April 24, 2024

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ

గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ.
“నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, లలితను కూడా రమ్మంటాను.” లక్ష్మి బతిమాలుతున్నట్టుగా అంది.
అమరేందర్, లక్ష్మి పెళ్ళయినపుడు అరుణ అప్పుడే కాలేజీలో చేరింది. అరుణ తన అన్న పెళ్ళిలో పెత్తనం చేసిన ఆనందం కంటే లక్ష్మిని చూసి ఎక్కువ ఆనందించింది. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకున్న ఘడియ అనే చెప్పాలి, లక్ష్మీ నాలుగేళ్ళు పెద్దదయినా ఇద్దరూ మంచి స్నేహితుల య్యారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. అరుణ భర్త రఘురాం కూడా అక్కా అని పిలుస్తూ లక్ష్మితో చనువుగా ఉండేవాడు. అమరేందర్ అరవైయ్యో ఏట వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి చని పోయాడు. అప్పుడే బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న పవన్ హైదరాబాదులోనే జాబు చూసు కున్నాడు. అప్పటి నుండి లక్ష్మి తన కొడుకు పవన్, కోడలు హిమతో జూబిలీ హిల్స్ లో ఉంటోంది. కూతురు ప్రగతి అమెరికాలో ఉంటోంది. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా వదినా మరదళ్ల మధ్య బంధం పెరిగిందే కానీ తరగలేదు.
“మనసేం బాగా లేదు. ఇంట్లోంచి కదలాలని లేదు వదినా.”
“ఏమయింది? అఖిల్ గుర్తుకోచ్చాడా? రఘు గుర్తు కొచ్చాడా? నాదగ్గర ఒక వారం రోజులుండి పోదువుగాని రా.”
“వాళ్ళిద్దరు ఎప్పుడు మనసులో ఉండే వాళ్ళే గదా. ఇప్పుడు రాను. నేను లలితకు ఫోన్ చేస్తాను రేపు మీరిద్దరు ఇక్కడికే రండి. ఇక్కడే లంచ్ తిందాం. రాత్రికి వీలయితే ఇక్కడే ఉండేట్టు రా వదిన.”
“ఈ సారి కాదు. పవన్ బెంగుళూరులో మీటింగ్ కు వెళ్ళాడు. హిమ కూడా వర్క్ లో బిజీగా ఉండి లేటుగా వస్తోంది. మరో రోజు నైట్ గడపడానికి వస్తాలే. రేపు గుత్తి దొండకాయ కూర తెస్తాను నీకిష్టం కదా!”
రఘు ఆలోచనలు అరుణ మనసును తొలిచేస్తున్నాయి. రఘు గురించి ఆలోచించకుండా ఉండలేదు, ఆలోచనలు వచ్చినప్పుడు బాధ కలగకుండా ఉండదు.
ఉన్న ఒక్క కొడుకు పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు. కొడుకు పిలుపుకు, కంటికి అందనంత దూరంలో ఉన్నాడని అప్పుడప్పుడు అనిపించినా ఈ రోజుల్లో యువతరం అంతా అమెరికాకు వెళ్తే తప్ప బ్రతుకే లేదన్నట్టు అందరూ అక్కడికే వలస పోతున్నారు. నా కొడుకూ అంతే అనుకుని స్థిమిత పడ్డారు అరుణ, రఘురాం.
‘చనిపోతే నన్ను ఫ్రీజర్ లో పెట్టకురా కన్నా’ అని ఒకసారి కొడుకుతో చెప్పుకున్నాడు రఘురాం. చాలామంది పిల్లలు విదేశాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. చనిపోగానే పరదేశాల్లో ఉన్న కొడుకు రావాలనో, కూతురు రావాలనో చనిపోయిన వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళి ఐసు డబ్బాల్లో ఫుడ్ ఫ్రీజ్ చేస్తున్నట్టు బాడీలను ఫ్రీజ్ చేస్తున్నారు. ఆ ఆలోచన మనసులోకి వస్తేనే రఘురాంకు ఒళ్ళు జలదరిస్తోందనేవాడు. ఆ చుట్టు పక్కల స్నేహితులకు, బంధువులకు జరిగే ఆ చివరి అంకంలోని తంతు పెద్దతరం వాళ్ళ మనసులో ముద్ర వేసుకుని కలవర పెడ్తోంది. అఖిల్ వెంటనే, ‘డాడ్ మీ హెల్త్ ఫర్ఫెక్ట్ గా ఉంది. మీరలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. నన్ను అమెరికా నుండి వచ్చేయమంటే వచ్చేసి ఇక్కడే జాబ్ చూసుకుంటాను.’ అన్నాడు.
‘తొందరపడి అలాంటి పనులు ఏమి చేయొద్దు కన్నా. ఏదో మనసు కొన్నిసార్లు అలా లోయల్లోకి వెళ్లి పోతుంది. అయినా చావొచ్చినా, తుఫానొచ్చినా ఆగదుగా! ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నే పోయాక నీ మమ్మీని బాగా చూసుకో.’ అన్నాడు.
రఘురాంకు కూడా కొడుకు అమెరికా వెళ్ళాడంటే ఏదో జీతం లేని ప్రమోషన్, కనిపించని ఎత్తు పెరిగినట్టుగా ఉంది. ముఖ్యంగా కొడుకు దేనికీ కొరత లేకుండా హాయిగా ఉంటాడని నమ్మకం.
కొన్ని రోజుల్లోనే హటాత్తుగా గుండె పోటుతో మరణించిన రఘురాం మృతదేహాన్ని ఐసుబాక్స్ లో పెట్టక తప్పలేదు. అఖిల్ వెంటనే బయల్దేరినా రావడానికి టైం పట్టింది. తండ్రి కోరిక తీర్చలేదని చాల బాధపడ్డాడు. కానీ అసమ్మతమైన కాలానికి లొంగక తప్పలేదు.
తండ్రి అంతిమ దశలో జరగవలసిన కార్యక్రమాలన్ని సక్రమంగా ముగిసాక,
“మమ్మీ! నువ్వొక్కదానివి ఇక్కడేలా ఉంటావు నాతో వచ్చేయ్యి.” అఖిల్ కు తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి సుతరాము ఇష్టం లేదు.
“ఇప్పుడు కాదులే నాన్నా! నాకిక్కడ అలవాటైన ఇల్లు, స్నేహితులు ఉన్నారు. నన్ను ప్రేమగా చూసుకునే వదిన ఉంది. నాకెమీ ఫర్వాలేదు. నువ్వు దిగులుపడకు.”
“నువ్వు ఒక్కర్తివే ఇక్కడుంటే దిగులు పడకుండా ఎలా ఉంటాను మమ్మీ!”
“నేను పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లోకే వచ్చాను. నువ్వు పెరిగిన ఇల్లు ఇది. నీ పెళ్ళయ్యాక సరితను తీసుకొచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో మీ అందరి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. నాకేమీ కాదు.”
“అవన్నీ డాడ్ ఉన్నప్పుడు చెబితే వినేవాణ్ణి . ఇప్పుడు నువ్వొక్కదానివే, ఎన్ని చెప్పినా వినేది లేదు.” మొరాయించాడు అఖిల్.
“ఇప్పుడప్పుడే కాదు కన్నా, కొన్నాళ్ళ తర్వాత వస్తాను. నువ్వేమి బెంగ పడకు.” ఊరడింపుగా అంది.
“అరుణా! నువ్వు అఖిల్ తో యుఎస్ వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. కనీసం కొన్నాళ్ళు వెళ్లిరా. నువ్విక్కడే ఉంటె నాకంటే ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరని నీకు తెలుసు. కానీ వెళితే నీకు స్థల మార్పుతో మనసు కొంత తేరుకుంటుంది.” లక్ష్మి నచ్చ చెప్పింది.
“ఇప్పుడు కాదులే వదినా. నాకేం, ఇనప గుండులా ఉన్నాను. అన్నింటికీ నాకు నువ్వున్నావు, పవన్, హిమ, లలిత, పార్వతి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళం కిట్టి పార్టీలకు కలుస్తూనే ఉంటాం. మీరంతా ‘హల్లో’ అంటే క్షణంలో నా ముందు వాలుతారు.”
ఆమె నిర్ణయం మార్చడం కష్టమని అఖిల్ కు అర్థం అయ్యింది. ఎన్నో ఏళ్ళు గడిపిన ఆ ఇంట్లో అందునా తండ్రి పోయిన తర్వాత వెంటనే ఆ ఇంటిని వదలి దూరంగా వెళ్ళడం కష్టమే. తల్లి స్నేహితులకు, ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న నెయిబర్సుకు అప్పగింతలు చెప్పి , అన్ని వసతులు తల్లికి అనువుగా అమర్చి అమెరికా వెళ్లి పోయాడు.
అరుణకు ఒంటరితనం కొంత బెదిరించినా–తనకు తానే ధైర్యం పుంజుకుంది. సాయంత్రం వరండాలో రఘురాం కూర్చునే రాకింగ్ కుర్చీ పక్క కుర్చీలో కూర్చుని రాకింగ్ కుర్చీని చెయ్యితో ఊపి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రఘురాం బట్టలు అన్నీ తీసి డబ్బాలో పెడ్తుంటే తన చర్మాన్ని ఒలి చేస్తున్నట్టుగా బాధ పడింది.
“ఈ బట్టలు ఎంత చక్కగా హేంగ్ చేసావు మేరే జాన్!” పొగుడుతూ మురిసిపోయే రఘు కనిపించేవాడు.
రఘురాం ముందు నుండి సందడి చేసే మనిషి, అరుణ వెనక చిన్న పిల్లాడిలా తిరుగుతూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. రిటైర్ అయ్యాక ఇద్దరు మరీ క్లోజ్ అయ్యారు.
అరుణ వంట చేస్తూంటే పక్క వరండాలో పచార్లు చేస్తూ కబుర్లు చెప్పేవాడు. అరుణ ఎప్పుడూ న్యూస్ పేపరు ఎక్కువగా చదవదు కానీ వార్తలన్నీ తెలుస్తాయి- రఘురాం చాలా వార్తలు వంటింట్లోనో, భోజనా లయ్యాక తీరిగ్గా సోఫాలో కూర్చున్నపుడో రీలే చేసేవాడు. ఇద్దరూ భోజనాలయ్యాక వరండాలో కూర్చుని బంధువుల, మిత్రుల జీవితాలు నెమరు వేసుకునేవారు. ‘ఒంటరిగా ఎలా ఉంటాననుకుని నన్నోదిలి వెళ్లి పోయావు రఘూ’ అరుణ కంటి నీరు పెట్టింది.
******************
మరునాడు లక్ష్మి, లలిత వచ్చారు. అరుణ బాధ తగ్గించడానికే వాళ్ళిద్దరూ ప్రయత్నించారు. కాస్త సరదాగానే గడిచింది. వాళ్లు వెళ్ళగానే మళ్ళీ వంటరితనం చుట్టుముట్టింది. మనసులో ఉన్న ఒంటరితనం బయట ఉన్న మనుషులతో పోదుగా!
అఖిల్ రోజూ వర్క్ కు వెళ్తూ ఫోన్ చేసి తల్లితో కాసేపు కబుర్లు చెబుతాడు. ఆగని కాలం కదిలిపోతూనే ఉంది. రఘురాం లోకం వదిలి ఆరు నెలలు గడిచిపోయాయి. అఖిల్ ఒక వారంరోజుల కోసం ఇండియా వచ్చాడు. ఈసారి తల్లి వీసాకు అప్లై చేసాడు.
“మమ్మీ! వీసా రాగానే తెలిసిన వాళ్ళెవరైనా వస్తూంటే అదే డేట్ కు నీ టికెట్టు బుక్ చేస్తాను. ఇంటి విషయం పవన్ బావ చూసుకుంటాడు. నువ్వు దేనిగురించి ఆలోచించాల్సిన పని లేదు, నీకు కావాల్సిన నీ వస్తువులు మాత్రమే తీసుకొనిరా. నా మాటకు నువ్వేమి అడ్డు చెప్పొద్దు.”
“అరుణా! నువ్వు అఖిల్ మాట విను. వాళ్లతో కలిసి ఉంటే నీకు బావుంటుంది. కొన్నాళ్ళ తర్వాత నీకు ఇక్కడికి రావాలనిపిస్తే తప్పకుండా రా. కానీ నువ్వు వెళ్ళకపొతే నేను నా మకాం పూర్తిగా ఈ దగ్గరకు మార్చాల్సి వస్తుంది. నీకు తెలుసు పవన్ ను చూడకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను, అయినా వస్తానంటున్నాను. నువ్వు ఆలోచించు ఏం చేస్తావో. నన్ను రమ్మంటావా లేక నువ్వు …” అల్టిమేటం ఇచ్చింది లక్ష్మి.
అరుణకు ఒంటరితనం కష్టంగానే ఉంది. కొడుకు దగ్గరకు వెళ్ళాలనే ఆలోచన వైపే మొగ్గింది మనసు. మరో మాట లేకుండా ‘సరే’ అంది.
“ఇక్కడ ఇల్లరికం వెళ్లి ఇల్లు మారుస్తారు. నన్ను అమెరికం వెళ్లి దేశం మారమంటున్నావా వదినా!” పరిహాసం చేసింది.
“అలాగే అనుకో” నవ్వుతూ అంది లక్ష్మీ. లక్ష్మీ గత నాలుగేళ్ళ లో రెండుసార్లు అమెరికా వెళ్లి వచ్చింది. ఆమె
ద్వారా అమెరికా కబుర్లు విని ఉన్న అరుణకు అమెరికా ప్రయాణమంటే సంకోచం లేదు కానీ పరిపూర్ణ మనస్సుతో ప్రయాణ సన్నాహాలు చేసుకోలేక పోతోంది. ఆత్మీయ బంధం ఏదో తనను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది అరుణకు. ఒంటరి తనంలో కలిగే బాధ కంటే నా అనే అన్నింటినీ వదిలి పోతున్నానే బాధ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రఘు ఉనికికి దూరం వెళ్ళడం, ఉన్నఆత్మ బంధువులను వదులుకుని పోవాలంటే మామూలు మాట కాదుగా! వేర్లు పెకిలించు కుని పోవాలి. లక్ష్మీ సహాయంతో అరుణ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టింది.
రఘురాంకు అమెరికా చూడాలని చాల కోరికగా ఉండేది. అతని కోరిక తీరనేలేదు. ‘నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ’ అరుణ కళ్ళంబట నీటి ధారలు.
********************
విమానంలో అన్ని గంటలు కూర్చుని అరుణకు వళ్ళంతా నొప్పులు, నిద్ర లేక, (రాక) తలనొప్పి వచ్చిందే కానీ దిగాల్సిన ఊరు మాత్రం రాలేదు. ఇంత దూర ప్రయాణం! మన పురాణాల్లో చెప్పినట్టు మాయ తివాసీలు, అదృశ్య అశ్వాలు ఈ సైంటిస్టులు కనిపెట్టినట్టు లేరు ఇంకా. అది మన ఇండియా వాళ్ళ తెలివి కదా వీళ్ళకు అంత అలోచన వచ్చి ఉండదులే అనుకుంది.
ఎయిర్ పోర్టులో కనిపించిన అఖిల్, సరితను చూడగానే దుఃఖం ఆపుకోవడం అరుణ వల్ల కాలేదు.
అంతా కలలాగ ఉంది.
అఖిల్ ఇల్లు పెద్దది, అందులో ఉండే మనుషులు ఇద్దరే. అరుణ కోసం వేరుగా అమర్చిన గది, అందులోని సదుపాయాలన్నీ చూపించాడు అఖిల్. అన్ని చక్కగా అమర్చి ఉన్నాయి. మధ్యాహ్నం నిద్దర పోవడం, మధ్య రాత్రికి లేచి కూర్చోవడం చేస్తోంది అరుణ. దయ్యాలు రాత్రి మెలుకువగా ఉంటాయట. బాడి క్లాక్ అడ్జస్ట్ కావాలని తెలుసు అయినా అమెరికా రాగానే దయ్యం అయి నట్టున్నాను అనుకుని నవ్వుకుంది..
ఒకరోజు రాత్రి పడుకోబోయే ముందు,
“మాం! రాత్రి కూడా పళ్ళు బ్రష్ చేసుకుంటే పళ్ళు శుభ్రంగా గట్టిగా ఉంటాయి” అంటూ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎలా వాడాలో చూపించాడు. అమ్మకు అమ్మై పోయాడు నా కొడుకు అనుకుంది.
“ఇన్ని ఏళ్లలో నేను రాత్రి ఎప్పుడూ పళ్ళు తోముకోలేదు కన్నా. రాత్రి తిన్నాక నీటితో బుక్కిలిస్తాను అంతే. ఉన్న పళ్ళను ఊడకుండా చూసుకోవాలిగా, అలాగే చేస్తాలే.”
అలంకారాల గురించి వింది కాని బాత్రూంలో చూస్తుంటే మరీ బావుంది. అరుణ కళ్ళు పెద్దవి చేసి అన్నీ ముచ్చటగా చూసింది.
“కన్నా! బాత్రుంలు కూడా ఇంత అందంగా అలంకరించుకుంటారా హోటల్లో లాగ?”
“అవును మమ్మీ. బాత్రూం కూడా ఇంట్లోనే ఉందికదా. ఇల్లంతా అలంకరించినపుడు బాత్రూం ఎందుకు అలంకరించ గూడదు!”
నిజమే కదా అనుకుంది. ‘రఘు ఉంటే ఇంకా ఎన్నో చెప్పేవాడు’ నిట్టూర్చింది. రఘు, అరుణ ఒకసారి డిల్లీ ట్రిప్ వెళ్ళినపుడు వెళ్ళిన ప్రతి చోటల్లా దానికి సంబధించిన చరిత్ర అరుణకు చెప్పేవాడు. రఘు పక్కనుంటే బావుండునని అరుణ మనసు తల్లడిల్లింది.
మరునాడు స్నానానికి ముందుగా సరిత వచ్చి వేడి నీళ్ళు , చన్నీళ్ళు షోవర్ లో తుంపరలు, పెద్ద చినుకులు, చిన్న చినుకులు, పెద్ద వాన, వరద అన్నీ అందులో ఎలా సెట్ చేసుకోవాలో చూపించి,
“మాం! నేను ఈ పక్కనే ఉంటాను. ఏదైనా కావాలంటే పిలవండి.”
“సరితా! నీ పని చూసుకో. నాకేం ఫర్వాలేదులే.” పైకి అందే కానీ మనసులో మాత్రం నా స్నానం అయ్యేవరకు ఇక్కడే ఉండమ్మా అనుకుంది అరుణ. షావర్ లోంచి వాన తుంపరలు పడ్తున్నై. చిన్న పిల్ల వానలో తడుస్తున్న భావన కలిగింది అరుణకు.
మొదటి వారం అంతా అఖిల్ ఇంటినుండే పనిచేసాడు. ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకొని కొన్ని రోజుల పాటు అరుణకు అలవాటు అయ్యేవరకు తోడు ఉన్నారు. వాళ్ళ రోజంతా ఉద్యోగాల దగ్గిరే గడిచి పోతుంది. సరిత మొదటి రెండు రెండు రోజులు ఇంటినుండే పని చేసింది. కొడుకు, కోడలిని చూసి అరుణ సంబరపడింది.
“నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ. వీళ్ళిద్దరినీ ఇలా చుస్తే ఎంత సంతోషించేవాడివో.” బరువుగా కన్నీళ్ళు రాలాయి.
సరిత వంట చేస్తూంటే అరుణ ఆ పక్కనే ఉండి “నేను కట్ చేస్తాను ఆ ఉల్లిపాయ ఇలా ఇవ్వు”
“మాం! మీరు రెస్టు తీసుకోండి. కొంచెం అలవాటయ్యాక చేద్దురు.” ఎంత చక్కగా మాం అని పిలు స్తుంది. అఖిల్ పిలుస్తుంటే తనకు పిలవాలనిపిస్తుందేమో. తను కూడా నా బిడ్దేకదా! మనసు తేలికగా అనిపించింది.
ఓ వారం తర్వాత అరుణ పరిసరాలకు చాలా వరకు అలవాటు పడింది. రఘు గుర్తు వచ్చినపుడు మాత్రం రూములో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇండియాకు ఫోన్ చేసి లక్ష్మితో ప్రతీది వివరించేది. దాంతో మనసు కాస్త తేలికగా అనిపించేది. ఫోన్ చేసి స్నేహితుల బాగోగులు పేరు పేరునా ఒక్కొక్కరి గురించి మాట్లాడేది.
అరుణ వంటింట్లో అన్నీ ఎక్కడ ఏముంటాయో తెలుసుకుంది. ఐపాడ్ ఎలా వాడాలో చూపించాడు అఖిల్. పాటలు ఎలా పెట్టుకోవాలి, టివి ఎలా చూడాలి తెలుసుకుంది అరుణ. ప్రతి దానికి అరడజను బటన్లు, ఆ టీవి చుట్టూ వల అల్లినట్టుగా అన్ని వైర్లే. నెమ్మదిగా అన్నీ వాడడం నేర్చుకుంది. అరుణకు ఇష్టమని రీడర్స్ డైజెస్ట్, ఉమెన్స్ డే, మార్తా స్తువార్డ్ మేగజీన్ లు తెప్పిస్తున్నారు. ఇండియాలో తెలుగు నవలలు, మేగజీన్స్ లో కథలు చదివేది. ఇండియాలో ఉన్నప్పుడు ఇంగ్లీషు చదవడం తక్కువే ఇప్పుడు అవి కూడా చదివి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని మంచి కాల క్షేపం అనుకుని మురిసి పోయింది. లక్ష్మీ కూడా ఫోనులో అదే అంది.
సరిత వంట చేయడం తక్కువే. నాలుగు మైళ్ళ దూరంలో ఒక తెలుగావిడ వంట చేస్తుందిట, ఆవిడ దగ్గరే తెచ్చుకుంటారు. ఆవిడ వంటల్లో నూనె కుమ్మరించకుండా, రుచికోసం మసాలాలు దిమ్మరించకుండా మనం ఇంట్లో చేసుకున్నట్టే వండుతుందని చాలా మంది కొనుక్కుంటారట. హోటల్లో కంటే నయం అని అఖిల్ అంటాడు. ఫ్రిజ్ లో అన్నీ ఆవిడ వండినవే ఉన్నాయి.
“నేనుండగా బయటి నుండి ఫుడ్ తేవద్దు.” తల్లి మాటలకు ఇద్దరూ తలాడించారు.
సరిత వంట చేస్తున్నపుడు అఖిల్ టీవి చూడ్డమో, ఫోనులోనో ఉండేవాడు. సరితకు కాస్త హెల్ప్ చేస్తాను అంటూ లేచిన తల్లితో,
“మాం! రోజూ ఇద్దరికి ఏం వంటలే అని తెచ్చుకుంటాం కాని అవి తిని విసుగొచ్చినపుడు రీటా వంట చేస్తుంది. చాల ఫాస్ట్ గా వంట చేస్తుంది.”
“ఇంటికొచ్చేసరికే చాల ఆలస్యమవుతుంది. అప్పుడు వంట చేసే ఒపిక ఉంటుందా!”
“మాం! సరిత అన్నీ మానేజ్ చేసుకోగలదు. ఇంట్లోనే కాదు ఫైనాన్స్ కూడా చూసుకోగలదు.”
“అన్ని పనులు వచ్చి ఉంటే మంచిదే.” అలోచించి పని లోకి దిగింది అత్తగారు అరుణ.
సరిత జాబులో చాల బిజీగా ఉన్నా, అలసి పోయినా దారిలో హోటల్ లోంచి డిన్నరు తెచ్చుకోవడం బాగా అలవాటు. అరుణ అది పూర్తిగా మానిపించేసింది. అలా అని సరదాగా తినడానికి ఆపదు. పైగా తనే ఎంజాయ్ చేయడానికి వెళ్ళమంటుంది.
అఖిల్ ఇంట్లో పని చేస్తూ బ్రేక్ తీసుకున్నప్పుడు అరుణ మాట్లాడిస్తూ చిన్న చిన్న పనులు- కూరలు కట్ చేయడం- లాంటివి చేయించింది. అలవాటు లేక ఇబ్బంది పడ్తున్న అఖిల్ ను చూసి మనసులో బాధ కలిగినా పైకి ఎమీ అనలేదు. చిన్నప్పుడే పనులు చేయడం అలవాటు చేస్తే ఇప్పుడు సులభంగా ఉండేది. మన సంఘంలో మగవాళ్ళు వంటింటి పనులు చేస్తే చిన్నతనమని ఒక స్టిగ్మా ఉంది. అరుణ కొడుకుని చాల గారాబంతో ఏ పని ముట్టుకోనివ్వలేదు. గడిచి పోయిన వాటిని జడ్జ్ మెంటు కోటాలో పెట్టి వగచే కంటే ప్రస్తుతంలో మార్పు ఎలా ప్రవేశ పెట్టాలో చూడాలి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నపుడు ఇద్దరికి పని వచ్చి ఉంటే వాళ్ళకే సుఖం. వీకెండుకు తల్లి, కొడుకు కలిసి వంట చేస్తూంటే సరిత ఇబ్బందిగా అఖిల్ ను పక్కకు జరగమని తాను సాయం చేసేది.
“అఖిల్ ను నేర్చుకోనివ్వు సరితా. మగవాడయినంత మాత్రాన వంట నేర్చుకోగూడదని ఎక్కడుంది.”
సరితకు మొదట్లో ఇబ్బందిగా ఉండేది. తన తల్లి అలా అంటే అర్థం చేసుకోగలదు కానీ అఖిల్ తల్లి…నెమ్మదిగా అరుణ మనసు తెలుసుకున్న సరిత చాల సంతోషించింది.
రెండు నెలలు గడిచి పోయాయి. అఖిల్ ఇంట్లో ఉన్నప్పుడు అరుణ పని చేస్తూంటే ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు. అలా చేస్తుంటే అరుణకు గర్వంగా ఉంది. వీకెండ్ డిన్నర్ పార్టీలకు అరుణ కూడా వెళ్తోంది. అక్కడ కొంత మంది పేరెంట్సు, ఇన్లాస్ కలిసారు.
“మాం! వినుత ఇన్లాస్, రజిత పేరెంట్సు, మాలిని మదర్ మన వీధిలోనే ఉంటారు. మీరు మధ్యాహ్నం కలుసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం మనం వాకింగ్ కు వెళ్లి వాళ్ళను కలుద్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళందరికీ వీలయితే రేపు లంచ్ కు కలుసుకోవచ్చు. ఏమంటారు?” సరే అంది అరుణ.
సరిత ఫోన్ చేసి సాయంత్రం వాకింగ్ ప్రోగ్రాం చేసింది. మరునాడు పెద్దవాళ్ళంతా లంచ్ కు కలుసుకున్నారు. అందరూ వయస్సులో, పద్ధతులలోను, భాషలోను వేరైనా వచ్చింది మాత్రం గ్రాండ్ కిడ్స్ కోసమే. ఆ తర్వాత ఒకరితో ఒకరు తరుచుగా ఫోన్ లో మాట్లాడుకున్నారు. బయట ఎండగా ఉంటే చాల బావుంది అంటూ బ్రేక్ ఫాస్ట్ తిని అందరూ కాసేపు వాకింగ్ కేళతారు. నెలకొకసారి పాట్ లక్ పెట్టుకుని కలుసుకుంటారు. అఖిల్ వంట చేయడం నేర్చుకుంటున్నాడని అరుణ చెప్పగానే విని తోటివారంతా మొహం తేలేసారు. అమెరికా వచ్చి కొడుక్కు వంట నేర్పుతున్నావా! అని ముక్కు మీద వేలేసుకున్నంత పన్జేసారు.
“అందులో తప్పేముంది. నేను చిన్నప్పుడే నేర్పాల్సింది. కనీసం ఇప్పుడైనా నేర్చుకుంటున్నాడు. వంటే కాదు ఇంట్లో ఏ పనైనా సాయం చేస్తున్నాడు. రోజూ బయటినుండి ఫుడ్ తెచ్చుకుని తినేకంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ రోజుల్లో ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు అని కేటాయించి లేవుగా. అన్ని పనులు కలిసి చేసుకుంటే సుఖం. ఇండియాలో కంటే ఇక్కడ మగవాళ్ళు పని చేయడం కాస్త సులభంగా అనిపిస్తుంది. సరిత జాబ్ లో బిజీగా ఉంటే గ్రాసరీ స్టోర్ కెళ్ళి మొన్న కూరగాయలు, పళ్ళు తెచ్చాడు. పళ్ళు ఫర్వాలేదు గాని కూరగాయలు ఇంకా సరిగ్గా చూసి తేవడం తెలీదు. ఒకసారి వెంట వెళ్లి చూపించాలి.” అరుణ మాటలు అందరికి నచ్చలేదు.
“ఎలా ఒప్పించావు? ఆ కిటుకేదో మాకు చెప్పు. రజిత అటు ఉద్యోగం ఇటు ఇంట్లో పని చేయలేక ఇద్దరు ఎప్పుడూ కస్సర బిస్సర అనుకుంటూనే ఉంటారు. నేను నెమ్మదిగా చేస్తానని నన్ను వద్దంటుంది.”
అరుణ నవ్వుతూ “మనం సరదాగా మాట్లాడుతూ మనం చేస్తూ వాళ్ళను పనుల్లోకి దించాలి” అని నవ్వుతూ చెప్పింది. కొందరు ఉత్సాహంగా చూద్దాం మనమెంత చేయించగలమో అని సవాల్ చేసుకుంటూ వెళ్ళారు.
అరుణకు టైం ఇట్టే గడిచి పోతోంది. మేగజీన్లు, టీవి, ఫ్రెండ్స్, ఇంట్లో ఏదో ఒక పనిచేస్తూ తోచని రోజంటూ లేదు. అరుణ తన దినచర్య లక్ష్మికి చెప్పగానే,
“నిజంగానే అమెరికం వెళ్లి పోయావు అరుణా. సరిత మంచి అమ్మాయి లాగుంది.”
“వాళ్ళిద్దరూ నా బిడ్డలే కదా వదిన. కొడుకు సంతోషంగా ఉండాలంటే కోడలు సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. రఘు ఉంటే చూసి ఎంత సంతోషించేవాడో!”
“నిజమే రఘు మురిసేవాడు. నీ మనసు మంచిది అరుణ. మనసులో మంచి ఆలోచనలు ఉంటే నోటి వెంట చెడ్డ మాటలు రానేరావు. ఎదుటి వారిలో కూడా మార్పు వస్తుంది. అదే మన జీవిత రహస్యం. తెలుసుకుంటే భూలోకంలోనే స్వర్గం కనిపిస్తుంది. అఖిల్ వంట ఎంత వరకు వచ్చింది?”
“సరిత బిజీగా ఉన్న రోజు అఖిల్ ఇంటికి రాగానే ‘ఇవ్వాళ్ళ డిన్నరుకు ఏం చేసుకుందాం మాం?” అంటాడు. మొన్న ఒకరోజు బటర్ చికెన్, చిక్ పీస్, రైతా, పులావ్ చేసి సరితకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. నన్ను కూచోబెట్టి ఒక్కడే అన్నీచేసాడు, చాల రుచిగా ఉన్నాయి. నేను ఇండియా వచ్చినా బయటి ఫుడ్ రోజూ తినకుండా మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు బయట ఫుడ్ తెచ్చుకుని తినడం చాలా తగ్గిపోయింది. ఇంట్లో సరితకు కూడా పనుల్లో సహాయం చేస్తున్నాడు. నాకు గర్వంగా ఉంది. నువ్వు వచ్చినపుడు చూద్దువు గాని. ఎప్పుడు వస్తున్నావు వదినా!”
“పిల్లలకు వేసవి సెలవులు ఉన్నపుడు వస్తే పిల్లలను చూసుకోవచ్చు. అరుణా! నీ ఐడియా చాల మంచిది. మేమెవ్వరము ఆలోచించనిది నువ్వు అమలులో పెట్టావు. ఇండియాలో కూడా అందరం మగ, ఆడ తేడా లేకుండా అన్ని పనులు చేసుకుంటే బావుంటుంది. నేను నెమ్మదిగా పవన్ మీద ప్రయోగం చేస్తాను. వంటే కాదు ఇంటి పనుల్లో చేయూత నివ్వడం మంచిదే. అయినా ఆ పాత ఆలోచనలు పక్కన పెట్టి ఉత్సాహంతో మార్పులు చేసు కుంటూ ముందుకు కదలాలి.” ఉత్తేజంగా అంది లక్ష్మీ.
మన పధ్ధతి మనమే మార్చుకోవాలి. మనసులు మారితే మనుషులు మారుతారు. మనం మారాలి, మనతో బాటు పురుషులను కూడా మన వెంట ముందుకు తీసికేళ్ళాలి. తరతరాలుగా ఉన్న అనవాయితీని మార్చడం ఒక్క రోజులో కాదు, ఒక్కరితో కాదు. వంటింట్లోనే కాదు ప్రతి పనిలో ఇద్దరి చేతులు కలిసి ఉంటేనే జీవితం బాలెన్స్ అవుతుంది. మనస్పర్థలకు అవకాశ ముండదు. చదువు, ఉద్యోగాలు ఒక్క ధనాభి వృద్దికే కాదు, సామరస్యంతో మనో వికాసానికి, బంధుత్వ అభివృద్ధిని పెంపొందించి నపుడే పురోగతి అనిపించు కుంటుంది.

***** సమాప్తం *****

‘తల్లి ప్రేమమయి, గొప్పది అంటారు. నిజమే. కానీ భార్య కూడా గొప్పది. భార్య కూడా ప్రేమ మయి. భార్యకు పనుల్లో సహాయం చేసే మగవారు ఎంతమంది! ఎంతమంది తల్లులు కొడుకులకు
ఇంటి పని, వంట పని నేర్పిస్తున్నారు? భార్యకు పనుల్లో సహాయం చేయడం తప్పుకాదు అని

ఎంతమంది తల్లి, తండ్రి నేర్పిస్తున్నారు.’ అని ఒక సవాల్ సంఘంలోకి విసిరారు మమత రఘువీర్
గారు, ఒక సంఘ సేవికురాలు, స్త్రీ సహాయాభి వృద్ధికై కంకణం కట్టుకున్న మహిళ
“వసుంధర పురస్కారం” అవార్డ్ గ్రహీత. ఆమెకు నా అభివందనాలు.
మన వేష భాషలోనే కాదు, మన ఆలోచనల్లో, మన చేతలలో మార్పు రావడమే ఆమెకు జవాబు.

******************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *