April 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”

రచన: విజయలక్ష్మీ పండిట్

 

అది చలికాలం.ఉదయం ఆరు గంటలకు  మదనపల్లెలో రైలు దిగి  నాగరాజు తెచ్చిన వ్యాన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేప్పటికి ఏడుగంటలు కావస్తోంది. సూట్కేస్ ఇంట్లో పెట్టి నాగరాజు వెళ్ళాడు.

వెళ్ళేప్పటికి అమ్మ ,నాన్న సుజాత మేలుకొని ఉన్నారు. సుజాత వంటపనే కాకుండా అమ్మ నాన్నకు  సహాయం చేస్తుంది వాళ్ళ అవసరాలలో.

నేను గడపలో అడుగు పెట్టగానే ఇంట్లోనుంచి కాఫీ వాసన నా ముక్కుపుటాలలో దూరి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది.

మా అమ్మ చేతి కాఫికి ప్రత్యేకమయిన రుచి.

వర్మ కాఫీవర్క్స్ కొట్టులో అప్పటికపిపుడు వేయించిన కాఫి గింజలు చికోరి కలిపి మిషన్ లో పొడి చేసి ఇస్తారు. ఆ కాఫీపొడి తెప్పించుకుని వాసన పోకుండా గట్టిమూతుండే ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటుంది మా అమ్మ.

ప్రొద్దున్నే లేవగానే మరిగే వేడి నీళ్ళు డికాషిన్ ఫిల్టర్ లోని కాఫీపొడిలో పోసి మూతపెడుతుంది. అమ్మ పండ్లు తోముకుని మొహం కడుక్కుని తల దువ్వుకుని, బొట్టు సరిచేసుకుని వంటింటిలోకి వచ్చేటప్పటికి పాలామె శకుంతల పాలు తెస్తుంది.

అమ్మ వాళ్ళు జర్సీ ఆవులను పెట్టుకోవడం మానేసిన తరువాత ఆమె వాళ్ళ ఇంటిలో ఆవులతో పాలు పిండి మాకు ఆవుపాలు తెస్తుంది ఉదయం ఆరు గంటలలోపు.

తాజాగా తెచ్చిన పాలు పొంగినాక తేరిన డికాక్షన్ లో పోసి, కాఫి చేసి రెండు గ్లాసులలో పోసుకుని హాల్లోకి వస్తుంది. మా అమ్మ తెచ్చే కాఫీగ్లాస్ కోసం కాచుకున్న మా నాన్నకిచ్చి, తాను ఇద్దరు కూర్చుని కాఫీ ఆస్వాదిస్తు తాగుతారు. బహుశ రోజు ఆ సమయంలో ఆ కాఫీ వాసనను పసిగట్టి ఆ సమయానికి సూర్యుడు మా వరండాలోకి వచ్చి తన కిరణాలతో ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్నట్టు ఉంటాడు

***

రాత్రి ట్రైన్లో మెలకువతో నిద్ర లేనందున రాగానే అమ్మను నాన్నను పలకరించి , బాగున్నావా సుజాతా అని పలకరిస్తూ బాత్ రూమ్ లో కెళ్ళాను. పనులు ముగించుకుని త్వరగా బయటపడ్డాను అమ్మ చేతి కాఫీ కోసం.

చలికాలంలో ఆ కాఫి వెచ్చదనం ,రుచిని అన్నీ  మరచి నింపాదిగా బయటి ప్రకృతితో కలిసి కూర్చొని ఆ కాఫీతాగే క్షణాలను తాగుతూ ఆస్వాదించడం దినంలో ఒక మంచి సమయం.

ఢైనింగ్ టేబుల్ దగ్గర నేను అమ్మ కూర్చొని మాట్లాడుతుంటే సుజాత కాఫీ గ్లాసు నా కందించింది. కాఫీ గ్లాసు తీసుకుని ఒకసారి సిప్ చేసి కాఫీ గొంతులో మెల్లగా దిగుతుంటే కాఫి గ్లాసు టేబుల్ మీద పెట్టాను. నాకు

ఎదురుగా ఉన్న డైనింగ్ హాలు గోడ మీదకు పాకాయి నా చూపులు.

నాకు ఎదురుగా మా అమ్మమ్మ ఫోటో. ఆ ఫోటోకు కుడివైపున మా మేనమామ ఫోటో. వెనుతిరిగి చూశాను అటువైపు గోడపై మా నాన్నమ్మ ఫోటో. ముగ్గరివి బస్ట్ సైజు పెద్ద ఫోటోలు. ముగ్గురు ఈ ప్రపంచాన్ని వీడారు. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నా వయసు దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల మధ్య, మా నాన్నమ్మ చనిపోయనపుడు నేను నా మొదటి పాపకు గర్భంతో వున్నాను. మా మేనమామ మా పెండ్లి అయిన రెండు సంవత్సరాల తరువాత చనిపోయారు హర్ట్ అటాక్ తో.

అప్పుడప్పుడు ఆ ఫోటోలు మన్మల్ని మా నాన్నమ్మ, అమ్మమ్మలతో, సెలవుల్లోమా మేనమామ ఇంట్లో గడిపిన రోజులు గుర్తు చేస్తుంటాయి.

ఆ ఫోటోలో ఉన్న మా అమ్మమ్మ మా అమ్మ. వాళ్ళను అయిదు మందిని పెంచిన అమ్మ.

మా అమ్మకు ముగ్గురు అక్కలు ఒక అన్న. మా అమ్మ చిన్నపుడే సొంతమమ్మ  చనిపోయింది.

మా ముత్తాతలు ముగ్గురు. ఆ కాలంలో వారిది  చిన్న సంస్థానం. విజయ నగర రాజుల కాలంనుండి శిస్తు వసూలు , ఇతర ప్రజా పనులు , రైతుల బాగోగులు చూడడం. ఆ ముగ్గురుకి మా అమ్మమ్మ ఒక్కతే కూతురు ఆ సంస్థానానికి వారసురాలు.

మా అమ్మమ్మకు పెండ్లి అయిన ఆరు నెలలకే భర్త చనిపోవడంతో వారసులు లేక ఆ సంస్థానానికి మా మేనమామ దత్త పుత్రుడిగా ఆ సంస్థానానికి వారసుడయ్యాడు.

తెల్లగా, ఎంతో ఆప్యాయత నిండిన పలుచని మొహముతో, లేత పసుపుకు ఆకుపచ్చ అంచు కంచిపట్టు చీరతో, మెడలో పగడాల దండతో , కొంగు కుడిబుజము మీదకు కప్పు కుని ఉన్న ఆ ఫోటో చూస్తూ అమ్మ నడిగాను“ అమ్మా ఆ ఫోటోలో బొజ్జమ్మవ్వకు ఆ ఫోటో తీసినపుడు ఎంత వయసు “అని.

అమ్మ రెండు నిమిషాలాగి బహుశ డెబ్బయి ఇయిదు సంవత్సరాలు ఉంటుందేమో ..,

ఆ కాలంలో మీ అమ్మమ్మ పుట్టిన తేదీ, జాతకం రాసినారు కాని భద్రంగా దాచిపెట్టడం ఎక్కడుంది..,అవన్ని చేతులు మారి మాసిపోయి ఎటుపోయాయో.” అని ఆగి మరలా…,

“మీ అమ్మమ్మ ఆ సంస్థానంలో మా ముగ్గురు తాతలకు ఒకటే ముద్దుల కూతురు. ఆమె పుట్టినపుడు ప్రసూతి గదినుండి బయటికి నిమ్మకాయ విసిరినారట. జ్యోతిష్యులు ఆ నిమ్మకాయ బయట పడగానే ఆమె పుట్టిన ఘడియలను లెక్కగట్టి ఆమె జాతకం రాశారంట”. అని ఆగి  “జాతకం లో రాసినట్టు పెండ్లి అయిన ఆరు నెలలకు భర్త చనిపోయారు..”అన్నది అమ్మ.

తన పుట్టింటి సంస్థానం విషయాలు కథలు కథలుగా చెప్పేది మా అమ్మ మాకు సందర్భాలను బట్టి .

అమ్మ లేచి “నేను స్నానం చేసి వస్తాను పాప విజయా” అని వెళ్ళింది.

మా పిల్లలకు పాపలు పుట్టినా, మా అమ్మకు మాత్రం ఎప్పటికి మేము పాపలం బాబులం.

నేను అమ్మ పద్దతిలో నా కూతుర్ల పేరు ముందు పాప పెడుతుంటాను అప్పుడప్పుడు.

మావారు “మన పాపలకు పాపలిప్పుడు నీవేమో ఇంకా పాప అంటున్నావు”అని ఆట పట్టిస్తారు.

“అది అంతేలేండి మన అమ్మలు ముని మనవళ్ళు, మనవరాళ్ళు పుట్టినా మనలను పాప, నాయనా, బాబు అని పిలుస్తారు. మనమున్నంతకాలము మన పిల్లలు మనకు పిల్లలే మన కుటుంబ వ్యవస్థలో” అని సమర్థించుకుంటాను.

మా అమ్మమ్మ, మా మేనమామ ఫోటోలు చూస్తూన్న నన్ను నా ఎదురుగా వున్న ఆ జ్ఞాపకాలగోడ టైమ్ మెషిన్ లాగ అమాంతం నన్నునా బాల్యం జ్ఞాపకాల తోటలోకి తీసుకెళ్లి దించిందని గ్రహించలేదు.

***

అది మా అమ్మమ్మ ఊరు కలిచెర్లలో నేను పుట్టిన ఇల్లు. నా చైతన్యం ఆ ఇంటిలో నన్ను ఇదు సంవత్సరాల పిల్లను చేసి నడిపిస్తూ ఉంది. మా అక్క నేను మా బాల్యంలో తిరుగాడి ఆడి పాడి గడిపిన లోగిలి. నేను సాక్షినై చూస్తున్నాను.

ఇంటి ముందు వత్తుగ అల్లుకున్న నిత్యమల్లి పందిరి. రెండివైపుల ఎరుపు, తెలుపు ముద్దగన్నేరు చెట్లు , కనకాంబరం, మాసుపత్రి, మరువము, నేలమీద అల్లుకున్న ఆ ఆకుల సువాసనలు. పందిరి క్రింద రాలిన ఆకులు పూలపై నడుచుకుంటూ వరండా దాటి నాలుగు ఏనుగుతలల స్థంబాలతో నిలిపిన హాలులోకి వెళ్ళాను. హాలులో ఈశాన్యం మూల తెల్లని పెద్ద కృష్ణుని విగ్రహం నడుము మీద చేతులు పెట్టుకుని నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్టు. మా అమ్మకు ఇష్టమయిన శ్రీకృష్ణ విగ్రహం. పక్కన రెండు పెద్ద గదులు, వెనకల , వంటిల్లు, దినుసుల నిల్వ గది,ఆ గదిలో వ్రేలాడుతు మూడు పెద్ద ఉట్టెలు వెన్న నెయ్యి పాత్రలను పెట్టడానికి.

ప్రక్కన భోజనాల హాలు. భోజనాల హాలులో మా తాతలు కూర్చొని భోచేసే పెద్ద పీటలు మూలల్లో వెండి నగిషీతో .భోజనాల గది దిగగానే వెనకల పది అడుగుల దూరంలో మూడు అడుగుల ఎత్తు ఉన్న తులసి కోట. నాలుగు వైపుల దీపపు గూళ్ళతో .ఇంటి ముఖద్వారం నుండి కనిపిస్తుంది.

వెనకల చేదబావి, కుడి వైపు పెద్ద స్నానాల గది.అందులో దాదాపు ఆరడుగుల పొడవు ,మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు వున్న నీళ్ళతొట్టి. లోపలికి తెరిచిన పెద్ద వేడి నీళ్ళు కాచుకొనే అండా. బయట నుండి కట్టెలు ,పొట్టు,తుంగలు పెట్టి నీళ్ళు కాచే పొయ్యి.

ఆటునుండి నేను పక్కన ఒక అర్థ ఎకరా అంత పశువులను కట్టే కొటం , గడ్డి, కట్టెలు, తుంగలు ఉన్న స్థలం లోకి నడిచాను.

ఆ ప్రహరీ గోడ ప్రక్కన మునగ, కరివేపాకు , టెంకాయ చెట్లు. అక్కడ మూల వున్న పేడ దిబ్బ ప్రక్కన అమ్మ నాటించిన రామ బాణం చెట్లు గుబురుగా తీగలు సాగి మునగ చెట్టెక్కి బాగా విస్తరించాయి. చిన్న కాడతో తెల్లని బాణం లాగా పొడుచుకొచ్చిన పెద్ద రామబాణం మెుగ్గలు. మా అమ్మమ్మ ఆదేశం ప్రకారం ఆ మొగ్గలను సాయంత్రం నాలుగయిదు గంటలకు మా యింట్లో ఉండే రామన్న గోడమీద కెక్కి కోయాలి అవి విడిగి పోకముందే. అవి కోసేప్పుడు చిన్ని చిన్ని పూల మేదరి బుట్టలు పట్టుకుని నేను మా అక్క క్రింద నిలుచుండే వాళ్ళం. ఆ కోసిన మొగ్గలను మా బుట్టలోకి వేసేవాడు రామన్న. కొంచెం నిండగానే హాలులోకి వెళ్ళి అమ్మమ్మ ముందు చాపమీద పోసేవాళ్ళం. దాదాపు ఒక కేజి మొగ్గలు కాసేవి.

అమ్మమ్మ రెండు రెండు మొగ్గలను చాపమీద పేర్చేది. సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు పని అమ్మాయిలు , అప్పుడప్పుడు మా అమ్మ మొగ్గలు కట్టడం మొదలు పెట్టి రెండు గంటలపాటు ముగించేవారు.

కట్టిన మొగ్గలను వెడల్పు వెదురు బుట్టలో తడిగుడ్డ పరచి అందులో కట్టిన మాలలను పెట్టి తడి గుడ్డ కప్పి పెట్టేది అమ్మమ్మ.

సాయంత్రం ఏడు గంటల సమయానికి విచ్చుకుని రామబాణం పూల పరిమళం ఇల్లంతా చుట్టి వేసేది. సాయంత్రం మా అక్కకు , నాకు రెండు జడలు వేసి అడ్డంగా రెండు జడలను కలుపుతు ఒకొక్క మూర మాకు పూలు పెట్టేది మా అమ్మమ్మ.

దేవుని పటాలకు, అమ్మకు తీసిపెట్టి, వంటమనిషి రెడ్డేమ్మకు, పనిపాప వసంతకు, మిగిలిన పూలను ఆ వీధిలో వారికి రోజుకు నాలుగయిదు ఇండ్లకు ఇచ్చి పంపేది. మరచిపోలేని రామబాణం పువ్వులు.

ఒడిలో పోసుకుంటూ ఆడుకున్న జ్ఞాపకాలు ముసురుకున్నాయి ఆ పరిమళంతో పాటు.

అటు నుండి ఇంటిని ఆనుకుని ఉన్న మిద్దె మెట్లు ఎక్కాను. మిద్దెపైకి ఎక్కాక నా చూపులు ఎడమవైపుకు మళ్ళాయి.

దాదాపు నాలుగు వందల గజాలదూరంలో ఆ వీధికి కుడి మలుపులో మా మేనమామ ఇల్లు. అది దాదాపు మూడుఎకరాల స్థలం. నాలుగు వైపుల దాదాపు నలభై యాభై అడుగుల ఎత్తు గల రాతి ప్రహరీ కోటగోడలు. గోడలపై కొనలోఇనప బాణాలు. అటువైపు వీధిలోనుండి ఇంటిలోకి పెద్ద ఇనుప గేటు. చిన్న సంస్థానంలోని హంగులతో పెద్ద వరండ.

ఆ వరండాలో పులిచర్మంతో ఈజీ చెయిర్ లాంటి పెద్ద  కుర్చీ. మా మేనమామ నరసింహారెడ్డి కూర్చుంటారు ఆ కుర్చీలో.ప్రక్కన కొన్ని కుర్చీలు .

మా మామ మంచి వేటగాడు. రెండు పులులను వేటాడి చంపినారు. ఒక పులిని బాకరాపేట అడవిలో పులి తారసపడితే వేటాడి చంపి కారు డిక్కులో వేసుకుని వచ్చారు.అపుడు వా స్నేహితురాళ్ళతో బడినుంచి ఇంటికి వస్తూ మా మేనమామ కారులో వెనకల తెరచిన డిక్కీ లో పులిని చూసి మేము భయపడిపోయిన సీను నా కనులముందు మెదిలింది. నేను మూడో ,నాలుగో తరగతి చదువుతున్నానప్పుడు మదనపల్లిలో. మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా చదువులకోసం మదనపల్లె లోమా నాన్న (B.A. Hons. L.L.B.) లాయర్ గా మదనపల్లెలో ప్రాక్టీసు పెట్టారు.

మా మేనమామ ఇంట్లో లోపల దాదాపు నాలుగు పెద్ద హాలులు , ఆరు రూములు, కొంచెం విడిగా పెద్ద వంటిల్లు , దానికి ఆనుకుని పెద్ద స్టోర్ రూము. వంటగది ప్రక్కన పెద్ద భోజనాల గది పది మందికి పెద్ద డైవింగ్ టేబుల్ .ముఖద్వారానికి ఎదురుగావెనుక ఆరడుగుల ఎత్తు తులసి కోట.ఆ తులసి బృందాలనానికి మూడు వైపుల చుట్టూ దీపాలు పెట్టడానకి దీపపు గూళ్ళ తో ఐదడుగుల ఎత్తు గోడలు. దీపావళి, కార్తీక పౌర్ణమి పండుగలు,రాములవారి , పోలేరమ్మ తిరునాళ్ళ రోజులలో వెలుగుతాయి అన్ని దీపాలు.

ఆ బృందావనానికి ప్రక్కన వర్తులాకారంలో పెద్ద దేవుని గది. ఆ కోటగోడలకు లోపల ఒక మూల దాదాపు నలబై అడుగుల ఎత్తు నాలుగు పెద్ద రూముల లాంటి గెరిసెలు ధాన్యాలు పోసి నిల్వకు. మిద్దె ఎక్కి ఆ గరిసెలలోకి వడ్లు పోసేవారు.

ఆ ఇంటికి ముందు యాబై అడుగుల దూరంలో దాదాపు వందమంది పట్టే పెద్ద చావుడి ఉంది. మా తాతలు రైతులతో, ఇతర ఆఫీసుల నుండి వచ్చే సిబ్బందితో ఆ చావిడిలో మాట్లాడేవారు. ఆ పెద్ద చావిడిపై నుండి తిరనాళ్ళప్పుడు తప్పెటలు , కీలుగుఱ్ఱాలు,నెమలి నాట్యము, మాకు చూపెట్టేవాళ్ళు. పీర్ల పండగప్పుడు

పైనుండి తీపి మిఠాయిలు చల్లేవాళ్ళము. మా మేనమామ ఒక పీరును చేయించారు.

మా అమ్మమ్మ ఉన్న ఇంటికి ఎడమ వైపు సందు మలుపులో ఒక చావిడి. ఎవరు బయటి ఊరువాళ్ళు వచ్చినా అక్కడ ఉచిత భోజనము తినమని దండువారా వేయించేవాళ్ళట.

మా మామ వాళ్ళ ఇంటి ముందు కుడి వైపుకు ఐదారు వందల గజాల దూరంలోమా తాతలు కట్టించిన శ్రీరాములవారి దేవాలయం. అమ్మతో అప్పుడప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం.

గుడికి దగ్గరే మేము వెళ్ళిన బడి. పక్కా గదులతో ప్రాథమిక పాఠశాల.

మిద్దె పైన నా చూపులు కలియతిరిగి ఆ పరిసరాలను జ్ఞాపకం చేసుకున్నాక క్రింద ఇంటి లోపలికి వచ్చాను.

మా అమ్మమ్మ హాలులో చాపపైన కూర్చొని వెండి తట్టలో వేడి అన్నంలో తన కుడిచేతి నిండ నెయ్యి పోసి, వట్టి పప్పు కలిపి, దానిలో పప్పు చారుపై తేట వేసి కలిపి మా ఇద్దరిని పిలిచింది .

ఇద్దరం వెళ్ళి అమ్మమ్మ ముందు కూర్చున్నాము. ఒక ఖాళి గిన్నెలోకి నీరు పోస్తూ మా చేతులు కడిగింది. తరువాత మాకు చేతి ముద్దలు పెడుతూంటే ఇద్దరం తింటున్నాము.

అంతలో మా అమ్మ స్నానం ముగించుకుని దేవుని గదిలోకి వెళుతూ “ఎన్ని రోజులు ఉంటావమ్మా, మరలా ఎప్పుడు నీ హైదరాబాదు ప్రయాణం” అని అడగటంతో ఆ కాలంలో అమ్మమ్మ చేతి ముద్దలు తింటున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న నన్ను ఈ కాలంలోకి తెచ్చి దింపింది ఆ జ్ఞాపకాల గోడ.

 

*****

 

 

 

1 thought on “విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”

Leave a Reply to మాలిక పత్రిక జూన్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *