April 24, 2024

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

(స్త్రీల పాటలు~ఊర్మిళాదేవి నిద్ర)
——————————
ఆదికావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి పాత్రకూ ఓ విశిష్టత ఉంది. సీతారాముల కల్యాణంతో బాటే లక్ష్మణ భరత శతృఘ్నుల వివాహాలు ఊర్మిళా, శ్రుతకీర్తీ, మాండవిలతో జరిగాయి. అందరూ కొత్త దంపతులే. రావణసంహారం రామావతార లక్ష్యం గనుక కైకేయి వరాలడుగటం, రాముని పదునాలుగేళ్ల వనవాసం, రామునితో పాటు సీత కూడా వనాలకు వెళ్లడం, రామునితో పాటు లక్ష్మణుడు కూడా అనుసరించడం-ఇవన్నీ కార్యకారణ సంబంధాలు. కష్టమో నష్టమో రామునితో సీత ఉన్నది. బాధతోనో, బాధ్యతతోనో భరత శతృఘ్నులు తమ భార్యలతో అయోధ్యలో ఉన్నారు. ఎటొచ్చీ అటు భర్తతో పోలేక, ఇటు భర్త లేకుండా ఒంటరిగా ఉండలేక నిద్రలోకి వెళ్లిపోయింది ఊర్మిళ. ఒక రకంగా ఇప్పటి కాలంలో మనం అనుకునే కోమా కావచ్చు.
ఏదైతేనేం మన జానపదులకు ఆ అంశం బాగా నచ్చింది.
అందుకే ఊర్మిళా దేవి నిద్రను కథాంశంగా చక్కని పాట అల్లుకున్నారు. మన తెలుగు ఆడపడుచులది జాలి గుండె కదా!ఆ మధుర గీతం తొలి భాగం కొంత గతనెలలో చదువుకున్నాం. మలిభాగంలో సీతమ్మ సూచన మేరకు రామన్న అనుమతి గైకొని లక్ష్మన్న సభనుండి ఊర్మిళాదేవి మందిరానికి బయలు దేరాడు. ఇక చూడండి.

. . . . . . . . . . . . . . . . . . చనుదెంచె తన గృహముకు
వచ్చె లక్ష్మణుడు చలువా సత్రంపు ।వాకిళ్లు దాటి వచ్చీ
కేళీగృహము జొచ్చియూ లక్ష్మన్న। కీరవాణిని జూచెనూ
కోమలా పాన్పు పైనీ వత్తిగిలి ।కోకసవరించి వేగా
తొడుగుల ధరించి వేగా।చల్లనీ తళ్లు పూరించె మేనా
ప్రాణనాయకి పాన్పునా కూర్చుండి।భాషించె విరహమ్మునా
కొమ్మ నీ ముద్దు మొగమూ సేవింప ।కోరినాడే చంద్రుడు
తాంబూలమెడమాయెనూ ఓపెనే।నగుమోవిచిగురుకొనకా
అమృతధారలు కురియగా పలుకవే ।ఆత్మ చల్లన సేయవే
చిటితామరలు బోలెడీ పాదముల।కీలించవే స్వర్ణమూ
తన్ను తా మరచియున్నా ఆ కొమ్మ ।తమకమున వణక దొడగే
అయ్యమీరెవ్వరయ్యా మీరింత। యాగడమ్ములకొస్తిరీ
సందుగొందులు వెతుకుతూ మీరింత ।తప్పు సేయగ వస్తిరీ
ఎవ్వరును లేని వేళ మీరిపుడు ।ఏకాంతములకొస్తిరా
మా తండ్రి జనక రాజు వింటె మిము। ఆజ్ఞసేయక మానరూ
మాయక్క బావ విన్న మీకిపుడు ।ప్రాణాల హానివచ్చు
మా అక్క మరది విన్నా మిమ్మిపుడు।బ్రతుకనివ్వరు జగతిలో
హెచ్చయిన వంశానికి అపకీర్తి ।వచ్చె నేనేమి సేతు
కీర్తిగల ఇంటబుట్టీ అపకీర్తి ।వచ్చె నేనేమి సేతు
ఒకడాలిగోరి కాదా ఇంద్రునికి।ఒడలెల్ల హీనమాయె
పరసతినిగోరి కాదా రావణుడు।మూలముతొ హతమాయెనూ
ఇట్టి ద్రోహములు మీరూ యెరిగుండి।యింత ద్రోహముకొస్తురా
ఆడతోడా బుట్టరామావంటి ।తల్లి లేదా మీకునూ
అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు।విని వగచి ఇట్లనియెను

(తరువాతి భాగం వచ్చే నెలలో)

1 thought on “తేనెలొలుకు తెలుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *