April 19, 2024

కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు

రచన: శారదాప్రసాద్

కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన నేదునూరి కృష్ణమూర్తి తెలుగువాడు కావడం తెలుగు ప్రజల అదృష్టం. నేదునూరి కృష్ణమూర్తి గారు అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు గారి శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్నారు. ఆల్‌ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. హిందీ, సంస్కృతం నేర్చుకున్నారు. సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకు తల్లి ప్రభావం ఉంది అని అంటారు. అష్టపదులు, తరంగాలు, రామాయణ కృతులు పాడారు.
చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగారు. విద్వాన్‌ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాలరావు గారి వద్ద నేర్చుకున్నారు. ఓ సారి వేణుగోపాలరావు గారి ఇంటికి విజయనగరం తహసిల్దారు విచ్చేసినప్పుడు నేదునూరి గారి పాట విని ప్రసన్నులైయ్యారు. అప్పల నరసింహం గారి పుణ్యమా అని విజయనగరం మహరాజా కాలేజీలో చేరడం జరిగింది. ఉండేందుకు ఉచిత బస ఏర్పరచారు, భోజన వసతి కల్పించారు. అప్పటినుంచి నేదునూరి జీవితంలో వెనుదిరిగి చూడలేదు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. “నానాటి బ్రతుకు నాటకము” కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం. ఎస్. సుబ్బులక్ష్మి “నేదునూరి గారూ, ఆ ఒక్క పాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి” అని మెచ్చుకున్నది. అప్పుడు నేదునూరి గారు “నేను స్వరపరచిన అన్నమాచార్య కృతులని మీరు పాడారు కాబట్టే అవి అంత ఆదరణ పొందాయి” అని ప్రత్యుత్తరం ఇచ్చారట. 1991లో సంగీత కళానిధి పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బులక్ష్మి గారు ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది. 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు. సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయ రామన్‌, ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్‌), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడారు. నేదునూరి విజయవాడ జీవీఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్ విభాగం డీన్‌ , బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ (ఆడిషన్‌) బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి ఉపకార వేతనం తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామినాయుడు, నేదునూరి ప్రతిభకు ముగ్దులై గాత్ర సంగీతం (ఓకల్‌ మ్యూసిక్‌) లోనే ఉండకూడదూ ? మంచి గళం ఉంది అన్నారు. నాయుడుగారి బంధువు, ప్రముఖ వయొలనిస్ట్‌ ద్వారం నరసింగరావు కూడా ఈ మాటనే సమర్ధించారు. ఐతే నేదునూరికి వయొలిన్‌ మీద మక్కువ ఉంది. వారు నిష్ణాతులు కనక ఓ ఉపాయం చేసారు. క్లాసులో నేదునూరి చేత పాడించి ఆయనే (వయొలిన్‌) వాయించారు. గాత్ర సంగీతం మీద ద్యాస ఉంచేట్టు ప్రోత్సహించారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణితం, బహుళం అయ్యింది. ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. సమయానికి మంచిగా స్పందించాడు యువ గాత్ర సంగీతకారుడు. ఆ యువ గాత్ర సంగీతకారుడే నేదునూరి కృష్ణమూర్తి గారు. నేదునూరివారు బహు సౌమ్యులు. శ్రీపాద పినాకపాణి గారు ఈయన గురువు, ఆప్త మిత్రుడు, సోదరప్రేమ, వాత్సల్యం కలిగిన వాడూను. నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో – దాశరధి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కాసెట్లు వెలువడించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.నేదునూరి ప్రముఖ శిష్యులలో కళాప్రపూర్ణ చిట్టి అబ్బాయి, శ్రీమతి కోక సత్యవతి, శ్రీమతి కె. సరస్వతి వుధ్యార్తి, జి. బాలకృష్ణ ప్రసాద్‌, శ్రీమతి శోభారాజు, మల్లాది సోదరులు (శివరామ ప్రసాద్‌, రవి కుమార్‌) ఉన్నారు. పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు.
నేదునూరి గారు. టీ టీ డీ – ఆస్థాన విద్వాన్‌గా నియమితులైయ్యారు. అన్నమాచార్య కృతులని కూర్చి సంగీత లోకానికి అందించారు. మద్రాసు సంగీత అకాడమి నుండి సంగీత కళానిధి గౌరవం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు. శ్రీ నేదునూరి గారు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కనడా, సింగపూర్ ఇత్యాది దేశాలు పర్యటించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంలో తన ప్రతిభ కనపరుస్తూ అన్నమాచార్య సంకీర్తనలు కూర్చి సంగీత ప్రియులకు అందించారు. విశేష ఖ్యాతిని ఆర్జించారు. సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు. నేదునూరి కృష్ణమూర్తి గారిని ఒక సందర్భంలో ఒకాయన ఇలా అడిగారట ” మీరు తంజావూరు నుంచా? “అని. అదీ ఆయన ప్రతిభ.
ఆయన తెలుగుతనం మూర్తీభవించిన వ్యక్తి. ఆయన కట్టూ భొట్టే కాదు, సంగీత పాండిత్యం తెలుగు సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తుంటాయి . “కర్ణాటక సంగీతం ఆంధ్రకి వలస పోయిందా ? ” అని ఒక విమర్శకుడు అడిగాడు. తెలుగులోనూ, తమిళంలోనూ అద్భుతంగా పాడగలరు. “నేడు చాలా మంది సంగీత కళాకారులకి పాండిత్యం ఉన్నా రాగాల అనుభూతి లేదు. ఆదర్శాలు, సరైన దిశ, కళ పట్ల నిబధ్ధత లోపిస్తున్నాయి “అని ఒక సందర్భంలో తన అభిమతాన్ని వ్యక్తం చేసారు ఆయన. ఓ సభలో కాపి రాగంలో ఆయన ఆలపించినపుడు లాల్గుడి జయరామన్ గారు “నేను వాయించడానికి ఇక మీరు ఏమి మిగిల్చారు ?” అని సరదాగా అన్నారు. నేదునూరి కృష్ణమూర్తిగారి నైపుణ్యానికి ఇదొక నిదర్శన మాత్రమే. “కొత్త పాటలు రాసే సామర్ధ్యం నాకు ఇప్పుడు లేదు. అసలు, కర్ణాటక సంగీత త్రిమూర్తులు(త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి) పాటలు క్షుణ్ణంగా పాడితే చాలదూ?” అని నమ్రతతో అన్నారు. ” నేను జనం ముందు పాడుతాను కాని, జనం కోసం పాడను” అని వ్యాఖ్యానించారు.
కర్ణాటక సంగీత మూర్తిత్రయం తెలుగులోనే తమ కృతులు రచించినప్పటికీ, తెలుగువాళ్ళు ఎక్కువగా సంగీతం నేర్చుకోకపోవటానికి కారణం ఏమిటి?అన్న ప్రశ్నకు ఆయన సమాధానం,”తెలుగుదేశంలో ఈ కళకి ఆదరణ లేకపోవటమే!”అని అన్నారు. “గురువులేక ఎట్టి గుణికి తెలియకబోదు” అంటారు త్యాగయ్య గారు. “ఏ విద్యకైనా గురువు అవసరం. సంగీత విద్యలో శాస్త్రమూ, కళ కలిసివుంటయి. ఇదొక మహావిద్య. గురువు ఉండి తీరాలి”అని అంటారు ఆయన. తన గురువు గారైన శ్రీపాద పినాకపాణి గారిని గురించి, “మా గురువుగారు సంగీత కళానిధి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన “సద్గురువు”. ఆయన మహా మేధావి, సంగీతవిజ్ఞానసర్వస్వం. నేనున్న ప్రస్తుతస్థితికి వారి సహృదయత, సద్బోధన, ఆశీస్సులే కారణం. ఇలా ఎంత చెప్పినా చాలదు. వారిలాంటి గురువు దొరకటం మహద్భాగ్యం. ” అని ఆయన అన్న మాటలు ఆయన సంస్కారాన్ని గురుభక్తిని తెలియచేస్తున్నాయి.
శాస్త్రీయ సంగీతానికి ఆంధ్రదేశంలో భవిష్యత్తును గురించి ఆయన ఇలా అన్నారు,”మన ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతానికి భవిష్యత్తు మీద నాకు అంత నమ్మకం లేదండి. ఎందుకంటే, ఆంధ్ర దేశంలో కచ్చేరీలు పెట్టి, పోషించి, ఆదరించే వాళ్ళు చాలా చాలా తక్కువ.
కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన ఈయన, చనిపోయేముందు ఐదు వారాల కిందటే తన స్వస్థలమైన పిఠాపురం వచ్చారు. నేదునూరి గురించి తెలియజెప్పడానికి ‘నేదునూరి మెమోరియల్‌ డిజిటల్‌ ఆర్కైవ్స్‌ లైబ్రరీ ఆఫ్‌ కర్ణాటక మ్యూజిక్‌’ను ఏర్పాటు చేస్తామన్నారు ఆయన అభిమానులు . చెన్నైకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పప్పు వేణుగోపాలరావుగారు ఐదు వేల గంటల నిడివి గల డిజిటల్‌ కర్ణాటక సంగీత గీతికలను ఈ స్మారక లైబ్రరీకి అందించడానికి అంగీకరించారు. ఈ మహా విద్వాంసుడు అనారోగ్యంతో బాధపడుతూ తన 87వ ఏట,08-12-2014 న విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు.

ఆ మహా గాయకుడికి నా స్మృత్యంజలి!

9 thoughts on “కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు

  1. మహానుభావులలో ఒకరైన నేదునూరి గురించి తెలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, శారదా ప్రసాద్ గారికి జయహో
    నాగయ్య

  2. ఎన్నదగిన చరిత కల్గిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారు ఈ గడ్డ మీద పురుడుపోసుకున్న ఆణిముత్యాలు జాతిరత్నాలలో ఒకరు. అద్భుతమైన సంగీత సంపత్తి శ్రీ నేదునూరివారికి సాక్షాత్ వాణీ వరప్రసాదం. ఇటువంటి మహానుభావుల చరిత్రలు చదివినప్పుడల్లా .. ” వీరు పుట్టిన నేలనే పుట్టడం ఎంత అదృష్టం నాది!” అనే ఒకేఒక భావం ఒళ్ళంతా తడిమి అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది గదా!

    మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదాలు.

    కాంతారావు

  3. Suparb.Today we came to know
    about Sri Nedunuri.
    Thank you very much for wonderful history giving.
    P.LakshmiNarayana

Leave a Reply to ధనశ్రీ Cancel reply

Your email address will not be published. Required fields are marked *