April 19, 2024

కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ

రచన: రవీంద్ర కంభంపాటి

ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల పెద్దమ్మాయిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు.

లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసక మసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం ఉండబట్టేలా లేదు.

ఆ రోజెందుకో ఏదైనా కూర తినాలనిపించిందావిడకి. వీధి చివరనున్న నారాయణ కొట్లోకి వెళ్లి ఏమైనా తెచ్చుకుందామనుకుంటే ఆ వాన నీళ్లలో నడిచే ఓపిక లేదు. ఆ ఇంటిముందున్న నేరేడు చెట్టు, మునగ చెట్టు వర్షానికి అటూ ఇటూ ఊగుతున్నాయి.

అలా చూస్తూన్నావిడ కాస్తా ఒక్కసారిగా విస్తుబోయింది. ఆ మునగచెట్టుకి వేలాడుతూ ఓ ములక్కాడ కనిపించింది! అదేమిటి ఆ మునగచెట్టుకి ఆ ములక్కాడ ఎప్పుడు కాసింది అనుకుందావిడ, కళ్ళు నులుముకుని చూసింది..సందేహం లేదు..లేతగా ఉన్న ములక్కాడే ! మెల్లగా వెళ్లి కోసుకొచ్చేస్తే ఏ పప్పులోనో ఉడకేసుకోవచ్చనిపించిందావిడకి.

ఇంక ఆలస్యం చేస్తే ఆ ఒక్క ములక్కాడ కూడా రాలిపోయేలా ఉంది, అసలే ఆ గాలికి అటూ ఇటూ ఊగుతూంది, ఇంక తప్పదని కూడదీసుకుని లేచిందావిడ.

మెల్లగా అడుగులో అడుగేసుకుంటా ఆ వర్షం నీళ్లలో నడుస్తా ఆ మునగ చెట్టు దగ్గరికెళ్లి ఆ ములక్కాడ మీద చెయ్యేద్దామనుకుంటూంటే ‘భలే వారే మామ్మగారూ..ఆగండాగండి’ అని అరుపు వినిపించి గుమ్మం వేపు చూసేసరికి, అక్కడ్నుంచి పెద్ద పెద్ద అడుగులేసుకుంటా వచ్చి ఆ పెద్దమ్మాయిగారిని అదాట్న పక్కకి లాగేసేడా అబ్బాయి.

బిత్తరపోయి చూస్తున్న పెద్దమ్మాయిగారికి జరాజరా పాక్కుంటా వెళ్ళిపోతున్న పసిరిక పాముని చూపించి అన్నాడు, ‘ములక్కాడ అనుకున్నారా మామ్మగారూ, పసిరిక పాముని చూసి?’

నోటమాట రాక అలా చూస్తూండిపోయిన ఆవిడని జాగ్రత్తగా చెయ్యట్టుకుని ఇంట్లోకి నడిపిస్తా అన్నాడు,’ నాపేరు ఫణికృష్ణండి..ఇక్కడే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా రెండ్రోజుల క్రితమే చేరేనండి..ఇటుపక్క ఇళ్ళు ఏమైనా అద్దెకి దొరుకుతాయేమో చూద్దామని ఇలా వర్షం లోనే బయల్దేరేనండి.. ప్రస్తుతం మన శ్రీ చిత్రా లాడ్జీలో ఉంటున్నానండి ‘

‘నిన్ను చూస్తుంటే నా మనవణ్ణి చూసినట్టే ఉంది బాబు ‘ అందావిడ మెల్లగా

‘నేనూ మీ మనవణ్ణే అనేసుకోండి మామ్మగారూ..ఇంతకీ ఆళ్లందరూ ఏరీ ‘ అని ఫణి కృష్ణ అడిగితే ‘ఆళ్ళందరూ అమెరికాలో ఉంటారు.. మా ఆయనగారితో కలిసి ఎప్పుడో యాభయ్యేళ్ళ క్రితం కట్టినిల్లు కదా.. వదలబుద్ది కాదు ఈ ప్రాణానికి ‘ అంది పెద్దమ్మాయి గారు

జాగ్రత్తగా ఆవిణ్ణి ఇంట్లోకి నడిపించుకొచ్చి వరండా గట్టు మీద ఎత్తి కూర్చోబెట్టి, ‘చొరవ తీసేసుకుంటున్నానని ఏమీ ఆనుకోకండేం..’అని గబగబ ఇంట్లోకి పరిగెత్తి లోపలి గదుల్లోనుంచి ఓ నేత తువ్వాలట్టుకొచ్చి ఆవిడ తల తుడిచేసేడు.

‘ఈ వయసులో వర్షం లో తడిస్తే న్యుమోనియా గారంటీగా వచ్చ్చేస్తుందండి.. లోపల్నుంచి ఈ పొడి చీర కూడా తెచ్చేను..గబుక్కున కట్టుకునొచ్చేయండి ‘ అని ఆవిడకి ఓ పొడి చీర ఇచ్చి లోపలికంపేడు

ఆవిడ చీర మార్చుకుని బయటికొచ్చేక అడిగాడు ‘ఉదయం నుంచీ ఏమైనా తిన్నారా మామ్మగారూ ?’, లేదన్నట్టు తలూపిందావిడ, ‘చెప్పారు కారేం.. ఇలా కూర్చోండి మీరు ‘అని చొరవగా ఇంట్లోకి వెళ్లి చూసొచ్చి ‘ఇంట్లో వంట సామాన్లేవీ ఉన్నట్టు లేవు..ఇక్కడే కాస్సేపు కూర్చోండి ‘ అని వర్షంలోనే పేరంటాలమ్మ గుడి దగ్గరున్న అబ్బులు గారి కిరాణా కొట్లోనుంచి కొంచెం పాలు, బియ్యం, పెసరపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కొనుక్కునొచ్చి, ‘మీకు ముందుగా వేడి కాఫీ కలిపిచ్చేస్తానండి’ అని వేడి వేడి కాఫీ కలిపి ఇచ్చేడు.

ఆవిడ అలా వర్షంకేసి చూస్తూ కాఫీ తాగుతూంటే, లోపలికెళ్ళి వంట చేసేసి, ఆవిడకి వేడివేడిగా అన్నం పెట్టేసేడు ‘మీ వయసుకి కందిపప్పు కన్నా పెసరపప్పు తినడం మంచిదండి..జీర్ణం తొందరగా అవుతుంది ‘ అంటూ అన్నం వడ్డిస్తూన్న ఆ ఫణికృష్ణ చేతులట్టుకుని ఏడ్చేసింది పెద్దమ్మాయిగారు, ‘నువ్వు నాతోపాటు ఇక్కడ ఉంటావా బాబు..నీకు తోచిన అద్దియ్యి చాలు ‘ అని ఆవిడనేసరికి అలా నవ్వుతూ చూస్తూండిపోయేడు ఫణికృష్ణ.

అక్కపల్లి నర్సింహం గారి పిల్లలందరూ పెద్ద చదువులూ అవీ చదివేసుకుని అమెరికాలో ఉండిపోతే, ఆయన భార్య పెద్దమ్మాయిగారు మట్టుకు ఇలా ఆ ఊళ్లో ఒక్కరూ మిగిలిపోయేరు. ఆళ్ళ దగ్గిరికెళ్లే ఓపిక ఈవిడికి లేకపోతే, ఈవిణ్ణి పట్టించుకునే తీరిక ఆళ్ళకి లేదు.

పిల్లల్ని చదివించడానికి ఉన్న పొలాలన్నీ పెద్దమ్మాయిగారు అమ్మేయగా ఈ ఇల్లొక్కటీ మిగిలింది. ఆ పిల్లలు క్రితం సారొచ్చినప్పుడు తల్లికో సెల్ ఫోను కొనిచ్చేరు, ఆవిడతో అప్పుడప్పుడూ మాట్లాడ్డానికి.

ఆ తర్వాత ఆ పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేసినప్పుడు, ఆవిడ ఇంట్లో ఇలా ఫణికృష్ణకి ఓ రెండు గదులు అద్దెకిచ్చేనని చెబితే ఆళ్ళు చాలా సంతోషించి ‘అమ్మయ్య.. ఇంట్లో పోలీసాడు ఉంటే నిన్ను చూసుకోవడమే కాదు.. ఇల్లు కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు ‘ అన్నారు

ఫణికృష్ణకిచ్చిన గదుల్లో పాత సామాన్లు గట్రా ఉంటే, వాటిని అటక మీద పెట్టేసుకోమంది పెద్దమ్మాయిగారు. ఆ పాతసామాన్లు పైకెక్కిస్తూ ఫణి అన్నాడు ‘ఏంటండీ..అస్సలీ ఇంటికీ, మీకూ బొత్తిగా సంరక్షణ లేనట్టుంది.. అటకంతా ఒకటే ఎలకలు.. తెగ పరిగెడుతున్నాయి..రేపు ఎలుకల మందట్టుకొచ్చి ఈటి పని పడతానండి. ఇంక మీ సంగతంటారా, నాకు వంట బాగా వచ్చునండి. రోజూ ఇద్దరికీ వండేసిల్లిపోతుంటానండి. మీకే ఇబ్బందీ ఉండదింక’ అని ఫణి చెబితే పెద్దమ్మాయి గారు సంతోషంగా వింటూండిపోయారు.

చెప్పిన మాట ప్రకారం, ఫణి ఆ పెద్దమ్మాయిగారినే కాకుండా ఇంటిని కూడా బాగా చూసుకునే వాడు. ఆవిడకి వండిపెట్టడంతో పాటు, వీలైనప్పుడు తన పోలీసు జీపట్టుకొచ్చి ఆవిణ్ణి గొల్లల మామిడాడ, సామర్లకోట, ద్రాక్షారామం, అయినవిల్లి గట్రా గుళ్లన్నీ తిప్పేసరికి ఆవిడ మురిసిపోయి ‘నా కొడుకులే నన్నెప్పుడూ ఈ ఊళ్ళయీ తిప్పలేదు, నేనేం తిన్నానో పట్టించుకోలేదు.. అలాటిది నువ్విన్ని చేస్తున్నావంటే..నువ్వు నా కొడుకులకంటే ఎక్కువ ‘ అంటూ పొంగిపోయిందావిడ.

ఆ దీపావళెళ్ళిన మర్నాడు రాత్రి పది దాటుతూండగా, పెద్దమ్మాయిగారింటికి కాస్త దూరంగా హెడ్లైట్లు ఆపేసున్న పోలీస్ జీపాగింది. ఇంటి ముందు చీకట్లో నేరేడు చెట్టు కింద నుంచుని సిగరెట్టు కాల్చుకుంటున్న ఫణి గబుక్కున సిగరెట్టు పక్కన పడేసి, గబగబా జీపుకేసి నడిచి, ‘రండి దొరగారు.. ముసిలావిడ నిద్దరోయింది ‘ అంటే మెల్లగా జీపు దిగిన ఎస్సై బుచ్చిబాబు ‘ఒరే.. ఇవ్వాళ ఆ రెండో గది కూడా కావాల్రా, ఓ ఎన్జీసీ ఆఫీసరుగారినట్టుకొచ్చేను..ఆరు మన శకుంతల రుచి చూస్తానన్నారు ‘ అన్నాడు.

‘తప్పకుండానండి.. నేను వసారాలో పడుక్కుంటానండి.. మరి ఇయ్యాల శకుంతలని ఆరుంచుకుంటే.. మరి మీకండి?’

‘నేను వేరే తెచ్చుకున్నాలేవో..తినడానికేటన్నా అరంజిమెంటు చేసేవా ‘ అని బుచ్చిబాబు అడిగితే ‘గదిలో రమ్ము సీసా రెడీగా ఉందండి.. చికెన్ ఒండిపెట్టేనండి..రెండు గదుల్లో అరేంజిమెంటు చేసేస్తానండి.. ‘ అని ఫణి చెప్పేడు

‘బాబూ ఏ అవసరం ఉన్నా నా సెల్ఫోనుకి మిస్సెడ్ కాలివ్వండి.. వెంటనే వచ్చేస్తాన్నేను.. కొంచెం గట్టిగా నవ్వులూ అయీ వినపడకుండా చూసుకోండి బాబు ‘ అని ఫణి ఆ ఓఎన్జీసీ ఆఫీసరు పట్నాయక్ తో చెబితే ఆయన ఫణి కేసి చూసి ‘ఠీక్ హై ‘ అని ఆ శకుంతలనట్టుకుని ఆబగా తనకిచ్చిన గదిలోకి దూరిపోయేడు.

ఒంటిగంటకి బుచ్చిబాబు మిస్డ్ కాలిచ్చి ఫణిని పిలిచి చెప్పాడు ‘నేను ఇంకాసేపు తెలివేసే ఉంటాను..నువ్వెళ్ళి ఎన్ని ఓఎన్జీసీ లారీలు వెళ్ళాయో చూడు.. రేపు ఆదినారాయణ తో మాటాడతాను ‘

తెల్లవారుఝామున మూడున్నర అవుతూండగా ఫణి వచ్చి బుచ్చిబాబుకి చెప్పేడు ‘ఐదువేల లీటర్ల లారీలు తొమ్మిదండి..ఆదినారాయణాళ్ళు ఒకో దాంట్లోంచి పదిహేను పర్సెంటు క్రూడాయిలు తీసేసేరండి.. ఇదిగో మీకిమ్మన్నారండి.. ‘అని ఐదొందల కట్ట చేతిలో పెడితే, బుచ్చిబాబు ఆ కట్ట తీసుకుని తలుపేసుకున్నాడు. కాసేపటికి ఆ గదిలోనున్న ఆడమనిషి మూలుగులు వినిపించాయి.

మర్నాడు ఎర్రగా ఉన్న ఫణి కళ్ళు చూసి పెద్దమ్మాయిగారు ఏమైందని అడిగితే, ‘. మీకు ఒంట్లో బాలేనట్టు కలొచ్చి అస్సలు నిద్దరట్టలేదండి ‘ అన్నాడు.

ఓఎన్జీసీ వాళ్ళతో కలిసి ఆళ్ళ టేంకర్లలోంచి ఆయిల్ కొట్టేసే గేంగుతో చేతులు కలిపి తెగ సంపాదించేస్తూ, ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ల సరదాలు తీర్చడానికి పెద్దమ్మాయి గారిల్లు వాడేస్తున్నాడు ఫణి.

వారంలో రెండు మూడు రాత్రులు ఎస్సై బుచ్చిబాబు రావడం, తనతో పాటు ఎవడో ఒకడు ఓఎన్జీసీ ఆఫీసరూ, ఆళ్ళతో ఉండే పెద్దాపురం, రాజానగరం నుంచి తెచ్చుకున్న ఆడంగులకి మర్యాదలు చెయ్యడం ఇదే పనైపోయింది!.

ఫణి ఆ ఇల్లు తీసుకున్నప్పుడే ఆ ఇంటిని ఎస్సై బుచ్చిబాబుగారికి ఎరగా వేసి ఎగస్ట్రా డబ్బులు సంపాదించొచ్చు అనుకున్నాడు గానీ, మరీ ఇంత అమ్మాయిల్ని సప్లై చేసే ఎదవ బతుకై పోతుందనుకోలేదు.

పైగా ఒచ్చినప్పుడల్లా ఆ బుచ్చిబాబు రెండువేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ఇంక లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాడు ఫణి.

కాకినాడెళ్ళి అక్కడ మెయిన్ రోడ్డులో ఉన్న చొప్పారపు గన్నిబాబు గారి మొబైల్ షాపులో సీసీ కెమెరా కిట్టు కొన్నాడు. దాన్నెలా ఆపరేట్ చెయ్యాలో తెల్సుకుని, ఓఎన్జీసీ ఆఫీసరు గారొకాయన వస్తే, అటక మీద ఆ కెమెరా పెట్టి ఆయన చేసిన పనులన్నీ షూటింగు చేసేసేడు. బాగానే రికార్డయ్యింది గానీ మొహాలు స్పష్టంగా తెలీడం లేదు. అదే విషయం ఆ మొబైల్ షాపులో కుర్రాడితో చెబితే ‘ఇదేమన్నా సినిమా కెమెరా అనుకుంటున్నారేటండీ.. అంతగా క్లారిటీ కావాలంటే.. ఏదైనా లేటెస్టు సెల్ ఫోనుతో షూటింగు చేసెయ్యండి ‘అన్నాడు.

ఆ రోజు ఎస్సై బుచ్చిబాబు చెప్పాడు ఫణికృష్ణ తో ‘ఒరే..నీకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ ఒచ్చింది.. ఆపుదామని ప్రయత్నించేను.. కుదర్లేదు మరి.. ఆ ఇల్లు మటుకు నా అవసరానిక్కావాలి…. ఏదోలా నువ్వే చూడు..నీ రెండు వేలు నీకిస్తాలే ‘ అని నవ్వేడు

తన ట్రాన్స్ఫర్ విషయం విని బిక్కచచ్చిపోయిన ఫణి ఏమ్మాట్లాడలేదు. ‘సరేగానీ..ఇయ్యాల రాత్రి శకుంతలని తీసుకునొస్తున్నాను.. మందూ అయి కొంచెం ఆరెంజీ చెయ్యి ‘ అని బుచ్చిబాబు చెప్పాడు.

‘అలాగేనండి.. ఊరినుంచి మా మావయ్యాళ్ల ఫ్యామిలీ ఒచ్చేరండి..ఆళ్ళకి అనుమానం రాకుండా మా ఇంటి ఓనరు గారి దగ్గిర పడుక్కుంటామండి .. నేను అన్నీ అక్కడ పెట్టేసి తలుపు దగ్గిరగా వేసెళ్లిపోతానండి.. మీకే అవసరం వచ్చినా ఒక్క మిస్డ్ కాలివ్వండి ‘ అన్నాడు ఫణి

రాత్రి పదకొండవుతూండగా శకుంతలనట్టుకుని బుచ్చిబాబు పెద్దమ్మాయిగారింటికొచ్చేడు. ఫణి చెప్పినట్లే తన గది తలుపు దగ్గరగా వేసుంది. లోపలికెళ్ళి లైటేసి చూస్తే మంచం నీటుగా సర్ది, పక్కనే ఒక హాఫ్ బాటిలు ఓల్డ్ మాంక్ రమ్ము, గ్లాసులు, కోడి బిరియాని, గుడ్డు పొరటు అన్నీ సర్దిపెట్టి ఉన్నాయి.

ఇద్దరూ మందుకొట్టేసి మంచం మీద దొర్లుతూంటే శకుంతల అడిగింది, ‘అటక మీద ఏదో కదిలినట్లు లేదూ ‘..’ఆ అటక నిండా ఎలకలంట.. ఆ ఫణిగాడు చెప్పేడోసారి’ అని శకుంతలని మీదకి లాక్కున్నాడు బుచ్చిబాబు

అటక మీద పడుక్కుని జాగ్రత్తగా కొత్తగా కొనుక్కొచ్చిన సెల్ల్ఫోన్ తో ఇదంతా వీడియో తీస్తున్న ఫణి ‘అమ్మయ్య బతికిపోయేను ‘ అనుకున్నాడు. కాలి మీద ఏదో పాకుతూంటే ఎదవ ఎలక అనుకుని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు.

రోజూ ఉదయాన్నే వచ్చి చేతికి కాఫీ అందించే ఫణి కనపడకపోవడంతో పెద్దమ్మాయిగారు కాస్త కలవరపడ్డారు. ఒంట్లో బాగోలేదోమోనని అతని గదిలోకెళ్ళి చూస్తే తలుపులు తీసున్నాయి, కానీ మనిషి లేడు.

ఆ గదంతా ఒకటే మందు కంపు. బిత్తరపోయిన ఆవిడ ఇల్లంతా వెతికేరు ఫణికోసం. ఎక్కడా కనపడకపోయేసరికి అలాగే ఆ వీధి వసారాలో కూలబడిపోయి రోజంతా ఎదురు చూసారు. తన బాగోగులన్నీ దగ్గరుండి చూసుకునే మనిషి కనపడకపోయేసరికి ఆవిడకి ఏమీ తినబుద్ది కాలేదు. ఆ రాత్రి అదే దిగులుతో ఆ వీధి వసారా మీదే పడుక్కున్నావిడ, మళ్ళీ మర్నాడు లేవలేదు.

రెండ్రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎవరో ఫోన్ చేసి చెప్పేరు, ‘ఊళ్ళో పెద్దమ్మాయిగారు ఆళ్ళ అరుగు మీదే పోయేరు..ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒకటే కంపంట..ఆ చుట్టుపక్కలంతా ‘

అసలే రెండ్రోజుల నుంచీ ఫణి కనపడకపోవడంతో కొంచెం టెన్షన్ గా ఉన్న ఎస్సై బుచ్చిబాబు ఈ విషయం తెలిసి, ఇదెక్కడి గొడవరా అనుకుని వెళ్తే, ఆ ఇంటి దగ్గిర అంతా కంపు కంపు.. ఆ పెద్దమ్మాయిగారి సెల్ ఫోన్ ద్వారా అమెరికాలో ఉన్న ఆవిడ కొడుకులకి కబురంపేరు.
ఆవిడ శవానికి పంచనామా చేయిస్తే సహజ మరణమే అని తేలింది. అమెరికా నుంచొచ్చిన ఆ పెద్దమ్మాయిగారి పిల్లలు ఆవిడకి దహనకాండ జరిపించేసి, శవం కంపు కొడుతున్న ఆ ఇంటికి తలుపులేసుకుని అమెరికా వెళ్ళిపోయేరు.
ఆ అటక మీద పాము కాటేసిన ఫణి కృష్ణ శవం అలాగే పడుంది, చేతిలో సెల్ ఫోన్ తో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *