప్రహరీ గుమ్మం వైపు చూస్తున్నాయి.
తన పిచ్చి గానీ పెద్దక్క పార్వతి పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఈ పెళ్ళికి వస్తుందనే? నిరాశ తొంగి చూసింది నీరజ మనసులో.
మూడేళ్ళ్ల క్రిందట పెద్ద కూతురు పెళ్ళిలో అంతటా ఆమే అయి తిరుగుతూ, పెళ్ళి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది పార్వతి.
“అక్కా ! ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తానో ఏమో. ఆసలే నాకు ఆ పద్ధతులు, శాస్త్రాలు అంతగా తెలియవు. ” అని నీరజ దిగులు పడినప్పుడు వెంటనే ధైర్యం చెప్పింది పార్వతి “పక్కన నేను వుంటాను కదే అన్నీ నేను చూసుకుంటాను . నీకెందుకు చింత? ” అంటూ చెల్లెలికి భరోసా ఇచ్చింది .
ఇచ్చిన మాట ప్రకారం నీరజ పెద్ద కూతురు రాధిక పెళ్ళికి వారం ముందే వచ్చిన పార్వతి అన్ని బాధ్యతలు మీద వేసుకుని జరిపించింది.
నిజానికి పార్వతి వాళ్ళ అమ్మ పోయాక ఇద్దరు చెళ్ళెళ్ళు, తమ్ముడు బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని కమల , నీరజ , రఘుల చదువులు , పెళ్ళిళ్ళు అన్నిటిలోనూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడింది పార్వతి. ఇవన్నీ పార్వతి చేయగలిగింది అంటే అది ఆమె భర్త సారధి సహకారం వలననే. ఆ తరువాత కూడా కమల, నీరజలకు పురుళ్ళు పుణ్యాలు అన్నిటికీ పార్వతి ముందు వుంది. తండ్రిని చివరి రోజులలో సారధి సహకారంతో తన దగ్గరే పెట్టుకుని ఆలనా పాలనా చూసుకుంది పార్వతి.
బుగ్గన చుక్క , నుదుట కల్యాణ తిలకం, పూలజడతో మెరిసిపోతూ పెళ్ళికూతురు రమ్య వచ్చి పీటల మీద కూర్చుంది. కలశ పూజ, ఇంటి దేవుడి పూజ అయ్యాక పీటల మీద కూర్చున్న వారికి బట్టలు చదివించే కార్యక్రమం మొదలు అయ్యింది. ముందు నీరజ తమ్ముడు రఘు పుట్టింటి వారి తరఫున అక్క బావలకు, రమ్యకు కొత్త బట్టలు చదివించాడు. నీరజ కనుసన్నతో చిన్నక్క కమల లోపలికి వెళ్ళి నీరజ కొనివుంచిన చీర , పంచలు తీసుకు వచ్చి పురోహితుడికి అందించింది.
“పెళ్ళికుమార్తె పెద్దమ్మ పార్వతి, పెద్దనాన్న సారధి ఆశీర్వదించించి చదివిస్తున్న పట్టు వస్త్రాలు అంటూ ఆ పళ్ళెం నీరజ, రమ్య ల చేతికి అందించాడు. శ్రీనివాస్ భార్య వైపు మెచ్చుకుంటున్నట్టు చూసాడు. మిగతా దగ్గరి వాళ్ళ చదివింపులు అయ్యాక వధువును, ఆమె తలితండ్రులను కొత్త వస్త్రాలను ధరించి రమ్మన్నాడు పంతులు గారు
“అదేమిటి అన్ని శుభకార్యాలకు ముందు వుండే మీ పెద్దక్క పార్వతి ఇంకా రాలేదు? నీరజ భయపడుతున్నట్టుగానే ప్రశ్నించింది పెద్ద తోడికోడలు.”
“కొంచం నలతగా వున్నదట . ఎదురుకోళ్ళ సమయానికి వచ్చేస్తుంది.” గొంతులో జీర కనబడకుండా జాగ్రత్త పడుతూ సమాధానం చెప్పింది నీరజ.
మధ్యాన్నం భోజనాలకు ముందు ఆ రోజు వండిన తీపి పదార్థం పూర్ణం పోళీలలో ఒకటి పందిరి మీద వేయించాడు పంతులు గారు . పదహారు రోజుల పండుగ తరువాత పందిరి తీసే రోజున అలాగే చేయమని సూచించాడు.
పైకి అందరితో నవ్వుతూ కబుర్లు చెబుతూ హడావిడిగా తిరిగేస్తున్నా నీరజ మనసు ఆలోచిస్తూనే వుంది. పెద్ద కూతురు రాధిక పెళ్ళిలో జరిగిన సంగతులు మెదులుతున్నాయి.
ముహూర్తం ముందురోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
*****
శుభ ముహూర్తం తెల్లవారు ఝామునే వుండడం వలన ముందురోజు సాయంత్రం ఎదురుకోలు సంబరం ముగిసాక రాత్రి ఎనిమిది గంటలనుండి రిసెప్షన్ ఏర్పాటు చేసారు. రిసెప్షన్ కు అనుకున్న దానికన్న ఎక్కువ మంది రావడం జరిగింది. తీరా మగ పెళ్ళివాళ్ళు భోజనాలకి వచ్చేసరికి కూరలు తక్కువ పడ్డాయి. మారు వడ్డించలేదని పెళ్ళివారు అనడంతో నీరజ బావగారు , పార్వతి భర్త అయిన సారధి కేటరింగ్ చేసిన వంటవాళ్ళ మీద కోపం చూపించాడు. దానితో వంట వాళ్ళు సహాయ నిరాకరణ మొదలు పెట్టి కూర్చుండి పోయారు
రసాభాసం కాకూడదని ఆడపెళ్ళి వాళ్ళు వియ్యంకులకు సర్ది చెపుతూ తామే వడ్దనకు దిగారు.
పార్వతి, ఆమె భర్త సారధి వంటవాళ్ళను శాంతింప చేసారు. . ఇంతలోనే బంధువులలో ఒకరు మాట తూలారు ” ఎంతయినా ఆడ పెళ్ళివారు కదా ఆ సారధి కాస్త అణిగి వుండక అంత దురుసుగా నోరు పారేసుకోవడం దేనికి? కొంచం వుంటే గొడవైపోయి పెళ్ళి అభాసు పాలయ్యేది. ” అని.
“మా బావగారికి కొంచం కోపం ఎక్కువ. కాస్త శాంతంగ వుండాల్సింది ” అంది నీరజ. ఆ మాట పార్వతి చెవినబడింది.
“మా ఆయన నడ్డి విరిగేట్టు చాకిరీ చేసింది ఎవరికీ కనబడలేదుగానీ వంటవాళ్ళను కోప్పడినందుకు ఆయన గారిని ఆడి పోసుకుంటున్నారు. ఆసలు ఈ పెళ్ళికి వచ్చి తప్పు చేసాము. ఇంకోసారి నీ గుమ్మం తొక్కితే ఒట్టే” అనేసి రాత్రికి అభొజనంగా వుండిపోయింది.
మరుచటి రోజు పెళ్ళి సలక్షణంగా జరిగింది. భోజనాలు అయ్యాక సంప్రదాయం ప్రకారం అమ్మాయిని అప్పగింతలు పెట్టడం , రాత్రికి శోభనం అన్నీ నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి.
నీరజతో మాట్లాడకండానే ఏ విషయంలోనూ లోటు రాకండా చూసుకుంది పార్వతి.
వాళ్ళు బయలుదేరేటప్పుడు సారధికి , పార్వతికి బట్టలు పెట్టి కాళ్ళకు నమస్కరించారు నీరజ, శ్రీనివాస్ . ” తెలియక మీ మనసు కష్టపెట్టి వుంటే క్షమించండి” అంది నీరజ. మౌనంగా వెళ్ళి బండి ఎక్కింది పార్వతి.
ఆంతే ఈ మూడేళ్ళుగా ఒక్క సారి కూడా ఫోనులొ పలుకలేదు పార్వతి.
రమ్య పెళ్ళి అనుకోకుండా పదిహేను రోజుల్లో పెట్టుకోవలసి వచ్చింది. పత్రిక పంపించి ఫోనులో ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ . వినడం తప్ప అటునుండి మౌనమే సమాధానం.
నీరజ భయపడినట్టే రమ్యను పెళ్ళికూతుర్ని చేసే రోజుకు కూడా రాలేదు పార్వతి.
” అమ్మా ! నేను , మీ అల్లుడు శ్రీశైలం వెళ్ళి వస్తాము” అని ప్రయాణమయ్యింది నీరజ పెద్దకూతురు రాధిక. ఎల్లుండి పెళ్ళి వారొస్తున్నారు. ఇప్పుడెందుకే? అన్న అమ్మ మాటకు “ఒక్క రోజులో రామూ?” అనేసి వెళ్ళింది.
అన్నట్టుగానే మరుసటి రోజు వచ్చేసింది రాధిక . వెళ్ళిన ఇద్దరు మరో నలుగురిని తీసుకు వచ్చారు.
పార్వతి, సారథి, వాళ్ళ కొడుకు కోడలు కూడా రావడం చూసి నీరజకు ఆనందంతో నోట మాట రాలేదు.
“అక్కా! నువ్వూ వచ్చేసావు ఇది చాలు అక్కా నాకు. “అంటూ అక్కని కౌగలించుకుంది నీరజ.
“రాకుండా ఎలా వుంటానే పిచ్చిదానా? ఏదో మాట మాటా అనుకున్నంత మాత్రాన ఆత్మీయ బంధాలు తెగిపోతాయా? నువ్వలా చూస్తు వుండు అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకీ నా చిన్న కూతురు అదే పెళ్ళికూతురు ఏదీ? ఆంటూ లోపలికి నడిచింది పార్వతి.
తల్లికి శ్రీశైలం వెళ్తున్నట్టు చెప్పి విజయవాడలో పెద్దమ్మ పార్వతి ఇంటికి వెళ్ళింది రాధిక. హటాత్తుగా వచ్చిన రాధికను చూసి ఆశ్చర్య పోయింది పార్వతి.
“పెద్దమ్మా , పెద్ద నాన్నా మీరిద్దరూ దగ్గర వుండి నా పెళ్ళి జరిపించారు. మొత్తం బాధ్యత మీరిద్దరే మోసారు అని అమ్మ నాన్నా ఈ రోజుకూ తలచుకుంటారు. మీరు రాకపోతే అమ్మకు రమ్య పెళ్ళి ఆన్న సంతోషమే లేదు. మా అమ్మగానీ నాన్నగానీ మీ మనసు కష్టపెట్టి వుంటే చిన్నవాళ్ళు అని క్షమించేయండి. మీరు నాతో రాకపోతే మేమిద్దరం కూడా వెళ్ళము. ఇక్కడే వుండిపోతాము” చిన్న పిల్లలాగా పార్వతిని రెండుచేతులతో చుట్టేసి అన్నది. రాధిక. కరిగిపోయింది పార్వతి.
ఆప్యాయంగా సారథి భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు శ్రీనివాస్ .
ఆత్మీయ బంధాలు అల్లుకున్న పెళ్ళి వారిల్లు మరింత శోభను సంతరించుకుని కళ కళ లాడింది .

శుభం

1 thought on “ఆత్మీయ బంధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *