March 29, 2024

సరదాకో అబద్దం

రచన: రాజన్

ప్రపంచం లో ఎక్కువ శాతం మంది ఆడేది, ఆడేకొద్దీ ఆడాలనిపించేది …….అబద్దం. నాటి ధర్మరాజు దగ్గర నుండి నేటి రాజకీయనాయకుల వరకు అందరూ ఈ ఆటలో నిష్ణాతులే. ఆ మాటకొస్తే వారే ఏమిటిలెండి.. మీరు, నేను కూడా చిన్నవో, పెద్దవో అబద్దాలు చెప్పే వాళ్ళమే. మనం ఆడిన అబద్ధాన్ని నమ్మితే అవతలి వాడు, నమ్మకపొతే మనం ఓడిపోతాం. ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంది కాబట్టే అబద్దాన్ని ఆడటం అంటారనుకుంటా.
మానవ జీవితం నుండి విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న ఈ (అవ)లక్షణాన్ని కవులు, రచయితలు తమ కవితా వస్తువుగా స్వీకరించిన సందర్భాలు అరుదు. అబద్దం ఎంత గొప్పదో, అవసరమైనదో చెప్పే ఒకటి రెండు సరదా పద్యాలు మాత్రం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి
అబద్దమాడని వాడు, మద్యము ముట్టని వాడు
దమ్ము లాగని వాడు, సాని చేరని వాడు
ఉండి బ్రతుకుటకన్న చచ్చి పోవుట మిన్న
పశువు చేయని పనులు మనిషి చేయనుకున్న
జాతి భేదము సున్న, వాడచ్చముగ దున్న
ఒక అబద్దం చెప్పి దాని అవసరం తిరిపోయాక, దానిని నిజంగా మార్చేసే అద్భుత అబద్దపు రీతికి ధర్మరాజు నాంది పలికాడు.’ అశ్వద్ధామ హతహ ‘ అని బిగ్గరగా అరిచి, పాపం ద్రొణాచార్యుడు విల్లంబులు వదిలేసిన తరువాత ‘ కుంజరహ ‘ అని మెల్లిగా పలికాడు. చచ్చింది అశ్వద్ధామ కాదు, ఆ పేరుగల ఏనుగు అని ఆ అబద్దాన్ని సరిచేసాడు. కానీ అప్పటికే కాగల కార్యం పూర్తయిపోయింది. ఎన్నో అస్త్రాలకి లొంగని ఆ అసామాన్య వీరుని ఒక అబద్దం చంపేసింది.
ఈ రోజుల్లో రోజూ చెప్పుకునే చిన్నా, పెద్దా అబద్దాలను పక్కన పెడితే, ప్రత్యేకించి అబద్దాలకి గిరాకి ఉండే కాలం ఒకటుంది…అదే ఎన్నికల కాలం. ఎంత అందంగా అబద్దం ఆడితే అన్ని ఓట్లు పడతాయి. ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోక పోతే కదా అబద్దం అవుతుంది. క్రితంసారి హామీలు ఈసారి నిలబెట్టుకుంటామని పాలకపక్షం, మేమైతే మొదటిసారే హామీలన్నీ తీర్చేస్తామని ప్రతిపక్షం మళ్ళీ అబద్దాలాడేస్తాయి. అలా అబద్దాలు నిజం కాకపోతాయా అని ఓటరు..ఎప్పటికీ నిజం కాని అబద్దాలు ఆడుతూ లీడరు బ్రతికేస్తుంటారు. ఏది ఏమైనా సామాన్య ప్రజల దృష్టిలో అత్యంత హేయమైన వర్గంగా రాజకీయనాయకులని మార్చేసింది ఈ అబద్దం.
పాములలో విషం ఉన్నవీ, లేనివీ ఉన్నట్టే… అబద్దాలలో కూడా హాని కలిగించనివి, హాని కలిగించేవి అని రెండు రకాలున్నాయి. హాని కలిగించని అబద్దాలని ఇంగ్లీష్ లో ‘వైట్ లైస్’ అంటారు. తెలుగులో వీటికి సరైన పదం లేదు. ప్రస్తుతానికి ‘ శ్వేత కోతలు ‘ అనుకుందాం. పార్టీ కి రమ్మన్న స్నేహితుణ్ణి నొప్పించకుండా తలనొప్పనో, కడుపు నొప్పనో అబద్దం చెప్పి ముఖ్యమైన పనులు చేసుకోవడం, ఫోన్ చేసిన అమ్మా నాన్నలతో కొద్దిపాటి జ్వరం ఉన్నా ఆ విషయం వారికి చెప్పి కంగారు పెట్టే కంటే, బానే ఉందని చిన్న అబద్దం చెప్పడం ఈ కోవలోకి వస్తాయి.
అబద్దాలు చెప్పడం మాట అటుంచితే, నిజం చెప్ప కూడని సందర్భాలు కొన్నుంటాయి. గుండెపోటుతో హాస్పిటల్ లో ఉన్న మనిషి దగ్గరకి పరిగెట్టుకు వెళ్ళి నీ ఇల్లు రాత్రి దొంగలు దోచేసారట అని నిఖార్సైన నిజం చెప్పి, అతని పంచ ప్రాణాలను పనికట్టుకు తీసేకంటే…అతను కోలుకునే వరకు మౌనంగా ఉంటే చాలు.
ప్రియురాలితో ప్రియుడు చెప్పే అబద్దాలు, స్కూల్ మానెయ్యడానికి పిల్లలు చెప్పే అబద్దాలు, ఆఫీస్ కి లేట్ గా వెళ్ళి బాస్ తో చెప్పే అబద్దాలు ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతే ఉండదు. పైగా ఇప్పటి అబద్దాలు రేపటి నిజాలు కావచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉందంటే అబద్దం… ఇప్పుడది నిజం. మనుషులు గాలిలో ఎగరగలగడం, వేరే ఊర్లో ఉన్నవారిని చూడగలగడం అప్పటి అబద్దాలు…ఇప్పటి నిజాలు.
ఇక చివరగా..ఏది ఏమైనప్పటికీ ఇతరులకి ఇబ్బంది కలిగించేవి, బాధ పెట్టేవి అయిన అబద్దాలను వదిలి పెట్టేసి, అవసరార్ధం, అనర్ధం కాని అబద్దాలు తప్పని సరైతే ఆడుకుందాం, వాడుకుందాం. సత్యవ్రతాన్ని పాటించే మహనీయులకు మాత్రం అందరం విధేయులై ఉందాం. సాధ్యమైనంత వరకూ సత్యాన్నే పలుకుదాం.అబద్దం విషయంలో కూడా నిబద్దంగా ఉందాం.

1 thought on “సరదాకో అబద్దం

Leave a Reply to మాలిక పత్రిక జూన్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *